సంపాదకీయం

వన జనులకు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్వోన్నత న్యాయస్థానం వారి ఫిబ్రవరి 13వ తేదీనాటి తీర్పు ప్రాతిపదికగా ఘోరమైన అన్యాయానికి గురికావలసి ఉండిన లక్షలాది వనవాసీ ప్రజలకు ఆ ప్రమాదం తాత్కాలికంగా తప్పిపోయింది. ఫిబ్రవరి పదమూడవ తేదీనాటి తమ తీర్పు అమలును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు తదుపరి విచారణను కొనసాగించనున్నట్టు ఫిబ్రవరి 28వ తేదీ సర్వోన్నత న్యాయస్థానం నిర్దేశించడం ప్రమాదం తప్పిపోవడానికి ప్రాతిపదిక. ఈ ఫిబ్రవరి పదమూడవ తేదీనాటి సర్వోన్నత న్యాయ నిర్ణయం జరిగినట్టయితే ‘అనుసూచిత సముదాయాల’- షెడ్యూల్డ్ ట్రయిబ్,- ఎస్‌టిలు,- ఇతర సంప్రదాయ అటవీ సముదాయాలకు చెందిన దాదాపు పదకొండు లక్షల ఏబయివేల వనవాసీ కుటుంబాలవారు నిలువ నీడను కోల్పోయి ఉండేవారు. వీరందరూ అటవీ ప్రాంతంలోకి అక్రమంగా చొరబడి జీవిస్తున్నట్టు సర్వోన్నత న్యాయస్థానం ఫిబ్రవరి పదమూడవ తేదీన నిర్ధారించింది. ‘‘వైల్డ్ లైఫ్ ఫస్ట్’’అన్న సంస్థ మరికొందరు దాఖలుచేసిన ‘న్యాయ యాచికలు’ ఈ నిర్ధారణకు ప్రాతిపదికలు. 2008లో దాఖలయిన ఈ ‘న్యాయ యాచికల’ విచారణ సమయంలో వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు కాని, కేంద్ర ప్రభుత్వం కాని సరైన వివరాలను అందించకపోవడం, శ్రద్ధతో వాదనలను వినిపించకపోవడం సర్వోన్నత న్యాయస్థానంవారు చేసిన నిర్ధారణలో వనవాసీ ప్రజలకు నిహితమై ఉన్న అన్యాయానికి కారణం. వనవాసీ సమాజానికి చెందిన ‘అనుసూచిత సముదాయాల’ - ఎస్‌టిలు- ‘ఇతర సంప్రదాయ అటవీ ఆధార సముదాయాల’ - అదర్ ట్రడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్- ఓటిఎఫ్‌డి- జీవన అధికారాలను పరిరక్షించడానికి వీలుగా 2006లో రూపొందిన చట్టం సక్రమంగా అమలు జరుగకుండా వివిధ రకాల ‘దళారీ’లు అడ్డుపడుతుండడం చరిత్ర. వనవాసీ ప్రజలకున్న రెండురకాల అధికారాలను చట్టంలో నిర్దేశించారు. వ్యక్తిగతమైన అటవీ అధికారాలు- ఇండివిడ్యువల్ ఫారెస్ట్ రైట్స్- మొదటివి, సాముదాయిక అటవీ అధికారాలు- కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్- రెండవ తరగతికి చెందినవి. ఈ చట్టం ప్రకారం అనాదిగా అడవులలో జీవిస్తున్నవారు ‘అనుసూచిత సముదాయాల’వారు. 2005నాటికి పూర్వం కనీసం మూడు తరాలుగా అంటె 1930నుంచి అడవులలో స్థిరపడి ఉన్నవారు ‘ఇతర సంప్రదాయ సముదాయాలవారు.’ ‘అనుసూచిత సముదాయాల వారు’, ‘సంప్రదాయ సముదాయాలవారు’ సమానంగా వనవాసీ ప్రజలన్నది ‘చట్టం’లోని స్ఫూర్తి. ఈ వనవాసీ ప్రజల నీరు- జల్-, నేల - జమీన్-, అడవి- జంగల్- ఇతరుల దోపిడీకి గురికాకుండా నిరోధించాలన్నది దశాబ్దుల తరబడి జరిగిన స్వదేశీయ ఉద్యమాలకు ప్రాతిపదిక. ‘అఖిల భారతీయ వనవాసీ కల్యాణ్ ఆశ్రమ్’వంటి జాతీయ స్వచ్ఛంద సంస్థలు వనవాసీ ప్రజల సంక్షేమానికి, అభ్యుదయానికి అవిరళ కృషిచేస్తున్నాయి. 2006లో వనవాసుల హక్కుల పరిరక్షణ చట్టం రూపొందడానికి ఇదంతా నేపథ్యం....
ఈ చట్టం సక్రమంగా అమలు జరిగినట్టయితే వివిధ ముఠాల దళారీలు, దోపిడి మూకలు, మతం మార్పిడి చేస్తున్నవారు, స్వచ్ఛంద సంస్థల ముసుగులో ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’ అక్రమ ప్రయోజనాలను పరిరక్షిస్తున్న దేశ విద్రోహులు అటవీ సంపదను యధేచ్ఛగా కొల్లగొట్టడానికి అవకాశాలు తగ్గిపోతాయి. అందువల్ల కొన్ని స్వచ్ఛంద సంస్థలు 2006నాటి చట్టాన్ని వ్యతిరేకించాయి. దశాబ్దులుగా ‘వనవాసీలు’కానివారు అటవీ ప్రాంతాలలో స్థిరపడి ‘వనవాసీలు’గా గుర్తింపుపొందడానికి ప్రయత్నించారు. వేలమంది నకిలీ ‘‘వనవాసులు’’ నిజమైన వనవాసులుగా గుర్తింపుపొంది ఉన్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అందువల్ల ‘నకిలీ’లను అటవీ ప్రాంతంనుండి వెళ్లగొట్టాలన్న సర్వోన్నత న్యాయస్థానంవారి ఆకాంక్ష అభినందనీయం. ‘‘వనవాసులు కానివారిని అటవీ ప్రాంతంనుంచి వెళ్లగొట్టడం అనివార్యం. రెండు తరగతుల ‘వనవాసీ’ ప్రజల హక్కుల రక్షణ ప్రధానం... అటవీ పరిరక్షణ కూడ’’అన్నది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన సర్వోన్నత న్యాయమూర్తులు అరుణ్‌మిశ్ర, నవీన్ సిన్హ, ఎమ్‌ఆర్ షా చేసిన స్పష్టీకరణ.
నిజానికి ‘నకిలీ’లు మైదాన ప్రాంతంనుండి చొఱబడి స్థిరపడి స్థిరపడని అతి తెలివైనవారు, అక్షరాస్యులు, వ్యాపారులు, దళారీలు, భూమిని దురాక్రమించగలవారు, స్వజాతీయ మతాలవారిని విదేశాలనుంచి వ్యాపించిన మతాలలోకి మార్పడి చేయగలవారు. వీరంతా నకిలీ సాక్ష్యాధారాలను ధ్రువపత్రాలను కల్పించుకొని అధికారులకు నివేదించి వనవాసులుగా నమోదయిపోయారు. కానీ మారుమూలలలోని అడవులలో నివసిస్తున్న ‘అనుసూచిత’, ‘సంప్రదాయ’ సమూహాలకు చెందిన నిజమైన వనవాసులలో అత్యధికులు నిరక్షరాస్యులు, చట్టం గురించి తెలియనివారు. ఈ అనభిజ్ఞ, అమాయక వనవాసీలకు చట్టం ప్రకారం అధికార కార్యాలయాలకు వెళ్లి ‘నమోదు’చేసుకోవాలన్న ధ్యాసకూడా లేదు. ఫిబ్రవరి పదమూడవ తేదీనాటి సర్వోన్నత న్యాయ నిర్ణయం ప్రాతిపదికగా అడవులనుంచి నిర్వాసితులుగానున్న వారిలో ఇలాంటి నిజమైన వనవాసీ ప్రజలే అత్యధికులు. అందువల్లనే పదమూడవ తేదీనాటి తీర్పును సమీక్షించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం ‘న్యాయ యాచిక’ను దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ‘అఖిల భారత వనవాసీ కల్యాణ్ ఆశ్రమ్’వారు ఫిబ్రవరి ఇరవైనాలుగవ తేదీన విజ్ఞప్తిచేశారు. ఇతర స్వచ్ఛంద సంస్థలు కూడ ఇదే ఆకాంక్షను వ్యక్తంచేశాయి. ఫిబ్రవరి 27న కేంద్ర ప్రభుత్వం ‘సమీక్షా యాచిక’ను దాఖలుచేసింది. ఈ ‘యాచిక’ ప్రాతిపదికగా సర్వోన్నత న్యాయస్థానం పదమూడవ తేదీనాటి తీర్పు అమలును తాత్కాలికంగా నిలిపివేసింది. నిజమైన వనవాసులు ఎవరో నకిలీలు ఎవరో నిర్ధారించడం కష్టంకాదు. కానీ నాలుగు నెలల కాల వ్యవధిలో ఈ పని జరగడం అసాధ్యం. లోక్‌సభ ఎన్నికలు జరిగి కొత్త సభ ఏర్పడేవరకు వివరాలను సేకరించడం కూడ అధికారులకు సాధ్యంకాదు. అందువల్ల కాల వ్యవధిని పెంచాలి. వనవాసీ ప్రజలను ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పరాదు. ఉద్యోగులు, అధికారులు -జనగణన సమయంలోవలె- వనసీమలలో ప్రతి జనావాసానికి వెళ్లి వివరాలను సేకరించాలి. అటవీ భూమిని పారిశ్రామిక కాలుష్య కేంద్రీకరణకోసం కేటాయిస్తున్నందువల్ల, కలపను దొంగరవాణా చేస్తున్న ముఠాలవల్ల, వన్యప్రాణులను హత్యచేస్తున్న వారివల్ల మాత్రమే నిరంతరం అటవీ హననం జరుగుతోంది. ఆవు పొదుగునుండి పాలను పిండుకుంటున్నట్టుగా అటవీ సంపదను ఉపయోగించుకొని యుగయుగాలుగా జీవనయాత్ర సాగిస్తున్న ‘వనవాసుల’వల్ల అడవి తల్లిని నిరంతరం ఆరాధిస్తున్న సనాతన సంస్కృతి నిబద్ధులవల్ల అడవులకు హాని జరగడంలేదు, మేలు జరుగుతోంది. అడవిని ప్రకృతిని ఆరాధించడం సనాతన- శాశ్వత- వేద సంస్కృతి, భారతీయ సంస్కృతి, హైందవ జాతీయ సంస్కృతి. వనవాసీ ప్రజలు ఈ అనాది సంస్కృతికి విశిష్ట ప్రతీకలు.... భరతమాత వరాల బిడ్డలు.
తొలి మానవుడు భారతదేశంలో జన్మించడం ప్రపంచ ప్రస్థాన క్రమానికి ఆరంభం... ఈ ఆరంభం ‘తుది మొదలు’లేని సృష్టిక్రమంలో పునరావృత్తి! ఇలా భారతదేశంలోనే తొలిసారి మానవులు ఏర్పడినాడు, ప్రథమ మానవీయ సంస్కారాలు వికసించాయి, సంస్కృతి పల్లవించింది. భారతదేశంనుంచి వివిధ సమయాలలో మానవులు ప్రపంచం నలుమూలలకు విస్తరించడం చారిత్రక వాస్తవం. ఈ వాస్తవాన్ని మన దేశాన్ని దురాక్రమించిన సమయంలో బ్రిటన్ ముష్కరులు వక్రీకరించారు. భారతీయులు ఇతర దేశాలనుంచి వివిధ సమయాలలో ఇక్కడికి వలస వచ్చారన్న అబద్ధాలను ప్రచారంచేసి వెళ్లారు. ఈ ప్రచారంనుండి మనం ప్రధానంగా విద్యావిధానం ఇప్పటికైనా విముక్తిని పొందడం జాతీయ సమైక్య రక్షణ అనివార్యం. అనాదిగా ఈ దేశంలో వికసించిన జాతీయ జీవనంలో వనవాసులు, గ్రామీణులు, పట్టణవాసులు, నగరవాసులు ఏర్పడినారు. అందువల్ల వనవాసుల జీవన పరిరక్షణ పరిపోషణ సమగ్ర జాతీయ భాగస్వామ్య వికాసానికి వౌలికమైన అంశం. దళారుల, అక్రమ పారిశ్రామిక వ్యాపార శక్తుల, మతం మార్పిడి మూకల, ‘నకిలీ’ల దురాక్రమణ నుండి వనవాసుల జీవన సంస్కృతిని, ప్రగతిని పరిరక్షించడం ప్రభుత్వాల కర్తవ్యం... దేశ ప్రజలందరి కర్తవ్యం.