సంపాదకీయం

‘పీయూష’ మధురిమ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇది మధ్యంతర, తాత్కాలిక ఆదాయ వ్యయ ప్రణాళిక- అన్న స్ఫురణ కలుగలేదు! ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి మొదలయ్యే 2019-2020 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం ఆవిష్కరించిన ‘ఆదాయ వ్యయ నివేదిక’- బడ్జెట్- తాత్కాలికమైనదన్న మాట ను మరచిపోవలసి వచ్చింది. ‘ఇది యధావిధిగా రూపొందిన సాధారణ ఆదా య వ్యయ పత్రం’ అన్న అనుభూతి ఆవహించింది. ‘నేల విడిచి సాము చేయకపోవడం’, ‘నేలపై నిలబడి అంతరిక్షానికి ‘నౌక’లను ఉపగ్రహాలను సంధించడం’ పీయూష్ గోయల్ పార్లమెంటుకు సమర్పించిన ‘ఆదాయ వ్యయ నివేదిక’లోని ఇతివృత్తం. ఈ ఇతివృత్తం ఐదేళ్ల భారతీయ జనతాపార్టీ పరిపాలనకు అనుగుణంగా రూపొందడం చారిత్రక పునరావృత్తి.. అందువల్లనే ‘గోయల్ తాత్కాలిక ఆర్థికమంత్రి’ అన్న స్ఫురణ కూడ కలుగలేదు. ప్రస్తుతం వైద్య చికిత్స పొందుతూ అధికార విధులకు దూరంగా ఉన్న అరుణ్ జైట్లీ స్వయంగా ‘బడ్జెట్’ను సమర్పించినట్టు అనుభూతి చెందడం అనివార్య పరిణామమైంది. ప్రవర్తనలో స్వచ్ఛత, విధానంలో స్పష్టత, నిబద్ధతలో సుస్థిరత తమ ప్రభుత్వ స్వభావమన్నది పీయూష్ చెప్పిన మాట! ఈ స్పష్టత స్వచ్ఛత సుస్థిరత మరోసారి స్ఫురింప చేయడానికి జరిగిన సమీక్ష గోయల్ ప్రసంగం. నేల తల్లిని నమ్ముకున్న, నేలను దున్నుతున్న, నేలను పండించి ప్రజలకు విందులు చేస్తున్న కర్షక సోదరుల అభ్యుదయం, సంక్షేమం కొత్త ఆదాయ వ్యయపత్రంలో ప్రస్ఫుటించిన మహా విషయాలలో మొదటివి.. జాతీయ కామధేను సంస్థ, ‘జాతీయ గో సంతతి- గోకుల- పరిరక్షణ యోజన’ వంటివి ‘నేల విడువని సాము’కు నిదర్శనం. గోమాత రక్షణ భూమాత రక్షణకు ప్రాతిపదిక. పనె్నండు కోట్ల మంది రైతులకు, పది కోట్ల అసంఘటిత రంగ కార్మికులకు శ్రామికులకు, ఆదాయం పన్ను చెల్లిస్తున్న మూడు కోట్ల మధ్యతరగతి వారికి, లక్షల మంది ‘అంగన్‌వాడీ’ కార్యకర్తలకు, మహిళలకు, పొగ నుండి సెగలు కక్కే పొయ్యిల నుంచి విముక్తులైన ఎనిమిది కోట్ల కుటుంబాల మాతృమూర్తులకు, ఇంధన వాయు ‘చుల్లీ’-పొయ్యి-లను పొందిన వారికి, విశ్రాంత ఉద్యోగులకు, వయోవృద్ధులకు ఇలా సకల జనులకు సంక్షేమం సమకూర్చడం ‘నేల విడవని సాము’. ‘కౌసల్ వికాస శిక్షణ’ద్వారా కోటి మంది యువజనులను పారిశ్రామిక వేత్తలుగా రూపొందించడం గురించి గోయల్ ప్రస్తావించాడు. ‘మాతృ వందనం’ పేరుతో గర్భవతులకు, బాలింతలకు ఇరవై ఆరు వారాల సెలవును మంజూరు చేయడం మాతృభూమి నలుచెరగులా సభ తీరుతున్న సంక్షేమం.. ‘వందే భారత్’ పేరుతో వేగవంతమైన రైళ్లను నడపాలన్న ప్రతిపాదన మాతృదేవికి మరో వందనం!
ఐదు ఎకరాల- రెండు హెక్టారుల- లోపు భూమి ఉన్న రైతులకు ఏటా ఆరువేల రూపాయలను అదనపు ఆదాయంగా చెల్లించాలన్న ప్రతిపాదన నేలతల్లిని నమ్ముకున్నవారికి మరికొంత ఊరట. తెలంగాణ ప్రభుత్వం ‘రైతుబంధు’ పేరుతో రైతన్నలకు ఏటా ఎకరానికి పది వేల రూపాయలను పెట్టుబడిగా ఇస్తుండడం అభినందనీయం!, కేంద్ర ప్రభుత్వం వారి ఈ ‘ఆదాయం పెంచే’ పథకం వల్ల దేశమంతటా ఉన్న రైతులకు లాభం కలుగుతుంది. పనె్నండు కోట్ల మంది సన్నకారు రైతులకు సంక్షేమం. భూరక్షణకు గోరక్షణకు దోహదకరం. నేలమీద నిలబడడం అంటే నేలను రక్షించడం, పర్యావరణాన్ని పరిరక్షించడం! ప్రధానమంత్రిగా లోక్‌సభలో అడుగుపెట్టిన తొలిరోజున, పార్లమెంటు గడప వద్ద నరేంద్ర మోదీ వంగి భూమికి నమస్కరించడం మాతృ మమకారానికి చిహ్నం. మమకారం పరిరక్షణకు ప్రాతిపదిక! కాలుష్యం నుండి ప్రకృతికి రక్షణ, జీవజాలానికి ‘ఊపిరి’. అంతర్జాతీయ సౌరశక్తి సంఘటన- సోలార్ అలియన్స్- మన దేశం ఆధ్వర్యంలో ఏర్పడడం భూమిని పంచభూతమయమైన ప్రకృతిని పరిరక్షించడంలో భాగం. ఈ స్వచ్ఛ్భారత పునర్ నిర్మాణం ‘సౌరశక్తి’తో ముడివడి ఉండడం ప్రాకృతిక వాస్తవం! గత నాలుగేళ్లలో సౌరశక్తి ఉత్పత్తి పదిరెట్లు పెరగడం పర్యావరణకు పరిపుష్టిని కలిగించిన పరిణామం. బొగ్గు, ఇంధనవాయు, ఇంధన తైల వినిమయం తగ్గినకొద్దీ ‘సౌరశక్తి’ ‘వాయుశక్తి’- విండ్ పవర్- ఉపయోగం పెరిగినకొద్దీ పర్యావరణ ఆరోగ్యం పెరుగుతుంది. ‘‘సూర్య ఆత్మా జగతః’’-జగత్తునకు సూర్యుడు ఆత్మ!- అన్న భారతీయ జీవన విధానం ఈ బడ్జెట్ ద్వారా స్ఫురించడం ప్రత్యామ్నాయ విధానం. ఈ ప్రత్యామ్నాయం నిజానికి వౌలికమైనది. మరుగున పడిన ఈ స్వభావం- నేలపై నిలబడి నింగిని చుంబించడం, సూర్యుడిని ప్రకృతిని గుర్తించడం- ‘గగన యాన్’ ద్వారా మరోసారి ప్రస్ఫుటిస్తోంది! మానవుడు ప్రకృతి కంటె సృష్టి కంటె భిన్నం కాదన్న స్ఫురణ సజీవంగా ఉండడానికి మోదీ చెప్పినట్టు ఈ ‘సర్వవ్యాప్త, సర్వస్పృహణీయ, సర్వభాగస్వామ్య, సర్వోత్కృష్ట’ ప్రత్యామ్నాయం వికసించడం అనివార్యం! ప్రగతిలో నిహితమై ఉన్న సుగతి. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజాఉద్యమాలుగా మార్చడం హర్షణీయం. గోయల్ చెప్పిన ఈ మాట అతిశయోక్తి కావచ్చు.. ఆకాంక్షించడం ప్రభుత్వ ప్రత్యామ్నాయ స్వభావానికి నిదర్శనం!
పన్నులను తగ్గించడం వల్ల పన్నుల వసూళ్లు, పన్నులను చెల్లించేవారి సంఖ్య పెరుగుతోంది. 2018-2019వ ఆర్థిక సంవత్సరంలో 2017-2018లో కంటె పన్నుల వసూళ్లు గణనీయంగా పెరగడం ‘వస్తుసేవల పన్ను’ల- జిఎస్‌టి- వ్యవస్థ ఫలితమన్నది గోయల్ చెప్పిన మాట! ‘జిఎస్‌టి’ పన్నులు తగ్గడం, తద్వారా వస్తువుల ధరలు, ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండడం గోయల్ చేసిన ‘సమీక్ష’లో ప్రధాన అంశం. ఐదు లక్షల రూపాయల వరకూ వార్షిక ఆదాయం లభించేవారు ఆదాయం పన్ను చెల్లించనవసరం లేదన్న ప్రభుత్వ నిర్ణయం వచ్చే ఏడు మరింత మంది మరింత నిజాయితీగా పన్నులు చెల్లించడానికి దోహదకరం. చిన్న వ్యాపారులకు లభించిన భారీ పన్ను రాయితీలు సైతం నిజాయితీని, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచగలవట! ఫలితంగా రాష్ట్రాల పన్నుల ఆదాయం ప్రతి ఏటా కనీసం పదునాలుగు శాతం పెరిగే వ్యవస్థ శాశ్వతం కానుంది. మరో ఐదేళ్లలో మన స్థూల ‘జాతీయ ఆదా యం-జిడిపి- మూడు కోట్లు యాబయి లక్షల కోట్ల రూపాయల స్థాయికి చేరడానికి ఇది దోహదం చేయగలదు. ఎనిమిదేళ్ల ఈ స్థూల జాతీయ ఆదాయం- గ్రాస్ డొమస్టిక్ ప్రాడక్ట్- ఏడు కోట్ల రూపాయల స్థాయికి పెరుగుతుందన్న గోయల్ ఆకాంక్ష భరతజాతి సమష్టి, సుఖకారకమైన శుభకరమైన ‘పీయూష’్ధర.. ‘పీయూష’మంటే అమృతం, ఆవుపాలు..
‘రక్షణ’కు మూడు లక్షల కోట్ల రూపాయలకు పైగా కేటాయిస్తున్నప్పటికీ ‘చైనా పాకిస్తాన్’ల ఉమ్మడి దురాక్రమణ పొంచి ఉన్న తరుణంలో ఇది చాలదు. వర్తమాన ఆర్థిక వత్సరంలో ప్రతిపాదిత వ్యయం- గత ఏడాది ఫిబ్రవరి ఒకటవ తేదీన- ఇరవై నాలుగున్నర లక్షల కోట్లు కాగా రక్షణ వ్యయం రెండు లక్షల తొంబయి ఐదు వేల కోట్లు, అంటే దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలు. ఏప్రిల్ ఒకటి నుంచి ఆరంభం కానున్న కొత్త ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదిత వ్యయం దాదాపు ఇరవై ఏడున్ననర లక్షల కోట్లు. అందువల్ల మొత్తం వ్యయానికి అనుగుణంగా రక్షణ వ్యయం పెరగలేదన్నది స్పష్టం. చైనా మనకంటె మూడున్నర రెట్లు- ఆధికారికంగా- సైనిక వ్యయం జరుపుతోంది. చైనా తన బడ్జెట్‌లో పదహారు శాతం సైనిక వ్యవస్థకు కేటాయిస్తోంది. మనం పదకొండు శాతానికి పరిమితం కావడం వైపరీత్యం! మన రక్షణ వ్యయం గణనీయంగా పెరగాలి! ‘ప్రపంచీకరణ’ దుష్ప్రభావం నుంచి విముక్తం కావడానికి ప్రభుత్వం ఇప్పటికీ పూనుకోలేదు. విదేశీయుల పెట్టుబడుల వ్యామోహం, ప్రభుత్వరంగం ఆస్తుల విక్రయం మన ప్రగతి ప్రస్థాన గీతంలో ధ్వనిస్తున్న వికృతమైన అపశ్రుతులు.. సేంద్రియ వ్యవసాయ విస్తరణకు దోహదకరమైన పథకాలు ఏవీ?