సంపాదకీయం

దోచుకుంటున్న చైనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైనాకు చెందిన పంపిణీ సంస్థలు- ‘ఈ’ టైలర్స్- ఉత్పత్తి సంస్థలు మన దేశానికి చెల్లించవలసిన ‘ఎగుమతి’ సుంకాన్ని భారీగా ఎగగొడుతుండడం చైనా సాగిస్తున్న వాణిజ్య దురాక్రమణలో వర్తమాన విచిత్రం. చైనా సంస్థలు మూడు దశాబ్దులకు పైగా మన దేశంలోకి నాసిరకం వస్తువులను, మనకు అవసరం లేని వస్తువులను భారీగా తరలించి అమ్మి సొమ్ము చేసుకుంటున్నాయి, అక్రమంగా లాభాలను బొక్కేస్తున్నాయి. మన దేశంలోని సామాన్య ప్రజలకు, విద్యావంతులైన యువజనులకు చైనా మనకు శత్రు దేశమన్న ధ్యాస లేదు. అందువల్ల వీరంతా భారీగా చైనా వస్తువులను కోనుగోలు చేస్తున్నారు. ధ్యాస ఉన్న విద్యాధికులకు, రాజకీయవేత్తలకు ప్రముఖులకు ఘరానాలకు జాతీయతా నిష్ఠ గురించి దేశ ప్రయోజన పరిరక్షణ గురించి పట్టింపులేదు, శ్రద్ధ లేదు, ఆసక్తిలేదు. మాతృభూమి పట్ల మమకారం కంటె చైనా పట్ల అధికమైన అభిమానం గలవారు- రాజకీయవేత్తలు, అధికారులు- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నిర్వహిస్తుండడం ఈ మూడు దశాబ్దుల వైపరీత్యం! చైనా మన భూభాగాలను దురాక్రమించి ఉందన్న, 1962లో మన దేశాన్ని వెన్నుపోటు పొడిచిందన్న వాస్తవం తెలిసిన రాజకీయవేత్తలు ఈ దుర్మార్గాన్ని మరచిపోయి చైనాను ప్రశంసిస్తుండడం నడుస్తున్న వైపరీత్యం. సరిహద్దు వివాదం పరిష్కారంతో నిమిత్తం లేకుండా చైనాతో వాణిజ్య, దౌత్య, వ్యూహాత్మక, రక్షణ సంబంధాలను పెంపొందించుకోవాలన్న ‘‘పథభగ్న’’ విధానం- పాత్ బ్రేకింగ్ పాలసీ- ఈ వైపరీత్యానికి ప్రాతిపదిక! ఈ ‘పథభగ్న’ విధానం 1988లో రూపొందింది. సరిహద్దు వివాదం పరిష్కారం అయ్యేవరకు, 1962లోను, అంతకు పూర్వం కూడాను, దురాక్రమించిన మన సీమల నుంచి చైనా వైదొలగే వరకు చైనాతో స్నేహ, వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోరాదన్నది 1988 వరకు అమలు జరిగిన మన విధానం. ఈ విధాన పథాన్ని అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ నాయకత్వంలోని ప్రభుత్వం భగ్నం చేసిన- కొత్తగా రూపొందిన ‘పథభగ్న’ నీతి మన విధానానికి ప్రాతిపదిక అయింది. ‘సరిహద్దు వివాదం’తో నిమిత్తం లేకుండా చైనాతో మనం వాణిజ్య సంబంధాలను పెంపొందించుకొనడం ఈ ‘నీతి’.. ప్రపంచీకరణ వ్యవస్థీకృతం కావడంతో చైనా ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థలు మన దేశాన్ని మరింతగా దోపిడీ చేయగలుగుతున్నాయి. చైనాతో మనం జరుపుతున్న వాణిజ్యం వల్ల మనకు ప్రతి ఏటా దాదాపు రెండున్నర లక్షల కోట్లు రూపాయల నష్టం- లోటు- సంభవిస్తోంది. ఈమేరకు చైనాకు లాభం సమకూరుతోంది! ఇలా ఏర్పడిన వాణిజ్య లోటువల్ల మన దేశానికి చెందిన, మన ప్రజల శ్రమ ఫలితమైన రెండున్నర లక్షల కోట్ల రూపాయల ‘విదేశీయ వినిమయ ద్రవ్యం’- ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ కరెన్సీ ప్రతి ఏటా చైనాకు తరలిపోతోంది...
ఇలా తరలిపోవడం మిత్ర దేశానికి కాదు, శత్రు దేశానికి..! చైనా భౌతిక, ఆర్థిక, వ్యూహాత్మక దురాక్రమణ మన దేశానికి వ్యతిరేకంగా నిరంతరం కొనసాగుతున్న సంగతి మన ప్రభుత్వాలకు తెలుసు. అఝార్ మసూద్ వంటి, హఫీజ్ సరుూద్ వంటి పాకిస్తానీ జిహాదీ బీభత్సకారులను చైనా బహిరంగంగా సమర్ధిస్తోంది, ఐక్యరాజ్యసమితి ఇలాంటి బీభత్సకారులకు వ్యతిరేకంగా చర్యతీసుకోకుండా అడ్డుపడుతోంది. 1948 నుంచి పాకిస్తాన్ దురాక్రమణలో ఉన్న జమ్మూ కశ్మీర్- పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్- పిఓకె-లో చైనా సైనిక దళాలు, చైనా వాణిజ్య సంస్థలు తిష్ఠవేసి ఉన్నాయి. ఈ ‘పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్’లో ఆర్థిక ప్రాంగణాన్ని- ఎకనామిక్ కారిడార్‌ను- నియమించరాదన్న మన ప్రభుత్వం మాటను చైనా పట్టించుకోవడం లేదు. మన అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రగతి, సంక్షేమ పథకాలను అమలు జరపడానికై ‘ఆసియా అభివృద్ధి బ్యాంక్’వారు పదేళ్లక్రితం మంజూరు చేసిన ఋణాన్ని చైనా రద్దుచేయించింది. మాల్‌దీవుల రాజధాని మాలేలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించడానికై మన దేశానికి చెందిన ‘జిఎమ్‌ఆర్’ సంస్థతో కుదిరిన ఒప్పందాన్ని చైనా 2013లో రద్దు చేయించింది. ఈ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ కార్యక్రమాన్ని మాల్‌దీవుల ప్రభుత్వం ఆ తరువాత చైనాకు అప్పగించింది. మధ్య ఆసియా దేశాలు మన దేశానికి ఇంధన వాయువును సరఫరా చేయకుండా చైనా ‘తెరవెనుక’ వ్యూహం అమలు జరుపుతోంది! ఇరాన్ నుంచి మన దేశానికి ఇంధన వాయువు సరఫరా కోసం గొట్టపు మార్గం నిర్మాణం కాకుండా పాకిస్తాన్, చైనాలు ఉమ్మడిగా అడ్డుకున్నాయి. 2050 నాటికి ‘‘్భరత రాజ్యాంగ వ్యవస్థను కూల్చివేయడం’’ తమ లక్ష్యంగా ప్రకటించుకున్న మావోయిస్టు బీభత్సకారులను ఉసిగొల్పుతున్నది చైనా ప్రభుత్వమన్నది అంతర్జాతీయ సమాజం ధ్రువపరచిన వాస్తవం!
ఇదంతా తెలిసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ చైనా దిగుమతులను నియంత్రించక పోవడం- నిజానికి పూర్తిగా నిషేధించాలి- ఆత్మహత్యా సదృశమైన మన విధానాలకు నిదర్శనం. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు చైనావారి వాణిజ్య సంస్థలు తమ రాష్ట్రాలలో చొరబడడానికి ‘‘తలుపులు బార్లాతెరుస్తుండడం’’ నిరంతరం ఆవిష్కృతం అవుతున్న దేశ వ్యతిరేక వికృత దృశ్యం! ఈ వికృతిని ఆవిష్కరించడంలో తెలుగు రాష్ట్రాలు మరీ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతి ఉత్సాహాన్ని చూపుతోంది. మన ఆర్థిక వ్యవస్థ జుట్టును చైనా చేతిలో ఇరికించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అతి ఉత్సాహాన్ని చూపుతుండడానికి కారణం కేంద్ర ప్రభుత్వ విధానం. 2015లో మన సైనిక దళాలు బర్మాలోకి చొచ్చుకొనిపోయి, మన ఈశాన్య ప్రాంతాలలో బీభత్సకాండను జరుపుతుండిన ‘చైనా తొత్తుల’ను శిక్షించిన తరువాత ఈ ముష్కర మూకల విద్రోహకాండ తగ్గింది. మన లడక్‌లోకి దాదాపు ప్రతిరోజు చైనా సైనికులు చొరబడడం 2015 తరువాత తగ్గిపోయింది. ఇందుకు కారణం అంతకు పూర్వం వలెకాక మన భద్రతాదళాలవారు చొరబడిన చైనీయ మూకలను మెడలు పట్టుకొని నెట్టుకుంటూ వెళ్లి ‘వాస్తవ అధీన రేఖ’- లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్- ఎల్‌ఏసి-కు అవతలి వైపునకు తరలించడం.. అందువల్ల మెతకదనంతో కాక కరకుతనం వల్ల మాత్రమే చైనా దారికి వస్తుందన్నది ధ్రువపడిన వాస్తవం. వాణిజ్య వ్యవహారాలలో సైతం మన ప్రభుత్వం ఈ ‘కరకుతనాన్ని’ ఇప్పుడైన ప్రదర్శించాలి!
ప్రపంచీకరణలో భాగంగా విస్తరించిన ‘ఈ’వాణిజ్య వ్యవస్థను ఉపయోగించి చైనా అనేక అక్రమాలకు పాలుపడుతోంది. చైనా సంస్థలు ‘ఈ టైలర్’ద్వారా మన దేశంలోని వినియోగదారులకు భారీ సరకులను, వస్తువులను విక్రయిస్తున్నాయట. ‘ఈ టైలర్’ లేదా ‘ఈ రిటైలర్’- చిల్లర వ్యాపారాల- అనుమతి లేకుండానే చైనా సంస్థలు అక్రమంగా ఈ చిల్లర వ్యాపారాన్ని మన దేశంలో చేస్తున్నాయట! దీన్ని పూర్తిగా నిషేధించక పోవడం నిరోధించకపోవడం మన ప్రభుత్వ వైఫల్యం. ఐదువేల రూపాయలకు లోపు ఉన్న బహుమతులను విదేశాలవారు మన దేశంలోని వారికి సుంకం లేకుండా పంపవచ్చునట. ఈ ‘మినహాయింపు’ను దురుపయోగం చేసుకొని చైనాసంస్థలు మన దేశంలోని వినియోగదారులకు భారీగా ‘బహుమతుల’ను పంపుతున్నాయి. నిజానికి ఇవి ‘బహుమతులు’కావు, మన దేశంలోని వినియోగదారులకు చైనా వాణిజ్య సంస్థలు అమ్ముతున్న వస్తువులు! కానీ ‘బహుమతుల’ ముసుగులో ఈ విక్రయాలు జరుగుతున్నాయి. తద్వారా చైనా సంస్థలు మన ప్రభుత్వానికి చెల్లించవలసిన సుంకాన్ని ఎగవేయవచ్చు. ఈ అక్రమం ఇప్పుడు బయటపడింది. కానీ బయటపడని వాణిజ్య అక్రమాలను చైనా సంస్థలు కొనసాగిస్తూనే ఉన్నాయి. చైనా వస్తువులను కొనరాదన్న నిష్ఠ మన ప్రజలలో పెరిగిననాడు చైనా వాణిజ్య అక్రమాలకు అడ్డుకట్టపడుతుంది! ఏవి చైనా వస్తువులు? ఏవి కావు? అన్న వాస్తవాలు మాత్రం సగటు వినియోగదారులకు, సామాన్య ప్రజలకు తెలియడం లేదు!!