సంపాదకీయం

స్వచ్ఛతకు గీటురాయి?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యాగ్రహ చరిత్ర ‘స్వచ్ఛాగ్రహ’ ఉద్యమంగా పరివర్తన చెందడం మంగళవారం హరియాణ రాష్ట్రంలోని కురుక్షేత్రంలో జరిగిన ‘స్వచ్ఛశక్తి’ సమ్మేళనానికి జాతీయ భావ నేపథ్యం. స్వచ్ఛ భారత పునర్ నిర్మాణంలో ప్రధాన కార్యక్రమం ‘బహిరంగ మలమూత్ర విసర్జన’ నుంచి విముక్తి. దేశవ్యాప్తంగా కోట్ల ‘శౌచాలయాల’ను నిర్మించడం ద్వారా బహిరంగ స్థలాలలో మలమూత్ర విసర్జనకు స్వస్తి చెప్పాలన్న కేంద్ర ప్రభుత్వం నాలుగున్నర ఏళ్లుగా అమలు జరుపుతున్న స్వచ్ఛ కార్యక్రమం. ఇలా బహిరంగ స్థలాలలో మలమూత్ర విసర్జన చేయవలసిన మహిళలు ఎదుర్కొన్న అసౌకర్యాలను, గురి అయిన అవమానాలను ‘శాశ్వతగతం’గా మార్చడానికి ఈ శౌచాలయాల నిర్మాణం జరిగింది. ఇలా కోట్ల మంది మాతృమూర్తులను అవమాన, లజ్జ్భారం నుంచి విముక్తి చేసిన ‘శౌచాలయాలు’ మర్యాదాగృహాలు - ఇజ్జత్‌ఘర్‌లు-గా ప్రచారం పొందడం కూడ ప్రచారమవుతున్న మహా విషయం. మహిళలు శౌచక్రియ నిర్వర్తించడానికై చీకటి పడేవరకు ఎదురుచూడవలసి వచ్చిన గతాన్ని సమ్మేళన వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుచేశారు. ‘‘కిక్కిరిసిపోయిన’’ పట్టణాలలో నగరాలలో రైలుమార్గాల పక్కన, రహదారుల పక్కన మహిళలు ‘చెంబులు’ పట్టుకొని నిలుచుండిన దృశ్యాలు దేశమంతటా ఆవిష్కృతమయ్యాయి. ఇళ్లలో ‘శౌచాలయ వ్యవస్థ’ లేకపోవడం ఈ దుస్థితి దశాబ్దులపాటు కొనసాగడానికి కారణం. పెరిగిన పట్టణ నగర జనాభా సృష్టించిన వైపరీత్యం అది. అనాదిగా మన దేశంలో గ్రామం స్వయం సమృద్ధంగా వికసించింది. దేశం లక్షల స్వయం సమృద్ధ గ్రామాలుగా వికేంద్రీకృతం కావడం ఈ సనాతన జాతీయ జీవనం. అందువల్ల లక్షల కోట్ల ఏళ్లపాటు ‘స్వచ్ఛ భారతం’ పరిఢవిల్లింది. విదేశీయ దురాక్రమణదారులు విచ్ఛిన్నం చేసిన ‘స్వయం సమృద్ధగ్రామ’ వ్యవస్థను పునరుద్ధరించాలన్నది గాంధీ మహాత్ముడు ప్రవచించిన సుందర స్వప్నం.. ఈ సుందర స్వప్నానికి సాకారం ‘స్వచ్ఛ భారతం’. విదేశీయ దురాక్రమణ విముక్తి స్వయం సమృద్ధ గ్రామ వ్యవస్థ పునరుద్ధరణకు, గ్రామ స్వరాజ్యానికి పునాది.. స్వయం సమృద్ధ గ్రామ వ్యవస్థ స్వచ్ఛ భారత పునర్ నిర్మాణానికి పునాది. కానీ బ్రిటన్ విముక్త భారత్‌లో స్వయం సమృద్ధ గ్రామ వ్యవస్థ వికసించలేదు. గ్రామీణ వృత్తులు నశించి, ఉపాధి అడుగంటిపోవడంతో పల్లెల నుంచి పట్టణాలకు ప్రజల వలసలు వెల్లువెత్తాయి. పట్టణాలు, నగరాలు పట్టని జనం కేంద్రీకృతం కావడం మురికివాడలు పెరగడానికి, కాలుష్యం కేంద్రీకృతం కావడానికి కారణం! ఇదంతా బహిరంగ మలమూత్ర విసర్జనను అనివార్యం చేశాయి. స్వచ్ఛ భారత నిర్మాణానికి శౌచాలయాల నిర్మాణానికి ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం నడుం బిగించడానికి ఇదీ నేపథ్యం.
ఈ నేపథ్యంలో జరిగిన కురుక్షేత్ర సమ్మేళనం గాంధీ మహాత్ముడికి మరో నివాళి! దేశ విదేశాల నుంచి వచ్చిన ‘స్వచ్ఛ ప్రతినిధులు’ పదిహేను వేల మందికి పైగా ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు. వీరిలో అత్యధికులు మహిళలు. ఇది గాంధీ మహాత్ముడి జీవిత సార్థకత సంవత్సర- నూట యాబయ్యవ ఏడు- ఉత్సవాలు జరుగుతున్న సమయం. గాంధీ మహాత్ముడికి ఒక చేయి ‘రాట్నం’- చరఖా- రెండవ చేయి భగవద్గీత! ఐదువేల నూట యాబయి ఆరేళ్లనాడు ‘హరియాణ’లోని ‘కురుక్షేత్రం’లో కౌరులకూ పాండవులకూ మధ్య యుద్ధం జరిగింది. కౌరవులు కాలుష్య ప్రతీకలు, పాండవులు స్వచ్ఛతకు, సత్యానికి పతాకలు. ఈ యుద్ధ ఆరంభంలో యదుకుల కృష్ణుడు పాండవ మధ్యముడైన అర్జునునికి చేసిన కర్తవ్య బోధ ‘భగవత్‌గీత’గా ప్రసిద్ధికెక్కింది, తరతరాలుగా ప్రజలను క్రియాశీల జీవనులుగా నడిపిస్తోంది. గాంధీ మహాత్ముడు బ్రిటన్ వ్యతిరేక స్వాతంత్య్ర ఉద్యమం నడిపిన కాలంలో కార్యకర్తలకు ప్రేరణ భగవత్ గీత! ‘రాట్నం’ భౌతిక ప్రగతికి ప్రతీక, భగవద్గీత సాంస్కృతిక సుగతికి పతాక! ‘ప్రగతి’ ‘సుగతి’ స్వయం సమృద్ధ గ్రామరాజ్య రథానికి రెండు చక్రాలు! అందువల్ల స్వచ్ఛ భారత పునరుద్ధరణ భౌతిక స్వచ్ఛతతో మాత్రమే కాదు, సాంస్కృతిక స్వచ్ఛతతో ముడివడి ఉన్న జీవన వాస్తవం! స్వచ్ఛత, గాంధీ మహాత్ముడి స్వప్నం, కురుక్షేత్రం, భగవత్‌గీత ఇలా పరస్పరం ముడివడి ఉండడం చరిత్ర. ఈ చరిత్రను మంగళవారం నాటి ‘స్వచ్ఛశక్తి’ సమ్మేళనంలో ప్రసంగించిన ప్రధాని, మంత్రులు, ఇతరులు ప్రస్తావించడం జాతీయ సాంస్కృతిక స్వచ్ఛత ప్రాధాన్యానికి నిదర్శనం!
గాంధీ మహాత్ముడు హరిజన బస్తీలలో విడిది చేయడం చరిత్ర. 1942లో గాంధీ మండు వేసవిలో మాల్‌గుడి పట్టణానికి వచ్చాడు. మాల్‌గుడి ‘పురపాలిక’ అధ్యక్షుడు నటేశన్ తన ఇంద్ర భవనానికి గాంధీ మహాత్ముడిని తోడుకొని వెడతాడు. అక్కడ బసచేయమని అభ్యర్థిస్తాడు. జన సమూహం వెనుక బిక్కుబిక్కుమంటూ నిలబడి ఉన్న ఆరేళ్ల బాలుడిని గాంధీ గుర్తించాడు. ఆ ‘బుడత’ను తనవద్దకు పిలిపించాడు, తన పక్కన కూచోబెట్టుకున్నాడు, కమలాపండ్లు ఇచ్చాడు. మరికొందరు పిల్లలు కూడ గాంధీ చుట్టూ చేరారు. వారందరికీ బుట్టలలోని కమలా ఫలాలు- సంతరాలు-ను పంచిపెట్టాడు గాంధీ. అందరూ తింటుంటారు, విత్తనాలను ఉమ్మివేస్తుంటారు. తన ‘భవనం’ పాడయిపోతోందని పురపాలక సంఘం అధ్యక్షుడు లోలోపల ఏడుస్తూ ఉంటాడు. గాంధీ తన పక్కన కూర్చుని ఉండిన ఆరేళ్ల బాలుడికి ‘కమలా’పండు- ఆరంజ్- ఎలా తినాలో చూపిస్తాడు. విత్తనాలను, తుప్పులను, పొట్టును-తొక్కను- ఇతర వ్యర్థాలను ఎలా జాగ్రత్తగా ఉంచాలో కూడ ఆ బాలుడికి బోధిస్తాడు. ఇదంతా గాంధీ మహాత్ముడు ప్రాధాన్యం ఇచ్చిన భౌతిక స్వచ్ఛత! ఆ బాలుడు దళితుడు, అస్పృశ్యత వంటి సామాజిక వికృతులకు బలి అవుతుండిన కుటుంబానికి చెందినవాడు! మహాత్ముడు ‘‘నన్ను మీ ఇంటికి తీసుకొని వెడతావా?’’ అని దళిత బాలుడిని ప్రశ్నించాడు. ‘‘మా ఇల్లు ఇంత బాగా ఉండదు’’అన్నది హరిజన బాలుడి జవాబు! సంభాషణ అలా కొనసాగింది! మాల్‌గుడిలో ఉండినన్నాళ్లు తాను ఆ బాలుడి ఇల్లున్న దళిత బస్తీలోనే బసచేయడానికి గాంధీ నిర్ణయించాడు! ఇదీ మానసిక స్వచ్ఛత, బౌద్ధిక స్వచ్ఛత, సాంస్కృతిక స్వచ్ఛత! రాసీపురం కృష్ణస్వామి నారాయణ్ తన ‘మహాత్ముని అనుమతి కోసం..’ - వెయిటింగ్ ఫర్ ది మహాత్మా- అన్న ఆంగ్ల నవలలో ఉటంకించిన చారిత్రక ఘటన ఇది. గాంధీ విడిది చేయడంతో చెత్తచెదారం కాలుష్యం తొలగి పోయాయి, చర్మకారుల బస్తీలో పరిశుభ్రత ప్రశాంత పరిసరాలు పునరుద్ధరణకు నోచుకున్నాయి!
భౌతిక స్వచ్ఛత అనాదిగా భారతీయ జీవన స్వరూపం. ‘‘మధు వాతాఋతాయతే..’’- గాలి తేనెల సుగంధంతో స్వచ్ఛంగా ఉండాలి- అని ఆకాంక్షించిన వేదద్రష్టలు స్వచ్ఛ్భారత నిర్మాతలు. ఈ భౌతిక స్వచ్ఛత విదేశీయ దురాక్రమణ సమయంలో భంగపడింది. మళ్లీ ఇప్పుడు స్వచ్ఛ భారత నిర్మాణం జరుగుతోంది. మద్యపానం, విష రసాయనాల ఎఱువులు, రసాయనాలు నిండిన తిండి, పరిశ్రమల కాలుష్యం- ఇలాంటివి నిర్మూలన అయినప్పుడు మాత్రమే ‘స్వచ్ఛత’ సమగ్రం కాగలదు. పాశ్చాత్య దురాక్రమణ దుష్ప్రభావం నుండి, భావదాస్యం నుంచి విముక్తం అయినప్పుడు మాత్రమే ‘సాంస్కృతిక స్వచ్ఛత’ మళ్లీ వికసిస్తుంది. ద్వాపర యుగం నాటి యదుకుల కృష్ణుడు, కలియుగంలోని ఆది శంకరాచార్యుడు, వివేకానందుడు, గాంధీ మహాత్ముడు ఈ సాంస్కృతిక స్వచ్ఛతను నిలబెట్టడానికి కృషిచేశారు, పునరుద్ధరించడానికి పాటుపడ్డారు. భౌతిక స్వచ్ఛత దేశ స్వరూపం... సాంస్కృతిక స్వచ్ఛత జాతీయ స్వభావం! ఈ స్వభావ స్వచ్ఛత స్థాయి ప్రస్తుతం ఎంత?