సంపాదకీయం

చేదు అయిన న్యాయం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ ఉన్నత న్యాయస్థానం ‘తెలంగాణ ఉన్నత న్యాయస్థానం’గాను, ‘ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం’గాను పునర్ వ్యవస్థీకృతం కావడం మరో చారిత్రక పరిణామం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణతో ఈ శుభ పరిణామం ముడివడి ఉంది. ఒక రాష్ట్రం రెండుగా పునర్ వ్యవస్థీకరణ జరిగిన వెంటే ఉమ్మడి రాజ్యాంగ వ్యవస్థలు కూడ రెండుగా ఏర్పడడం సహజమైన పరిణామం. ‘‘కలియుగాబ్ది 5120వ సంవత్సరం, జాతీయ శకం 1940వ సంవత్సరం, క్రీస్తుశకం 2019వ సంవత్సరం ఈ సహజ పరిణామక్రమ పరాకాష్ఠకు ‘సమయ ముద్ర’ను వేయడం కేవలం లాంఛనం. ఈ రాజ్యాంగ లాంఛనం శుభ విలంబ సంవత్సరం మార్గశిర బహుళ ఏకాదశి, మంగళవారం నాడు చారిత్రక వాస్తవంగా ప్రస్ఫుటిస్తోంది! ఉమ్మడి మదరాసు రాష్ట్రం కొనసాగిన కాలంలో తెలుగువారికి రెండు ఉన్నత న్యాయస్థానాలు ఉండేవి. మదరాసు రాష్ట్ర పునర్విభజన ఫలితంగా క్రీస్తుశకం 1953 అక్టోబర్ ఒకటవ తేదీన ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి గుంటూరులో ఉన్నత న్యాయస్థానం ఏర్పడడం చరిత్ర. ‘నిజాం’ల మతోన్మాద నిరంకుశ బీభత్స పాలన నుంచి హైదరాబాద్ సంస్థానం 1948 సెప్టెంబర్ 17న విముక్తమైన తరువాత 1956 అక్టోబర్ ముప్పయి ఒకటవ తేదీ వరకు అలా తెలుగువారికి రెండు ఉన్నత న్యాయస్థానాలు ఏర్పడినాయి.... హైదరాబాద్‌లో ఒకటి, మొదట మదరాసులోను ఆ తరవాత గుంటూరులోను రెండవది. హైదరాబాద్ రాష్ట్రంలోని కన్నడ ప్రాంతాలు మైసూరు- కర్నాటక - రాష్ట్రంలోను మరాఠీ ప్రాంతాలు ముంబయి- మహారాష్ట్ర-లోను కలసిపోవడం తెలుగు ప్రాంతమైన తెలంగాణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలతో కలసి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడడం తరువాతి చరిత్ర. అలా 1956 నవంబర్ ఒకటవ తేదీన ఆంధ్రప్రదేశ్ ఏర్పడడంతో గుంటూరులోని హైకోర్టు హైదరాబాద్‌లోని హైకోర్టులో కలసిపోయింది. 2014 జూన్ రెండవ తేదీన తెలుగు భాషాజన సముదాయానికి మళ్లీ రెండు రాష్ట్రాలు ఏర్పడడం అనాది చారిత్రక ప్రస్థానంలో మరో శుభంకర పరిణామం. చిన్న రాష్ట్రాలు ఏర్పడడం వల్ల పాలన, ప్రగతి వికేంద్రీకృతం కాగలవన్న, మరింత విస్తృతం కాగలవన్న వాస్తవానికి ఈ నాలుగున్నర ఏళ్ల చరిత్ర నిదర్శనం! అందువల్ల మళ్లీ రెండు ఉన్నత న్యాయస్థానాలు ఏర్పడడం ఊహించిన పరిణామం. ఈ పరిణామం వాస్తవ రూపం ధరించడానికి నాలుగున్నర ఏళ్లు పట్టడమే విచిత్రమైన వ్యవహారం! తెలుగువారి ఈ చరిత్ర మొత్తం- 1948నాటి నుంచి, 1953 నాటి నుంచి, 1956నుంచి, 2014 నుంచి కొనసాగుతున్న చరిత్ర- ఉమ్మడి వారసత్వం! అందువల్ల రెండు న్యాయస్థానాలు వ్యవస్థీకృతవౌతున్న సమయంలో హైదరాబాద్‌లో తెలంగాణ ఉన్నత న్యాయస్థానం, విజయవాడ- అమరావతి-లో ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం ‘కొత్తగా’ కొలువుతీరుతున్న సమయంలో తెలుగు ప్రజలు ఈ ఉమ్మడి వారసత్వపు అనుభూతులను నెమరు వేసుకొనడం సహజం..
ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక ఉన్నత న్యాయస్థానం ఉండాలని రాజ్యాంగంలోని 214వ అధికరణం నిర్దేశిస్తోంది. కేంద్ర పాలిత ప్రాంతాలకు మాత్రం ప్రత్యేకంగా హైకోర్టు ఉండవచ్చు లేదా రెండు అంతకంటె ఎక్కువ కేంద్ర పాలిత ప్రాంతాలకు కలసి ఒకే హైకోర్టు ఉండవచ్చునని 241వ అధికరణం నిర్దేశిస్తోంది. అందువల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఈ నాలుగున్నర ఏళ్లుగా ప్రత్యేక ఉన్నత న్యాయస్థానాలు లేకపోవడం రాజ్యాంగ స్ఫూర్తికి కలిగిన విఘాతం. గతంలో బిహార్ పునర్ వ్యవస్థీకరణ తరువాత ఝార్ఖండ్ ఏర్పడినప్పుడు కాని, మధ్యప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ తరువాత ఛత్తీస్‌గఢ్ ఏర్పడినప్పుడు కాని, ఉత్తరాంచల్- ఉత్తరఖండ్- ఉత్తరప్రదేశ్ నుండి విడివడినప్పుడు కానీ ఉన్నత న్యాయస్థానం ఏర్పాటు వ్యవహారానికి ఇంతటి సుదీర్ఘకాలయాపన జరగలేదు. మదరాసు రాష్ట్రం పునర్విభజన తరువాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడ కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు ఏర్పడడం సమాంతర పరిణామాలు! కానీ తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్‌కు నాలుగున్నర ఏళ్లు ఒకే ఉన్నత న్యాయస్థానం కొనసాగడం పునర్ వ్యవస్థీకరణ స్ఫూర్తికి వ్యతిరేక పరిణామం. పదేళ్లపాటు ఉభయ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిని మాత్రమే పునర్ వ్యవస్థీకరణ చట్టంలో నిర్దేశించారు.. ఉమ్మడి న్యాయస్థానాన్ని కాదు!
శాసన నిర్మాణం- విధాన మండలి- కార్యనిర్వాహకత్వం- మంత్రివర్గం,- న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్య రాజ్యాంగ ప్రక్రియను నడిపించే మూడు ప్రధాన విభాగాలు. కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు ఈ మూడు విభాగాలు ప్రత్యేకంగా ఏర్పడినప్పుడు మాత్రమే రాష్ట్రానికి రాజ్యాంగ స్వరూప స్వభావాలు సమగ్రం కాగలవు. ఆ సమగ్రతను రెండు తెలుగు రాష్ట్రాలు మంగళవారం సంతరించుకోనున్నాయి. ఈ సమగ్రత సిద్ధించడానికి నాలుగున్న ఏళ్లు పట్టడం రాజకీయ నిర్లక్ష్యానికి నిదర్శనం. హైదరాబాద్ ఉన్నత న్యాయస్థానాన్ని రెండు వేఱువేఱు న్యాయస్థానాలుగా పునర్ వ్యవస్థీకరించడం పట్ల తెలంగాణ ప్రభుత్వం చూపినంత శ్రద్ధ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపలేదన్నది నిరాకరింపజాలని నిజం. కేంద్ర ప్రభుత్వం దాదాపు నాలుగేళ్లు ఈ సంగతిని పెద్దగా పట్టించుకోకపోవడం చరిత్ర. సర్వోన్నత న్యాయస్థానం అక్టోబర్ 29వ తేదీన ఆదేశించిన తరువాత మాత్రమే ‘కదలిక’ మొదలైంది! ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఉన్నత న్యాయస్థానం పనిచేయడానికి వీలైన తాత్కాలిక భవనాలను డిసెంబర్ పదిహేనవ తేదీనాటికి సిద్ధం చేయగలమని రాష్ట్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానానికి నివేదించింది. జనవరి ఒకటవ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతిలో పనిచేయాలన్న ఉత్తరువునకు ఇదీ ప్రాతిపదిక! కానీ ఈ తాత్కాలిక భవనాలు సిద్ధం కాకపోవడం వల్ల ఉన్నత న్యాయస్థానాన్ని తాత్కాలికంగా విజయవాడలో ఏర్పాటు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధిక శాతం న్యాయవాదులు హైకోర్టుతోపాటు అమరావతికి తరలిపోవడానికి విముఖతను వ్యక్తం చేయడానికి ఇదీ కారణం! హైకోర్టు తరలింపును కొన్ని నెలలపాటు వాయిదా వేయాలన్నది ఈ న్యాయవాదుల అంతరంగం... ఈ ‘వాయిదా’ను కోరుతూ ఈ న్యాయవాదులు సుప్రీం కోర్టును ఆశ్రయించడం విజయవాడలో మంగళవారం జరుగనున్న ప్రధాన ఉన్నత న్యాయమూర్తి, న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార ఉత్సవానికి విచిత్రమైన నేపథ్యం..
అమరావతిలో భవనాల నిర్మాణం పూర్తికానప్పుడు ఆ సంగతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానానికి నివేదించి ఉండాలి, నివేదించకపోవడం నిమ్మకు నీరెత్తినట్టు నిర్లిప్తతను ప్రదర్శించడం నిర్లక్ష్యానికి నిదర్శనం! హైదరాబాద్ ఉభయ రాష్ట్రాలకు పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉండగల అవకాశం ఉంది. అందువల్ల హైదరాబాద్‌లోని తమ భవనాల ప్రాంగణంలోనే, తాము ఖాళీచేసిన సచివాలయంలో కావచ్చు ఇతర భవనాలలో కావచ్చు కొంతకాలం తమ ఉన్నత న్యాయస్థానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పరచుకొని ఉండవచ్చు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం కూడ అభ్యంతరం చెప్పలేదు! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ ధ్యాస ఎందుకు కలగలేదు? శాసనసభను, సచివాలయాన్ని తరలించుకొని రావడానికి- హైదరాబాద్ నుంచి అమరావతికి- చూపిన ఆసక్తిని, శ్రద్ధను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానాన్ని తరలించుకొని రావడంలో చూపలేదన్నది స్పష్టం.. ఏమయినప్పటికీ ప్రత్యేక ‘హైకోర్టులు’ ఏర్పడినాయి. ఉభయ రాష్ట్రాలకు ‘రాజ్యపాల్’-గవర్నర్- మాత్రమే ఇప్పుడు ‘‘ఉమ్మడి’’.