సంపాదకీయం

ఛైనా గాలిపటం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మకర సంక్రాంతికి మరో పేరు ‘పతంగ్’ల- గాలిపటాల- పండుగ.. మకర సంక్రాంతి పండుగకూ గాలిపటాలకు అవినాభావ సంబంధం ఉండడం తరతరాల కథ. మన దేశంలోని ఆకాశంలో ఎగురుతున్న గాలిపటాలలో అత్యధిక శాతం చైనాతో ముడివడి ఉండడం నడుస్తున్న వ్యథ.. చైనా గాలి పటాలకున్న దారం- మాంజా- స్వదేశంలో తయారైన గాలి పటాలను కోస్తోంది, తెగిన మన గాలిపటాలు కూలిపోతున్నాయి. ఈ ‘పతంగ్’లను, దారాన్ని తయారుచేస్తున్న కుటీర పరిశ్రమలు దేశవ్యాప్తంగా మూతపడి పోతున్నాయి! చైనాలో తయారవుతున్న గాలిపటాలు- పతంగ్‌లు-, వాటిని ఎగుర వేయడానికి అవసరమైన చైనా ‘దారం’- మాంజా- మన దేశానికి దిగుమతి కాకుండా మన ప్రభుత్వం నిషేధించక పోవడం ఈ స్వదేశీయ వైపరీత్యానికి మూల కారణం! ‘దిగుమతి’ని పూర్తిగా నిషేధించకుండా ‘వాడకాన్ని’ మాత్రం నిషేధించడం వల్ల చైనా గాలిపటాలు, చైనా ‘మాంజా’ మన దేశపువిపణి వీధుల నుంచి తొలగిపోవడం లేదు. ఫలితంగా వందల ఏళ్లుగా ‘పతంగ్’లను తయారుచేస్తున్న భారతీయులు, చిట్టిపొట్టి ఉత్పత్తిదారులు, గృహపరిశ్రమల వారు తమ దుకాణాలను మూసివేస్తున్నారు. ఇలా మూసివేస్తున్న ఉదంతాలు నాలుగైదు ఏళ్లుగా ప్రచారం అవుతున్నప్పటికీ ప్రభుత్వాలు నిరోధక చర్యలను చేపట్టిన జాడ లేదు. ‘్భరత్‌లో నిర్మించండి’- మేక్ ఇన్ ఇండియా- అన్న కార్యక్రమాన్ని నాలుగేళ్లుగా అమలుజరుపుతున్న కేంద్ర ప్రభుత్వం ఈ గృహ పరిశ్రమలవారు తమ గాలిపటాలను, దారాన్ని తయారుచేయడానికి వీలుగా నిర్నిరోధ వ్యవస్థను మాత్రం తయారుచేయలేక పోతోంది! పదిహేను ఏళ్లకు పైగా చైనానుంచి వందల వేల రకాల అనవసరమైన వస్తువులు మన దేశాన్ని ముంచెత్తుతున్నాయి. ఫలితంగా మనం చైనాతో చేస్తున్న వ్యాపారంలో మనకు సాలుసరి ‘లోటు’ నిరంతరం పెరిగిపోతోంది. నాలుగేళ్ల క్రితం ఈ ‘లోటు’ విలువ రెండున్నర లక్షల కోట్ల రూపాయలు. ప్రస్తుతం ఈ ‘లోటు’ మూడున్నర లక్షల కోట్ల రూపాయలకు చేరినట్టు ప్రచారవౌతోంది. తమ వాణిజ్యపు లోటును తగ్గించుకొనడానికై అమెరికా, ఐరోపా సమాఖ్య దేశాలు చైనా వస్తువులపై దిగుమతి సుంకాలను పెంచుతున్నాయి, కొన్ని వస్తువుల దిగుమతిని నిషేధించాయి కూడ! కానీ మన ప్రభుత్వం మాత్రం ఈ ‘లోటు’ తగ్గించుకొనడానికి వీలైన పటిష్ఠ చర్యలను చేపట్టడంలో ‘మీనమేషాల’ను లెక్కిస్తూ నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం పదిహేను ఏళ్ల వైపరీత్యం. ఫలితంగా ‘లోటు’పెరిగి మన విదేశీయ వినిమయ ద్రవ్యం- ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ కరెన్సీ- భారీగా చైనాకు తరలిపోతోంది. మన వార్షిక రక్షణ వ్యయం కంటె, మన భద్రతకు ప్రమాదకరంగా పరిణమించిన శత్రు దేశమైన చైనాకు మన దేశం నుంచి తరలిపోతున్న విదేశీయ వినిమయ ద్రవ్యం విలువ ఎక్కువ. మన ప్రభుత్వాల వలె ‘జాతీయ ఆత్మహత్యా సదృశమైన’ వ్యాపారాన్ని ప్రపంచంలో మరే దేశంలోను చేయడం లేదు. ఇజ్రాయిల్ ప్రభుత్వం తమ దేశంలో పెట్టుబడులను పెట్టడానికి సిరియా, ఇరాన్, లెబనాన్, సౌదీ అరేబియా వంటి శత్రుదేశాలను అనుమతించడం లేదు! ఎందుకంటె ఈ దేశాల ప్రభుత్వాలు ఇజ్రాయిల్‌ను బద్దలుకొట్టడానికై బీభత్సకాండను ప్రోత్సహిస్తున్నాయి. జపాన్ వస్తువులను చైనావారు కొనడం లేదు, జపాన్ ప్రజలు ‘ఎగబడి’ చైనాబజార్‌లలో కొనుగోళ్లు చేయడం లేదు. చైనా భోజనాల- చైనీస్ ఫుడ్-ను ఆరగించడం లేదు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో చైనా, జపాన్‌లు పరస్పరం శత్రువులు. ‘శంకాకు’ అన్న ద్వీప సముదాయం యాజమాన్యం విషయంలో ఉభయ దేశాలకు మధ్య ఇప్పటికీ వివాదం సాగుతోంది!
చైనాను చూసి మనం నేర్చుకోవాలన్నది అక్కడికి వెళ్లి వస్తున్న మంత్రులు, ముఖ్యమంత్రులు మనకు చెబుతున్న పాఠం..కానీ ఏమి నేర్చుకుంటున్నాము? తమ జాతీయ ప్రయోజనాలను దెబ్బతీస్తోందన్న ‘సాకు’తో జపాన్‌పై చైనా పగసాధిస్తూనే ఉంది! మన జాతీయ ప్రయోజనాలను భంగపరుస్తున్న దేశాల పట్ల మనం కూడ వ్యతిరేకతను చూపాలన్నది చైనానుంచి మనం నేర్చుకోవలసిన పాఠం. కానీ మన దేశంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిర్వహిస్తున్నవారు మాత్రం ఈ పాఠం నేర్చుకున్న, నేర్చుకుంటున్న దాఖలాలు లేవు. చైనా సంస్థలకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు ‘తలుపులు బార్లా తెరచి ఉంచాయి’.. చైనా సంస్థల పట్టు మన ఆర్థిక వ్యవస్థపై పెరగడానికి మన ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ‘తెలిసిన’ ప్రభుత్వ నిర్వాహకులు ఇలా చైనా ఆర్థిక వాణిజ్య దురాక్రమణను ప్రోత్సహిస్తున్నప్పుడు ‘తెలియని’ యువజనులు, సామాన్యులు ‘చైనీస్ ఫుడ్’ను ‘చొంగలు కార్చుకుంటూ’ ‘ముక్కులను ఊరించుకుంటూ’ ఆరగించడంలో ఆశ్చర్యం ఏముంది? మనం కొంటున్న, తింటున్న, ఇళ్లలో వాడుతున్న అనేకానేక వస్తువులు శత్రుదేశమైన చైనానుంచి వచ్చిపడుతున్నాయి. చైనా 1962లో మన ప్రభుత్వాన్ని వెన్నుపోటు పొడిచింది, భౌతికంగా దురాక్రమించింది. ఇప్పటికీ దాదాపు యాబయి వేల చదరపు కిలోమీటర్ల మన భూమి చైనావారి అక్రమ అధీనంలో అలమటిస్తోంది. అందువల్ల చైనా మనకు శత్రుదేశం. చైనా వస్తువులను కొనడం తినడం వాడడం మన జాతికి హానికరం, మన దేశానికి ద్రోహం. కానీ ఏవి చైనా వస్తువులు? ఏవి కావు? అని సామాన్య జనానికి తెలీదు.. ఎవరు తెలియచెప్పాలి?? 2050 నాటికి భారత ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థను కూల్చివేయడానికి కుట్ర చేస్తున్న మావోయిస్టులను, నక్సలైట్లను చైనా ఉసిగొల్పుతోంది. అందువల్ల చైనా మనకు శత్రుదేశం! చైనావారి ‘గాలిపటాల’ను, చైనానుంచి వస్తున్న దారాన్ని కొంటున్న పిల్లలకు ఈ వాస్తవం తెలీదు, కొనిస్తున్న తల్లితండ్రులకు ఈ వైపరీత్య ధ్యాస లేదు. ‘్ధ్యస ఉన్న’ప్రభుత్వం చైనా దిగుమతులను ఎందుకు నిషేధించరాదు? ఎందుకు కనీసం నియంత్రించరాదు..??
చైనానుంచి వస్తున్న ప్లాస్టిక్ దారం పక్షుల గొంతులను పావురాల గొంతులను కోస్తోందని 2013నుంచి వార్తలు ప్రచారం అవుతూనే ఉన్నాయి. ఈ దారం తగిలి గాయపడిన బాలబాలికలకు నెలల తరబడి ఆ పుండ్లు మానడం లేదని కూడ ప్రచారమైంది. ఈ దారం- మాంజా- గాలిపటాల- పతంగ్‌ల-ను ఎగురవేయడానికై ఉపయోగపడుతోంది. ఈ దారం ఉపయోగించినట్టయితే గాలిపటాలు ఆకాశంలోకి బాగా దూసుకొనిపోతాయన్న భ్రమ వ్యాపించి ఉంది! అందువల్ల మన దేశంలో తరతరాలుగా తయారవుతున్న ‘పత్తిదారాన్ని’ వద్దని, చైనానుంచి వస్తున్న ప్లాస్టిక్ దారాన్ని జనం ఎగబడి కొంటున్నారు. ఈ ప్లాస్టిక్ చైనా ‘దారం’లో గాజుముక్కలను ఇతర రసాయన విషాలను కలుపుతున్నారట! అందువల్ల ఈ ‘దారం’ కత్తిలాగా మారుతోందట. ‘పతంగ్’లను ఎగురవేసేవారు తమ ‘పతంగ్’ మిగిలినవారి గాలి పటాలకంటె ఎత్తున ఎగరాలని భావించడం సహజం! అంతవరకు బాగుంది. కానీ తమ గాలిపటంతో పోటీపడి పైకి లేచే ఇతరుల గాలిపటాలను కూల్చివేయడం ‘ఆట’లో భాగమైపోయింది. అందువల్ల తమ గాలిపటానికున్న ‘దారం’తో ఇతరుల గాలిపటాలను ఎగిరించే దారాలను కోసివేయాలి, అప్పుడు ప్రత్యర్థుల గాలిపటం కూలిపోతుంది. ఈ పోటీ ఆట ‘ధర్మయుద్ధం’వలె నూలు దారంతో మాత్రమే జరగడం తరతరాల క్రీడా చరిత్ర. స్వదేశీయ గృహపరిశ్రమలవారు ‘నూలు’తో మాత్రమే గాలిపటాల దారాన్ని తయారుచేశారు. వృక్ష నిర్యాసాలతోను ఇతరమైన అటవీ ఉత్పత్తులతోను మాత్రమే దారానికి పదనుపెట్టారు, పెడుతున్నారు. గాలిపటాలను సైతం కాగితాలతోను అటవీ ఉత్పత్తులతోను మాత్రమే స్వదేశీయులు రూపొందిస్తున్నారు. మన దేశంలోని కుటీర పరిశ్రమలవారు తయారు చేసిన, చేస్తున్న ‘పతంగ్’లవల్ల, ‘దారం’వల్ల పర్యావరణం పాడు కాలేదు, పావురాలు పక్షులు గాయపడలేదు. ప్రకృతిని పరిపోషించడం, పెంపొందించడం భారతీయుల జీవన విధానం. కానీ చైనానుంచి వస్తున్న గాజుపెంకులతోను ప్లాస్టిక్‌తోను రసాయన విషాలతోను నిండిన దారాలు, గాలిపటాలు ప్రకృతిని గాయపరుస్తున్నాయి. ఈ ‘ప్లాస్టిక్’ విషాల దారంతో ప్రత్యర్థుల గాలిపటాలను సులభంగా కూల్చవచ్చునన్న భ్రమతోను, తమ గాలిపటాన్ని పైపైకి ఎగిరించవచ్చునన్న అత్యాశతోను మన జనాలు చైనా దారాన్ని, చైనా గాలిపటాలను కొనేస్తున్నారట! ఇద్దరు వీరులు కత్తులతో పోరాడడం యుద్ధ క్రీడ! ఒకడు తన ప్రత్యర్థిపై విషం పూసిన కత్తిని ప్రయోగించడం వంచన క్రీడ! భారతీయుల ‘పతంగ్’ల క్రీడలో చైనావారి వంచన చొరబడిపోయింది.. చైనా గాలిపటాలు, దారాలు విషం పూసిన కత్తులు..
మకర సంక్రాంతి ముందురోజున, 2016 జనవరిలో తెలంగాణ ప్రభుత్వం చైనా మాంజా వాడకాన్ని, అమ్మకాన్ని, నిలువ ఉంచడాన్ని నిషేధించింది. ఈ దారం వల్ల పక్షులు, పావురాలు బలికావడం, బాలబాలికలు గాయపడడం ఆ నిషేధానికి నేపథ్యం. ఆ తరువాత అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు కూడ ఈ దారాన్ని నిషేధించాయి. 2017 జూలైలో ‘జాతీయ హరిత న్యాయ మండలి’-నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్- ఎన్‌జిటి-వారు దేశవ్యాప్తంగా చైనా ‘మాంజా’ను నిషేధించారు. కానీ గత ఏడాది మకర సంక్రాంతికి ముందు ‘మాంజా’తోపాటు గాలిపటాలు కూడ చైనానుండి వెల్లువెత్తాయి! దేశంలో తయారవుతున్న ‘దారం’ఉండ ఇరవై రూపాయలకే లభిస్తోంది. కానీ ఎనబయి రూపాయలకు ‘ఉండ’- బండిల్- చొప్పున చైనా దారాన్ని మనం కొంటున్నాము. హైదరాబాద్‌లోను ఇతర చోట్ల తరతరాలుగా గాలిపటాలు రూపొందించిన స్వదేశీయ ఉత్పత్తిదారులు దుకాణాలు మూసి వేస్తున్నారు.. ప్రత్యామ్నాయ ఉపాధిని వెతుక్కుంటున్నారు! నిరోధించడం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు శ్రద్ధ ఉందా?