సంపాదకీయం

రైలు ‘భాష’ణ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భాషా వైవిధ్యాలు భాషా వైరుధ్యాలుగా విస్తరించడానికి ‘రైలు రాజకీయాలు’ దోహదం చేస్తుండడం నడిచిపోతున్న మంత్రాంగం... విశాఖపట్టణం కేంద్రంగా ఉండిన- వాలుతేరు (వాల్తేరు)- రైలు విభాగం- ‘డివిజన్’-ను రెండుగా విడగొట్టడం భాషా వైరుధ్య స్ఫురణను మరోసారి కలిగించిన విపరిణామం! విశాఖపట్టణం ‘రైలు క్షేత్రం’- రైల్వే డివిజన్- అవతరించింది. కానీ, విశాఖపట్టణం ‘రైలు విభాగం’-డివిజన్- అంతరించింది. ఇలా అంతరించి పోవడంలో భాషావైరుధ్యం నిహితమై ఉండడం నిరాకరింపజాలని నిజం! తెలుగు, ఒరియా భాషల ప్రజల మధ్య వారథిగా ఉండిన ‘వాలుతేరు విభాగం’ అంతరించడం ఉభయ భాషా జన సముదాయాల, హృదయ వారథిని కూల్చడం వంటిది! ‘రైలు మార్గాలు’ భారత జాతీయ ప్రాదేశిక అనుసంధాన చిహ్నాలన్నది ‘బ్రిటన్ విముక్త’ భారత్‌లో వినబడుతున్న పాఠం. బ్రిటన్ దురాక్రమణదారులు క్రీస్తుశకం 1853లో తొలిసారి రైలు మార్గం నిర్మించినప్పుడు ఆ ‘నిర్మాణ’ లక్ష్యం వేఱు... కానీ ఆ తరువాత రైలుమార్గాలు అఖండ భారత వివిధ ప్రాంతాల మధ్య అనాదిగా ఉన్న అనుసంధాన వ్యవస్థను మరింత విస్తరింపచేయడం చరిత్ర. తమ దురాక్రమణను మన దేశంపై శాశ్వతం చేసుకోవాలన్న లక్ష్యంతో మాత్రమే బ్రిటన్ ముష్కరమూకలు రైలుమార్గాలను నిర్మించారు. సైనిక దళాలను వేగవంతంగా దేశంలోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించుకొని వెళ్ళడానికై బ్రిటన్ వారు ‘ఇనుప దారుల’ను నిర్మించారు. ప్రథమ భారత స్వాతంత్య్ర సమరం 1857-1858లో ప్రారంభమైంది. స్వజాతీయులలో బ్రిటన్ తస్కర తండాల పట్ల వ్యతిరేకత విస్తరించడం, ఈ వ్యతిరేకతను అణచివేయడానికి బ్రిటన్ బీభత్సకారులు రైలుమార్గాలను విస్తరింపచేయడం సమాంతర పరిణామ విపరిణామాలు! మన పంటలను, మన ధాన్యాన్ని, మన కలపను, అటవీ సంపదను, భూగర్భ సంపదను వేగవంతంగా ఇంగ్లాండుకు తరలించుకొని పోవడానికి వీలుగా ప్రధాన ఓడరేవు పట్టణాలను ‘ఇనుపదారుల’తో అనుసంధానం చేయడం బ్రిటన్ వారి మరో ఎత్తుగడ. ఈ ఎత్తుగడల గురించి జాతీయ మహారచయిత బంకించంద్ర ఛటర్జీ తన సమకాలంలో వివరించి ఉన్నాడు. కానీ రహదారులు, రవాణా సౌకర్యాలు అనాదిగా మన దేశంలో ప్రాదేశిక అనుసంధాన వ్యవస్థలుగా వికసించాయి. రాజపథాలు, వృషభ శకట పథాలు, సాధారణ జనులు నడచిన ‘బాటలు’, అమిత వేగంగా రథాలు పరుగులు తీసిన మహారాజ పథాలు, వనసీమలలో సైతం ప్రయాణాన్ని సుగమం చేసిన గిరి మార్గాలు అఖండ భారతదేశమంతటా నెలకొనడం సహస్రాబ్దుల చరిత్ర! అందువల్ల బ్రిటన్ దురాక్రమణదారులు మన దేశానికి రాకపోయి ఉండినప్పటికీ సహజ ప్రగతి పరిణామ క్రమంలో మన దేశంలో రైలుమార్గాలు ఏర్పడి ఉండేవి!
ఈ ‘ఇనుప దారుల’ నిర్మాణ, ఆవిరి యంత్రం ఆవిష్కరణ సమయాలలో మనదేశంపై విదేశాల దోపిడీ దొంగలు పెత్తనం వహించడం అందువల్ల కాకతాళీయం! ఏమయినప్పటికీ బ్రిటన్‌వారు దురాక్రమణ స్థిరీకరణ వాంఛతో నిర్మించ మొదలుపెట్టిన ఇనుపదారులు- రైలుమార్గాలు- ఆ తరువాత భారత జాతీయ ప్రాదేశిక సమగ్రతా పరిరక్షణ పథాలుగా మారాయి. కానీ అనాదిగా జాతీయ భావ సమైక్య మాధ్యమాలుగా పరిఢవిల్లిన భారతీయ భాషలు ప్రాంతీయ వైరుధ్యాలు పెరగడానికి ప్రాతిపదికలు కావడం సమాంతర వ్యతిరేక పరిణామం! వివిధ భారతీయ భాషల ద్వారా ఒకే సంస్కృతి ప్రస్ఫుటించడం మన దేశ చరిత్ర. ఈ భాషా వైవిధ్యాలు పరస్పర పరిపోషకాలై ఒకే జాతిగా మన దేశాన్ని అనాదిగా వికసింపచేశాయి.. బ్రిటన్ బౌద్ధిక బీభత్సకారులు ఈ చరిత్రను ధ్వంసం చేశారు. భాషా వైవిధ్యాలను భాషా వైరుధ్యాలుగా చిత్రీకరించారు. భారతీయ భాషలు మొత్తం ఒకే భాషా కుటుంబానికి చెంది ఉండడం చారిత్రక వాస్తవం. కానీ బ్రిటన్ మేధావులు ‘‘్భరతీయ భాషలు భిన్న భిన్న- పరస్పర విరోధించిన- భాషా కుటుంబాలకు చెందినవి’’ అని అబద్ధాలను చెప్పి వెళ్లారు. ఈ అబద్ధాలను మన విశ్వవిద్యాలయాలలో ఇప్పటికీ వల్లెవేస్తుండడం, విద్యార్థులకు మప్పుతుండడం నడిచిపోతున్న వైపరీత్యం! భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడంతో ఈ భాషా వైరుధ్యాలు మరింతగా ప్రజ్వరిల్లుతున్నాయి. ఒక ‘ప్రాంతం’- రాష్ట్రం, రాజ్యం-లో విభిన్న మతాలవారు, కులాలవారు, సంప్రదాయాలవారు, ఆచార వ్యవహారంలో కలసిమెలసి ఉంటున్నారు. వివిధ భాషలవారు ఒకే ‘ప్రాంతం’-రాష్ట్రం, రాజ్యం-లో కలసిమెలిసి ఎందుకు ఉండరాదు? అందరిదీ ఒకే జాతి- భారత జాతి! అందరిదీ ఒకే సంస్కృతి- హైందవ సంస్కృతి! కానీ ఒక ప్రాంతం నుంచి ప్రధాన భాష తప్ప మిగిలిన భాషలు నిర్మూలనకు గురికావడానికి ‘ భాషా రాష్ట్రాలు’ దోహదం చేశాయి. దీనివల్ల మిగిలిన భాషల కంటె తెలుగు భాష, తెలుగు వారు ఎక్కువగా నష్టపోయారు!
భాషాప్రయుక్త రాష్ట్రాలు కల్పించిన భాషా వైరుధ్యాలకు కొంతైనా విరుగుడు రైలు వ్యవస్థ. ఒకే క్షేత్రం- జోన్-లోను, ఒకే ‘విభాగం’- డివిజన్-లోను రెండు, మూడు భాషలు మాట్లాడే ప్రజలు ఉండేవారు. 1980వ దశకం వరకు ‘తొమ్మిది రైలు క్షేత్రాలు’ మాత్రమే ఉండేవి. ఇప్పుడు పద్దెనిమిదికి పెరిగాయట! వికేంద్రీకరణ జరగడం వల్ల ‘పాలన’ ప్రజలకు మరింత చేరువకాగలదు. అందువల్ల ‘జోన్’లు పెరిగినకొద్దీ రైళ్ల నిర్వహణ కూడ ప్రజలకు చేరువ అవుతుందన్నది ఆకాంక్ష! కానీ వికేంద్రీకరణ జరుగుతున్నకొద్దీ రైళ్ల వ్యవస్థలో, సేవలలో ప్రభుత్వేతర సంస్థలు చొఱబడుతున్నాయి. విదేశీయ సంస్థలు చొఱబడి దోచుకొనడానికి ప్రభుత్వమే రెండు దశాబ్దుల రంగం సిద్ధం చేసింది. మార్కెట్ ఎకానమీ- స్వేచ్ఛా విపణి- పేరుతో ‘డైనమిక్’- క్రియావేగం-, ‘సర్జ్’- గిరాకీ పెరిగినకొద్దీ శుల్కం పెంచడం- వంటి విచిత్ర నామాలతో ప్రయాణీకులను ‘రైలు వ్యవస్థ’ భయంకరంగా దోచుకొంటోంది. అత్యవసరం రైలు ప్రయాణం చేయదలచినవారు రెండు రెట్లు, మూడు రెట్లు ప్రయాణ శుల్కం చెల్లించవలసి వస్తోంది! ఇంత జరిగినప్పటికీ భయంకరమైన ‘రద్దీ’ రైలు పెట్టెలను, రైలు ప్రయాణాన్ని ఆవహించింది. ఇన్ని జరుగుతున్నప్పటికీ ఒకే ‘జోన్’లో ‘డివిజన్’లో వివిధ భాషా ప్రాంతాలు ఉండడం కొంతైనా సమైక్య భావానికి దోహదకారి! కానీ ఇప్పుడు ‘జోన్’లోను, ‘డివిజన్’లోను సైతం ఒకే భాషాప్రాంతం ఉండాలన్నది నియమమైపోయింది. భాషా ప్రాంతాల ప్రాతిపదికగా ‘విశాఖ’ విభాగాన్ని విడగొట్టడం ఇందుకు నిదర్శనం. ఒక భాషా ప్రాంతం వారి ముఖం మరో భాషా ప్రాంతం వారు చూడరాదన్నది ఈ విభజన ‘స్ఫూర్తి’.. రాయగడ డివిజన్‌ను ఏర్పాటు చేసినప్పటికీ, ఆ ‘డివిజన్’ను విశాఖ ‘జోన్’లోనే కొనసాగించి ఉండవచ్చు గదా! ఈ ‘డివిజన్’ ఏర్పడిన ప్రాంతాలు భువనేశ్వర్‌కు కాక ‘విశాఖ’కు చేరువలో ఉన్నాయి. గుంతకల్లు డివిజన్ హైదరాబాద్‌కు చేరువలో ఉంది. కానీ ఈ ‘డివిజన్’ను ‘విశాఖ’జోన్‌లో కలపడం గొప్ప వైపరీత్యం..
ముంబయిలో రెండు రైలు క్షేత్రాల- మధ్య క్షేత్రం, పశ్చిమ క్షేత్రం- ప్రధాన కార్యాలయాలను ‘కుక్కడం’ కాలుష్యాన్ని పెంచిన కేంద్రీకరణకు నిదర్శనం, బ్రిటన్ దురాక్రమణకారుల వారసత్వం. కలకత్తాలో కూడ రెండు ‘జోన్ల’ప్రధాన కార్యాలయాలను కుక్కేశారు. కానీ ఇప్పుడు కూడ వికేంద్రీకరణ జరగడం లేదు. కేంద్రీకరిస్తూనే ఉన్నారు. విభాగాల ప్రధాన కార్యాలయాలను ఒకే చోట కేంద్రీకరిస్తున్నారు. సికిందరాబాద్‌లో ఒక ‘డివిజన్’ ప్రధాన స్థావరం ఉన్నప్పుడు మళ్లీ హైదరాబాదు పేరుతో మరో డివిజన్ ఎందుకు? వరంగల్లులోనో పాలమూరులోనో వికారాబాదులోనో ఏర్పాటుచేసి ఉండవచ్చు! విజయవాడలోనూ, పక్కనే ఉన్న గుంటూరులోను కూడ ‘డివిజన్’ ప్రధాన కార్యాలయం ఇరుక్కొని ఉండవలసిందేనా? ఒక దాన్ని మరో దూర ప్రాంతానికి తరలిస్తే ఊపిరి ఆడుతుంది కదా!