సంపాదకీయం

కాలుష్య కారణం..?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దినమంతా ఎగనేశాము, దీపం తేరా దిగనేద్దాము- అన్నది కేవలం సామెత కాదు. ఒకవైపున పగలంతా వస్త్రాన్ని నిర్మించడం మరోవైపున అదే బట్టను చింపి చీల్చి పోగులుగా విడగొట్టడం.. ఇలాంటి వైపరీత్యం స్వభావంలో, పనితీరులో నిహితమై ఉన్న వైరుధ్యాలకు నిదర్శనం. ‘ప్రపంచీకరణ’ విధానాలు ‘్భరతీయత’ను పరిమార్చుతుండడం నడుస్తున్న చరిత్ర. ‘ప్రపంచీకరణ’ను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాలు మరోవైపున భారతీయతను నిలబెట్టడానికి యత్నిస్తుండడం విధాన నిహితమై ఉన్న వైరుధ్యం.. ఆకుపచ్చదనం అభివృద్ధికి ప్రాతిపదిక, ఇది తరతరాల భరతజాతి జీవన వాహిక! అడవులు, పంట పొలాలు, అవిరళ జల ప్రవాహాలు, స్వచ్ఛమైన గాలి, ప్రకృతి పరిమళాలు- ఇవన్నీ ఆకుపచ్చదనంలో భాగం! ఆకుపచ్చ దళాన్ని హతమార్చడం ప్రపంచీకరణకు ప్రాతిపదిక! పారిశ్రామిక వికేంద్రీకరణ భారత జాతీయ విధానం. చిన్న పరిశ్రమలు కుటీర పరిశ్రమలు గృహ పరిశ్రమలు వికసించడం ప్రకృతిలోని ఆకుపచ్చదనానికి విఘాతం కాలేదు, వేల లక్షల ఏండ్లపాటు విఘాతం కాలేదు.. ‘ప్రపంచీకరణ’ పరిశ్రమలను ఒకేచోట కేంద్రీకరిస్తోంది. ఈ కేంద్రీకరణ కాలుష్యాన్ని పెంచుతోంది. దుర్గంధాన్ని పంచుతోంది. వేల ఎకరాలలో మొక్కలను నాటుతూ ‘హరితహారాల’ను భరతమాత గళసీమను అలంకరించడానికి, మాతృదేవి చరణాలను అర్చించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేస్తుండడం హర్షణీయం. కానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బహుళ జాతీయ వాణిజ్య సంస్థల- మల్టీ నేషనల్ కంపెనీస్- నిర్వాహకుల చేతులకు గొడ్డళ్లను, గునపాలను అందిస్తుండడం సమాంతర విపరిణామం. ఈ వాణిజ్య సంస్థలు ప్రధానంగా విదేశీయ సంస్థలు గొడ్డళ్లతో ఆకుపచ్చని చెట్లను నరికివేస్తున్నాయి. గునపాలతో భూమి తవ్విపారేస్తున్నాయి. పడమటి కనుమలకు కన్నాలు పడిపోయాయి, తూర్పు కనుమలు కూలిపోతున్నాయి, వింధ్య పర్వతాలు వికృతిని సంతరించుకుంటున్నాయి, హిమాలయాలు కరగిపోతున్నాయి, సముద్రాలలో కాలుష్య తరంగాలు ఉవ్వెత్తున లేస్తున్నాయి! స్వచ్ఛ భారత పునర్ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రపంచీకరణ కాలుష్య సమూహాలు అడుగడుగునా అడ్డుకుంటున్నాయి, క్షణక్షణం నిలదీస్తున్నాయి. ఈ ప్రభుత్వ విధాన నిహిత పరస్పర వైరుధ్యాలకు సరికొత్త ఉదాహరణ ఇలా ప్రస్ఫుటిస్తోంది.. మొదటిది గురువారం, శుక్రవారం ప్రచారమైన కేంద్ర ప్రభుత్వం వారి ‘జాతీయ స్వచ్ఛవాయు కార్యక్రమం’- నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్- ఎన్‌సిఏపి-! గత నెల చివరిలో కేంద్ర ప్రభుత్వం ‘సముద్రతీర నియంత్ర మండలం’ నియమావళిని సడలించడం. రెండవది.. ‘స్వచ్ఛవాయు’ కార్యక్రమం వల్ల 2024 నాటికి దేశంలో దాదాపు నూట ఐదు నగరాలలో వాయుకాలుష్యాన్ని ప్రస్తుత స్థాయి కంటే ఇరవై శాతం తగ్గిస్తారట... ఆనందకరం! జనం జీవజాలం మరింత స్వచ్ఛంగా ఊపిరి పీల్చుకొనడానికి ఈ కార్యక్రమం దోహదం చేస్తుంది.. కానీ గత నెలలో కేంద్ర ప్రభుత్వం సడలించిన నియమావళి ప్రకారం ‘సముద్ర తీర నియంత్ర మండలం’- కోస్టల్ రెగ్యులేషన్ జోన్- సిఆర్‌జెడ్- పరిధిలో పరిశ్రమలను నెలకొల్పడానికి మరింత సులభం అవుతుంది. కేంద్రం నుంచి పర్యావరణ పరిరక్షణ అనుమతులను ఆయా వాణిజ్య సంస్థలు పొందనవసరం లేదు. అందువల్ల కాలుష్యాన్ని పెంచగల పరిశ్రమల స్థాపన వేగవంతం అవుతుంది. గాలి కాలుష్యం పెరుగుతుంది. ఇదీ పరస్పర వైరుధ్యం! ‘‘దీపం పెట్టి దిగనేయడం..’’
‘సిఆర్‌జెడ్’ నిబంధనలను సడలించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తన అధికారాలను తగ్గించుకొంది. రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలను పెంచింది. సముద్ర తీరం పొడవునా భూమి ఉపరితలంపై నెలకొనే పరిశ్రమల వల్ల పర్యావరణంపై ఎలాంటి ప్రభావం ఉంటుందన్న వ్యవహారం కేంద్ర ప్రభుత్వ అధికార పరిధి నుంచి తొలగిపోయింది. ఇకపై రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయమై తుది నిర్ణయాలు తీసుకోవచ్చునట! కేంద్ర పర్యావరణ పరిరక్షణ మంత్రిత్వశాఖ వారి అనుమతులు అక్కరలేదట! ఇంతవరకు ‘అభివృద్ధి’ చెందని సముద్ర తీర సమీప ప్రాంతాలలో సైతం కేంద్ర ప్రభుత్వం వారి అనుమతులతో పనిలేకుండా రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారంతో పరిశ్రమలను నెలకొల్పవచ్చునట! అభివృద్ధి అంటే ‘‘ఆకుపచ్చదనాన్ని హరించివేసి, పంటలను పశువులను నిర్మూలించి సిమెంటు కట్టడాలు కట్టి ఇనుప యంత్రాలను ఏర్పాటుచేయడమన్నది’’ దేశంలో కొనసాగుతున్న అభిప్రాయం.. ‘ప్రపంచీకరణ’ ముదిరిన తరువాత ఈ ‘కృత్రిమ ప్రగతి భ్రాంతి’ మరింత ముదిరిపోయింది. ఆవుపాలు దొరకడం ఆగిపోయిన పల్లెలలో ‘కాఫీ, తేనీరు అమ్మే దుకాణాలు’ నెలకొనడం గతంలో అంటే రెండు తరాలకు పూర్వం జరిగిన ‘ప్రగతి’! మంచినీటి బావులు ఎండిపోయిన సీమలలో మద్యం విక్రయ కేంద్రాలు ఏర్పడుతుండడం నడుస్తున్న ‘ప్రగతి’.. అందువల్ల గాలి వివిధ రకాల విష వాసనలకు నిలయంగా మారుతోంది.. స్వచ్ఛతను పునరుద్ధరించడం ఈ ద్వంద్వ విధానం వల్ల, వైరుధ్యాలు నిహితమైన విధానాల వల్ల ఎలా సాధ్యం?
సముద్ర తీరం వెంట సార్వభౌమ జలాల- టెర్రిటోరియల్ వాటర్స్-లో అంటే తీరం నుంచి పనె్నండు మైళ్లవరకు సముద్రంలోకి విస్తరించిన ప్రాంతంలోను, పర్యావరణం భయంకరంగా ఇదివరకే పాడయిన ప్రాంతాలలోను ఏర్పడే పరిశ్రమలకు మాత్రమే ఇకపై కేంద్ర ప్రభుత్వం వారి అనుమతి అవసరమట! ఇలా రాష్ట్రాలకు మరిన్ని ఆర్థిక అధికారాలను కట్టబెట్టిన కేంద్ర ప్రభుత్వం ‘సమాఖ్య’- ఫెడరల్- స్ఫూర్తిని పెంచింది. కానీ కేంద్ర ప్రభుత్వం తమ అధికారాలను హరించివేస్తోందని కొన్ని రాష్ట్రాల ప్రభుత్వ నిర్వాహకులు నిరంతరం ప్రచారం చేస్తున్నారు. ఇది మన రాజ్యాంగ ప్రక్రియలో నిహితమై ఉన్న రాజకీయ వైరుధ్యం! నగరాలలోని వాయుకాలుష్యానికి ప్రధాన కారణం దశాబ్దుల తరబడి పెరిగిన, పెరిగిపోతున్న అంతస్థుల భవనాలు! ఈ వాస్తవం సామాన్య ప్రజలకు తెలుసు, మేధావులకు తెలుసు, ప్రభుత్వ నిర్వాహకులకు మరింతగా తెలుసు! నగరాలు పట్టణాలు జనావాసాలు అడ్డంగా విస్తరించడం సహజమైన ప్రగతి. మానవులు నిలువున పెరగడం అందం, చందం, ఆరోగ్యం.. కానీ నగరాలు నిలువున పెరుగుతున్నాయి. విపరీతమైన తిండి- జంక్ ఫుడ్- తిని తిని మానవులు పొట్టలు పెంచుకొని అడ్డంగా పెరుగుతుండడం- నిలువున పెరుగుతున్న నగరాలలో ఆవిష్కృతవౌతున్న జీవన దృశ్యం. ఒక ఇంటిని, దాని పక్కన ఉన్న మరో ఇంటిని- రెండిళ్లను- కూలగొట్టి అదే స్థలంలో నాలుగు అంతస్థులతో పదహారు ‘్ఫ్లట్’లు నిర్మిస్తున్నారు. ఫలితంగా రెండు కుటుంబాలు గాలి పీల్చి వదలిన స్థలంలో పదహారు కుటుంబాల వారు గాలిని పీల్చి వదలుతున్నారు. ఫలితంగా వాయు మండలంలో కర్బన వాయువు కేంద్రీకృతమై గాలి కలుషితం అయిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మూడువందల కోట్ల రూపాయల ఖర్చుతో అమలు జరిపే వాయు ప్రక్షాళన కార్యక్రమానికి ఎక్కడికక్కడ ఈ అంతస్థుల భవనాలు విరుగుడు. ఒక వాహనం నిలిచినచోట సగటున ఐదు వాహనాలు నిలబడుతున్నాయి- ఒక వాహనం రోడ్డెక్కినచోట సగటున ఐదు వాహనాలు రోడ్డెక్కుతుండడానికి కారణం అంతస్థుల భవనాలు. ఫలితంగా వాహనాల నుండి వెలువడుతున్న వేడి పొగల వల్ల పర్యావరణం పొగ చూరిపోతోంది.. అంతస్థుల భవనాల నిర్మాణానికి ఇకనైనా ప్రభుత్వాలు అనుమతినివ్వడం మానుకున్నట్టయితే ‘వాయు ప్రక్షాళన’ కార్యక్రమం విజయవంతం కావచ్చు...
పెద్ద పెద్ద పరిశ్రమలను నగరాలలోను నగరాల చుట్టూ మాత్రమే కేంద్రీకరిస్తుండడం వాయుకాలుష్యానికి మాత్రమేకాదు సకల విధ కాలుష్యాలు పెరగడానికి కారణమన్నది కూడ సర్వజన విదితం. ఈ సంగతిని పక్కకుపెట్టి దీపావళి పండుగరోజున ‘బాణసంచా’ పేల్చడం వల్ల, వినాయక ప్రతిమలను నీటిలో నిమజ్జనం చేయడం వల్ల కాలుష్యం పెరుగుతోందన్న ప్రచారం జరుగుతోంది.. ‘ప్రపంచీకరణ’ మారీచ మృగ మాయాజాలం విస్తరించిపోయింది!