సంపాదకీయం

బద్దలైన విష వ్యూహం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశానికి వ్యతిరేకంగా ‘ఇరాక్ సిరియా ఇస్లాం మత రాజ్యం’- ఐసిస్- జిహాదీ ముఠా పన్నిన మరో బీభత్స పన్నాగం బుధవారం భగ్నం కావడం హర్షణీయ పరిణామం. సిరియా నుంచి తన సైనిక దళాలను ఉపసంహరించుకోవాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం బుధవారం మన ‘జాతీయ నేర పరిశోధక సంస్థ’- ఎన్‌ఐఏ- సాధించిన విజయానికి విచిత్రమైన నేపథ్యం. ఢిల్లీలోను, ఉత్తర ప్రదేశ్‌లోను ఎన్‌ఐఏ జరిపిన దాడుల ఫలితంగా ఈ ‘ఐసిస్’ ముఠా ‘గుట్టు’ మరోసారి రట్టయింది. మొత్తం పదహారు చోట్ల జరిగిన దాడులలో ఇప్పటి వరకూ పదహారుగురు అనుమానితులను గుర్తించినట్టు ఎన్‌ఐఏ ఉన్నత అధికారులు ప్రకటించడం మన దేశంలో ‘ఐసిస్’ విస్తరిస్తున్న తీరుకు నిదర్శనం. గుర్తించిన అనుమానితుల్లో పదిమందిని నిర్బంధించినట్టు అధికారులు ప్రకటించారు. ఈ ముఠాలో ఒక యువతి కూడ ఉండడం ‘ఐసిస్’ విష విస్తృతికి మరో నిదర్శనం. ‘ముఠా’ ప్రయత్నం భగ్నం కావడం శుభ పరిణామం అయినప్పటికీ ఈ ‘ఐసిస్’ ముఠా ‘విస్తృతి’ పరిమాణం, పరిధి ఎంతెంత ఉన్నాయన్నది ఆందోళన కలిగించ వలసిన అంశం. ఐదేళ్ల క్రితం మన దేశంలో ఒకరిద్దరు ‘ఐసిస్’ బీభత్సకారులు పట్టుబడిన నాటి నుంచి ఈ జిహాదీ ముఠా బీభత్సకారుల సంఖ్య, బీభత్స కలాపాలు నిరంతరం విస్తరించిపోతుండడం చరిత్ర. ఈ విస్తరణ ఇరాక్, సిరియా దేశాలలో సంభవించిన విపరిణామాలతో ముడివడి ఉంది. ఇరాక్‌లోను, సిరియాలోను ఈ దేశాలనంటి ఉన్న విస్తృత పశ్చిమ ఆసియాలోను ‘ఇస్లాం మత రాజ్య వ్యవస్థ’ను ఏర్పాటు చేయడానికి ఈ ‘ఇరాక్ సిరియా ఇస్లాం మత రాజ్యం’- ఐఎస్‌ఐఎస్- ఐసిస్- పనిచేస్తోందన్నది జరిగిన ప్రచారం. కానీ ఈ ‘ముఠా’ మన దేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్స అనుసంధాన సంస్థ- ‘ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్’-ఐఎస్‌ఐ- కొనసాగిస్తున్న జిహాదీ ఘాతుక కృత్యాలలో భాగమన్నది ధ్రువపడిన వాస్తవం. అందువల్ల ఈ ‘ఐసిస్’ ఇరాక్‌లోను, సిరియాలోను ఉద్ధృతంగా కలాపాలు సాగించిన సమయంలోనే మన దేశంలో కూడ ‘జిహాదీ’ హంతకులను చేర్చుకోవడం మొదలు పెట్టింది. ఇరాక్‌లో ప్రభుత్వ దళాలతో తలపడి పరాజయం పాలైన ‘ఐసిస్’ ఆ తరువాత సిరియాలో తన కలాపాలను ఉద్ధృతం చేసింది. ఇరాక్‌లోను, సిరియాలోను ‘ఐసిస్’ బీభత్స దళాలలో భారతీయులు చేరి ఉన్నట్టు దశలవారీగా సమాచారం మొదలైంది. మన దేశానికి చెందిన యువకులను, విద్యావంతులను ప్రధానంగా ‘అంతర్జాల’- ఇంటర్నెట్- వ్యవస్థలో ఉద్యోగిస్తున్న వారిని ఈ ‘ఐసిస్’ జిహాదీ ముఠాలో చేర్పించడానికి పాకిస్తానీ ‘ఐఎస్‌ఐ’ కృషి చేస్తోంది. వివిధ దేశాలలో జిహాదీ ముఠాలను ఏకీకృతం చేస్తున్న అనుసంధాన వ్యవస్థ పాకిస్తానీ ‘ఐఎస్‌ఐ’..
‘ఐసిస్’ను ఇలా మన దేశంలో రంగంలోకి దింపగలిగిన ‘ఐఎస్‌ఐ’ తన విస్తృత విషవ్యూహాన్ని అమలు జరుపుతూనే ఉందన్నది బుధవారం ఢిల్లీలోను, ఉత్తర ప్రదేశ్‌లోను పట్టుబడిన ముష్కరుల వల్ల మరోమారు ధ్రువపడింది. ముఠాల పేర్లు మారుతున్నప్పటికీ ఈ ముఠాల స్వభావం, లక్ష్యం, కార్య పద్ధతి, వ్యూహం మాత్రం సమానం. మన దేశాన్ని నిరంతరం బలహీన పరచడం ఈ సమానత్వం. ప్రపంచంలోని ఇస్లామేతర మతాలను సమూలంగా మట్టుపెట్టి ‘ఇస్లాంను ఏకైక మతం’గా ప్రపంచమంతటా ప్రతిష్ఠించడం జిహాదీల శతాబ్దుల లక్ష్యం. 1947 నుంచి ఈ లక్ష్యసాధన కోసం కృషి చేస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వం వాస్తవానికి బీభత్స రాజ్యాంగ వ్యవస్థ- టెర్రరిస్ట్ రిజీమ్-! అయితే అంతర్జాతీయ సమాజ అభిశంసనకు భయపడుతున్న పాకిస్తాన్ నిర్వాహకులు భారత వ్యతిరేక బీభత్సకాండతో తమకు సంబంధం లేదని అంతర్జాతీయ సమాజాన్ని నమ్మించ యత్నిస్తున్నారు.. ఈ అభినయంలో భాగంగానే పాకిస్తానీ ‘ఐఎస్‌ఐ’ బంగ్లాదేశ్‌కు చెందిన ‘హుజీ’ని, అఫ్ఘానిస్తానీ తాలిబన్‌లను, ఇరాక్‌లో పుట్ట పగిలిన ‘ఐసిస్’ను, బర్మా- మ్యాన్‌మార్-కు చెందిన రోహింగియా జిహాదీలను మన దేశానికి వ్యతిరేకంగా ఉసిగొల్పుతోంది. మన దేశంలో సైతం ‘హిజిబుల్’, ‘సిమి’, ‘ముజాహిదీన్’ వంటి ముఠాలను తయారు చేసింది.
‘భారత్‌లో జరుగుతున్న జిహాదీ బీభత్సకాండతో మాకు సంబంధం లేదు.. ఫలానా బీభత్స ఘటనకు ‘హుజీ’ కారణం, జాకిర్ నాయక్ అనేవాడు కారణం, ‘హిజ్‌బుల్’ కారణం, ‘సిమి’ కారణం.. మరో ఘటనకు ఇండియన్ ముజాహిదీన్ కారణం, బుద్ధగయపై దాడికి రోహింగియాలు కారణం..’ అని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రచారం చేసుకొంటోంది. ఈ వంచన క్రీడలో ‘తాలిబన్’లను, ‘ఐసిస్’ ముష్కరులను పాకిస్తాన్ ‘ఐఎస్‌ఐ’ ఉసిగొల్పుతుండడం వర్తమాన ఘట్టం. ఈ ఘట్టం అఫ్ఘానిస్తాన్‌లోని భారతీయులపైన, భారతీయ వాణిజ్య సంస్థలపైన, భారతీయ దౌత్య కార్యాలయంపైన దాడులతో ఆరంభమైంది. ఇరాక్‌లోను, సిరియాలోను,లిబియాలోను తదితర ‘ఇస్లాం మత రాజ్యాంగ వ్యవస్థలు’న్న దేశాలలోను భారతీయుల అపహరణలతోను, హత్యలతోను ఊపందుకొంది.. గత ఏప్రిల్ రెండవ తేదీన ముప్పయి ఎనిమిది మంది భారతీయుల మృతదేహాలను ఇరాక్ నుంచి మన దేశానికి విమానంలో తరలించుకొని వచ్చిన భయంకర విషాద దృశ్యం ఆవిష్కృతమైంది. వీరందరినీ ‘ఐసిస్’ బీభత్సకారులు హత్య చేశారు. 2014 జూన్ పద్దెనిమిదవ తేదీన ఇరాక్‌లోని ‘మోసుల్’ ప్రాంతంలో గృహ నిర్మాణ రంగంలో పనిచేస్తున్న నలబయి మంది భారతీయులను ‘ఐసిస్’ హంతకులు అపహరించుకొనిపోయారు. వీరిలో ఒక భారతీయుడు అదృష్టవశాత్తూ బతికి బయటపడ్డాడు. మిగిలిన ముప్పయి తొమ్మిది మందిని ‘ఐసిస్’ జిహాదీలు పైశాచికంగా హత్య చేయగలిగారు. 2014 జూలైలో ‘ఐసిస్’ అపహరించిన నలబయి ఆరుమంది వైద్య సహాయకులు సురక్షితంగా బయటపడి ఇరాక్ నుంచి స్వదేశానికి తిరిగి రావడం మరో దైవ ఘటన! కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకూ మన దేశానికి వ్యతిరేకంగా ‘ఐసిస్’ బీభత్స కలాపాలు నిరంతరం విస్తరించడం నడుస్తున్న వైపరీత్యం. ఢిల్లీలోను, ఉత్తర ప్రదేశ్‌లోను ‘ఐసిస్’ ముష్కరులు పదహారు చోట్ల స్థావరాలను ఏర్పరచుకున్నట్టు బుధవారం బయటపడింది. ఈ స్థావరాల్లో మారణాయుధాలు, బాంబులు, విస్పోటన వికిరణ వాహకాలు- రాకెట్ లాంచర్స్- కూడ బయటపడడం ‘ఐసిస్’ భయంకర విస్తృతికి నిదర్శనం. మన దేశంలో ఎన్నిచోట్ల ఇలాంటి స్థావరాలున్నాయో మరి!!
అఫ్ఘానిస్తాన్‌లో 2002లో పలాయనం చిత్తగించిన ‘తాలిబన్- అల్ ఖాయిదా’ జిహాదీలు అటు యెమెన్ వరకూ, సోమాలియా వరకూ విస్తరించారు. ఇటు మన జమ్మూ కశ్మీర్‌లోకి, బంగ్లాదేశ్‌లోకి చొరబడ్డారు. ఇప్పుడు సిరియాలో ‘ఐసిస్’ మట్టికరచినట్టు అమెరికా అధ్యక్షుడు ప్రకటించాడు. అందువల్లనే తమ సైనికులను సిరియా నుంచి ఉపసంహరించినట్లు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నాడు. అయితే ‘తాలిబన్ల’ వ్యూహాన్ని ఇప్పుడు ‘ఐసిస్’ కూడ అమలు జరుపుతోంది. ఇరాక్ నుంచి, సిరియా నుంచి నిష్క్రమిస్తున్న ‘ఐసిస్’ మన దేశంలోను ఇతర దేశాలలోను చొరబడిపోయింది.. చొరబడి పోతోంది.. అప్రమత్తత అనివార్యం..