సంపాదకీయం

మాతృభాషల లక్ష్యం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షరాలు అజరామర
భావానికి రూపాలు..
అక్షరాలు విశ్వవిహిత
నాద జనిత రాగాలు..
అక్షరాలు ఎద విరిసిన
అనుభూతుల పరిమళాలు,
‘అమ్మా’ అను పసిపాపల
పరిశోధక స్వరాలు!!
అక్షరం ‘స్వరూపం’, అక్షరం ద్వారా వ్యక్తమయ్యే సంస్కారం ‘స్వభావం’. ‘్భష’ మాధ్యమం. భావం లక్ష్యం.. సంస్కార సమాహారం సంస్కృతి! ప్రతి జాతి సంస్కారం ఆ జాతీయ భాష ద్వారా లేదా జాతీయ భాషల ద్వారా వ్యక్తం అవుతోంది. మాతృభాష లేదా మాతృభాషల మాధ్యమం ద్వారా మాతృ జాతీయ సంస్కృతిని రక్షించుకోవాలన్నది 2009 మే 16న ఐక్యరాజ్య సమితి చేసిన తీర్మానం స్ఫూర్తి! మాధ్యమం ధ్వంసం అయిపోయినట్టయితే లక్ష్యం ధ్వంసం అయిపోతుంది! భాషలు పరస్పర పరిపోషకాలు కావడం చరిత్ర. ఎందుకంటె ఒక మూల భాష నుంచి అనేక భాషలు వికసించాయి. వృక్షజాలం, జంతుజాలం, జీవజాలంలో ఈ పరస్పర పరిపోషకత్వం నిహితమై ఉండడం ప్రకృతిలోని సమన్వయం! ఒకేచోట వందల రకాల మొక్కలు తీగెలు పొదలు చెట్లు పెరగడం పరస్పర పరిపోషకత్వం! ఏ మొక్క కూడ మరో మొక్కను చంపదు, భారతదేశంలోని ఏ భాష కూడ మరో భాషను చంపలేదు. ఒక భాష మరో భాషగా మరిన్ని భాషలుగా రూపాంతరం చెంది ఉండవచ్చు! విదేశాల నుంచి, ఆఫ్రికా నుంచి, అమెరికా నుంచి ఐరోపా నుంచి వ్యాపించిన కొన్నిరకాల మొక్కలు మాత్రం మన దేశపు అడవులలో ప్రధానంగా పశ్చిమ కనుమలలో ప్రాకృతిక బీభత్సాన్ని సృష్టిస్తున్నాయని ధ్రువపడింది! ఈ విదేశీయపు మొక్కలు పెరుగుతున్నచోట ఇతర అన్నిరకాల మొక్కలు, అనాదిగా పెరిగిన మొక్కలు నశించిపోతున్నాయి. ఇలా ఇతర మొక్కలన్నీ ధ్వంసమైపోయి ఈ కొత్త- హంతక జాతి- మొక్కలు విస్తరించడం పట్ల పర్యావరణ పరిరక్షకులు ఆందోళన చెందుతున్నారు. మన దేశానికి విదేశాల నుంచి వ్యాపించిన ‘ఆంగ్లభాష’ భారతీయ భాషలను నిర్మూలిస్తుండడం ఈ ప్రాకృతిక బీభత్సానికి సమాంతరంగా నడుస్తున్న బౌద్ధిక బీభత్సం! ఆంగ్ల భాష కూడ సరస్వతీ స్వరూపం. ఆ భాషను భారతీయులు తమ మాతృభాషలతోపాటు నేర్చుకోవచ్చు, మాతృభాషలను మరచిపోయే రీతిలో ఆంగ్లభాషను అధ్యయనం చేస్తున్నాము. శిశువులకు తెలుగుభాషలోని అక్షరాలు కాని, భారతీయ భాషలలోని అక్షరాలను కాని నేర్పడం లేదు. ఆంగ్లభాషలోని అక్షరాలను మప్పుతున్నాము. తెలుగు అక్షరాలు రాని, భారతీయ భాషల వ్రాయలేని ఉన్నతోన్నత విద్యావంతులు చదవగల, వ్రాయగల ఏకైక అక్షర మాధ్యమం ఆంగ్లభాష!
ప్రపంచంలో ప్రస్తుతం ఏడువేల భాషలను మాట్లాడుతున్నారట! ‘లిపి’ ఉన్నవి కొన్ని.. ‘లిపి’లేనివి ఎన్నో?! ఈ భాషలలో ప్రతి రెండు వారాలకు ఒకటి చొప్పున అంతరించిపోతుండడం ‘మాతృభాషా దినోత్సవాని’కి విచిత్రమైన నేపథ్యం. ప్రచారంలో అతిశయోక్తులు ఉండవచ్చు. కానీ అనేక భాషలు అంతరించిపోవడం మాత్రం కఠోరమైన చారిత్రక వాస్తవం! మన దేశంలో కనీసం పదివేల మంది మాట్లాడుతున్న భాషలు నూట ఇరవై రెండు ఉన్నాయన్నది ఆధికారికంగా నిగ్గుతేలిన నిజం! పదివేల మంది కంటె తక్కువ సంఖ్యలోనివారు మాట్లాడుతున్న భాషలు ఇంకా ఎక్కువ ఉన్నాయట! ఇవన్నీ భారతీయ మాతృభాషలు! ఈ మాతృభాషల మాధ్యమం ద్వారా ‘ఒకే సంస్కృతి’ ‘ఒకే జాతీయత’ ప్రస్ఫుటించడం భారతదేశపు వైవిధ్య పరిరక్షక ప్రవృత్తికి నిదర్శనం, వైవిధ్య భాషారూపాల మధ్య నిహితమై ఉన్న అద్వితీయ స్వభావానికి నిదర్శనం. మన దేశంలో అనాదిగా అనేక భాషలు వికసించాయి. అనేక మతాలు పుట్టి పెరిగాయి, అసంఖ్యాక వైవిధ్యాలు పరిఢవిల్లాయి, పరిఢవిల్లుతున్నాయి. కాని ఈ అన్ని భాషల ద్వారా మతాల ద్వారా ‘ఒకే భారత జాతీయ సంస్కృతి’ దేశ ప్రజల జీవన వ్యవహారం కావడం యుగయుగాల చరిత్ర. ఈ దేశంలో కేవలం ఒక భాష ప్రాతిపదికగా ‘జాతి’ ఏర్పడలేదు, ఒక ‘మతం’ మాత్రమే ప్రాతిపదికగా ‘జాతి’ ఏర్పడలేదు. కేవలం ఒక వైవిధ్యం ప్రాతిపదికగా ‘జాతి’ ఏర్పడలేదు. అందువల్లనే అనాదిగా భారత ‘జాతి’ వివిధ భాషల, మతాల ‘వైవిధ్యాల సంపుటమైన’ అద్వితీయ జాతి! ఈ నూట ఇరవై రెండు భాషల ద్వారా నూట ఇరవై రెండు ‘జాతులు’ ఏర్పడలేదు, నూట ఇరవై రెండు సంస్కృతులు ఏర్పడలేదు. నూట ఇరవై రెండు భాషల ద్వారా కూడ ఒకే ‘జాతీయత’ వికసించింది, ఒకే ‘సంస్కృతి’ పరిమళించింది. అందుకే అనాదిగా మనది వైవిధ్యాల సమాహారమైన వైవిధ్య భాషల సమభావమైన అద్వితీయ జాతి! అద్వితీయ సంస్కృతి! ‘‘పృథివీ సముద్ర పర్యంతాయాః ఏకరాట్...’’- సముద్రాల వరకు విస్తరించిన ఈ భూమి ఒకే జాతి అన్నది సనాతనమైన- అంటే శాశ్వతమైన- వాస్తవం! సృష్టిలో వైవిధ్యాల మధ్య సమన్వయం ఉంది, స్వభావ సమానత్వం ఉంది! సమన్వయం ప్రకృతి సహజ ధర్మం... ‘సంఘర్షణ’ అప్పుడప్పుడు తలఎత్తే ‘అపవాదం’ మాత్రమే. సమన్వయం శాశ్వతం! ఈ సృష్టిగత వాస్తవం భారతదేశంలో అనాదిగా సమాజస్థితం కావడం చరిత్ర.. కానీ ఈ స్వజాతీయ చరిత్రను విదేశీయ దురాక్రమణదారులు భంగపరచడం కూడ చరిత్ర...
మన దేశంలో ఉన్నన్ని భాషలు- కోట్ల మంది మాట్లాడే భాషలు- మరే దేశంలోను లేవు. పెద్ద దేశాలైన చైనాలోను, రష్యాలోను, అమెరికాలోను ఒకే ప్రధాన మాతృభాష ఉంది. ఈ ‘ఏకరూపత’కు భిన్నంగా వైవిధ్య భాషారూపాలు అనాదిగా వికసించడం భారతదేశపుప్రత్యేకత! సంస్కృత భాష నుంచి అనేక ప్రాకృత భాషలు రూపాంతరం చెందాయి, ఈ ప్రాకృత భాషలు వివిధ ప్రాంతీయ భాషలుగా వికసించాయి. అన్ని భాషలకు మాతృక సంస్కృత భాష కావడం వైవిధ్య భాషా ప్రాంత మతాలవారు సంప్రదాయాలవారు ఒకే జాతిగా ఏర్పడడానికి ప్రధాన కారణం! అనేక వైవిధ్యాల ‘జన సముదాయాలు’ కలసి ఒకే ‘సాంస్కృతిక జాతి’గా వికసించడానికి భూమిక సంస్కృత భాష! అందువల్లనే మన దేశంలో ‘్భష’ల పేరిట ‘జాతులు’ ఏర్పడలేదు. అన్ని భాషల వారిదీ ఒకే భారత జాతి! వివిధ ప్రాంతాలలోని వివిధ ‘‘్భషా జన సముదాయాలవారు’’ తాము భరతమాత సంతానమన్న, తమది భారతజాతి అన్న వాస్తవ భూమికపై జీవించారు. అందువల్లనే సింహళ ప్రజలకు కైలాస పర్వతం స్ఫూర్తి కేంద్రమైంది. కావేరీ నదీ తీరంలో పుట్టిపెరిగిన గోదాదేవి యమునా తీరంలోని యదుకుల కృష్ణుని కథను పాడింది! ఇందుకు కారణం సంస్కృత భాష! అన్ని భారత ప్రాంతాల మధ్య అనుసంధాన భాష సంస్కృత భాష, ఉన్నత విద్యాబోధనకు మాధ్యమ భాష సంస్కృతం. పరిపాలన భాష సంస్కృతం. సంస్కృతంలో రూపొందిన భావాలు, సంస్కారాలు, కథలు, అనుభూతులు అన్నీ భారతీయ భాషలలోకి అనువాదం కావడం వేల వేల ఏళ్ల చరిత్ర.. ఐరోపా నుంచి దురాక్రమించినవారు ఈ చరిత్రను ధ్వంసం చేశారు. సంస్కృత భాషలో జరిగిన వ్యవహారం మొత్తం ఆంగ్ల భాషలో జరగడం ఆరంభం కావడం ఈ విధ్వంసం! సంస్కృత భాష, భారతీయ ప్రాంతీయ భాషలు భారతీయులను భారతీయులుగా నిలబెట్టాయి. ఆంగ్లభాష భారతీయులను ఐరోపా స్వభావంతో నింపింది. స్వరూప భారతీయులు ‘స్వభావ ఐరోపీయు’లుగా చెలామణి అవుతుండడం నడుస్తున్న చరిత్ర...
స్వరూప భారతీయులను మళ్లీ స్వభావ భారతీయులుగా మార్చడానికి మాధ్యమం ఏమిటన్న ‘మథనం’ జరుగవలసిన తరుణం ఇది. శిశువులకు బాలబాలికలకు మొదట- కనీసం ఏడవ తరగతి వరకు- తెలుగు భాష మాధ్యమం గాను, వివిధ భారతీయ భాషల మాధ్యమంగాను బోధన జరగాలి. ఉన్నత విద్యను దేశమంతటా ఒకే భారతీయ భాష మాధ్యమంగా బోధించాలి! జాతీయ స్వభావ పునర్ వికాసానికి ఇది వౌలిక సూత్రం!