సంపాదకీయం

‘మనోహర’ స్ఫూర్తి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన రక్షణ విధానంలో గత నాలుగున్నర ఏళ్లుగా ప్రస్ఫుటిస్తున్న విప్లవాత్మక పరిణామ క్రమానికి శ్రీకారం మనోహర్ పారికర్ జీవన ప్రస్థానం. 2014 నవంబర్‌లో గోవా ముఖ్యమంత్రిగా ఉండిన పారికర్ రక్షణమంత్రిగా పదవీ బాధ్యతలను స్వీకరించినప్పటి నుంచి ఈ ‘పరివర్తన’ మొదలైంది. పడమటి సరిహద్దులలో మాత్రమే కాక ఉత్తరపు సరిహద్దులలోను, తూర్పు సరిహద్దులలోను సైతం మన రక్షణ దళాలు ప్రత్యక్ష, ప్రచ్ఛన్న బీభత్సకారులను తిప్పికొట్టడం ఆరంభం కావడం ఈ పరివర్తన. 2015 జూన్‌లో మన సైనికులు అనుబంధ సాయుధ దళాలు వారు బర్మాలోకి చొచ్చుకొనిపోయి సరిహద్దుల సమీపంలో పుట్టలు పెరిగి ఉండిన బీభత్స బట్టీలను బద్దలుకొట్టడం భారతీయుల ప్రతిఘటనకు ప్రారంభం. ఈ బీభత్సకారులను దశాబ్దుల తరబడి చైనా మన దేశంలోకి ఉసిగొల్పడం చరిత్ర. ఈ చైనా ప్రేరిత ముష్కరుల నడుములు విరగడం పట్ల బర్మా-మ్యాన్‌మార్- ప్రభుత్వం సైతం హర్షం వ్యక్తం చేయడం పారికర్ మొదలుపెట్టిన ‘పరివర్తన’కు లభించిన దౌత్య విజయం. 2016 సెప్టెంబర్‌లో మన సైనిక దళాలు జమ్మూ కశ్మీర్‌లోని ‘అధీనరేఖ’ను దాటి వెళ్లి పాకిస్తాన్ దురాక్రమిత జమ్మూ కశ్మీర్‌లోని జిహాదీ హంతకుల స్థావరాలను ధ్వంసం చేయడం మన భద్రతను పదిలం చేయగలిగిన శుభ పరిణామం. ఈ రెండు మహా పరిణామాలకు సమాంతరంగా ఉత్తర సరిహద్దులలోని ‘వాస్తవ అధీనరేఖ’ను నిరంతరం అతిక్రమించి మన వైపు చొరబడుతుండిన చైనా సైనిక మూకలను నిరోధించడం. 2014 చివరి వరకు దాదాపు ప్రతిరోజూ ‘వాస్తవ అధీనరేఖ’ను అతిక్రమించి మన వైపునకు వచ్చి తిష్ఠవేస్తుండిన చైనీయ ప్రభుత్వ దళాలను మన ‘్భరత టిబెట్ సరిహద్దు పోలీసులు’-ఐటిబిపి- తిప్పికొట్టడం ఆరంభమైంది. ఫలితంగా లడక్‌లోని చైనావారి ‘చొరబాట్ల’ సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. మన సముద్ర జలాలలోకి, సార్వభౌమ జలాలలోకి విదేశీయ నౌకలు తరచూ చొరబడడం 2014 వరకు నడచిన కథ. ఐరోపా దేశాలవారు తమ పాత ఓడల నిండా కాలుష్య పదార్థాలను, పారిశ్రామిక వ్యర్థాలను నింపుకొనివచ్చి మన సార్వభౌమ జలాల- టెర్రిటోరియల్ వాటర్స్‌లో వాటిని ముంచిపోవడం కూడ చరిత్ర. మనోహర్ పారికర్ రక్షణ మంత్రిత్వం ఈ చరిత్రను సైతం తుదముట్టించ గలిగింది. జమ్మూ కశ్మీర్‌లో ‘సైనిక దళాల ప్రత్యేక అధికారాల’ చట్టం అమలుకాకుండా నిలిపివేయాలని, జమ్మూ కశ్మీర్‌నుంచి సైనిక దళాలను ఉపసంహరించాలని, సైనికులపై రాళ్లు రువ్వే దేశద్రోహులను చెదరగొట్టడానికై తుపాకులలో ‘రవ్వ’ల- పెల్లెట్స్-ను ఉపయోగించరాదని పాకిస్తాన్ అనుకూల రాజకీయవేత్తలు కీచుగొంతులతో అరవడం 2014 నవంబర్ వరకు నడచిన చరిత్ర. మనోహర్ పారికర్ సైనిక దళాల నైతిక బలాన్ని పెంచడమేకాక వారిలో నిబిడీకృతమైన ‘హనుమచ్ఛక్తి’ని జాగృతం చేయగలిగాడు. హనుమంతుడు సాగరాన్ని లంఘించి వెళ్లి ‘లంక’ను దగ్ధం చేసినట్టు మన రక్షణ దళాలు ‘అధీన రేఖ’ను లంఘించి వెళ్లి బీభత్స స్థావరాలను ధ్వంసం చేయగలిగారు. ఇదీ మనోహర్ పారికర్ పునరుద్ధరించ గలిగిన సమర స్ఫూర్తి.. ఈ సమరస్ఫూర్తి అజరామరం.. ఆయన భౌతిక జీవన ప్రస్థానం ముగిసింది.. ఈ సమర స్ఫూర్తి ముగియబోదు!
ఆలోచన రీతిలో పరివర్తన వచ్చినట్టయితే అనేక వ్యవహారాలలో పరివర్తన వస్తుంది- అన్న జీవన వ్యవహార వాస్తవాన్ని 2015 జూన్ నాటి ‘సాయుధ చికిత్స’- సర్జికల్ స్ట్రయిక్’- సందర్భంగా పారికర్ పునరుద్ఘాటించాడు. బర్మాలో నెలకొన్న స్థావరాలలోని చైనా ప్రేరిత బీభత్సకారులు 2015 జూన్ నాలుగవ తేదీన మణిపూర్‌లోకి చొరబడి ఇరవై మంది మన సైనికులను చీకటి మాటున హత్యచేశారు. ఇలాంటి బీభత్స ఘటనలకు పాల్పడిన ‘ఆతతాయి’లను శిక్షించే పనికి మన ప్రభుత్వాలు దశాబ్దుల తరబడి పూనుకోలేదు. పూనుకోకపోవడానికి ప్రధాన కారణం తరతరాల భారత జాతీయ స్వభావానికి వక్రభాష్యాలు ప్రచారం కావడం. శత్రువులను, శత్రురాజులను, వెన్నంటి తరిమి హతమార్చరాదన్నది యుగయుగాలుగా ఈ హైందవ జాతీయ స్వభావం! ఎదురుగావస్తున్న శత్రువును ప్రతిఘటించడమే ఈ జాతికి తెలుసు. పిరికితనంతో పారిపోయే వారిని వెన్నంటి తరిమి చంపడం- హాట్ పర్సూట్- ఈ జాతికి తెలియదు. కానీ నిజమైన సైనికుల పట్ల, ధర్మయుద్ధం చేసే సైనికుల పట్ల మాత్రమే ‘హాట్ పర్సూట్’- వెన్నంటి తరిమి చంపడం అధర్మం. కానీ నిరాయుధ ప్రజలను, పిల్లలను, మహిళలను, నిద్రపోయే వారిని హత్యచేసే వారు సైనికులు కాదు, వారు ఆతతాయిలు, బీభత్సకారులు. ఇలాంటి బీభత్సకారులను వెన్నంటి తరుమవచ్చు. ఎవరు బీభత్సకారులు? ఎవరు సైనికులు? అన్నది విచక్షణ! ఈ విచక్షణ-ఆలోచన-లో మార్పు రావాలన్నది పారికర్ చెప్పిన మాట!
అందువల్ల బీభత్సకారులను ‘వెన్నంటి తరమడం’ అన్నది అర్థం లేని మాట! ‘పరిభాష’ మారడం ఆలోచన రీతిలో పరివర్తన ఫలితం. బీభత్సకారులకు వ్యతిరేకంగా ‘పగతీర్చుకొనడం’, ‘దెబ్బకు దెబ్బతీయడం’వంటి పదజాలం అర్థం లేని పరిభాష. బీభత్సకారులను రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వాలు శిక్షించడం హైందవ జీవన స్వభావం. ఇలా శిక్షించడానికై ‘సాయుధ చికిత్స’ జరపాలన్నది మన ‘పరిభాష’కు సంబంధించిన సరైన అర్థం. క్రీస్తుశకం 1663 ఏప్రిల్ ఐదవ తేదీన ఛత్రపతి శివాజీ ఇలాంటి సాయుధ చికిత్స- సర్జికల్ స్ట్రయిక్- జరిపాడు. పూణె నగరం సమీపంలో నక్కి ఉండిన ‘షాయిస్థఖాన్’ అనే జిహాదీ బీభత్సకారుడి స్థావరాన్ని బద్దలుకొట్టాడు. మరచిన ఈ ‘పరిభాష’ మళ్లీ ఇప్పుడు ప్రచారవౌతోంది. పునరుద్ధరించినవాడు మనోహర్ పారికర్! బీభత్సకారులను శిక్షించడం ‘వెన్నంటి తరమడం’- హాట్ పర్సూట్- కాదు, అది సాయుధ చికిత్స- సర్జికల్ స్ట్రయిక్-! ఈ ‘చికిత్స’లో పగలేదు, ద్వేషం లేదు, కసి తీర్చుకోవడం లేదు, ‘దెబ్బకుదెబ్బ’ లేదు. ఆతతాయిలను- నిరాయుధులను చీకటిలో చంపేవారిని-టెర్రరిస్టులను శిక్షించాలన్న ప్రభుత్వ ధర్మం ఈ ‘చికిత్స’! ఆలోచనరీతి మారాలన్న ‘మనోహర’ సూత్రం ఇది. ఎందుకంటె ‘దురవగాహన’ తొలగితే తప్ప మన సరిహద్దులు భద్రం కావు, మన దేశ ప్రజలు నిర్భయంగా నిద్రించలేరు. కానీ 2014వ సంవత్సరానికి పూర్వం అనేక ఏళ్లపాటు ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులు ఈ ‘దురవగాహన’ నుండి విముక్తం కాలేదు. అందువల్ల 2016 సెప్టెంబర్ నాటి పారికర్ మాటలలో- ‘మన రక్షణ దళం హనుమంతుని వలె, - త్రేతాయుగంలో సముద్రాన్ని దాటగలిగిన హనుమంతుని వలె- స్వీయ పటిమను గుర్తించలేకపోయింది.. హనుమంతుని శక్తిని వానర ప్రముఖులు గుర్తింపచేశారు.. రక్షణ దళాలకు తమ శక్తిని నేను గుర్తుచేశాను..’ అన్నది పారికర్ చెప్పిన మాట! ‘గుర్తించిన’ హనుమంతుడు రావణ స్థావరాన్ని దగ్ధం చేశాడు, ‘గుర్తించిన’ మన సైన్యం పాకిస్తానీ బీభత్సపు బట్టీలను, చైనా ప్రేరిత హంతక స్థావరాలను ధ్వంసం చేయగలిగింది..
కసి తీర్చుకోవడం, దాడి చేయడం హైందవ జాతీయ స్వభావం కాదన్నది పారికర్ చెప్పిన మాట! దాడిని ప్రతిఘటించడం దోషిని దండించడం మాత్రమే హిందూ స్వభావం. ‘‘హిందూ జాతి’’- ‘‘ భారతజాతి’’ పర్యాయ పదాలు. ఈ ‘పరిభాష’ను సైతం మరోసారి, మరిన్నిసార్లు గుర్తుచేసిన పారికర్ భౌతిక భద్రతను మాత్రమేకాక ‘సాంస్కృతిక అస్తిత్వ’ రక్షణను సైతం పెంపొందించాడు. ‘‘గోవాలోని కాథలిక్కులు హిందువులే, ఎందుకంటె వీరి ఆచార వ్యవహారాలు బ్రెజిల్‌లోని కాథలిక్కుల ఆచార వ్యవహారాల వలె లేవు... గోవాలోని కాథలిక్కుల ఆలోచనలు ఆచార వ్యవహారాలు హైందవమైనవి...’’ అన్నది పారికర్ పునరుద్ఘాటించిన జాతీయ జీవన వాస్తవం! ఈ ‘పరివర్తన’కు ప్రతీక అయిన గోవా ముఖ్యమంత్రి, మాజీ రక్షణమంత్రి పారికర్ సేవ భరతమాతకు ఆనందకరం, ఆయన భౌతిక నిష్క్రమణం జాతి ప్రజలకు శోకం.. ‘ఒక కంట శోకజలం, మరోకంట ఆనంద అశ్రుకణం..’