సంపాదకీయం

పైశాచిక ‘శిక్ష’ణ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాఠశాలలు పిల్లలకు శిక్షణనిచ్చే సంస్కార స్వరూపాలు- అన్నది పాతమాట! పాఠశాలలు పిల్లలను శిక్షించే అమానవీయ వాణిజ్య కేంద్రాలుగా మారి ఉండడం నడచిపోతున్న చరిత్ర. బుద్ధి పెరిగిన అయ్యవార్లకు, పంతులమ్మలకు, పాఠశాలల నిర్వాహకులకు, యజమానులకు హృదయం తరిగిపోవడం చిన్నపిల్లలు అమానుష శిక్షలు అనుభవిస్తుండడానికి ఏకైక కారణం.. చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని ‘చైతన్య భారతి పాఠశాల’ అన్న వ్యాపార విద్యా కేంద్రం ప్రాంగణంలో చిన్నపిల్లలను బట్టలూడదీసి ఎండలో నిలబెట్టడం ఈ అమానవీయ ప్రహసనంలో వర్తమాన ఘట్టం! ఈ పిల్లలు చేసిన నేరం పాఠశాలకు ఆలస్యంగా రావడం! బడిపిల్లలు ప్రధానంగా ఊహ సరిగా తెలియని ప్రాథమిక విద్యార్థులు పాఠశాలకు ఆలస్యంగా వెడుతుండడానికి కారణం వారు కాదు. అందువల్ల ఆలస్యానికి పిల్లలను శిక్షించడం వౌలికమైన వైపరీత్యం. పాఠశాలలో అల్లరి చేసిన వారిని, తోటి పిల్లలను కొట్టిన వారిని, గిచ్చిన వారిని, గిల్లిన వారిని పంతుళ్లు, పంతులమ్మలు దండించవచ్చు. ఇలాంటివారిని సైతం తప్పునకు అనుగుణంగా మాత్రమే దండించాలి. కానీ కొందరు ఉపాధ్యాయులు ప్రధానంగా పంతులమ్మలు ఇలా దండించడంలో ‘కసి’ని ప్రదర్శిస్తుండడం దేశమంతటా ఆవిష్కృతమవుతున్న వికృత దృశ్యం. చిన్న చిన్న తప్పులు చేసిన పిల్లలను వాతలు తేలేలాగ, రక్తం ఉబికేలాగ, కండెలు కట్టేలాగ అయ్యవార్లు కొట్టిన ఘటనలు గతంలో ఎన్నో ప్రచారమయ్యాయి. బల్లఎక్కి దూకిన నేరానికి ‘కాలాంశం’- పీరియడ్- పూర్తయ్యేవరకు ‘నేరస్థుడి’ని, ‘నేరస్థురాలి’ని బల్లపైన నిలబెట్టడం అమానవీయ శిక్ష! ఐదు, పది నిముషాలు నిలబెట్టి కూచోమని చెప్పవచ్చు! ‘బల్లఎక్కి దూకిన’ అభియోగానికి పసిపాపను రోజంతా పాఠశాల ప్రాంగణంలో నిలబెట్టి ప్రదర్శించే పంతుళ్లను, పంతులమ్మలను ఏమని పిలవాలి? పాఠశాల ప్రాంగణంలో తెలుగు భాషను మాట్లాడిన నేరానికి ‘ఐ డోంట్ స్పీక్ తెలుగూ’- నేను తెలుగులో మాట్లాడను- అని వందసార్లు, రెండు వందలసార్లు వ్రాయించడం ఆంగ్ల మాధ్యమ బడిలో అమలు జరిగిన శిక్ష.. సరికొత్తగా ఇలా తెలుగులో మాట్లాడడం మానుకోలేని వారికి చిత్ర విచిత్ర శిక్షలను అమలు జరుపుతున్నారు. ‘ఐ డోంట్ స్పీక్ తెలుగూ’ అన్న ప్రకటన వ్రాసిన ‘బల్ల’ను పట్టుకొని ‘నేరస్థులు’ వ్యాపార విద్యా ప్రాంగణాలలో నిలబడుతున్నారు. సందు దొరికితే చాలు శిక్షించాలన్న ‘పైశాచికానంద’- శాడిస్ట్ శాటిస్‌ఫాక్షన్- ప్రవృత్తి పెరిగిన వారు అయ్యవార్లుగా, అయ్యవారమ్మలుగా చెలామణి అవుతుండడం ఈ ‘శిక్ష’లకు కారణం.. మంచివారు లేరని కాదు, మహనీయులు లేరని కాదు.. వారి సంఖ్య తక్కువైపోయింది...
ఇలా బోధకులు పైశాచిక ఆనంద స్వభావులు- శాడిస్ట్‌లు-గా మారిపోతుండడానికి కారణం కూడ విద్యా విధానమే! సౌశీల్యం నేర్పని, సంస్కారం మప్పని, విజ్ఞానం నిండిన తలవారు- విద్యాధికులుగా ఉద్యోగులుగా అధికారులుగా రాజకీయ వేత్తలుగా న్యాయమూర్తులుగా ప్రముఖులుగా చెలామణి అవుతున్నారు. ఈ ప్రభావం విద్యారంగంలో పనిచేస్తున్నవారి స్వభావాన్ని సైతం వికృత పరుస్తోంది. అయ్యవార్లు, అయ్యవారమ్మలు తమ విద్యార్థులను కన్న కొడుకుల వలె, కన్న కూతుళ్ల వలె సంభావించాలన్నది విద్యా పద్ధతికి సంబంధించిన వౌలికమైన సంస్కారం. ఈ వౌలికమైన సంస్కారం మిగిలిన సంస్కారాలు అంకురించి పల్లవించి పుష్పించి పరిమళించడానికి భూమిక. మాతృ మమకారం మాతృదేశం పట్ల మమకారంగా పరిణతి చెందడం భారతీయ విద్య. మాతృ దేశం పట్ల మమకారానికి విస్తృతి విశ్వహితం- ‘వసుధైవ కుటుంబ’ జీవన వాస్తవం.

పాలుతాగు పసిపాపకు
పలుకు నేర్పె సంస్కారం,
పురుషుని పురుషోత్తమునిగ
తీర్చిదిద్దే సంస్కారం,
తరతరాల భారతీయ
వరమైనది సంస్కారం...
సంస్కార సమాహారం
మన జాతికి అస్తిత్వం!
ఈ సంస్కార సమాహారం విదేశీయుల దురాక్రమణ ఫలితంగా, విదేశీయుల బీభత్స పాలన ఫలితంగా వికృతమైపోయింది. ఈ ‘్భమిక’ బీటలు పారిపోయింది. ఇంటికి ప్రతినిధిగా ‘బడి’, తల్లిదండ్రులకు ప్రతిబింబాలుగా అధ్యాపకులు అలరారక పోవడానికి విద్యా స్వరూప స్వభావాలు ఇలా వికృతం కావడం కారణం! అందువల్ల పుంగనూరులోని ఆ విద్యాలయంలో ఇలా బాలలపై బీభత్సం విరుచుకొని పడింది!
పుంగనూరులోని ‘చైతన్య భారతి’ పాఠశాలలో మూడవ తరగతి, నాలుగవ తరగతి చదువుతున్న పిల్లలు ఆలస్యంగా వచ్చారట! ఇందుకు కారణం తల్లిదండ్రులు వారిని సకాలంలో సంసిద్ధం చేసి బడికి పంపకపోవడం కావచ్చు.. పాఠశాల ప్రధాన అధ్యాపకుడు తల్లిదండ్రులను హెచ్చరిస్తూ ఉత్తరం వ్రాసి ఉండాలి. పిల్లలను హింసించడం అర్థం లేని చర్య. పిల్లలను బడికి తీసుకొని వచ్చే రిక్షాల వారు, ఆటోరిక్షాల వారు, బస్సుల వారు కూడ ఆలస్యం చేసి ఉండవచ్చు. కానీ ‘చేయని నేరానికి’ ఆరుగురు బుడతలను- బట్టలన్నీ ఒలిచేసి కేవలం లంగోటాల- గోచీల-తో బడి ప్రాంగణంలో నిలబెట్టాలన్న విచిత్ర వికృత మనః ప్రవృత్తి పాఠశాల నిర్వాహకులకు- అధ్యాపకులకు- ఏర్పడడం దశాబ్దుల విద్యా విధాన వైఫల్యం... అంతర్గతంగా నిహితమై ఉన్న సౌశీల్య రాహిత్య బోధన... ఈ సౌశీల్య రాహిత్యం అన్ని ఇతర రంగాలను మాత్రమే కాక విద్యారంగాన్ని ముంచెత్తడం నిరాకరించజాలని నిజం! 1970లో జరిగిన ఒక వి‘చిత్ర’ సంఘటన గురించి 1990వ దశకంలో ఎవరో వెల్లడించారు. ఒక ప్రముఖ నటీమణి తాను నటిస్తున్న చిత్రంలో బాల వేషానికి తమ బంధువుల పాపను సిఫార్సు చేసిందట. కానీ నిర్మాతలు వేరే అమ్మాయిని ఎంచుకున్నారట! అభినయ సమయంలో బాలనటి చెంపపై ప్రౌఢనటి కొట్టాలట! తన బంధువుల అమ్మాయికి అవకాశం రాలేదన్న కసితో రగిలిపోతున్న ఆ ప్రముఖనటి ఆ చిట్టిపాప చెంప కందిపోయేలా ఛెల్లుమనిపించిందట! ఆ బాలనటికి జ్వరం వచ్చేసింది. ‘ఆ బాలనటి నా చెల్లెలు అయి ఉంటే నేను ఊరుకునే వాడిని కాదు..’ అని ఒక సహాయకుడు బహిరంగంగా వ్యాఖ్యానించాడట! భాగ్యనగరంలో ఒక పోలీస్ స్టేషన్‌కు ఒక మహిళ వెళ్లి ఫిర్యాదు చేసింది. అద్దెకున్న తనను ఇల్లుగల గయ్యాళి యజమానురాలు తనను ఒళ్లంతా బరికి గాయపరిచిందన్నది ఆమె ఫిర్యాదు. పోలీసు ఠాణా అధికారులు నిందితురాలి వద్ద, బాధితురాలి వద్ద సమానంగా లంచం దండుకొని ఇద్దరినీ తిట్టి పంపించేశారట! ఇతర రంగాలలోని ఈ పైశాచిక ఆనంద చిత్తవృత్తికి వారు విద్య నేర్చుకొన్న తీరు కారణం. ఓ నాలుగవ తరగతి పాప తనను గిల్లిందని మూడవ తరగతి పాప ఫిర్యాదు చేసింది. పంతులమ్మ ఆ నాలుగవ తరగతి పాప బుగ్గ, చెంప కందిపోయేలా కొట్టింది. ‘నువ్వు దాని జోలికెందుకు పోయావు? అందుకే ఆమె నిన్ను గిల్లింది’ అని మూడవ తరగతి పాపను కూడ పంతులమ్మ చెంపపై కందిపోయేలాగ కొట్టిందట! ఇదేం న్యాయం? ఇదేం విద్యాపాలన?? హైదరాబాద్‌లో జరిగిన ఘటన ఇది. అసౌకర్యమైన ప్రశ్న వేసిన స్వామినాథన్ అనే ఆరవ తరగతి విద్యార్థికి సమాధానం చెప్పలేని ‘ఆల్బర్ట్ స్కూల్’ ఉపాధ్యాయుడు కోపంతో ‘స్వామి’ చెవులను కందిపోయేలాగ పిండేశాడు! ప్రఖ్యాత రచయిత ఆర్.కె. నారాయణ్ చెప్పిన 1915వ సంవత్సరం నాటి ‘మాల్గుడి కథ’ ఇది!
తల్లిదండ్రులు మాత్రం తక్కువ తినడం లేదు. నాలుగేళ్లు నిండిన తరువాత ఐదవ నెలలో ఐదవ రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం తరతరాల విద్యా సంప్రదాయం. ఆ తరువాత కూడ అక్షరాభ్యాసం చేయించవచ్చు. కానీ ముందుగా చేయించరాదు. ‘కానె్వంటు’ మారీచ మృగ విన్యాసాలకు మురిసిపోతున్న ‘మమీడాడీలు’ ఇపుడు రెండేళ్లు నిండిన పాపలకు, బాబులకు ఆర్భాటంగా అక్షరాభ్యాసం చేసి వాణిజ్య పాఠశాలలకు తోలిస్తున్నారు. మూడేళ్లు కూడా నిండని ఈ బుడతలు ఇలా మానసిక, శారీరక హింసకు గురికావలసిందేనా??