సంపాదకీయం

వదలని ‘మొన్‌సాంటో..’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పత్తి విత్తనాల అమ్మకాల వివాదం మరోసారి ప్రచారం అవుతోంది. ‘మొన్‌సాంటో’ అనే బహుళ జాతీయ వాణిజ్య సంస్థకూ, భారతీయ సంస్థలకూ మధ్య కొనసాగుతున్న ‘పరిజ్ఞాన ముద్ర’- పేటెంట్- వివాదానికి సంబంధించి మంగళవారం సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు ఈ ప్రచారానికి నేపథ్యం. ఈ తీర్పు తమకు అనుకూలంగా ఉందని ‘మొన్‌సాంటో’ను నిర్వహిస్తున్న ‘బేయర్’ సంస్థ ప్రతినిధులు చెపుతున్నారు. సర్వోన్నత న్యాయస్థానం వారి మంగళవారం నాటి తీర్పు తమకు వ్యతిరేకం కాదని ‘మొన్‌సాంటో’తో వివాదం కొనసాగిస్తున్న ‘నూజివీడు పత్తి విత్తనాల సంస్థ’ వంటి భారతీయ వాణిజ్య సంస్థలు విశే్లషిస్తున్నాయట! సర్వోన్నత న్యాయస్థానం వారి తీర్పు ఎవరికి అనుకూలమన్నది ఈ దేశ ప్రజలకు ప్రధానం కాదు. ‘ప్రపంచీకరణ’ వ్యవస్థీకృతమైన తరువాత వివిధ విదేశీయ సంస్థలు ఈ దేశ ప్రజలను వివిధ పద్ధతులలో దోచుకుంటూ ఉండడం అసలు సమస్య. ఈ దోపిడీకాండలో విదేశీయ సంస్థలు రైతులకు విత్తనాలను భయంకరమైన ధరలకు అమ్ముతుండడం భాగం. జీవజన్యు పరివర్తన - జెనటిక్ మోడిఫికేషన్- జిఎమ్- ప్రక్రియ ద్వారా విత్తనాలను రూపొందించడం మొదలైన తరువాత ఈ దోపిడీ మరింత విస్తరించిపోయింది. ‘జిఎమ్’ ప్రక్రియ ద్వారా రూపొందుతున్న విత్తనాలలోను మొక్కలలోను ‘బాసిలస్ తురింజెనిసిస్’- బి.టి.- అన్న జీవ రసాయనం ఉత్పత్తి అవుతోందట! అందువల్ల ఈ ‘జిఎమ్’ ప్రక్రియ ద్వారా రూపొందుతున్న విత్తనాలకు ‘బిటి’ విత్తనాలన్న పేరు వచ్చింది. ఈ ‘బిటి’ రసాయనం పంటల దిగుబడిని విపరీతంగా పెంచుతుందట. అందువల్ల రైతులకు భారీగా లాభాలు వస్తాయన్నది జరిగిన ప్రచారం! ఈ ‘బిటి’ పంటలకు రోగాలు, క్రిములు, కీటకాలు సోకవని అందువల్ల ‘క్రిమి నాశక’ ఔషధాలను పిచ్చికారీ చేయవలసిన పనిలేదన్నది కూడ జరిగిపోయిన ప్రచారం! దీనివల్ల వ్యవసాయ వ్యయం తగ్గి రైతుల నికర ఆదాయం భారీగా పెరిగిపోతుందట! ఈ ‘బిటి’ విత్తనాల వల్ల ఏ భూమిలోనైనా ఏ పంటలైనా పండించవచ్చునన్నది మరో ప్రచారం! ఇలా ‘బిటి’ పంటలతో రైతుల సర్వతోముఖ అభివృద్ధి జరిగిపోతుందన్నది ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’, వారికి తొత్తులుగా దళారీలుగా ప్రతినిధులుగా వ్యవహరించిన వారు చేసిన ప్రచారం! ఈ ప్రచారాన్ని ప్రపంచంలోని ఇతర దేశాలలోకంటె మన దేశంలోని రైతులు ఎక్కువగా విశ్వసించారు. పదిహేను ఏళ్లగా పైగా మన దేశంలో ‘బిటి’ పత్తిని పండిస్తున్న వ్యవసాయ క్షేత్రాలు విస్తరించిపోవడం ఇందుకు నిదర్శనం..
‘జిఎమ్’ పరిజ్ఞానంతో రూపొందుతున్న పంటల వల్ల భూమి క్రమంగా నిస్సారమైపోయి నిర్జీవమవుతున్నది అంతర్జాతీయంగా జరుగుతున్న సమాంతర ప్రచారం! ‘బిటి’ రసాయన విష ప్రభావం వల్ల వ్యవసాయ భూముల, చుట్టుపక్కల పర్యావరణం కలుషితమైపోతుందని కూడ శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. ఈ ‘బిటి’ పంటలను తిన్న మానవులు, జంతువులు కూడ చిత్ర విచిత్రమైన మానసిక, శారీరక రుగ్మతలకు గురి అవుతారన్నది కూడ జరుగుతున్న సమాంతర ప్రచారం! కొన్ని ఏళ్లపాటు ‘బిటి’ పత్తి పండిన భూములు మరే ఇతర పంటలు పండడానికి పనికిరాకుండా పోతున్నాయట, ఇది తొలి దశ! మరికొన్ని ఏళ్ల తరువాత ‘బిటి’ పంట సహా ఏ పంట కూడ ఈ వ్యవసాయ క్షేత్రంలో పెరగని, పండని దుస్థితి దాపురిస్తుందట! వ్యవసాయ క్షేత్రం క్రమంగా పనికిరాని ఊసర క్షేత్రంగా, ఎడారిగా మారిపోవడానికి ‘బిటి’ విత్తనాలు ఇలా దోహదం చేస్తున్నాయి. రెండు మూడేళ్లు మంచి దిగుబడులు లభిస్తాయని ఆ తరువాత అకస్మాత్తుగా పంట తుడిచిపెట్టుకొనిపోతుందని కూడ అంతర్జాతీయంగా ప్రచారం జరిగింది. పంటలు ఇలా తుడిచిపెట్టుకొని పోవడం వల్ల తమకున్న మొత్తం భూమిలో ‘బిటి’ పత్తిని పండించిన రైతులు కుదేలుమంటున్నారు, ఋణాల ఊబిలో కూరుకొనిపోతున్నారు. భారతదేశంలోని రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణం ‘జిఎమ్’ పంటలని 2008 అక్టోబర్‌లో బ్రిటన్ యువరాజు ఛార్లెస్ ప్రకటించడం ‘ప్రపంచీకరణ విధానాల’కు తీవ్రమైన అభిశంసన. మన దేశంలో ఇప్పటివరకు ‘బిటి’ పత్తి మాత్రమే పండిస్తున్నారు. మిగిలిన ‘బిటి’ పంటలను సైతం మన నెత్తికెత్తడానికి అనేక ‘బహుళ జా తీయ సంస్థలు’, వాటికి వత్తాసు పలుకుతున్న శాస్తవ్రేత్తలు సిద్ధంగా ఉన్నారు.
శాస్ర్తియ పరిశోధనలను నిరోధించరాదన్న సాకుతో మన ప్రభుత్వం ‘బిటి’ సాంకేతిక పరిజ్ఞాన పరిశోధనలు కొనసాగడానికి అనుమతులను ప్రసాదిస్తోంది. కానీ ఈ తథాకథిత శాస్త్ర పరిశోధనలు, క్షేత్ర ప్రయోగాలు వాణిజ్య వంచనలో భాగమన్నది కొనసాగుతున్న ఆరోపణ. జీవ జన్యు పరివర్తన సాంకేతిక పరిజ్ఞానాన్ని పర్యవేక్షించడానికి ఏర్పాటయిన ‘జనటిక్ ఇంజనీరింగ్ అప్రయిజల్ కమిటీ’- జిఇఏసి- జియాక్-వారు 2017 మే నెలలో ‘బిటి’ ఆవాలను సాగుచేయడానికి అనుమతినిచ్చారు. అంతకు పూర్వం ‘బిటి వంకాయల’ను సాగుచేయడానికి సైతం ఈ సాధికార సంస్థవారు అనుమతినివ్వడం వివాదగ్రస్తమైంది. కానీ న్యాయస్థానాల జోక్యం వల్ల, వ్యవసాయ ఉద్యమకారుల వ్యతిరేకత వల్ల ఈ పంటలు ఇంకా మననెత్తికెక్కలేదు. నైతికత లేని వాణిజ్యం ‘మానవత్వం మరచిన శాస్త్ర విజ్ఞానం’ ప్రమాదకరమన్నది మహాత్మాగాంధీ దశాబ్దుల క్రితం చెప్పిన మాట. కానీ ‘ప్రపంచీకరణ’లో భాగంగా నైతికత లేని వాణిజ్యం విశ్వంఖల విహారం చేస్తోంది, మానవత్వం గురించి తెలియని శాస్తప్రరిజ్ఞానం విస్తరించిపోతోంది!
ఒకప్పుడు, కొన్ని దశాబ్దుల క్రితం వరకు మన దేశంలోని రైతులు విత్తనాలను తమంతతామే తయారుచేసుకునేవారు. కోతకు వచ్చిన పంటలోని శ్రేష్ఠమైన కంకులను గింజలను ఎంపిక చేసుకొని తదుపరి పంటకు విత్తనాలు తయారుచేసుకొనేవారు. కానీ హరిత విప్లవాల పేరుతో పుట్టుకొచ్చిన జీవ ‘సాంకేతిక సాంకర్యం’- హైబ్రిడ్- కారణంగా రైతులు ఏటా అధిక ధరలకు విత్తనాలను కొనుగోలు చేయవలసి వచ్చింది. జీవజన్యువుల మార్పిడి-జిఎమ్- ప్రక్రియ మొదలైన తర్వాత ‘మొన్‌సాంటో’ వంటి సంస్థలు విత్తనాల ఉత్పత్తిపై పంపిణీపై గుత్త్ధాపత్యం సాధించాయి. ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’ నిర్దేశిస్తున్న ‘పరిజ్ఞాన ముద్ర’ల - పేటెంట్స్- నిబంధనలను ఈ సంస్థలు భయంకరంగా దురుపయోగం చేసుకొనడం నడుస్తున్న చరిత్ర. నాలుగువందల యాబయి గ్రాముల పత్తి విత్తనాలను దాదాపు తొమ్మిది వందల యాబయి రూపాయలు చెల్లించి రైతులు కొనుగోలు చేశారు. అంతకు పూర్వం ఇంకా ఎక్కువ ధరలకు ఈ విత్తనాలు అమ్ముడుపోవడం చరిత్ర. న్యాయస్థానాల జోక్యంతో కొంతమేరకు ఈ ధరలు తగ్గినప్పటికీ, ఇప్పటికీ భయంకరమైన స్థాయిలోనే కొనసాగుతున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన పటిమను పెంచడం పేరుతో ‘‘కొత్త రకం విత్తనాల’’ను ప్రవేశపెడుతున్నారు. కానీ నిజానికి ఇవి పాత రకం విత్తనాలేనన్నది కొనసాగుతున్న ప్రచారం. కొత్త రకం ‘బిటి పత్తి విత్తనాల’లో కాన్సర్ వ్యాధిని కలిగించే జీవధాతువులు కలిసి ఉన్నాయట!
ఈ ‘బిటి’ మూడవ రకం పత్తి విత్తనాలను తెలంగాణ ప్రభుత్వం, ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు నిషేధించాయి. అయినప్పటికీ ‘మొన్‌సాంటో’ వారి దళారీలు ఈ విత్తనాలు అమ్ముతూనే ఉన్నారట! మంగళవారం నాటి సుప్రీం తీర్పునకు ఇదంతా నేపథ్యం.. ఈ తీర్పు ప్రకారం ‘మొన్‌సాంటో’కు, భారతీయ వాణిజ్య సంస్థలకు మధ్య ఏర్పడిన ‘పేటెంట్’ వివాదాన్ని ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం మళ్లీ విచారించనుంది.. ఎవరు తుది విజేతలు కాగలరన్నది ప్రధానం కాదు. ‘మొన్‌సాంటో’ విత్తనాల నుంచి రైతులకు విముక్తి ఎప్పుడన్నది సమాధానం లభించవలసిన ప్రశ్న..!