సంపాదకీయం

అయోధ్య.. సయోధ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యత్నే కృతే యది నసిద్ధ్యతి కోత్ర దోషః?- అన్నది దాదాపు రెండు సహస్రాబ్దులకు పూర్వం భర్తృహరి మహాకవి సంధించిన ప్రశ్న. ‘కార్యసిద్ధి జరుగకపోయినప్పటికీ కార్యసాఫల్యంకోసం ప్రయత్నించడంలో తప్పేమిటి?’అన్నది ప్రశ్న. ఈ ప్రశ్నను తరతరాలుగా మానవ ప్రయత్న సాఫల్యం మీద విశ్వాసం ఉన్నవారు అడుగుతూనే ఉన్నారు, భర్తృహరికి పూర్వం భర్తృహరి తరువాత ఈ ప్రశ్న ఉదయించింది, వైయక్తిక ప్రయోజనాన్ని ఆశించినవారు సమాజ సమష్టి హితాన్ని ఆకాంక్షించినవారు ఈ ప్రశ్నను పదే పదే అడిగారు, పదే పదే అడగనున్నారు. ‘సర్వోన్నత న్యాయస్థానం’వారు మంగళవారం మరోసారి ఈ ప్రశ్నను వేశారు. అయోధ్య రామజన్మభూమి స్థల వివాదం పరిష్కరించడానికి న్యాయస్థానం వారు సూచించిన మార్గం మధ్యవర్తిత్వం. అది రామజన్మభూమి అని అంటున్న వారికి, అది రామజన్మభూమి కాదంటున్నవారికి మధ్య దశాబ్దుల తరబడి కొనసాగుతున్న వివాదాన్ని వివాదానికి సంబంధించిన అన్ని పక్షాలువారు చర్చల ద్వారా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలన్నది సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం చేసిన తాత్కాలిక నిర్ధారణ. ఈమధ్యవర్తిత్వం ఫలించినట్టయితే న్యాయ ప్రక్రియతో నిమిత్తం లేని సయోధ్య- ఔట్ ఆఫ్ కోర్ట్ సెటిల్‌మెంట్- ఏర్పడుతుంది. రామజన్మభూమి మందిర నిర్మాణ న్యాస్‌వారు, నిర్మోహ్ ఖాడావారు, సున్నీ వక్ఫ్ మండలి వారు, ఇంకా ఈ వివాదం తమకు అనుకూలంగా పరిష్కారం కావాలని కోరుతున్న అనేక సంస్థలవారు ఉద్యమకారులు చర్చలు జరపడం ద్వారా సమస్యను పరిష్కరించుకున్నట్టయితే అయోధ్యలో నిజమైన సయోధ్య ఏర్పడుతుంది. సర్వోన్నత న్యాయస్థానంవారు వాదప్రతివాదాలు విన్న తరువాత తీర్పు చెప్పినట్టయితే ఓడిన పక్షంవారు కలత చెందడం సహజం... గెలిచిన వారిపై కక్ష పెంచుకొనడానికి అది అవకాశం. పరస్పరం చర్చల ద్వారా అఖిలపక్ష ఆమోదంతో అయోధ్యలో శాశ్వత సయోధ్య ఏర్పడినట్టయితే దేశప్రజలందరి మధ్య సౌహార్దం నెలకొంటుంది, భరత మాత బిడ్డ మధ్య మళ్లీ సాదర్యం పెంపొందుతుంది. అందువల్లనే బహుశా సర్వోన్నత న్యాయస్థాన రాజ్యాంగ ధర్మాసనంవారు అయోధ్య వివాద పరిష్కారానికి మరోసారి మధ్యవర్తిత్వాన్ని సూచిస్తున్నారు.
గతంలో అలహాబాదు ఉన్నత న్యాయస్థానంవారు తీర్పు చెప్పక పూర్వం ఒకసారి, తీర్పును చెప్పిన తరువాత మరోసారి మధ్యవర్తిత్వం ద్వారా వివాద పరిష్కారానికి ప్రయత్నాలు జరిగాయి, విఫలమయ్యాయి. అందువల్ల ఇప్పుడు మళ్లీ మధ్యవర్తిత్వం నెరపడంవల్ల ‘సయోధ్య’ ఏర్పడగలదన్న హామీలేదు. అయినప్పటికీ మధ్యవర్తిత్వం ఫలించే అవకాశం ఒక శాతం మాత్రమే ఉన్నప్పటికీ కూడ, మరో ప్రయత్నం చేయడం మంచిదన్నది సర్వోన్నత న్యాయస్థానం వారి అభిప్రాయం... ‘‘యత్నేకృతే యది నసిద్ధ్యతి కోత్ర దోషః?’’
ఇది కేవలం ‘భూమి’కి లేదా ఆస్తికి సంబంధించిన తగాదా మాత్రమే కాదన్నది సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన మరో మంచి మాట. ఈ వివాదం పరిష్కారంకోసం ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం- జనవరి ఎనిమిదవ తేదీన- ఏర్పడినప్పుడే అయోధ్య వివాదం పరిధి కేవలం ఆస్తితగాదాకు సంబంధించినది కాదని మరింత విస్తృతమైనదని స్పష్టమైంది. అంతకు పూర్వం సెప్టెంబరు ఇరవై ఏడవ తేదీన అలహాబాద్ ఉన్నత న్యాయస్థానం తీర్పును వ్యతిరేకిస్తూ దాఖలయిన- అయోధ్య న్యాయ యాచిక- అప్పీల్-లను విచారించడానికి కేవలం ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఏర్పడింది. ‘‘రామజన్మభూమి- బాబరీ మసీద్’’ వివాదాన్ని భూమి తగాదాకు సంబంధించిన అనేకానేక ‘పౌర వివాదాల- సివిల్ సూట్స్- వలెనే విచారించి నిర్ధారిస్తామని గత ఏడాది ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన అప్పటి ప్రధాన న్యాయమూర్తి దీపక్‌మిశ్రా, న్యాయమూర్తులు అశోక్ భూషణ్, ఎస్. అబ్దుల్ నజీర్ స్పష్టం చేశారు. ఈ అయోధ్య వివాదానికి ఆస్తితగాదాకంటె విస్తృతమైన సాంస్కృతిక చారిత్రక ప్రాధాన్యం లేదన్నది ప్రధాన న్యాయమూర్తి దీపక్‌మిశ్రా నాయకత్వంలోని ధర్మాసనం చేసిన నిర్ణయంలోని ధ్వని. ఇందుకు అనుగుణంగా ఈ వివాదాన్ని ‘ఐదుగురు సభ్యుల’ విస్తృత- రాజ్యాంగ- ధర్మాసనానికి నివేదించడానికి ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని ధర్మాసనం వారు గత ఏడాది సెప్టెంబరు 22వ తేదీన తిరస్కరించారు. అందువల్ల ఈ వివాదాన్ని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలని గత నెల ఎనిమిదవ తేదీన సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ నిర్ణయించడం ప్రాధాన్యాన్ని సంతరించుకున్న పరిణామం. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్, న్యాయమూర్తులు ఎస్‌ఏ బాబ్దే, డివై చంద్రచూడ్, ఆలోక్‌భూషణ్, ఎస్.అబ్దుల్ నజీర్ మంగళవారం చేసిన ‘మధ్యవర్తిత్వ నిర్ణయం’లో ఈ చారిత్రక సాంస్కృతిక జాతీయ భావ విస్తృత ప్రాధాన్యం ధ్వనించింది....
మన దేశం అనాదిగా ఒక జాతిగా ఒకే జాతిగా పరిఢవిల్లుతోంది. వివిధ సమయాలలో వివిధమైన పేర్లు ఈ జాతికి ఏర్పడినాయి. సనాతన- శాశ్వత-జాతి, అజనాభం- సృష్టిలో మొదటి మానవుడు సంచరించిన స్థలం-, భారతజాతి, హిందూ జాతి అన్నవి ఈ వివిధ నామాలు. పేర్లు ఏవయినప్పటికీ ఈ జాతీయ సమాజ సంస్కారం స్వభావం అనాదిగా ఒక్కటే. ఈ అద్వితీయ జాతీయతకు ఏ ఒక్క మతం కాని ప్రాతిపదిక కాలేదు, ఈ జాతీయత ఏ ఒక్క మతానికి పరిమితం కాలేదు. వివిధ మతాల అసంఖ్యాక వైవిధ్యాల సర్వసమగ్ర సమాహారంగా ఈ భారత జాతీయత, లేదా హైందవ జాతీయత పరిఢవిల్లడం యుగయుగాల చరిత్ర. కొన్ని మతాలు పుట్టక పూర్వం కొన్ని మతాలు గిట్టిన తరువాత కూడ ఈ హైందవ జాతీయత లేదా భారత జాతీయత అనాదిగా వికసించింది.
ఈ స్వజాతీయ వికాస క్రమంలో మతాలు, భాషలు, ఆచారాలు, విభిన్న వ్యవహారాలు ఏర్పడినాయి. వేల మంది మహాపురుషులు జన్మించారు, అసంఖ్యాక సముత్కర్ష సంస్కారాలు వికసించాయి. ఏ మతం వారికైనా ఏ భాష మాట్లాడే వారికైన సముత్కర్ష సంస్కార ప్రదాతలైన మహాపురుషులు వందనీయులయ్యారు, అనుసరణీయులయ్యారు. రఘురాముడు యదుకుల కృష్ణుడు, ఆదిశంకరాచార్యుడు, విక్రముడు, శాలివాహనుడు, ఛత్రపతి శివాజీ, మహాత్మాగాంధీ, అబ్దుల్‌కలాం వంటివారు ఈ అసంఖ్యాక మహనీయుల పరంపరలోని కొందరు మాత్రమే. వీరందరూ ఈ దేశంలోని అన్ని మతాలవారి సమాన సాంస్కృతిక వారసత్వానికి చారిత్రక ప్రతీకలు. శైవ మతము, వైష్ణవ మతము, అద్వైత స్మార్త మతము వంటి వేద మతాలు బౌద్ధమతం జైన మతం వంటి అవైదిక మతాలు ఈ దేశంలో పుట్టిపెరగడం చరిత్ర. ఈ మతాలవారందరూ తమ ‘మత’ విభేదాలకు అతీతంగా జాతీయ సాంస్కృతిక వారసత్వాన్ని- భారతీయతను లేదా హిందుత్వాన్ని-సమానంగా స్వీకరించి పెంపొందించారు. కొన్ని మతాలు వివిధ దేశాలనుంచి వ్యాపించడంవల్ల ఆ ‘వ్యాప్తి’కి పూర్వం లక్షల ఏళ్లుగా కొనసాగిన జాతీయత మారదు. జాతీయ సంస్కృతి మారదు, సాంస్కృతిక వారసత్వం మారదు. అందువల్ల స్వదేశంలో పుట్టిన పెరిగిన మతాలవారు మాత్రమేకాక విదేశాలనుంచి మన దేశానికి విస్తరించిన ‘ఇస్లాం’, ‘క్రైస్తవం’వంటి వారుకూడ అనాది జాతీయతలో సమాన భాగస్వాములు. ఇలా ఇస్లాం మతస్థులు, క్రైస్తవ మతస్తులు కూడ ‘్భరత జాతి’లో లేదా ‘హిందూ జాతి’లో భాగం!
ఈ వాస్తవానికి ఈ దేశ ప్రజలందరూ అంగీకరించడం సహజం, అంగీకరించకపోవడం అన్యాయం, అసహజం. అందువల్ల ‘రఘురాముడు’ అన్ని మతాల వారికి తరతరాలుగా సంస్కార ప్రదాత, స్ఫూర్తిప్రదాత, ఆరాధ్యుడు, సాంస్కృతిక వారసత్వ పథంలో అన్ని మతాలవారికి సమానంగా పూర్వజుడు, భరతమాత వరాల బిడ్డడు. రఘురాముడు అయోధ్యలో పుట్టిపెరగడం చారిత్రక వాస్తవం. ఆ రఘురామునికి దేశ ప్రజలు-అన్ని మతాలతో కూడిన స్వజాతి ప్రజలు- నిర్మించిన మందిరాన్ని విదేశాలనుంచి చొఱబడిన బాబర్ అనే మొఘలాయి జిహాదీ బీభత్సకారుడు ధ్వంసం చేయించడం కూడ చారిత్రక వాస్తవం! అన్ని మతాలవారు ఈ జాతీయ చారిత్రక వాస్తవ భూమికపై నిలబడి ఆలోచించాలి. ఈ ‘మథనం’ సర్వోన్నత న్యాయస్థానం నిర్దేశించిన మధ్యవర్తిత్వానికి ప్రాతిపదిక కావాలి!