సంపాదకీయం

మైత్రికి ‘మారాకు’..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూ మహాసముద్ర ప్రాంతంలో పరస్పర సహకారంతో భద్రతా కలాపాలను నిర్వహించాలని మన దేశం, మాల్‌దీవులు నిర్ణయించడం చైనావారి వ్యూహాత్మక దురాక్రమణకు మరో ప్రతిఘటన! మాల్‌దీవులకు దాదాపు పదివేల కోట్ల రూపాయల- నూట నలబయి కోట్ల అమెరికా డాలర్ల- ఆర్థిక సహాయం అందించాలని సోమవారం మన ప్రభుత్వం నిర్ణయించడం మాల్‌దీవుల ఆర్థిక వ్యవస్థపై బిగిసిపోతున్న చైనా ‘పట్టు’ను సడలించడానికి దోహదకరం! మాల్‌దీవుల ప్రభుత్వం తనకు దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయల ఋణాలు తిరిగి చెల్లించాలని చైనా ప్రభుత్వం వాదిస్తూ ఉండడం సోమవారం ఢిల్లీలో మన ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయానికి నేపథ్యం. గత నెల పదిహేడవ తేదీన ఇబ్రహీం మహమ్మద్ సోలీ అధ్యక్ష పదవీ బాధ్యతలను స్వీకరించే వరకు దాదాపు ఆరేళ్లపాటు మాల్ దీవుల ప్రభుత్వం మన దేశానికి వ్యతిరేకంగాను, చైనాకు అనుకూలంగాను వ్యవహరించడం చరిత్ర.. 2012 ఫిబ్రవరి ఏడవ తేదీన మాల్‌దీవుల ‘్భద్రతా దళాలు’- పోలీసులు లేదా సైనికులు- తిరుగుబాటు చేసి అప్పటి అధ్యక్షుడు మహమ్మద్ నషీద్‌ను పదవి నుంచి తొలగించడంతో ఈ చరిత్ర మొదలైంది. అబ్దుల్ యమీన్ అధ్యక్ష పదవిని చేపట్టినప్పటి నుంచి మాల్ దీవులు చైనా ప్రభుత్వానికి ఆర్థిక, వాణిజ్య, రక్షణ, వ్యూహాత్మక కేంద్రంగా మారిపోవడం ఈ చరిత్ర. గత సెప్టెంబర్‌లో జరిగిన ఎన్నికలలో అబ్దుల్ యమీన్ ఓడిపోవడంతో, ‘మాల్ దీవుల ప్రజాస్వామ్య దళం’- మాల్ దీవియన్ డెమొక్రాటిక్ పార్టీ- ఎమ్‌డిపి- అభ్యర్థి ఇబ్రహీం మహమ్మద్ సోలీ విజయం సాధించడంతో ఈ చైనా చోదిత చరిత్ర దాదాపు ముగిసింది. ‘ఎమ్‌డిపి’ 2012లో పదవీచ్యుతుడైన మహమ్మద్ నషీద్ నాయకత్వంలోని ప్రజాస్వామ్య పక్షం. మాల్‌దీవుల చరిత్రలో తొలిసారిగా ప్రజాస్వామ్య పద్ధతిలో- 2008 నాటి ఎన్నికలలో- మహమ్మద్ నషీద్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అంతకు పూర్వం దశాబ్దుల పాటు నిరంకుశ ఏకపక్ష పాలన సాగించిన వౌమూన్ అబ్దుల్ గయూమ్ పాలన అప్పుడు ముగిసింది. కానీ నాలుగేళ్లు పూర్తికాకముందే నషీద్‌ను ‘‘సైనిక దళాలు’’ తొలగించడం మాల్‌దీవులలో పాకిస్తాన్, చైనాలు ఉమ్మడిగా ఆడిస్తున్న నాటకంలో భాగం. 2012 నుంచి ఆరేళ్ల మాల్‌దీవుల ప్రభుత్వంలో ప్రధానంగా అబ్దుల్ యమీన్ బహిరంగంగా మన దేశానికి వ్యతిరేకంగా విషం కక్కాడు. గత సెప్టెంబర్‌లో జరిగిన ఎన్నికలలో కూడ యమీన్ గెలిచిపోతాడని మొదట ప్రచారం జరిగింది. అతగాడు గెలిచి ఉండినట్టయితే మాల్‌దీవులపై చైనా పట్టు మరింత బిగిసి ఉండేది. కానీ యమీన్ అనుసరించిన ‘జిహాదీ’ మతోన్మాద విధానాలను, భారత్ వ్యతిరేక చైనా అనుకూల దౌత్యనీతిని మాల్‌దీవుల ప్రజలు తిరస్కరించారు.
ప్రజాస్వామ్య నిష్ఠగల మహమ్మద్ నషీద్ సహచరుడైన మహమ్మద్ సోలీ అధ్యక్ష పదవీ బాధ్యతలను స్వీకరించిన తరువాత మాల్‌దీవులలో మన మైత్రి మళ్లీ ‘మారాకు తొడుగుతోంది’.. సోలీ ఆదివారం, సోమవారం మన దేశంలో పర్యటించడం ఇందుకు నిదర్శనం. అధ్యక్ష పదవీ బాధ్యతలను స్వీకరించిన తరువాత జరిపిన మొదటి విదేశీయ పర్యటనకు సోలీ మన దేశాన్ని ఎంపిక చేసుకొనడం మాల్‌దీవులతో మన మైత్రి పునర్ వికసనానికి నిదర్శనం. నవంబర్ పదిహేడవ తేదీన సోలీ అధ్యక్ష పదవీ బాధ్యతలను స్వీకరించిన సందర్భంగా జరిగిన ఉత్సవానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా వెళ్లిరావడం హిందూ సముద్ర ప్రాంతంలో చైనా దౌత్య దౌర్జన్యానికి, వ్యూహాత్మక దురాక్రమణకు అడ్డుకట్టవేయడంలో భాగం! మూడువైపుల నుంచి మన దేశాన్ని చైనా నౌకాదళ ‘‘స్థావరాలు’’ చుట్టుముడుతున్న సమయంలో మాల్‌దీవులలో మన మైత్రి మళ్లీ చిగురిస్తూ ఉండడం మన ప్రభుత్వానికి లభించిన వ్యూహాత్మక విజయం. సోలీ పర్యటన సందర్భంగా మనకూ మాల్ దీవులకూ మధ్య నాలుగు ఒప్పందాలు కుదిరాయి, సముద్రతీర భద్రతను పెంపొందించడంలో ఉభయ దేశాల ఉమ్మడి కృషికి మరోసారి శ్రీకారం జరిగింది. మాల్‌దీవులకు, మన లక్ష ద్వీపాలకు మధ్య ఉన్న ఇరుకైన అంతర్జాతీయ జలమార్గంలో చైనా యుద్ధనౌకల రాకపోకలు పెరుగుతున్న సమయంలో మాల్‌దీవులు అత్యంత కీలకమైన శక్తిగామారి ఉంది. మాల్‌దీవులలో 2011వరకు చైనాకు దౌత్యకార్యాలయం కూడ లేదు. కానీ తరువాతి కాలంలో చైనాకు మాల్ దీవులు నౌకాదళ స్థావరంగా మారిపోవడానికి రంగం సిద్ధమైంది!
ఆఫ్రికాలోని సోమాలియా తీరం కేంద్రంగా పనిచేస్తున్న ఓడదొంగలు గత పదేళ్లకు పైగా ‘జిహాదీ’లు గా మారిపోయారు. ఈ జిహాదీ మతోన్మాద బీభత్సకారులను పాకిస్తాన్ ప్రభుత్వం ఉసిగొల్పుతోంది. పాకిస్తాన్‌లోని ‘లష్కర్ ఏ తయ్యబా’ బీభత్సపు బట్టీలలో శిక్షణ పొందిన మాల్‌దీవుల యువజనులు స్వదేశానికి తిరిగి వెళ్లి, ‘జిహాదీ’లుగా స్థిరపడుతుండడం గత పదేళ్ల చరిత్ర. ఈ జిహాదీలు మాల్ దీవులలోని ‘నిర్జన ప్రాంతాల’లో స్థావరాలను ఏర్పాటుచేసుకొన్నారు. ఇరుకైన అంతర్జాతీయ జలమార్గం దాటి ఉత్తరంగా ఉన్న మన లక్ష ద్వీపాలలోని నిర్జన ప్రాంతాలలోకి చొరబడి తిష్ఠవేయడానికి ఈ ‘జిహాదీ’ ముష్కరులు యత్నిస్తున్నట్టు పదేళ్ల క్రితమే ప్రచారమైంది. నషీద్ పదవీచ్యుతుడైన తరువాత యమీన్ ప్రభుత్వం కొనసాగిన కాలంలో ఈ ప్రమాదం మరింత పెరిగింది. ఓడ దొంగలను అరికట్టే నెపంతో అరేబియా సముద్రంలోకి పాకిస్తాన్‌లోని ‘గ్వాడార్’ ఓడరేవులోకి చొచ్చుకొని వచ్చిన చైనా నౌకాదళాలు మార్గమధ్యంలో ‘‘విశ్రాంతి తీసుకొనడానికి’’ శ్రీలంకలోను, మాల్ దీవులలో స్థావరాలు అవసరం అయ్యాయి. ఈ స్థావరాలు ఆధికారికంగా ఏర్పడకపోయినప్పటికీ చైనా యుద్ధనౌకలు, జలాంతర్గాములు తరచూ శ్రీలంకలోను, మాల్‌దీవులలోను తిష్ఠవేస్తుండడం బహిరంగ రహస్యం. ఎఱ్ఱ సముద్రం అరేబియా సముద్రంతోను, హిందూ మహాసముద్రంతోను కలిసేచోట ఆఫ్రికా ఖండపు తూర్పుతీరంలో నెలకొని ఉన్న ‘జిబౌటీ’లో గత ఏడాది చైనాకు నౌకాదళ, భూతల సైనిక స్థావరం ఏర్పడడం వ్యూహాత్మక దురాక్రమణకు పరాకాష్ఠ. చైనా, పాకిస్తాన్‌ల ఈ ఉమ్మడి ప్రమాదానికి మాల్‌దీవులు తోడుకావాలన్నది యమీన్ విధానం. అందువల్ల యమీన్ ఓడిపోవడం, ఇబ్రహీం మహమ్మద్ సోలీ విజయం సాధించడం చైనా ‘విస్తరణ’కు ప్రతిఘటన! సముద్ర తీర భద్రత విషయంలో మాల్‌దీవులు ఇకపై మనతో సహకరించనుంది...
మన అండమాన్ దీవులకు ఇండోనేసియాకు, మలయా ద్వీపకల్పానికి మధ్య ఉన్న ఇరుకైన సముద్రం మన దేశానికి దక్షిణంగా విస్తరించి ఉన్న జలమార్గానికి తూర్పున ఉన్న ముఖ ద్వారం, మన లక్ష ద్వీపాలకు మాల్ దీవులకు మధ్య ఉన్న ఇరుకైన సముద్రం పశ్చిమ ముఖ ద్వారం. ఈ అంతర్జాతీయ జల మార్గం గుండా ఆసియా నుంచి ఆఫ్రికాకు, ఐరోపాకు, అమెరికాకు వాణిజ్య నౌకలు వెడుతున్నాయి, యుద్ధనౌకలు వెడుతున్నాయి. బ్రిటన్ దురాక్రమణకు పూర్వం ఈ మాలా ద్వీపాలు- మాల్ దీవులు-, సింహళ ద్వీపం- శ్రీలంక- అఖండ భారత్‌లో తరతరాలుగా భాగమై ఉండేవి. బ్రిటన్ ముష్కరులు ఈ భౌగోళిక స్వరూపాన్ని చెఱచిపోయారు. మన దేశం ఆధీనంలో ఉండవలసిన ‘జాతీయ జల మార్గం’ ‘అంతర్జాతీయ మార్గం’గా మారడం చారిత్రక వైపరీత్యం....