సంపాదకీయం

రాని ‘హోదా’ ఎవరి ‘ఘనత’?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర ప్రభుత్వం వారు చెప్పిందే పదే పదే చెబుతున్నారు, అవశేష ఆంధ్రప్రదేశ్ ప్రజలు విన్నదే వింటున్నారు. రెండేళ్లుగా జరిగిపోతున్న ప్రహసనం. అందువల్ల నవ్యాంధ్రప్రదేశ్‌కు ఆర్థికంగా ప్రత్యేకమైన హోదా లభించడం లేదని బుధవారం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్పష్టీకరణ నిజానికి పునరుద్ఘాటన మాత్రమే! ఈ పునరుద్ఘాటన అవశేషాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి విద్యుత్‌ఘాతం వంటి విస్మయాన్ని కలిగించడం ఎందుకన్నది జనానికి అంతుపట్టని వ్యవహారం. 2014 జూన్ ఒకటవ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం చెప్పిందొకటి...2014 జూన్ రెండు నుంచి చెబుతున్నది మరొకటి! ఈ రెండూ పరస్పరం విభేదించుకుంటున్న అంశాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా, అవశేష ఆంధ్రప్రదేశ్‌గా 2014 జూన్ రెండున వ్యవస్థీకృతమైంది. కొత్త ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ స్టేటస్ ఆరోజునుండి అత్యంత సహజంగా లభిస్తుందని అంతవరకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన అభిప్రాయం. కానీ ఆ రోజునుండి స్పెషల్ స్టేటస్-ప్రత్యేకమైన హోదా-లభించబోవడం లేదన్న దుర్వార్త ప్రచారమవుతునే ఉంది. ఈ కఠోర వాస్తవం పుటపుటలుగా ప్రచారమైంది. చిటపటలుగా విస్తరించింది. ఇలా విస్తరించిన సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆ చిటపటలపై నీళ్లు చల్లడం చరిత్రలో నమోదై ఉంది! ప్రత్యేకమైన హోదాను ఉమ్మడి రాష్ట్రం పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పొందడం అసాధ్యమని 2014 జూన్‌లోనే అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలిసింది. అందువల్ల విద్యుద్ఘాతం వంటి విస్మయానుభూతి ఆయనకు అప్పుడే కలిగి ఉండాలి! కలగలేదన్నదానికి రెండేళ్ల చరిత్ర సాక్ష్యం. ఆ తరువాత తరువాత ప్రత్యేక ఆర్థిక ప్రతిపత్తి ఇవ్వాలని, ఇవ్వకపోయినట్టయితే కనీసం ప్రత్యేక ఆర్థిక సహాయం భారీగా చేయాలని చంద్రబాబునాయుడు బహిరంగంగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేయడం కూడ చరిత్ర...అంటే ప్రత్యేక ప్రతిపత్తి కోసం పట్టుపట్టబోమని ప్రత్యేక ఆర్థిక సహాయం చేస్తే చాలునని కేంద్రానికి అవశేషాంధ్రప్రదేశ్ ప్రభుత్వాధినేత పరోక్షంగా సూచించినట్టే కదా! అందువల్ల కేంద్ర ప్రభుత్వం కూడ ప్రతిపత్తిని పక్కకునెట్టి ప్రత్యేక సహాయం చేస్తోంది. ఈ ప్రత్యేక ఆర్థిక సహాయం కూడ గత రెండేళ్లలో పదివేల కోట్ల రూపాయలను దాటలేదు. మిగిలిన కేంద్ర నిధులు వసూలైన పన్నులలో రాష్ట్రానికి రావలసిన వాటా మాత్రమే! ఈ వాటా అన్ని రాష్ట్రాలకు లభిస్తోంది..అవశేష ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే కాదు!
ఐదేళ్లపాటు అవశేష ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని ఇవ్వనున్నట్టు 2014 నాటి ఎన్నికలకు పూర్వం ప్రధాన మంత్రి మన్‌మోహన్‌సింగ్ ఇచ్చిన హామీ గురించి ఇప్పుడు ఎవరు ఎవరిని నిలదీయాలి? కాంగ్రెస్ పార్టీని అవశేషాంధ్రప్రదేశ్ ప్రజలు నిలదీయాలి. కాంగ్రెస్ చిరునామా దొరకడంలేదు. కాంగ్రెస్ పార్టీ ఆనవాళ్లు సైతం నవ్యాంధ్రలో లేవు మరి! జాతీయస్థాయిలో సైతం కాంగ్రెస్‌కు ఈ వాగ్దానం సంగతి గుర్తులేదు. అందువల్ల పార్లమెంటు సభలలో కాని బయట కాని కాంగ్రెస్ పార్టీ నవ్యాంధ్రపై ప్రేమను ఒలకబోసేందుకు యత్నించడం లేదు, అభినయం చేయడంలేదు. అభినయ విన్యాసాలను ప్రదర్శించవలసింది కేంద్ర ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న భారతీయ జనతాపార్టీ వారు మాత్రమే! ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భాజపా ప్రాంతీయ నాయకులు కాని, కేంద్ర నాయకులు కాని ఎందుకని గట్టిగా కోరడంలేదు? వ్యూహాత్మక వౌనాన్ని ఎందుకని పాటిస్తున్నారు? తమ కృషి వల్ల మాత్రమే విభజన తరువాత అవశేష ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరుగబోతోందని, తాము సకాలంలో జోక్యం చేసుకోకపోయి ఉండినట్టయితే కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి అన్యాయం చేసి ఉండేదని పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా భాజపా నాయకులు చాటుకున్నారు. రాజ్యసభలో ఈ చాటింపు మరింత గట్టిగా వినపడింది. జనం కూడ దీన్ని విశ్వసించారు. అందువల్లనే ఘోరమైన అన్యాయం చేసిన కాంగ్రెస్‌ను భూస్థాపితం చేసి భాజపాతో జట్టుకట్టిన తెలుగుదేశం పార్టీకి అవశేషాంధ్రులు 2014 నాటి శాసనసభ ఎన్నికలలో పట్టం కట్టారు! ఐదేళ్లపాటు కాదు...పదేళ్ల పాటు నవ్యాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తామని 2014 నాటి ఎన్నికలలో భాజపావారు ప్రచారం చేయలేదా? ఇప్పుడెందుకు నోరు మెదపడం లేదు?
ఆంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తిని కట్టబెట్టడం అసాధ్యమని కేంద్ర ప్రణాళికా సంఘం -ప్లానింగ్ కమిషన్-2014 జూన్ 12న స్పష్టం చేసింది. కొత్త రాష్ట్రాలు ఏర్పడి అప్పటికి పదిరోజులైంది! ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయి వారం కూడా కాలేదు! ప్రణాళికా సంఘం స్పష్టీకరణ వెలువడిన వెంటనే అన్ని రాజకీయ పక్షాలను, స్వచ్ఛంద సంస్థలను కూడగట్టుకొని తెలుగుదేశం పార్టీవారు ఢిల్లీకి వెళ్లి కేంద్రంపై ఒత్తడిని మొదలుపెట్టి ఉండాలి! నిబంధనలను, అనివార్యం అయితే రాజ్యాంగాన్ని సవరించాలని కోరి ఉండాలి. అదేమీ జరగలేదు. ప్రత్యేక ప్రతిపత్తి కోసం అన్ని పార్టీలను కూడగట్టడం మాని తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షాన్ని దిగమింగి వేయడానికి మాత్రమే యత్నిస్తోంది! పార్టీ ఫిరాయింపులను నిరోధించే చట్టంలోని నిబంధనను బాహాటంగా నిర్లజ్జగా ఉల్లంఘిస్తోంది. వారానికి ఒకరిద్దరు చొప్పున ప్రతిపక్ష శాసనసభ్యులు తెలుగుదేశంలోకి ఫిరాయిస్తుండడం ఆంధ్రప్రదేశ్‌లో నడుస్తున్న ప్రధాన రాజకీయ నాటకం! కేంద్ర నిధులతో అమలు జరుగుతున్న పథకాలను ఆరంభించిన ఘనత తమదే చాటుకోవడం మినహా తెలుగుదేశం ప్రభుత్వం వారు ప్రారంభించిన కొత్త పథకం లేదు! నవ్యాంధ్ర ప్రభుత్వం వారి ఏకైక కార్యక్రమం రాజధాని నిర్మాణం మాత్రమేనన్నది అంతర్జాతీయ సమాజం గుర్తించిన అద్భుతం..మరో సింగపూర్‌ను మరో షాంఘయిని మరో న్యూయార్కును మరో టోకియోను మరో టింబకూను కృష్ణానదీ తీరంలో నెలకొల్పడం మాత్రమే చంద్రబాబునాయునికి కార్యక్రమ సర్వస్వం!
నవ్యాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తి అసాధ్యమని నిర్ధారించిన ప్రణాళికా సంఘం రద్దయిపోయింది. దాని స్థానంలో అవతరించిన నీతి ఆయోగ్ కూడ ఆంధ్రప్రదేశ్‌కు మొండి చెయ్యి చూపించింది. ప్రత్యేక ప్రతిపత్తి అంత సులభం కాదని కేంద్ర మంత్రి ఎమ్.వెంకయ్యనాయుడు నిర్ధారించి ఏడాది గడిచింది! ప్రత్యేక ప్రతిపత్తి లభించినట్టయితే రాష్ట్రానికి లభిస్తున్న కేంద్ర ప్రభుత్వ నిధులు భారీగా పెరుగుతాయి. పథకాలకు అవసరమయ్యే వ్యయంలో తొంబయి శాతం కేంద్రం భరించాలి! అందువల్ల కేంద్ర ప్రభుత్వంపై ఒత్తడిని పెంచడం వల్ల మాత్రమే ప్రతిపత్తి సాధ్యం. ప్రతిపత్తి ఇవ్వకపోతే పదవులకు రాజీనామా చేస్తామని నవ్యాంధ్రకు చెందిన భాజపా నేతలు ప్రకటించవచ్చు. కేంద్ర మంత్రివర్గంనుండి వైదొలగుతామని తెలుగుదేశం హెచ్చరించవచ్చు! పిల్లి మెడలో గంటను ఎవరు కడతారో?