సంపాదకీయం

బీభత్సంపై ‘పిడుగు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమరం ఇది ‘నిశా’సురుల
దునుమాడిన శుభ సమయం,
సమరం ఇది మతోన్మాద
మూకలపై క్షణం క్షణం....
సమరం ఇది ‘జిహాదీ’ల
బీభత్సంపై అనిశం,
సత్వర న్యాయం జరిగింది... జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అవన్తిపురావద్ద నలబయి మంది మన రక్షకులను హత్యచేసిన పాకిస్తానీ ‘జిహాదీ’లకు దండన లభించింది. బీభత్సపు తోడేళ్లను మన దేశంలోకి ఏడుపదుల నిశాబ్దులుగా ఉసిగొల్పుతున్న పాకిస్తానీ సైనిక నియంతలకు తగిన శాస్తి జరిగింది. వారికి ‘వణుకు’ పుట్టింది, తేలు కుట్టిన దొంగల వలె పాకిస్తాన్ ‘పౌర’ ప్రభుత్వం, చైనా నియంతృత్వపు ‘దొరతనం’ నోళ్లు మెదపడం లేదు. సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత తెల్లవారుజాము సమీపిస్తున్న తరుణంలో ఈ సత్వర న్యాయ ప్రక్రియ భారతీయ రక్షణ పటిమగా మారింది, వైమానిక దళం వీరుల రూపమెత్తింది. భరత మాతృదేవి వజ్రాల బిడ్డల పరాక్రమంగా పరిఢవిల్లింది! జమ్మూకశ్మీర్‌లోని ‘ఆధీనరేఖ’- లైన్ ఆఫ్ కంట్రోల్- ఎల్‌ఓసి-ను దాటింది, ‘జాయిష్ ఏ మొహమ్మద్’- జెఇఎమ్-జిహాదీ బీభత్సపు బట్టీలపై పిడుగుల జడిగా మారింది. కేవలం పదహైదు నిముషాల కాలవ్యవధిలో, తెల్లవారుజామున మూడుగంటల నలబయి ఐదు నిముషాల నుండి నాలుగు గంటల వరకు, - జెఇఎమ్ - బీభత్సపు బట్టీలు అనేకం బద్దలైపోయాయి. ‘అధీనరేఖ’కు ఆవల ‘పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్’- పిఓకె-లోని బాలాకోట, ముజఫరాబాదు, ఛకోటి వంటి చోట్ల దశాబ్దులుగా ‘విషపుకోరల బీభత్స పిశాచాలకు’ అడ్డాలుగా మారి ఉన్న జిహాదీ స్థావరాలు ధ్వంసమైపోయాయి. ‘‘పదిహేను నిముషాల క్రితం’’వరకు తోడేళ్లవలె నక్కి ఉండిన, ఆధీన రేఖను అతిక్రమించి మనవైపునకు చొరబడడానికి సిద్ధంగా ఉండిన వందలాది పాకిస్తానీ బీభత్సకారులు ‘్భరతీయ సత్వర న్యాయప్రక్రియ’ పదహైను నిముషాలపాటు జరిపిన ఈ ‘గగన సాయుధ చికిత్స’- ఎయిర్ సర్జికల్ స్ట్రయిక్- తరువాత కుక్కిన పేనులు....!! కోరలు తెగిన పిశాచాలు, నడుములు విరిగిన నరరూప నిశాచరులు......
పుల్వామాలో మన పోలీసులను చంపించిన ‘జాయిష్ ఏ మొహమ్మద్’ ముఠా వారిని పాకిస్తాన్ ప్రభుత్వం తయారుచేసింది, మన దేశంలోకి ఉసిగొల్పుతోంది. పదునాలుగవ తేదీన జరిగిన జిహాదీ దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నది ఒకరిద్దరయినప్పటికీ వారిని నడిపించిన ‘జెఇఎమ్’ ముఠాలోని మొదటి హంతకుడు అఝార్‌మసూద్. అఝార్ మసూద్ గతంలో మన దేశంలో వివిధ భయంకర హత్యాకాండలను జరిపించినవాడు. ఈ మసూద్ ముష్కరుడిని చైనా ప్రభుత్వం ఐక్యరాజ్యసమితిలోను, అంతర్జాతీయ వేదికల మీద వెనకేసుకొని వస్తోంది. అఝార్ మసూద్‌ను ‘అంతర్జాతీయ బీభత్సకారుడి’గా ప్రకటించాలన్న తీర్మానం ‘ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి’లో ఏళ్లతరబడి చర్చజరుగుతోంది. అయినప్పటికీ అఝార్‌మసూద్‌ను అంతర్జాతీయ బీభత్సకారుడిగా ప్రకటించే తీర్మానం నెగ్గలేదు. కారణం చైనా ఈ తీర్మానాన్ని వ్యతిరేకించడం, ‘నిరోధక నిర్ణయ’- వీటో- అధికారం గల చైనా ప్రభుత్వం ‘మండలి’లో బ్రిటన్ ఫ్రాన్స్ అమెరికాలు ప్రతిపాదించిన ఈ తీర్మానాన్ని అడ్డుకుంటోంది. ఇలా చైనా ప్రభుత్వం అఝార్ మసూద్ ముఠా మన దేశంలో నడిపిస్తున్న జిహాదీ బీభత్సకాండను ప్రేరేపిస్తోంది. అవన్తిపురా బీభత్సకాండ నిర్వహించినవారు- కర్తలు- మసూద్ ముఠావారు, నిర్వహింప చేసిన బీభత్సవ్యవస్థ- కారయితే- పాకిస్తాన్ ప్రభుత్వం. ‘ప్రేరక’ పాత్రధారి చైనా! ‘‘శభాష్’’అని అంటూ జిహాదీ బీభత్సకారుల చర్యను మెచ్చకుంటున్నవారు జమ్మూకశ్మీర్‌లోని ‘హురియత్’ తదితర విచ్ఛిన్న సంస్థలవారు, దేశద్రోహులు! సోమవారం తెల్లవారుజామున బ్రహ్మీముహూర్త సమయంలో మన వైమానిక దళం జరిపిన ‘సాయుధ చికిత్స’ ఈ నలుగురికీ-కర్త, కారయితే, ప్రేరకులు, అనుమోదకులు, జెఇఎమ్, పాకిస్తాన్ ప్రభుత్వం, చైనా, హురియత్- మన ప్రభుత్వం విధించిన తగిన దండన. ఎందుకంటే ‘‘చేసినవాడు, చేయించినవాడు, ప్రేరకుడు, ఆమోదించినవాడు, ఈ నలుగురూ మంచి చేయడంలోకాని చెడుచేయడంలో కాని సమాన భాగస్వాములు...‘‘ కర్తా కారయితా చైవ ప్రేరకాశ్చనుమోదకః సుకృతౌ దుష్కృతౌశ్చైవ తత్వారః సమభాగినః’’-అన్నది సనాతన సత్యం. అందువల్ల సోమవారం మన వైమానిక దళం జరిపిన ‘‘చికిత్స’’ ఈ నలుగురినీ శిక్షించగలిగిన న్యాయ ప్రక్రియ....
‘‘ఎన్ని ఉపకారాలు చేసినప్పటికీ దుర్జనుడు తన దుర్మార్గ ప్రవర్తనను మానుకోడు, వాడుచేసిన దుర్మార్గానికి ప్రతిక్రియగా వాడికి అపకారం జరిగినప్పుడు మాత్రమే బీభత్సకారుడైన దుర్జనుడు అణగిపోతాడు’’-- ‘‘శామ్యేత్ ప్రత్యపకారేణ, నోపకారేణ దుర్జనః’’-అన్నది క్రీస్తునకు పూర్వంనాటి మహాకవి కాళిదాసు చెప్పిన చారిత్రక సత్యం. క్రీస్తునకు పూర్వం పదునాలుగవ శతాబ్దినుంచి మన దేశంలోకి చొఱబడి బీభత్సకాండను సాగించిన విజాతీయ బర్బరమూకలను క్రీస్తునకు పూర్వం పదమొడవ శతాబ్దిలో భారత సమ్రాట్ శుంగవంశపు పుష్యమిత్రుడు తిప్పికొట్టాడు. భారతీయ సైనిక పటిమ దురాక్రమణ శక్తికాదు, కాలేదు, కాబోదు. కానీ దురాక్రమణ జరిపిన బీభత్సమూకలను ప్రతిఘటించి, పరాభవం పాలుచేయగల సజ్జనశక్తి భారతీయ సైనిక శక్తి! మన వైమానిక దళం ఈ చారిత్రక వాస్తవాన్ని తన ‘చికిత్స’ద్వారా మరోసారి ధ్రువపరిచింది. పుష్యమిత్రుని ‘‘సత్వర న్యాయ ప్రక్రియ’’వల్ల నాలుగు శతాబ్దులపాటు విదేశీయ బీభత్సకారులు మన దేశంలోకి చొఱబడే సాహసానికి ఒడిగట్టలేదు. క్రీస్తునకు పూర్వం ఏడవ శతాబ్దిలో మన దేశంలోని చొఱబడి దగ్ధకాండ విధ్వంసకాండ బీభత్సకాండ సాగించిన మ్లేచ్ఛ మూకలను నాటి కశ్మీర్ రాజు మిహిరకులుడు ‘సాయుధ చికిత్స’ ద్వారా తరిమికొట్టడం కూడ చరిత్ర. ఈ చరిత్ర పదే పదే పునరావృత్తికి గురికావడం కూడ ఆ తరువాతి రెండు సహస్రాబ్దుల చరిత్ర! దీనికి పరాకాష్ఠ క్రీస్తుశకం పదిహేడవ శతాబ్దినాటి ఛత్రపతి శివాజీ మతోన్మాద జిహాదీ బీభత్సకారులను అణచివేయడం. బ్రిటన్ విముక్త భారత్‌లో పాలకులు ఈ చారిత్రక పాఠాన్ని విస్మరించడం జాతీయ వైపరీత్యం... గత నాలుగున్నర సంవత్సరాలుగా మన ప్రభుత్వం ఈ చారిత్రక పాఠాన్ని పాటిస్తోంది. సరిహద్దులనుదాటి వచ్చి హత్యాకాండ సాగించిన చైనా తొత్తులను మన సైనికులు బర్మాలోకి చొచ్చుకోని వెళ్లి శిక్షించి వచ్చారు. పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్‌లో తిష్ఠ వేసి ఉన్న ‘రక్తం తాగే రాక్షసుల’ను కూడ మన ప్రభుత్వం సాయుధ చికిత్స ద్వారా శిక్షించడం ఇది మూడవసారి. ఈ నాలుగు ‘సాయుధ చికిత్స’లూ చారిత్రక పాఠాలకు ఆధునిక పునరావృత్తి.... ‘‘శామ్యేత్ ప్రత్యేపకారేణ, నోపకారేణ దుర్జనః!’’
బీభత్సకాండ జరిపిన దుర్మార్గులను మన ప్రభుత్వం దశాబ్దుల తరబడి పట్టుకుంటూనే ఉంది, న్యాయస్థానాల ఎదుట నిలబెడుతూనే ఉంది. కానీ అఝార్ మసూద్, హఫీజ్ సరుూద్, దావూద్ ఇబ్రహీం వంటివారు పట్టుబడడం. వారిని పట్టి అప్పగించాలని కొన్నాళ్లు... వారిని పాకిస్తాన్‌లోనే విచారించి శిక్షించాలని మరి కొన్ని ఏళ్లు మన ప్రభుత్వం కోరింది. దశాబ్దులు జరిగిపోయాయి, న్యాయం జరగలేదు. దోషులకు దండన లభించలేదు. లభించకుండా పాకిస్తాన్‌లో పాలకులుగా చెలామణి అవుతున్న ప్రచ్ఛన్న జిహాదీ హంతకులు అడ్డుతగులుతున్నారు! ఇమ్రాన్‌ఖాన్ అన్నవాడు ఇలాంటి ప్రచ్ఛన్న బీభత్సకారుడు, అందువల్లనే మన ప్రభుత్వం ‘సాయుధ చికిత్స’ ద్వారా సత్వర న్యాయ ప్రక్రియకు పూనుకొంది....
సమరార్ణవ తరంగాలు
సైనికులై ఉప్పొంగెను,
దనుజ నీతి దమన శిఖల
దావాగ్నుల ముంచెత్తెను....
బీభత్స పిశాచమైన
పాకిస్తాన్‌కిది పాఠం,
భరతాంబిక గృహసీమను
రక్షించుటకిదె మార్గం!

***