సంపాదకీయం

వ్యవసాయ వైపరీత్యం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్షం కురవకపోవడం, దుర్భిక్షం ఏర్పడడం, పంటలు ఎండిపోవడం, వ్యవసాయ జీవనులు తమ ఇళ్లను, ఊళ్లను వదలిపెట్టి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం వంటి విపరిణామాలు వాణిజ్య పారిశ్రామిక వర్గాలకు గొప్ప ఆనందాన్ని కలిగిస్తుండడం మన అభివృద్ధి ప్రక్రియలో నిహితమై ఉన్న వైరుధ్యం. వ్యవసాయ భూములు పాడైపోయినట్టయితే వాటిని సులభంగా కొని పారిశ్రామిక అక్రమ ప్రయోజనాల కోసం వినియోగించుకోవచ్చునన్నది వాణిజ్యవేత్తల ఆశ. ‘స్వేచ్ఛావిపణి’- మార్కెట్ ఎకానమీ- నిర్వాహకుల ఆకాంక్ష! కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలంలో నెలకొన్న కరవు పరిస్థితుల కారణంగా గ్రామీణులు గుంటూరు జిల్లాకు, ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారట! కంబాలదినె్నలోను అదే దృశ్యం.. జొన్నగిరిలోను అదే విషాదం! ‘వ్యవసాయం వల్ల ప్రయోజనం శూన్యం, పరిశ్రమలు పుట్టలుగా గుట్టలుగా పెరగాలి. అప్పుడు మాత్రమే ప్రగతిగతి వేగవంతం అవుతుంది..’ అని గతంలో రాజకీయ ప్రముఖులు ప్రవచించి ఉన్నారు. ఈ ప్రవచనాన్ని వాస్తవం చేయడానికి ‘ప్రపంచీకరణ’ శక్తులు నడుం బిగించి ఉన్నాయి.. మాయల మారీచ మృగాల వలె ‘బంగారు వనె్నల’తో జనాన్ని మురిపిస్తున్నాయి. ‘వ్యవసాయం చేయకండి, నష్టపోకండి, భూమిని మాకు అమ్మివేయండి, మేము బంగారాన్ని తవ్వితీస్తాము.. వజ్రాలను వెలికితీస్తాము’ అని వాణిజ్య శక్తులు రైతులను ఊరిస్తున్నాయి. ‘జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్’ అన్న ప్రభుత్వేతర సంస్థవారు కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గ్రామం వద్ద మూడు వందల యాబయి ఎకరాల వ్యవసాయ, అటవీ భూమిని కొనుగోలు చేయనున్నారట! ఎందుకయ్యా?- అని అంటే బంగారపు ఖనిజాన్ని తవ్వితీయడానికి అన్నది సమాధానం! ఇది ప్రతీక మాత్రమే! భూమి పట్ల మాతృభావం లేని, మాతృభూమి పట్ల మమకారం లేని వందల వేల ప్రభుత్వేతర సంస్థలు కొండలకు కన్నాలు పెట్టేస్తున్నాయి. రాళ్లను పిండి చేస్తున్నాయి. భూమిని తవ్విపారేస్తున్నాయి. కనుచూపు మేరలో ఆకుపచ్చదనపు ఆనవాళ్లు సైతం మిగలని పారిశ్రామిక ప్రాంగణాలు దేశమంతటా వెలసిపోతుండడం నడుస్తున్న చరిత్ర. ప్రభుత్వాలు సైతం ‘కృత్రిమ ప్రగతి’ని సాధించడానికి వీలుగా బహుళ జాతీయ వాణిజ్య సంస్థల- మల్టీ నేషనల్ కంపెనీలు-తో జట్టుకట్టి ఉన్నాయి. అనంతపురం జిల్లాలోని వజ్రకరూరు మండలంలో ‘భారత భూ భౌతిక అధ్యయన సంస్థ’- జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా- జిఎస్‌ఐ- వారు ‘వజ్రశుద్ధి’- డైమండ్ ప్రాసెసింగ్ కేంద్రాన్ని నడుపుతున్నారట! ఇప్పుడు ఈ ప్రాంతంలో వజ్రశిలా నిక్షేపాలు పుష్కలంగా ఉన్నట్టు ‘జిఎస్‌ఐ’ వారు కనిపెట్టారట! అందువల్ల ప్రభుత్వేతర సంస్థలు చొరబడిపోయి కృత్రిమ వజ్రాలను తయారుచేయడానికి రంగం సిద్ధమైంది. వ్యవసాయ భూములను రైతుల నుంచి ‘విముక్తం’ చేసి లోతుగా తవ్వి పారేయడానికి అధ్యయనాలు దోహదం చేస్తున్నాయనడానికి ఇది మరో ప్రతీక మాత్రమే!!
ప్రతీకలు అసంఖ్యాకం.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, దేశమంతటా ‘కృత్రిమ భూమి నిధి’- ల్యాండ్‌బ్యాంక్- ఏర్పాటు పేరుతో వందలాది వాణిజ్య సంస్థలు వ్యవసాయ భూములను, అటవీ భూములను కొనేస్తున్నాయి. దాదాపు ప్రతి మండలంలోను ఇలాంటి ‘ భూమి నిధులు’ ఏర్పాటైపోతున్నాయి. రైతుల నుంచి ఎకరం యాబయి వేలకు, లక్ష రూపాయలకు కొనుగోలు చేస్తున్న ‘దళారీ సంస్థల’ పుట్టలు పగిలి ఉన్నాయి. ఈ దళారీ సంస్థలు మరో పెద్ద సంస్థకు అదే భూమిని ఎకరం రెండు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయల వరకూ అమ్మేస్తున్నట్టు దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ప్రచారం జరుగుతోంది. మట్టికి వెల.. రాళ్లకు వెల.. ఈ రాళ్లను పగులగొట్టి పిండి చేసి అమ్మడం వాణిజ్య కలాపాలలో ఒకటి మాత్రమే! నల్లడబ్బును ‘ భూమి నిధి’గా మార్చి సువిశాల వాణిజ్య ప్రాంగణాలను ఏర్పాటు చేయడం, కృత్రిమ కొరతను సృష్టించడం బహుళ జాతీయ వాణిజ్య సంస్థల మరో వ్యూహం.. అడవులు ధ్వంసం కావడంతో వానలు లేవు.. వానలు లేనందున నిరంతరం నష్టపోతున్న రైతులు వ్యవసాయ భూములను ఈ దళారీలకు అమ్మేస్తున్నారు. ఇటు వ్యవసాయ భూమి అటు అటవీభూమి అంతరించిపోతోంది! ‘మెతుకుసీమ’- తిండిపెట్టే సీమ- అయిన మెదక్ జిల్లాలో కాలుష్యం కొలువుతీరింది. ‘మెతుకుల’ను ప్రసాదించగల వ్యవసాయం నష్టానికి ప్రతీకగా మారింది. ఇది మరో ఉదాహరణ మాత్రమే! ఉదాహరణలు వేనవేలు...
వ్యవసాయాన్ని కబళించడానికి బయటి నుంచి బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు ఇలా దాడి చేస్తున్నాయి. వ్యవసాయ రంగంలో అంతర్గతంగా కూడ దాడి జరుగుతోంది. ఈ దాడి గతంలో కృత్రిమ రసాయన విషధాతుల ఎఱువుల రూపంలో కొనసాగింది. ‘ఎండోసల్ఫాన్’ రూపమెత్తింది. క్రిమిసంహార విషాలు పంటలను ప్రధానంగా కూరగాయలను పండ్లను విషపూరితం చేశాయి. జీవ జన్యువుల మార్పిడి- జెనటిక్ మోడిఫికేషన్- జీఎమ్- సాంకేతిక ప్రక్రియ ద్వారా రూపొందిన విత్తనాలు ఈ అంతర్గత దాడికి పరాకాష్ఠ. ‘జీఎమ్’ పంటలలో సహజంగా ఉత్పత్తి అయ్యే ‘బీటీ’- బాసిలస్ తురింజెనిసిస్- రసాయనం దిగుబడులు పెరగడానికి దోహదం చేస్తోందట! కానీ ఈ ‘బీటీ’ రసాయనం పాత తెగుళ్లను నిర్మూలించి భయంకరమైన కొత్త తెగుళ్లను సృష్టించింది. ‘బీటీ’ పత్తి వల్ల గొప్ప లాభం కలుగుతుందన్న భ్రమతో మెదక్ జిల్లా రైతులు జొన్నలు, కందులు వంటి పంటలను పక్కనపెట్టి ‘బీటీ’ పత్తిని పండిస్తున్నారట. కానీ ఈ ఏడాది పత్తి దిగుబడులు సగానికి సగం తగ్గాయట! ‘బీటీ’ పంటను- పత్తిని- ఐదేళ్లు వరుసగా పండించినట్టయితే ఆ భూమి మరే ఇతర పంటకు పనికిరాకుండా పోతోంది. ఆ తరువాత కొత్తరకం రంగురంగుల ‘అందమైన ఈగలు’, పురుగులు బలిసి పత్తికాయలను నమిలి మింగేశాయి. రసాయనాలను పిచ్చికారీ చేసినందున ఈ ‘బీటీ’ పురుగులు, ఈగలు నశించడం లేదన్నది వరంగల్ జిల్లాలో ధ్రువపడింది. పంజాబ్‌లో మరింతగా ధ్రువపడింది. దేశమంతటా ధ్రువపడుతోంది! అన్నదాతల ఆత్మహత్యలకు, వ్యవసాయ జీవనుల వలసలకు ఇదీ నేపథ్యం. రుణాలను రద్దు చేయడం వల్ల సమస్యలు తీరడం లేదు. తీరడం లేదని ‘నీతి ఆయోగ్’ మరోసారి ధ్రువపరిచింది. దళారీలు బయలుదేరారు. నకిలీ వ్యవసాయదారులు బ్యాంకుల్లో రుణాలు పొంది ఎగవేస్తున్నారు.. వ్యవసాయరంగంలో వౌలిక మార్పులు జరగనంత వరకూ తెలంగాణ ప్రభుత్వం కోటి ఎకరాలకు నీరిచ్చినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు కోట్ల ఎకరాలకు నీరు ప్రసాదించినప్పటికీ ప్రయోజనం ఉండబోదు. ‘బీటీ’, ‘జీఎమ్’ పంటలను, రసాయనపు ఎఱువులను, పురుగుల మందులను పూర్తిగా నిషేధించాలి. విత్తనాలను రైతులు కొనరాదు. వారే విత్తనాలను తయారు చేసుకొనే సేంద్రియ పద్ధతి పునరుద్ధరణ జరగాలి. ఆవుపేడ, పశువుల పేడ, చెఱువుమట్టి, అటవీ ఉత్పత్తులు ఎఱువులుగా వాడే పద్ధతి మళ్లీ మొదలుకావాలి. ఈ సేంద్రియ వ్యవసాయాన్ని వందశాతం భూమికి విస్తరింపచేయాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆకాంక్ష అభినందనీయం. కానీ ఆ ఆకాంక్షలు బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు సృష్టిస్తున్న కృత్రిమ ప్రగతి ఊబిలో కూరుకొనిపోకుండా ఉండాలి..
వాణిజ్య సారళ్యం- ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్-లో మన దేశం గొప్ప ప్రగతిని సాధించిందట! కానీ ఈ ‘ప్రగతి’ని బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు, విదేశీయ శక్తులు నిర్దేశిస్తున్నాయి, నియంత్రిస్తున్నాయి. వ్యవసాయ సారళ్యం- ఈజ్ ఆఫ్ డూయింగ్ అగ్రికల్చర్- గురించి ప్రపంచీకరణ శక్తులకు ధ్యాస లేదు. అందువల్ల ఈ సహజ ప్రగతి గురించి ‘స్థాయి’లు ఏర్పడడం లేదు. ‘వ్యాపార సారళ్యం’ ప్రాతిపదికగా గాక ‘వ్యవసాయ సారళ్యం’ ప్రగతికి గీటురాయి కావాలి. అదీ అందరూ ఆర్భాటిస్తున్న నిజమైన భాగస్వామ్య ప్రగతి- ఇన్‌క్లూసివ్ డెవలప్‌మెంట్! ‘ఆర్భాటం’ ఆచరణగా మారాలి!!