సంపాదకీయం

‘గోడ’ కడుతున్నారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెక్సికోతో తమ దేశానికి ఏర్పడి ఉన్న రెండువేల మైళ్ల- మూడు వేల కిలోమీటర్ల - పొడవునా ‘గోడ’ను నిర్మించాలన్న అమెరికా ప్రభుత్వ సంకల్పం కార్యరూపం ధరించడానికి రంగం సిద్ధం కావడం ‘ప్రపంచీకరణ’ వాణిజ్య స్ఫూర్తికి విఘాతకరం.. దేశాల సరిహద్దులు చెఱిగిపోవాలని ప్రపంచమంతా ఒకే ‘వాణిజ్య మండలం’గా, ‘పుడమిపల్లె’గా ఏర్పడాలని దశాబ్దులపాటు ‘ప్రపంచీకరణ’ సిద్ధాంతకర్తలు ప్రచారం చేశారు. ఈ సిద్ధాంతకర్తలలో మొదటిది అమెరికా.. ‘నిజమే కాబోలు’ అని విశ్వసించిన మన దేశం వంటి ప్రవర్థమాన దేశాలు తలుపులు బార్లాతెరచి ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’- మల్టీ నేషనల్ కంపెనీల-ను తమ వాణిజ్య ఆర్థిక వ్యవస్థలలోకి చొరబడనిస్తున్నాయి. అమెరికా మాత్రం గత కొన్నేళ్లుగా ‘తలుపుల’ను మూసేస్తోంది, ‘సరిహద్దుల’లో నిర్నిరోధంగా రాకపోకలు జరగడం సాధ్యం కాదంటోంది. డొనాల్డ్ ట్రంప్ 2017 జనవరిలో అధ్యక్ష పదవీ బాధ్యతలను స్వీకరించాక సరిహద్దుల తలుపులు మరింతగా అమెరికా బిగిస్తోంది. గత నవంబర్‌లో మెక్సికో నుంచి తమ దేశంలోకి ‘చొరబడిన’ దాదాపు లక్ష మందిని ట్రంప్ ప్రభుత్వం నిర్బంధించింది, వీరిలో రెండువేల మంది భారతీయ అక్రమ ప్రవేశకులు కూడ ఉన్నారట! మెక్సికో వైపునుంచి ఎవ్వరూ తమ దేశంలోకి ప్రవేశించకుండా నిరోధించడానికై ‘ఇనుపగోడ’ను నిర్మించాలన్నది ట్రంప్ వ్యూహం. ఈ ‘ఉక్కు గోడ’ వ్యూహాన్ని అమెరికా కాంగ్రెస్ మొదట తిరస్కరించింది, వారాల తరబడి ‘ప్రతిష్టంభన’ ఏర్పడింది. గోడ కట్టడానికి వీలుగా ట్రంప్ నలబయి వేల కోట్ల రూపాయల నిధులను కోరాడు. కానీ కాంగ్రెస్-అమెరికా పార్లమెంట్- ప్రతినిధుల సభవారు పదివేల కోట్లు రూపాయలను మాత్రం ‘మంజూరు’ చేయనున్నారట! ఏమైనప్పటికీ అమెరికా ప్రభుత్వం, చట్టసభలు ‘గోడ’ కట్టడానికే నిర్ణయించడం ‘ప్రపంచీకరణ’ కోట బీటలు పారుతోందనడానికి మరో నిదర్శనం. అక్రమ ప్రవేశం ‘నేరం’పై వందల మంది భారతీయ విద్యార్థులను అమెరికా ప్రభుత్వం కారాగృహాలలో నిర్బంధించి ఉంచడం సమాంతర విపరిణామం..
విదేశీయ అక్రమ ప్రవేశకులు తమ దేశాన్ని ముంచెత్తుతున్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘కీచుగొంతు’తో నిరసనలను నిగిడిస్తుండడం చారిత్రక వైపరీత్యం. ఎందుకంటె ప్రస్తుతం అమెరికా ఖండంలోని అత్యధిక దేశాలలో అక్రమ ప్రవేశకులే ‘స్వజాతులు’గా ఏర్పడి ఉండడం చరిత్ర. క్రీస్తుశకం పదహారవ శతాబ్ది నుండి మూడున్నర శతాబ్దులుపాటు ఐరోపా ఖండంలోని తెల్లజాతులవారు అమెరికా ఖండంలోకి చొరబడ్డారు. ఇలా చొరబడిన ఐరోపావారు అనాదిగా అమెరికాలో నివసించిన ఎఱ్ఱజాతుల వారిని వేటాడి చంపేశారు. ఇలా ఎఱ్ఱజాతుల- రెడ్ ఇండియన్‌ల-ను నిర్మూలించిన ఐరోపావారు అమెరికా ఖండంలో తిష్ఠవేశారు. అంటే తాము చొరబడిన దేశాలలోని ‘స్వజాతీయుల’ను నిర్మూలించాలన్న హంతక స్వభావం ఐరోపా ఖండంలో తెల్లజాతులది. తమకు శక్తిలేకపోయినట్టయితే చెప్పుకింద ‘తేళ్ల’వలె పడి ఉండడం, తాము శక్తిమంతులు అయినట్టయితే వివిధ దేశాలలోని ‘స్వజాతీయుల‘పై- ఆవులపై దూకెడి తోడేళ్లవలె’ దాడి చేయడం ఐరోపా ప్రజల సమష్టి స్వభావమన్నది చరిత్ర ధ్రువపరచిన కఠోర వాస్తవం! అందు శక్తిమంతులైన ఐరోపావారు బ్రిటన్‌వారు, ఫ్రాన్స్‌వారు, స్పెయిన్ వారు, పోర్చుగల్ వారు, ఇంకా ఇతర ఐరోపా జాతులవారు అమెరికా ఖండంలోని అనాది జాతులను సామూహికంగా హత్యచేయడం మూడున్నర శతాబ్దుల చరిత్ర! అమెరికాలోని ప్రకృతి ఆరాధక, విగ్రహారాధక మతాల వారిని అలా చంపేసిన ఐరోపావారు ప్రాచీన సంస్కృతి ఆనవాళ్లను, యజ్ఞ సంస్కృతి అవశేషాలను సైతం మిగలకుండా అమెరికా ఖండాన్ని కుళ్లగించి పారేశారు. ఈ తెల్లని దొంగల నల్లని హృదయాలు వ్యాపింపచేసిన సాంస్కృతిక బీభత్సం అమెరికా ఖండపు ‘ప్రకృతి’ని మార్చివేయడం ఆ మూడున్నర దశాబ్దుల చరిత్ర. పద్దెనిమిదవ శతాబ్ది ఆరంభం నాటికి- ఇలా అమెరికాలోకి చొరబడిన ఐరోపావారు, వారి వారసులు అమెరికాలోని వివిధ ప్రాంతాలలో ‘కొత్త జాతులు’గా ఏర్పడినారు. అందు ఈ కొత్త జాతులకు కొందరు ఐరోపా ‘పిత’లు కూడ ఏర్పడినారు! ఉత్తర అమెరికా ఖండంలోని ఆగ్నేయ భాగంలో ఇలా పదమూడు బ్రిటన్ ‘వలసలు’- కొత్త జాతులు ఏర్పడినాయి! ఐరోపా నుండి చొరబడివారు శతాబ్దుల తరువాత ఈ ‘వలసల’లో సక్రమ ప్రవేశకులు కావడం, స్వజాతీయులు కావడం చారిత్రక వైపరీత్యం! అమెరికా జాతిపిత విలియం పెన్ వంటివారు ఇలా ఐరోపా నుండి చొరబడిన వారి సంతతి! 1776లో ఈ పదమూడు బ్రిటన్ వలసల వారు ‘అమెరికా సంయుక్త రాష్ట్రాలు’- యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా- యుఎస్‌ఏ- గా ఏర్పడి మాతృదేశం- బ్రిటన్-పై తిరుగుబాటు చేసి స్వాతంత్య్ర యుద్ధం చేశారు, బ్రిటన్‌ను ఓడించారు. స్వతంత్ర దేశంగా ఏర్పడినారు!
ఆ తరువాత శతాబ్దిపాటు, అట్లాంటిక్ సముద్ర తీరానికి అంటుకుని ఉండి పదమూడు రాష్ట్రాల అమెరికా పశ్చిమంగా విస్తరించి ‘పసిఫిక్’ సముద్రం వరకూ జరిగి యాబయి రాష్ట్రాల పెద్ద దేశంగా ఏర్పడింది. అమెరికా ఖండంలోని అనేక ప్రాంతాలు ఐరోపా సంతతి వారితో నిండిపోయి కొత్త దేశాలుగా ఏర్పడడం సమాంతర విపరిణామం. ఐరోపా దొంగలు అమెరికా ఊళ్లను పంచుకున్నారు. అలా ‘యుఎస్‌ఏ’కు దక్షిణంగా మెక్సికో, ఉత్తరంగా కెనడా ఏర్పడినాయి. మెక్సికో ప్రజలు తమ దేశంలోకి చొరబడుతున్నారని దాదాపు ఐదు దశాబ్దులుగా అమెరికా ప్రభుత్వం ఆరోపిస్తోంది. కొందరు ఐరోపా దొంగల వారసులు- మెక్సికోవారు- మరికొందరు ఐరోపా దొంగల వారసుల- అమెరికా సంయుక్త రాష్ట్రాల- ఇంటిలోకి చొరబడడం చరిత్రకు అనుగుణమైన వ్యవహారం. చారిత్రక అన్యాయాలను సవరించాలని అన్యాయం చేసిన ‘జాతి’వారు అన్యాయానికి గురి అయిన ‘జాతి’కి క్షమార్పణ చెప్పాలని ఆర్థిక పరిహారం చెల్లించాలని అంతర్జాతీయంగా ప్రచారం జరుగుతోంది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో తమ దేశాన్ని ‘దురాక్రమించిన జపాన్’ తమకు క్షమార్పణ చెప్పాలని, పరిహారం చెల్లించాలని చైనా ప్రభుత్వం వారు ఏళ్లతరబడి కోరడం ఇలాంటి ప్రచారానికి ఒక ఉదాహరణ మాత్రమే! శతాబ్దులపాటు తమ దేశాన్ని దురాక్రమించి దోచుకున్న బ్రిటన్‌వారు, ఐరోపావారు తమకు క్షమార్పణ చెప్పాలని అమెరికాలో ఎవ్వరూ కోరడం లేదు, 1776నుంచి కోరడం లేదు.. ఎందుకంటె అమెరికాలోని తెల్లవారు ఐరోపావారే!!
అమెరికాలో వందల మంది భారతీయ విద్యార్థులను ‘చొరబాటు నేరం’పై నిర్బంధించడాన్ని నిరోధించలేకపోవడం మన ప్రభుత్వం వారి దౌత్య వైఫల్యం. దశాబ్దుల తరబడి రెండు కోట్ల మందికి పైగా విదేశీయులు మన దేశంలోకి చొఱబడినట్టు మన ప్రభుత్వం ఆధికారికంగా ప్రకటించి ఉంది. వీరిలో ఎవ్వరినీ మన ప్రభుత్వం జైళ్లపాలు చేసిన జాడ లేదు. ‘దేశ పౌరుల జాతీయ సూచిక’- నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్- ముసాయిదా వెలువడిన తరువాత అస్సాంలోనే ‘దేశ పౌరులు కాని వారి సంఖ్య’ నలబయి లక్షలని తేలింది. మిగిలిన కోటి అరవై లక్షలమంది దేశమంతటా నిండి ఉన్నారు. వీరందరూ బంగ్లాదేశీయులు. బర్మా నుంచి దాదాపు డెబ్బయివేల మంది మన దేశంలోకి చొఱబడి ఉన్నట్టు ప్రభుత్వం నిగ్గుతేల్చింది. కానీ వీరిలో ఎవ్వరినీ మన ప్రభుత్వం నిర్బంధగృహాల పాలుచేయలేదు. వీరందరూ ‘శరణార్థుల’ హోదా పొంది ఉన్నారు. వీరిలో- బర్మా రోహింగియాలలో వందల మంది జిహాదీలు కూడ ఉన్నట్టు ధ్రువపడింది. అయినప్పటికీ మన ప్రభుత్వం ఈ రోహింగియాలను నిర్బంధించలేదు! వివిధ దేశాల నుంచి సహస్రాబ్దుల పాటు శరణార్థులై వచ్చినవారికి ‘నీడ’నిచ్చిన చరిత్ర మనది. ఈ హైందవ జాతీయ స్వభావం గురించి పంతొమ్మిదవ శతాబ్ది చివరిలో అమెరికాలోని చికాగోలో జరిగిన సర్వమత సభలో వివేకానందస్వామి వివరించి ఉన్నాడు. అన్నము పెట్టిన భరతజాతికి, హత్యలు చేసిన ఐరోపా జాతులకు మధ్యగల స్వభావ భేదం ఇది! ఇతర దేశాల అక్రమ ప్రవేశకులను సైతం జైళ్లపాలు చేయకపోవడం మన ఔదార్యం.. కావచ్చు! కానీ ఇతర దేశాలలోని మనవారు జైళ్లపాలు కాకుండా నిరోధించడం కూడ మన ప్రభుత్వ కర్తవ్యం..