సంపాదకీయం

నడక... నడత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిటన్ దురాక్రమణ నుండి విముక్తమైన మన దేశం గణతంత్ర ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థగా ఏర్పడిన తరువాత అరవై తొమ్మిదేళ్లు గడిచాయి, డెబ్బయ్యవ గణతంత్ర శుభోత్సవం జరుపుకుంటున్నాము, డెబ్బయ్యవ సంవత్సరంలో అడుగిడుతున్నాము. సార్వభౌమ అధికార శోభలను సంతరించుకున్న మన జాతి ‘నడక’ ఆవిష్కృతవౌతున్న స్వరూపం.. అనాదిగా వికసిస్తున్న మన జాతీయ జీవనంలో నిహితమై ఉన్న ‘నడత’ మన సనాతన స్వభావం! ‘నడక’ భౌతికమైనది, స్వరూపానికి సంబంధించినది. ‘నడత’ సాంస్కృతికమైనది, స్వభావానికి సంబంధించినది. గణతంత్ర దినోత్సవ శుభోదయం ఈ ‘నడక’కు ఈ ‘నడత’కు సంబంధించిన స్మృతుల సమాహారం.. అనాదిగా కొనసాగుతున్న ఈ జాతీయ ప్రస్థానక్రమంలో ప్రస్ఫుటించిన విభవ పతనాలు, జయ పరాజయాలు ఈ స్మృతుల సమాహారంలో భాగం. జాతీయ ప్రస్థానరథం ప్రగతి శిఖరాలను అధిరోహించడం, సుగతి సుమ సుగంధాలను ఆఘ్రాణించడం చరిత్ర. ఈ ప్రస్థాన క్రమంలో పతన బిలాలలో ఈ సనాతన జాతీయ రథచక్రాలు కూరుకొనిపోవడం కూడ చరిత్ర. వికృత భావాల విషవాయువులు ఈ సనాతన జాతీయ నందన వనాన్ని ముంచెత్తడం కూడ చరిత్ర. ఈ సుగంధాలు ఈ జాతీయ స్వభావ భూమికపై సహజంగా వికసించిన సాంస్కృతిక సుమసరాల నుండి ప్రభవించాయి, పుడమి అంతటా విస్తరించాయి, మానవులను జంతు స్వభావం నుంచి విముక్తం చేశాయి, సంస్కారవంతులను చేశాయి. అందువల్లనే ‘్భరత భూమి’ అనాదిగా ప్రపంచ ప్రజలకు ‘నడత’నేర్పిన ‘బడి’ అయింది. భరతమాత విశ్వగురువుగా విరాజిల్లింది! అవని ప్రజల ‘ఆకలి’ని తీర్చి అక్కున చేర్చుకొని ఆదరించడం యుగయుగాలుగా భారత జాతీయ స్వభావం! నూట పాతిక ఏళ్లకు పూర్వం అమెరికాలోని చికాగో పట్టణంలో జరిగిన ప్రపంచ ‘సర్వమత’ సభలో వివేకానందస్వామి చెప్పిన ‘సర్వసమ్మత’ సత్యం ఇది. సనాతన వాస్తవాన్ని వివేకానందుడు మరోసారి ఆవిష్కరించాడు.. ‘దమనకాండకు బలైపోయి ప్రాణావశిష్టులై శరణార్థులై తన ముంగిట నిలచిన విదేశీయ జాతులకు ఆశ్రయం కల్పించిన జాతికి చెందిన వాడిని కావడం నాకు గర్వకారణం..’ అన్నది వివేకానందుడు చికాగో సభలో చేసిన తొలి ప్రసంగంలో వినిపించిన భరత జాతీయ స్వభావం! యుగయుగాల మన ‘నడత’ ఇది. కలియుగం ముప్పయి ఒకటవ శతాబ్ది- క్రీస్తునకు పూర్వం ఒకటవ శతాబ్ది-లో రోము జాతీయుల దమనకాండకు గురై పాలస్తీనా నుంచి పారిపోయి వచ్చిన ‘యూదు’ జాతీయులను భరతమాత తన ఒడిలో చేర్చుకుని పాలించింది. కలియుగం ముప్పయి తొమ్మిదవ శతాబ్ది- క్రీస్తుశకం ఎనిమిదవ శతాబ్ది-లో అరబ్బీ జిహాదీలు నిర్మూలించిన ‘పారశీక జాతి’లో అవశిష్టులైన వారికి భరతభూమి మాతృభూమిగా మారింది. అన్నం పెట్టిన జాతి హైందవ జాతి, హత్యలు చేయని జాతి భరత జాతి.. ఇదీ అనాదిగా మన ‘నడత’! మహాకవి కరుణశ్రీ ఈ ‘ఉత్పలమాల’ పద్యంలో చెప్పినట్టు,
‘‘అచ్చపు చీకటిండ్ల పొరలాడుచు
నుండ, ప్రపంచమెల్ల ఈ
పచ్చని తల్లి గుమ్మములపై
వెలిగెన్ మణి దీపికల్ కనన్
వచ్చిన ఖండ ఖండముల వారికి
కోరిక తీరునట్టుగా
బిచ్చము పెట్టె భారత సవిత్రి
ప్రియంబున రెండు చేతులన్..’’
ఈ స్వభావ స్మృతి గణతంత్ర దినోత్సవ వేళ జాతీయ జన మానస క్షేత్రంపై మరోసారి ఉదయించడం- నిన్నటి సూర్యుడు నేడు మళ్లీ ఉదయించినట్టు- సహజం! వేలాది ‘రోహింగియా’లకు- బర్మా నుంచి అక్రమంగా చొరబడిన వారికి- సైతం మన దేశంలో ప్రస్తుతం ఆశ్రయం లభిస్తుండడం ఈ జాతీయ స్వభావ స్ఫురణకు సరికొత్త సాక్ష్యం.. ఈ ‘రోహింగియా’లు కడగండ్లు పాలు కావడం స్వయంకృతం. ‘రోహింగియా’లు అధికంగా ఉన్న బర్మాలోని ‘అరకాన్’ప్రాంతాన్ని బర్మా నుంచి విడగొట్టి ప్రత్యేక స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేయాలన్నది ‘రోహింగియా’లలోని ‘జిహాదీ’ల లక్ష్యం. ఈ పన్నాగం బెడిసికొట్టింది. అందువల్లనే అనేక వేలమంది ‘రోహింగియా’లు మన దేశంలోకి చొరబడి ‘శరణార్థులు’గా చెలామణి అవుతున్నారు. ఈ రోహింగియాలలో వందలాది ‘జిహాదీ’ బీభత్సకారులున్నారు. ఈ బీభత్సకారులు మన భద్రతకు ప్రమాదకరంగా పరిణమించారు. అయినప్పటికీ అనేక వేల మంది ‘రోహింగియా’లు మన దేశంలో ఆశ్రయం పొందగలగడానికి కారణం మన జాతీయ స్వభావంలో అనాదిగా నిహితమై ఉన్న ‘‘నితాంత అపార భూతదయ’’.. ఇదీ మన నడత! విదేశీయ దురాక్రమణదారులు ఈ మన ‘నడత’ను భంగపరచ యత్నించారు. మన ‘నడక’ భంగపడింది, కానీ ‘నడత’ భంగపడలేదు. కలియుగం 5049-క్రీస్తుశకం 1947-లో బ్రిటన్ దురాక్రమణదారులు మన దేశం నుంచి నిష్క్రమించడంతో శతాబ్దుల భౌతిక రాజకీయ దాస్యం ముగిసింది. ‘నడక’ మళ్లీ మొదలైంది. రెండున్నర సంవత్సరాల ఈ ప్రస్థాన ఫలితం క్రీస్తుశకం 1950- కలియుగం 5052- జనవరి 26న మనకు గణతంత్ర రాజ్యాంగ వ్యవస్థ ఏర్పడడం. ఈ ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థ తరతరాల భారత జాతీయ స్వభావానికి మరో ధ్రువీకరణ. హైందవ జాతీయ స్వభావ నిహితమైన ‘సర్వమత సమభావ’ తత్త్వానికీ, సకల వైవిధ్య పరిరక్షక శాశ్వత ప్రవృత్తికి ఆధునిక ధ్రువీకరణ..
ప్రపంచంలోని వివిధ దేశాలలో అన్ని రంగాలలోను వైవిధ్య విధ్వంసం జరుగుతోందన్నది జరుగుతున్న ప్రచారం. ఈ విధ్వంసక చిత్తవృత్తి శతాబ్దుల విదేశీయ మ్లేచ్ఛ్భావ అసహిష్ణు ప్రవృత్తికి ‘పునరావృత్తి’, కొనసాగింపు.. ఐరోపా అమెరికా పశ్చిమ ఆసియా తదితర ప్రాంతాలలో ఒక విలక్షణ నాగరికతను మట్టుపెట్టి మరో విలక్షణ నాగరికత వికసించడం వేల ఏండ్ల చరిత్ర.. అంతేకానీ అన్ని వైవిధ్యరీతులు సమాంతరంగా వికసించిన సమన్వయ జీవన చరిత్ర ఆ ప్రాంతాలకు లేదు! ‘విశ్వ విజేత’ కావాలన్న విధ్వంసక ప్రవృత్తి భారత సీమలకు వెలుపలకల ప్రాంతాలలో వైవిధ్యాలను ధ్వంసం చేసింది, బీభత్సం సృష్టించింది. గ్రీసు బీభత్సకారుడు అలెగ్జాండర్ నుండి అరబ్బీ బీభత్సకారుల వరకు, బ్రిటన్ బీభత్సకారుల వరకూ... ఈ ‘విశ్వవిజేతలు’ కావాలన్న దురాశ ఆవహించడం శతాబ్దుల విపరిణామం. ఈ బీభత్స లక్ష్యం నెరవేరలేదు, కానీ వైవిధ్యాలు ధ్వంసమయ్యాయి.. ఒకే మతం, ఒకే భాష, పరిమిత ప్రాంతం, ఒకే నిరంకుశ ఆలోచనారీతి- వీటి ప్రాతిపదికలుగా రాజకీయపు సరిహద్దులను ఏర్పరచుకొని వివిధ దేశాలు మనుగడ సాగిస్తున్నాయి. కానీ భారతదేశం ఈ విధ్వంసక ప్రవృత్తిని రెండు సహస్రాబ్దులకు పైగా ఎదిరించింది, ప్రతిఘటించింది. అంతేకాని ‘్భరతదేశం’ ఇతర దేశాలలోకి చొరబడి విధ్వంసం సృష్టించలేదు. మన దేశంలో వివిధ మతాలు, అసంఖ్యాక భాషలు, అనేకానేక ఆలోచనా రీతులు, వైవిధ్యాలు సమాంతరంగా వికసించాయి. ఈ వైవిధ్య పరిరక్షక పరిపోషక జాతీయ భూమికపై వికసించిన మానవీయ భావ సుమ పరిమళ సంస్కారాలు ప్రపంచమంతటా వ్యాపించడం భారతదేశపు విశ్వ గురుత్వం.. ఈ ‘నడత’ప్రస్ఫుటించడం యుగాలుగా సాగుతున్న మన ‘నడక’ చరిత్ర..
గణతంత్ర శుభోత్సవ వేళ, వేల వేల ఏండ్ల ఈ స్మృతుల సమాహారం మరోసారి సభలు తీరుతోంది. కుంటుపడిన మన ‘నడక’ మళ్లీ వేగం పుంజుకుంటోంది. ‘మింటి’ని అంటుతున్న మన ప్రగతికి భూమిచుట్టూ తిరుగుతున్న మన సాంకేతిక ఉపగ్రహాలు నిదర్శనం.. భారతీయ ‘యోగం’ మరోసారి అంతర్జాతీయ సమాజాన్ని ప్రభావితం చేస్తోంది. ‘అంతర్జాతీయ సౌరశక్తి సంఘటన’ ఏర్పడడం మన జాతీయ సాంస్కృతిక ప్రభావ విస్తృతికి మరో సాక్ష్యం.. ఇదీ మన ‘నడక’... ఇదీ మన ‘నడత’!
అన్నార్తుల ఇళ్లముందు
వెనె్నల వృక్షాలు పెరిగి
అభ్యుదయామృత
ఫలములు అందుకునేదెప్పుడు?
జన మానస క్షేత్రంపై
సంస్కారపు సుధలు కురిసి
జాతీయ స్వభావ నదులు
పరుగుతీసినప్పుడు....!