సంపాదకీయం

ఇంకా ‘బాలికా వధువులు’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ పెళ్లి వేదికపై అంతా మహిళా పురోహితులే.. కన్యాదాన ఘట్టం వచ్చేసరికి వధువు తండ్రి - ‘నేను కన్యాదానం చేయబోవడం లేదు.. నా కూతురేమీ ఆస్తి కాదు.. దానం ఇవ్వడానికి..’ అనడంతో అక్కడి వారంతా నివ్వెరపోయారు. మరో వివాహ వేడుకలో వధువు ‘కనకాంజలి’ అనే ఆచారాన్ని పెళ్లిపీటల మీదే తిరస్కరించింది.. వధువు తన గుప్పెట నిండా బియ్యం తీసుకొని తలపై నుంచి పోసుకుంటూ- ‘నా తల్లిదండ్రుల రుణాన్ని తీర్చేశాను’ అని చెప్పడమే ‘కనకాంజలి’ ఆచారంలోని పరమార్థం. ‘తల్లిదండ్రుల రుణం ఎప్పటికీ తీరేది కాదు.. కనుక నేను ఆ మంత్రాన్ని జపించను..’ అని ఆ వధువు పురోహితులతో ధైర్యంగా చెప్పి సనాతన ఆచారాన్ని నిరసించింది.. ఈ రెండు ఘటనలూ జరిగింది పశ్చిమ బెంగాల్‌లోనే! మరోవైపు బాల్యవివాహాలకు సంబంధించి అనూహ్యంగా ఇదే రాష్ట్రం ‘ముందంజ’లో ఉండడం సమాంతర పరిణామం. కాలానుగుణంగా సంప్రదాయాల్లో మార్పులు రావడం మంచి విషయమే అయినప్పటికీ, కొన్ని దురాచారాలు ప్రస్తుత డిజిటల్ యుగంలోనూ సమాజం నుంచి దూరం కావడం లేదనడానికి బెంగాల్ ప్రత్యక్ష తార్కాణం. ‘బాల్యవివాహాలు హిందీ రాష్ట్రాల్లోనే ఎక్కువ’ అన్న భావన మన దేశంలో బలంగా ఉన్నా, తాజా పరిస్థితుల్ని విశే్లషిస్తే అది నిజం కాదని తేలుతుంది. సంస్కరణల గడ్డగా, విప్లవోద్యమాలకు ఆలవాలంగా వాసికెక్కిన పశ్చిమ బెంగాల్ ఇపుడు బాల్యవివాహాల్లో దేశం మొత్తం మీద ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ దురాచారాన్ని సంప్రదాయ బద్ధంగా పాటించడంలో రాజస్థాన్ అగ్రస్థానంలో ఉందన్నది నిన్నటి సంగతి. సామాజిక చైతన్యం, కఠిన చట్టాలు, విస్తృత ప్రచారం వల్ల రాజస్థాన్‌లో బాల్యవివాహాల సంఖ్య తగ్గుముఖం పట్టగా, అందరికీ విస్మయం కలిగించేలా బెంగాల్‌లో ‘చిన్నారి పెళ్లికూతుళ్ల’ సంఖ్య పెరుగుతోందని ‘జాతీయ కుటుంబ ఆరోగ్య అధ్యయనం’ నివేదిక ఘోషిస్తోంది. పదిహేను నుంచి పందొమ్మిదేళ్ల లోపు వయసు గల వధువుల సంఖ్య బెంగాల్‌లో పెరిగింది. రాజస్థాన్, బిహార్, ఝార్ఖండ్, ఉత్తర ప్రదేశ్ వంటి హిందీ రాష్ట్రాల్లో గత దశాబ్ద కాలంలో బాల్యవివాహాల్లో ఇరవై శాతం తగ్గుదల నమోదైంది. అదే కాలంలో పశ్చిమ బెంగాల్‌లో మాత్రం ఈ తగ్గుదల 8.4 శాతంగానే ఉంది. ‘జాతీయ కుటుంబ ఆరోగ్య అధ్యయనం’ తాజా నివేదిక మేరకు దేశం మొత్తం మీద బెంగాల్‌లోని ముర్షీదాబాద్ జిల్లాలో 39.9 శాతం మేరకు బాల్యవివాహాలు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో గాంధీనగర్ (గుజరాత్), భిల్వారా (రాజస్థాన్) జిల్లాలు నిలిచాయి. ఇప్పటికీ బిహార్‌లో 20 జిల్లాల్లో, బెంగాల్‌లో 14 జిల్లాల్లో, ఝార్ఖండ్‌లో 11 జిల్లాల్లో బాల్యవివాహాలు జరుగుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాల్లోనూ బాల్యవివాహాల సంఖ్యలో స్వల్ప పెరుగుదల చోటు చేసుకోవడం ఆందోళనకర పరిణామం.
ఎవరికీ ఆశ్చర్యం కలిగించని రీతిలో- గ్రామీణ ప్రాంతాల్లో బాల్యవివాహాల జోరు ఇంకా కొనసాగుతోంది. మన దేశంలోని పల్లెప్రాంతాల్లో 14.1 శాతం, పట్టణ ప్రాంతాల్లో 6.9 శాతం మేరకు బాల్యవివాహాలు జరుగుతున్నాయి. రాజస్థాన్‌ను మించిపోయి బెంగాల్‌లో బాల్యవివాహాల సంఖ్య పెరగడానికి అనేక కారణాలను సామాజికవేత్తలు విశే్లషిస్తున్నారు. పేదరికం, అభద్రత, అవిద్య, పితృస్వామ్య వ్యవస్థ, లింగ వివక్ష, చట్టాల వైఫల్యం వంటివి బాల్యవివాహాలు ఇంకా కొనసాగడానికి ప్రధాన కారణాలన్నది జగమెరిగిన సత్యం. బాల్యవివాహాల తగ్గుదలకు సంబంధించి జాతీయ సగటు 11.9 శాతం కాగా, పదకొండు రాష్ట్రాల్లో మాత్రమే ఈ తగ్గుదల రేటు జాతీయ సగటుకు మించి నమోదైంది. బెంగాల్ సహా 18 రాష్ట్రాల్లో బాల్యవివాహాల దురాచారం దూరం కాలేదని అధికారిక నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. సతీ సహగమనం, బహు భార్యత్వం, బాల్య వివాహాలు వంటి దురాచారాలపై పోరాడిన ప్రఖ్యాత సంఘ సంస్కర్త రాజారామమోహన్ రాయ్ నడయాడిన బెంగాల్‌లో యుక్తవయసు రాకుండానే దాంపత్య బంధంలోకి అడుగుపెడుతున్న బాలికల సంఖ్య ఎక్కువగా ఉండడం విస్మయకరం. బాల్యవివాహాల ఫలితంగా లేత వయసులోనే గర్భం దాలుస్తున్న బాలికలు అనారోగ్యం బారిన పడుతున్నారు. పెళ్లిళ్లు జరిగిన బాలికల్లో 17 ఏళ్ల వయసులో 26.6 శాతం మంది, 18 ఏళ్ల ప్రాయంలో 30.7 శాతం మంది తల్లులవుతున్నారు. తగిన వయసు రాకుండానే కాన్పులు జరగడంతో మాతాశిశువులకు ఆరోగ్య సమస్యలు అనివార్యమవుతున్నాయి.
బాల్యవివాహాలను భారత రాజ్యాంగం నిషేధించడంతో కాలగతిలో అనేక చట్టాలు రూపుదిద్దుకున్నాయి. జమ్మూ కశ్మీర్ మినహా దేశంలోని మిగతా ప్రాంతాలన్నింటికీ వర్తించేలా బాల్యవివాహాల నిరోధక చట్టం 1929లోనే రూపుదాల్చింది. 18 ఏళ్లలోపు బాలికలకు వివాహం చేయరాదన్న ఆ చట్టం ప్రకారం నిందితులకు జైలుశిక్షలు, జరిమానాలు వేసే అవకాశం ఉంది. ఆ చట్టాన్ని 1940లో సవరించారు. బాల్య వివాహాల నిషేధ చట్టాన్ని 2006లో రూపొందించారు. కాలానుగుణంగా చట్టాల్లో మార్పులు చేసినప్పటికీ బాల్యవివాహాలపై ఆందోళనకర అంశాలు తరచూ వెలుగుచూస్తూనే ఉన్నాయి. సామాజిక చైతన్యం, విద్యావకాశాలు పెరగడంతో కొన్ని కులాల్లో ఈ దురాచారం అదృశ్యమైంది. పలు అభివృద్ధి చెందిన దేశాల్లోనూ బాల్యవివాహాల సంఖ్య తగ్గింది. ‘యునిసెఫ్’ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా గత దశాబ్ద కాలంలో బాల్యవివాహాల సంఖ్య 15 శాతం మేరకు తగ్గింది. భారత్‌లో మాత్రం ఈ దురాచారం పూర్తి స్థాయిలో అంతం కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న బాల్యవివాహాల్లో భారత్ వాటా 33 శాతంగా నమోదైంది. పెళ్లీడు రాకుండానే గత దశాబ్ద కాలంలో ప్రపంచ వ్యాప్తంగా 650 మిలియన్ల బాలికలు, భారత్‌లో 103 మిలియన్ల మంది బాలికలు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ప్రతి నిమిషానికి విశ్వవ్యాప్తంగా 28 మంది బాలికలకు పెళ్లిళ్లు జరుగుతుండగా, భారత్‌లో నిమిషానికి కనీసం ఇద్దరు బాలికలకు వివాహాలు జరుగుతున్నాయి. గ్రామీణ కుటుంబాల్లో పేదరికం, అవిద్య అంతరించినపుడే ఈ దురాచారం అంతం కాగలదని సామాజిక నిపుణులు అంటున్నారు. దేశ జనాభాలో అధిక శాతంగా ఉన్న మహిళలు ఇప్పటికీ విద్య, ఆర్థిక రంగాల్లో వెనుకబడి ఉండడం వల్లే పితృస్వామ్య వ్యవస్థ, లింగ వివక్ష కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అర్థం లేని సంప్రదాయాలు, దురాచారాలు ఇంకా ప్రభావం చూపుతున్నాయి.
బాల్య వివాహాలను కేవలం మానవ హక్కులు, లింగ వివక్ష అనే కోణంలోనే కాకుండా- విద్య, ఆర్థిక, ఆరోగ్య పరమైన అంశాలుగా చూడాల్సి ఉంది. సామాజిక చైతన్యం లేకపోవడం, చట్టాల వైఫల్యం వల్ల ఇప్పటికీ ఏడు రాష్ట్రాల్లో బాల్య వివాహాలు తగ్గుముఖం పట్టలేదు. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న బాల్యవివాహాల్లో పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, బిహార్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 70 శాతం మేర చోటుచేసుకోవడం గమనార్హం. సామాజిక, ఆర్థిక పరిస్థితులు కొంత మెరుగ్గా ఉన్న తమిళనాడు, కేరళ, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఈ దురాచారం చాలావరకూ తగ్గుముఖం పట్టింది. ఆర్థిక, విద్య, ఉపాధి రంగాల్లో మహిళలకు సమానావకాశాలు కల్పిస్తూ 2030 నాటికి బాల్యవివాహాలను పూర్తి స్థాయిలో తగ్గించాలని ‘ఐక్యరాజ్య సమితి’ కొన్ని మార్గదర్శకాలను సూచించింది. ఆరోగ్యం, ఆహారం, విద్య, చట్టాలు వంటి అంశాలపై విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తే ఈ దురాచారం సమసిపోయే అవకాశం ఉంది. కనీసం హైస్కూల్ స్థాయి వరకూ బాలికలను విద్యావంతులుగా చేస్తే 2030 నాటికి దాదాపు 50 మిలియన్ల బాల్యవివాహాలను అరికట్టే వీలుందని ఐరాస చెబుతోంది. బాలికలను బడిబాట పట్టించే ‘బేటీ బచావో.. బేటీ పఢావో’ నినాదం సాకారమైతే భారత్ ఈ దురాచారం నుంచి గట్టెక్కే అవకాశం కొంతైనా ఉంది.