సంపాదకీయం

హరిత వైరుధ్యం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రకృతిని పరిరక్షించే పథకాలు, పరిసరాలను పాడుచేసే పనులు సమాంతరంగా కొనసాగుతుండడం విధానాలలో నిహితమై ఉన్న వైరుధ్యాల ఫలితం. ప్రకృతి పట్ల ప్రత్యేకించి పుడమి పట్ల సహజమైన మమకారం సన్నగిల్లిపోవడం ఇందుకు కారణం. సహజత్వం స్థానంలో కృత్రిమ తత్త్వం గూడుకట్టుకుని ఉంది. అందువల్ల ప్రకృతిని, పరిసరాలను పరిరక్షించాలన్న విధానం నినాదాలకు పరిమితమైపోయింది. ఒకవైపున మొక్కలు నాటుతుండడం మరోవైపున ‘అభివృద్ధి’ పేరుతో వృక్షాలను తెగ నరుకుతుండడం- ఇదీ ప్రభుత్వ నిర్వాహకుల విధానంలోని వైరుధ్యం! వివిధ రాష్ట్రాలలో అడవులను పెంపొందించడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం ‘బృహత్ నిధి’ని ఏర్పాటుచేసి ఉంది. ‘అభివృద్ధి’- డెవలప్‌మెంట్- పేరుతో జరుగుతున్న ‘అటవీ నిర్మూలన’కు పరిహార ప్రక్రియను సాగించడానికై కేంద్రం ఈ నిధిని ఏర్పాటు చేసిందిట. ‘అటవీ సమతుల్య పరిరక్షణ’కు ఈ నిధిని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చుపెట్టవలసి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యవంలోని ‘అటవీ సమతుల్య రక్షణ నిధి నిర్వాహక, సంయోజక మండలి’- కాంపెనే్సటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్‌మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ- ‘కాంపా’- వారు వివిధ రాష్ట్రాలకు యాబయి వేల కోట్ల రూపాయల నిధిని కేటాయించారట! దేశంలోని వివిధ ప్రాంతాలలో రాష్ట్ర ప్రభుత్వాలు కొత్తగా పెంచుతున్న, పెంచనున్న అడవులకయ్యే ఖర్చులో తొంబయి శాతం ఇలా కేంద్ర ప్రభుత్వం భరిస్తోంది. ఇదంతా భరతభూమి హరిత శోభలను పెంపొందించడానికి జరుగుతున్న కృషి అన్నది హర్షదాయకం! కానీ ఈ ‘ఆనందం’ పక్కనే అటవీ హనన, హరిత నిర్మూలన వైపరీత్యం కూడ పొంచి ఉంది. సవరించిన ‘తీరప్రాంత అభివృద్ధి నియంత్రణ ప్రాంగణం’ - కోస్టల్ రెగ్యులేషన్ జోన్- సిఆర్‌జెడ్- నియమావళిని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ కొత్త నియమావళి ప్రకారం సముద్రతీర ప్రాంతంలో చెట్లను నరికివేయడం, అడవులను నిర్మూలించడం మరింత సులభం. ‘అభివృద్ధి’ పేరుతో జరిగిపోతున్న హరిత హననానికి ఈ కొత్త నియమావళి కొత్త ఊపు! కేంద్ర ప్రభుత్వ ‘పర్యావరణ పరిరక్షణ అనుమతి’తో నిమిత్తం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక, వాణిజ్య, పర్యాటక, పారిశ్రామిక ప్రాంగణాలను ఏర్పాటు చేయడం, వందల వేల ఎకరాల భూమిని ప్రభుత్వేతర సంస్థలకు కేటాయించడం ఇకపై మరింత సులభం! హరిత పరిరక్షణ నిబంధనలను అతిగా పాటించడం వల్ల అభివృద్ధి ఆగిపోగలదన్నది 2011 ఫిబ్రవరి మూడవ తేదీన ఢిల్లీలో జరిగిన ‘నిరంతర ప్రగతి’- సస్టయినబుల్ డెవలప్‌మెంట్- సదస్సులో అప్పటి ప్రధానమంత్రి మన్‌మోహన్‌సింగ్ చేసిన ప్రకటన. ఈ చారిత్రక ప్రకటనకు అనుగుణంగానే ‘హరిత పరిరక్షణ’ నియమాలను అతిగా పాటించిన జయ్‌రామ్ రమేశ్ వంటి ‘పర్యావరణ, అటవీశాఖ’ మంత్రికి బదిలీ జరిగిపోయింది. నిజానికి ఆ చారిత్రక ప్రకటన మన్‌మోహన్‌సింగ్ నోటివెంట వెలువడిన ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’ మాట! తమలపాకుల తోటలు, మామిడి తోటలు, అరటి తోటలు ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’ ప్రగతి గొడ్డళ్లకు బలికావడం ఆ చారిత్రక ప్రకటన తరువాత ఊపందుకున్న పరిణామం. కూరగాయల మొక్కలు, వరి పొలాలు అదృశ్యమైపోయి ‘సిమెంటు’ భవనాలు, ఇనుప కంచెలు అవతరించడం ఆ చారిత్రక ప్రకటన ఫలితం..
మన్‌మోహన్‌సింగ్ ప్రభుత్వం రూపొందించిన ఈ ‘అంతర్గత వైరుధ్య హరిత విధానం’- పది మొక్కలు నాటడం.. పదహైదు చెట్లను కొట్టివేయడం- ఇప్పటికీ కొనసాగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు మాత్రమే కాదు దేశంలోని దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడ ఇలా ‘సమదృష్టి’ని వహించి ఉండడం నడుస్తున్న చరిత్ర. మొక్కలు నాటడం ఒకవైపు, అడవులను పంట పొలాలను నిర్మూలించగల ‘పెట్టుబడి’ సదస్సులు మరోవైపు. విదేశీయుల నుంచి పెట్టుబడులను సమకూర్చుకోవాలన్న తహతహ రాష్ట్ర ప్రభుత్వాలకు దీటుగా కేంద్ర ప్రభుత్వం నిర్వాహకులలో సైతం తాండవిస్తోంది. సముద్ర తీర ప్రాంతాలలో ప్రగతి పేరుతో కాలుష్యాన్ని కేంద్రీకరించడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం నియమావళిని సవరించడం ఈ ‘తహతహ’లో భాగం. నియమావళికి విరుద్ధంగా సముద్ర తీర ప్రాంతంలో ఇప్పటికే వేలకొలదీ ఇళ్ల నిర్మాణం జరిగింది. ఈ అంతస్థుల భవంతులు వాణిజ్య కార్యాలయాలుగా, పర్యాటకులకు ‘విడిది కేంద్రాలు’గా మారి ఉన్నాయి. దీనివల్ల రెండు విపరిణామాలు సంభవించాయి. మొదటిది- ఈ ప్రాంతాలలో ఆకుపచ్చదనం హననమైంది, రెండవది- పర్యాటక కేంద్రాల ప్రాంగణాలు, పారిశ్రామిక వాణిజ్య వాటికలు ‘ప్లాస్టిక్’ వ్యర్థాలకు ఆలవాలం అయ్యాయి. దేశంలో ప్రతిరోజు ఇరవై ఆరువేల టన్నుల ‘ప్లాస్టిక్’ సంచులను, ఇతర పదార్థాలను వినియోగిస్తున్నారట! ఇందులో అరవై శాతం మాత్రమే చెత్తకుండీలకు, చెత్తదిబ్బల వాటికలకు చేరుతోంది. నలబయి శాతం ‘ప్లాస్టిక్’ పడినచోటనే పదిలంగా ఉంటోందట! పర్యాటక కేంద్రాలు, పారిశ్రామిక వాటికలు ఇలా ‘ప్లాస్టిక్’ను పదిలం చేస్తున్నాయి! ఈ ‘ప్లాస్టిక్’ వ్యర్థాలు పరిసరాల హరిత శోభలకు వికృతమైన కన్నాలు.
తెలంగాణ ప్రభుత్వం ‘హరిత హారం’ పేరుతో వందల కోట్ల మొక్కలను నాటే కార్యక్రమాన్ని అమలు జరుపుతోంది. ‘కాంపా’ నిధి నుంచి తెలంగాణలో అటవీ అభివృద్ధికి రెండువేల ఐదు వందల కోట్ల రూపాయలు లభించనుండడంతో ’హరితహారం’ మరింత విస్తరించనున్నదట! మొక్కలను పెంచడంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలో అగ్రగామిగా ఉందన్నది జరుగుతున్న ప్రచారం. అక్రమంగా అడవుల నరికివేత కార్యక్రమం కొనసాగుతుండడం సమాంతర విపరిణామం! టేకు దుంగలను అక్రమంగా రవాణా చేస్తున్న ఒక ముఠాను సోమవారం నిర్మల్ జిల్లా పోలీసులు నిర్బంధించడం ఒక ఉదాహరణ మాత్రమే! ఈ ‘కలప దొంగల’ ముఠాలో నిజామాబాదు నగర పాలక సంస్థ ఉపాధ్యక్షుడు, ‘మజ్లిస్ ఇత్తెహాదులు ముస్లిమీ’ నాయకుడు ఫహామ్ కూడా ఉన్నట్టు పోలీసులు ఆరోపించడం రాజకీయ నేరప్రవృత్తికి మరో నిదర్శనం! 2029 నాటికి ఆంధ్రప్రదేశ్‌లోని విస్తీర్ణంలో సగం అటవీ మాయం కాగలదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి ఉంది. కానీ ‘అమరావతి’ నిర్మాణానికి సేకరించిన వేల ఎకరాల భూమిపై ‘మొక్క’ మిగలలేదన్నది జరుగుతున్న సమాంతర ప్రచారం. ‘ఎఱ్ఱచందనం’ వృక్షాలను నరికివేసి కలపను విదేశాలకు తరలిస్తున్న ముఠాలను నిర్మూలించలేక పోవడం ప్రభుత్వ వైఫల్యం! ఈ ఎఱ్ఱచందనం కలప అత్యధిక శాతం చైనాకు అక్రమంగా తరలిపోతోంది! చైనా ప్రభుత్వం ఈ దొంగ రవాణాను ప్రోత్సహిస్తోంది. అలాంటి చైనా సంస్థల పెట్టుబడుల సాధన కోసం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు పోటీపడుతుండడం అంతర్గత విధాన వైరుధ్యం!
అడవి అంటే కేవలం వృక్షజాలం కాదు, అడవి జీవ జాలం! జంతుజాలం, వృక్ష జాలం, విహంగ సమూహం అడవులలో భాగం! ఆవు పొదుగు నుండి పాలను పిండుకున్నట్టు అడవి నుంచి ప్రాకృతిక సంపదను దండుకొనడం భారతీయ జీవన విధానం. ప్రకృతిని పరిరక్షించడం ద్వారా మానవ జీవన ప్రగతిని, సుగతిని సాధించడం తరతరాల భారతీయుల స్వభావం.. కానీ ప్రకృతిని కొల్లగొట్టడం ద్వారా ధ్వంసం చేయడం ద్వారా మానవులు ప్రగతిని సాధించగలరన్న భ్రాంతిని విదేశీయ దురాక్రమణదారులు కలిగించి వెళ్లారు. అటవీ హననానికి కొనసాగుతున్న ఈ ‘భ్రాంతి’ కారణం! 1942లో బ్రిటన్ వ్యతిరేక ‘క్విట్ ఇండియా’ ఉద్యమం సాగిన కాలంలో శ్రీరామ్ అన్న ఉద్యమకారుడు పడమటి కనుమలలోని అరణ్యాలలో చెట్లను నరికివేస్తున్న ఒక వ్యాపారిని ఎదిరించాడు. ఆ కలపను బ్రిటన్‌కు ఇతర దేశాలకు తరలించరాదని శ్రీరామ్ వాదించాడు. దురాక్రమణదారుని యుద్ధ ప్రయోజనాల కోసం లేత చెట్లను నరికివేయడం అమానుషమని వ్యాపారికి హితవుచెప్పాడు. ఆ వ్యాపారి తానుకూడ దేశభక్తుడననీ మహాత్మాగాంధీ ఉద్యమ నిధికి ఐదువేల రూపాయల విరాళం ఇచ్చానని శ్రీరామ్‌కు తెలిపాడు. ‘బ్రిటన్ ప్రభుత్వం వారి యుద్ధ నిధికి ఎంత విరాళం ఇచ్చావు?’అన్నది శ్రీరామ్ ప్రశ్న. ‘యుద్ధ నిధికి ఐదువేల రూపాయల విరాళం ఇచ్చాను..’అన్నది వ్యాపారి సమాధానం! ఈ ‘సమదృష్టి’గురించి ‘వెయిటింగ్ ఫర్ ది మహాత్మా’- మహాత్ముని అనుమతి కోసం- అన్న తన ఆంగ్ల నవలలో ప్రసిద్ధ రచయిత ఆర్‌కె నారాయణ్ వివరించాడు! ఈ ‘సమదృష్టి’ ప్రస్తుతం మన ప్రభుత్వాలకు ఏర్పడి ఉంది.. అటవీ పరిరక్షణ పట్ల, ఆకుపచ్చదనాన్ని హరించివేస్తున్న ‘కృత్రిమ అభివృద్ధి’ పట్ల సమదృష్టి..