మెయన్ ఫీచర్

చంద్రబాబుకు ‘వాటర్లూ’.. తెలంగాణ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐరోపాలో ఇరుగు పొరుగు దేశాలను జయించిన యుద్ధవీరుడు నెపోలియన్ బొనపర్టే తన జీవితంలో 60 యుద్ధాలు చేశాడు. చివరికి బెల్జియంలోని ‘వాటర్లూ’ అనే ప్రాంతంలో బ్రిటన్, ప్రుష్యన్ సైనికులతో జరిగిన భీకర పోరులో నెపోలియన్ పరాజయం పాలయ్యాడు. ఈ యుద్ధం 1815 జూన్ 18న జరిగింది. బ్రస్సెల్స్‌కు 15 కి.మీ దూరంలోని వాటర్లూ ప్రాంతంలో జరిగిన యుద్ధంలో ఓటమి చెందాక నెపోలియన్ బందీ అయ్యాడు. అప్పటి నుంచి ‘వాటర్లూ’ పేరును రాజకీయంగా జైత్రయాత్ర చేసే వారికి, ప్రతి ఎన్నికను తాడోపేడోగా తేల్చుకునే నేతలకు వాడుతుంటారు.
లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రస్తుతం అయిదు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు కీలకం కావడంతో ఈ సమరాన్ని ‘సెమీ ఫైనల్స్’గా పరిగణిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయానికొస్తే- టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాబోయే ఫలితాలు నిజంగా అగ్నిపరీక్షే. తన రాజకీయ భవిష్యత్తును పొరుగు రాష్టమ్రైన తెలంగాణలో నిర్ణయించుకునే సాహసానికి ఆయన దిగారు. తెలివైన వాళ్లు విలువైన వస్తువును తాము ఎక్కడ పొగొట్టుకున్నారో, అక్కడే వెతుక్కుంటారు. ప్రస్తుతం చంద్రబాబు హైదరాబాద్‌లో తన ఆధిపత్యాన్ని చేజిక్కించుకుంటారో లేదో ఈనెల 11న తెలుస్తుంది.
చంద్రబాబు తన రాష్ట్రానికి పరిమితం కాకుండా, తెలంగాణ సహా జాతీయ రాజకీయాల్లో తన ముద్రను చాటుకొనేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఓ వైపు కొత్త మిత్రులతో జత కడుతూనే, మరోవైపు శత్రువుల సంఖ్యను పెంచుకుంటున్నారు.
తెలంగాణ ఎన్నికలు చంద్రబాబుకు, కేసీఆర్‌కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఏదో ఒక పాచిక వేసి అధికారాన్ని నిలబెట్టుకోవడంలో చంద్రబాబు దిట్ట. ‘మహాకూటమి’లోని కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకమైనవే. కాంగ్రెస్ వ్యతిరేకతపై ఆవిర్భవించిన తెదేపా తెలంగాణ ఎన్నికల వేళ ‘మహాకూటమి’లో చేరడం రాజకీయ పండితులను సైతం విస్మయపరచింది. ఒకప్పుడు సువిశాల ఆంధ్రప్రదేశ్‌ను పాలించిన చంద్రబాబు ఈ రోజు మరుగుజ్జులా తన పాత్రను కుదించేసుకుని, కాంగ్రెస్‌తో చేతులు కలిపి 119 సీట్లలో కేవలం 14 సీట్లలో తన అభ్యర్థులను నిలిపారు. ఎన్నికల ప్రచారం కురుక్షేత్ర సంగ్రామాన్ని తలపించింది. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో చంద్రబాబు అమీతుమీ తేల్చుకోవడానికి సర్వశక్తులనూ మోహరించారు. ‘మహాకూటమి’ ఓటమి చెందినా, తెదేపా కొద్ది సీట్లకు పరిమితమైనా- చంద్రబాబు ప్రతిష్ట మసకబారినట్టే. ఇది ఒక రకంగా చంద్రబాబుకు ‘వాటర్లూ’ యుద్ధం లాంటిదే. ‘కూటమి’ గెలిస్తే ‘నారా’వారికి అడ్డేలేకుండా పోతుంది. వచ్చే ఏడాది జరిగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు ఈ ‘ఊపు’ ఆయనకు దోహదపడుతుంది.
తెలంగాణ ఎన్నికల్లో ‘కూటమి’ విఫలమైతే గనుక తెలుగుదేశంలోనూ అనుకోని పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. చంద్రబాబు ఒక రకంగా పెద్ద ‘రిస్క్’ చేశారు. తెలంగాణలో తాను ఆశించిన ‘్ఫలితాలు’ వస్తే- దేశ రాజకీయాల్లో ‘సేవ్ డెమొక్రసీ’ నినాదంతో ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెస్తున్న చంద్రబాబు నాయకత్వానికి బీజేపీ వ్యతిరేక పార్టీలు బ్రహ్మరథం పడతాయి. బీజేపీ వ్యతిరేక వేదికను బలోపేతం చేసేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు కాంగ్రెస్ చేయూత నిస్తుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండోసారి గెలవాలనే లక్ష్యంతో ఉన్న చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాయి. లోక్‌సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు చంద్రబాబు ప్రభ వెలుగుతుంది.
తెలంగాణలో ‘కూటమి’ గెలిస్తే చంద్రబాబు ఇకపై హైదరాబాద్ వేదికగా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు వ్యూహరచన చేసే అవకాశం ఉంది. ఈ నెల 10న బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌కు ఢిల్లీలో అంకురార్పణ చేస్తున్నారు. అమరావతిలో వౌలిక సదుపాయాల కొరత వల్ల అక్కడి నుంచి పావులు కదపడం చంద్రబాబుకు కష్టమే. అమరావతిలో కంటే హైదరాబాద్‌లోనే ఎక్కువ కాలం మకాం ఉండే పరిస్థితులను చంద్రబాబు సృష్టించుకుంటారు. తెలంగాణ ప్రజలు ఇచ్చే తీర్పుతో చంద్రబాబు రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
‘కూటమి’ పరాజయం పాలైందంటే చంద్రబాబు ఆంధ్ర రాజకీయాలకు పరిమితమయ్యే అవకాశాలు లేకపోలేదు. కాంగ్రెస్‌తో టీడీపీ జతకట్టడాన్ని ప్రజలు తిరస్కరించారన్న వాదనకు బలం చేకూరుతుంది. కాంగ్రెస్‌తో పొత్తు తెదేపాకు ‘చారిత్రక తప్పిదం’ అవుతుంది. చంద్రబాబును ఏకాకిని చేసి రాజకీయంగా చిత్తు చేసేందుకు బీజేపీ అన్ని అవకాశాలను వినియోగించుకుంటుంది. మరోసారి అధికారంలోకి వస్తే గనుక తెరాస అధినాయకత్వం చేతులు ముడుచుకుని కూర్చోదు. చంద్రబాబును తెలంగాణలో అడుగుపెట్టనివ్వకుండా వ్యూహాలతో ముందుకెళుతుంది. జాతీయ స్థాయిలో బీజేపీ, ప్రాంతీయ స్థాయిలో కేసీఆర్, వైఎస్ జగన్, పవన్ కల్యాణ్‌ల నుంచి ముప్పేట దాడిని చంద్రబాబును ఎదుర్కొంటారు.
చంద్రబాబు ‘గ్రాఫ్’ను పరిశీలిస్తే, రాజకీయంగా ఈ తరహా నేతలు అరుదుగా కనపడుతారు. 1995లో ఎన్డీఆర్‌ను గద్దె దించిన సమయంలో ఎదురైన సంక్షోభం నుంచి చంద్రబాబు బయటపడ్డారు. 2004-2014 మధ్య ప్రతిపక్ష నేతగా ఉంటూ పార్టీని కాపాడుకున్నారు. రాష్ట్ర విభజన వల్ల తలెత్తిన సంక్షోభంలో చిక్కుకుని, చివరకు ఏపీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. 1995, 2014 సంవత్సరాల్లో సంక్షోభాల నుంచి గట్టెక్కిన చంద్రబాబు ఇపుడు మరో సాహసం చేశారు. ఎన్డీఏ కూటమికి ‘గుడ్ బై’ చెప్పి, సరైన వ్యూహాలు లేక అల్లాడుతున్న కాంగ్రెస్ పక్కనచేరి బీజేపీపై గురి పెట్టారు. రాజకీయాల్లో అంతగా అనుభవం లేని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని తన చాతుర్యంతో మెప్పించారు. తెలంగాణ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు వస్తే రాహుల్, చంద్రబాబుల దోస్తీ మరింత బలపడుతుంది. తెలంగాణలో ఓడినా- రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్‌కు ఆశాజనకమైన ఫలితాలు వస్తే కాంగ్రెస్‌తో కలసి నడిచేందుకే చంద్రబాబు సుముఖత చూపుతారు. ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌కు అధికారం లభించకపోతే పరిస్థితి మరోలా ఉంటుంది.
ఈ రోజు చంద్రబాబు ఏపీకి ప్రత్యేక హోదా సాధించాలని కాంగ్రెస్‌తో జతకట్టలేదు. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు చెక్ పెట్టేందుకు ఆయన దుస్సాహసంతో కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధమయ్యారు. ‘శత్రువుకు శత్రువు మిత్రుడు’ అనే పాత సామెతకు పదునుపెట్టి కాంగ్రెస్‌తో స్నేహ హస్తం చాచారు. వాస్తవానికి కాంగ్రెస్‌లో పాతతరం నేతలు జాతీయ స్థాయిలో లేరు. ఆ పార్టీకి దిశానిర్దేశం చేసే నాయకత్వం కూడా కరవైంది. చంద్రబాబు అంటే రాహుల్ గాంధీకి గౌరవం ఉంది. 2004లో వైఎస్‌ఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పనిగా చంద్రబాబును విమర్శించవద్దని తాను సూచించినట్లు ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ స్వయంగా చెప్పారు.
దేశ రాజకీయాలను విశే్లషిస్తే సమాజ్‌వాదీ పార్టీ (ములాయం సింగ్), జనతాదళ్, ఆర్జేడీ (లాలూప్రసాద్ యాదవ్), బీఎస్పీ (మాయావతి), లోక్‌దళ్ (చరణ్‌సింగ్), తృణమూల్ కాంగ్రెస్ (మమతాబెనర్జీ), తమిళనాడులో ద్రవిడ పార్టీలు (డీఎంకె, అన్నాడిఎంకె), సీపీఐ, సీపీఎం తదితర పార్టీలు బీజేపీపై పోరాడేందుకు, ఒక్కోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమ ఆగర్భ శత్రువైన కాంగ్రెస్ పార్టీతో కలిశాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు అంటూ ఎవరూ ఉండరు. చంద్రబాబు రాజకీయ జీవితం, ఆయన ఎత్తుగడలను అధ్యయనం చేస్తే ఈ మాట అక్షర సత్యం అని అవగతమవుతుంది.

-కె.విజయ శైలేంద్ర 98499 98097