సంపాదకీయం

కర్షక వ్యథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జవహర్‌లాల్ నెహ్రూకు ‘‘కాళ్లు మేఘాలలో ఉంటాయి..’’ అని లార్డ్ వౌంట్ బాటెన్ మహాత్మా గాంధీతో చెప్పాడట! చరిత్రలో ఈ సంగతి నమోదయి ఉంది. ‘‘నేల మీద నిలబడి ఆలోచించగల నాయకుడు సర్దార్ వల్లభ భాయి పటేల్..’’ అని కూడ మహాత్మునితో వౌంట్ బాటెన్ చెప్పినట్టు చరిత్ర! అందువల్ల ప్రభుత్వంలో పటేల్ ఉండి తీరాలన్నది వౌంట్ బాటెన్ గాంధీకి చెప్పిన మాట! 1947లో పటేల్ ఉప ప్రధాని పదవి నుంచి ప్రభుత్వం నుంచి తప్పుకోవాలని భావించాడట! అందుకు అనుమతించవలసిందిగా మహాత్మాగాంధీని కోరాడు. మహాత్ముడు సైతం అంగీకరించాడట! కానీ అప్పటి గవర్నర్ జనరల్- బ్రిటన్ రాజప్రతినిధి- వౌంట్ బాటెన్ అంగీకరించలేదట! కానీ 1951 నుంచి సర్దార్ పటేల్ లేడు. అందువల్ల నెహ్రూ అనుసరించిన ‘‘నేల విడిచిన సాము’’ వ్యవసాయాన్ని ఉద్ధరించలేదు. అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాల నుంచి తిండి గింజలను దేబిరించవలసిన దుస్థితి 1960వ దశకం వరకూ, 1970వ దశకం ఆరంభం వరకూ కొనసాగడం చరిత్ర. 1990వ దశకం నాటికి మనది స్వయం సమృద్ధి. తిండి గింజల ఎగుమతులు ఆరంభమయ్యాయి. ప్రపంచీకరణ వచ్చి మన నెత్తినెక్కి కూర్చుంది, వ్యవసాయం కుదేలుమంటోంది! విధాన వైఫల్యానికి ఇది మరో నిదర్శనం. ఈ వైఫల్యం ప్రభుత్వాల రాజకీయవేత్తలది. ఆర్థిక నీతిని రూపొందిస్తున్న మేధావులది, ప్రభుత్వాలకు సలహాలనిస్తున్న ఉన్నతోన్నత అధికారులది, నేల విడిచి నింగిలో సాము చేస్తున్న విధానకర్తలది. వ్యవసాయ రంగం నానాటికీ కుంగిపోతుండడం ఈ వైఫల్యానికి ఫలితం. లోక్‌సభకు జరుగుతున్న ఎన్నికలు ఈ వైఫల్యాన్ని మరింతగా ప్రచారానికి గురిచేస్తుండడం సమస్య తీవ్రతకు నిదర్శనం. పసుపు రైతులు వినూతన పద్ధతిలో విప్లవించారు. నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో నూట ఎనభయి ఐదుగురు అభ్యర్థులు పోటీ చేస్తుండడంతో పసుపు పండిస్తున్న రైతుల కడగండ్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రజలకు తెలిసివచ్చింది. పసుపు కొనుగోళ్లను క్రమబద్ధీకరించడం, రైతులకు గిట్టుబాటు ధరలను ఇవ్వడం వంటి చర్యలను చేపట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నది ఆరోపణ. తెలంగాణలో ‘పసుపు నిర్వహణ సాధికార మండలి’- టెర్మరిక్ బోర్డ్-ను ఏర్పాటు చేయడం గురించి కేంద్ర ప్రభుత్వం శ్రద్ధ వహించలేదు. ఐదేళ్లు గడిచిపోయాయి. పసుపును రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేయవచ్చు. అదీ జరగలేదు. నిజామాబాద్ జిల్లా పసుపు ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది, ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న పసుపు కొమ్ములలో మన దేశం ఎనబయి శాతం పండిస్తోంది. ఇంతటి ప్రాధాన్యం సంతరించుకున్న పసుపును పండిస్తున్న రైతులకు క్వింటాలునకు నాలుగువేల రూపాయలు లభిస్తోందట. ఈ క్వింటాలు పసుపు కొమ్ములను పండించడానికి రైతుకు తొమ్మిది వేల రూపాయల ఖర్చు అవుతోందట! ఇదీ నూట డెబ్బయి ఎనిమిది మంది పసుపు రైతులు ఇందూరు- నిజామాబాద్- లోక్‌సభ నియోజకవర్గంలో పోటీచేస్తుండడానికి నేపథ్యం.
నిజామాబాద్ జిల్లాలోని ఎఱ్ఱజొన్నలు పండిస్తున్న రైతులు కూడ ఈ ‘ఎన్నికల’ ప్రక్రియలో తమ నిరసనను తెలుపుతున్నారు. ఎఱ్ఱ జొన్నలను కొన్ని ప్రాంతాలలో ‘‘కాకిమారు జొన్నల’’ని అంటున్నారు. ఈ ఎఱ్ఱజొన్నలను ప్రధానంగా పశుగ్రాసంగా వినియోగిస్తున్నారు. అనేక ప్రాంతాలలో ఈ జొన్నలను కంకి వచ్చే సమయంలో కోసి ‘చొప్ప’ను పశువులకు తినిపిస్తారు. ఈ జొన్నగడ్డి తినడం పశువులకు గొప్ప విందు. నిజామాబాద్ ప్రాంతంలో ఈ ఎఱ్ఱ జొన్నగింజలను భారీగా ఉత్పత్తి చేస్తుండడం ‘‘గిట్టని సేద్యానికి’’ మరో నిదర్శనం. ఇందూరు ప్రాంతం ఎఱ్ఱజొన్నల రైతులు దశాబ్దుల తరబడి నష్టపోతున్నారు. ఈ ఎఱ్ఱజొన్నల వ్యాపారంపై ఒకే సంస్థవారు గుత్త్ధాపత్యం వహించడం 2008లో రైతుల నిరసన జ్వాలలు రగలడానికి దారితీసింది. ఈ ‘గుత్త్ధాపత్యం’ ‘ప్రపంచీకరణ’-గ్లోబలైజేషన్- ఫలితం. బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు రైతులకు అతి ఎక్కువ ధరలకు ‘విత్తనాల’ను ‘రసాయనపుటెఱువుల’ను అమ్ముతున్నాయి, అతి తక్కువ ధరలకు రైతుల నుంచి పంటలను కొనుగోలు చేస్తున్నాయి. కృత్రిమ కొరతను కల్పించి వినియోగదారులకు వ్యవసాయ ఉత్పత్తులను అతి భారీ ధరలకు అమ్ముతున్నాయి. ఇదంతా 1994లో ఆరంభమైన వాణిజ్య ప్రపంచీకరణ ఫలితం! ‘ప్రపంచీకరణ’ను విదేశీయ వాణిజ్య సంస్థల చొరబాటును, విదేశాల పెట్టుబడులను దేశంలోని అన్ని ప్రధాన రాజకీయ పక్షాల వారు సమర్ధిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు ‘బూడిద’లో పోసిన ‘పన్నీరు’కావడానికి ఇదీ కారణం! నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో 2008 జూన్‌లో రైతులపై పోలీసులు కాల్పులు జరిపారు. నూట ఎనిమిది గ్రామాలకు చెందిన రైతులు పండించిన ఐదు లక్షల క్వింటాళ్ల ఎఱ్ఱజొన్నలను ఒకే సంస్థ కొనుగోలు చేసింది. కేవలం కొన్ని వేల రూపాయలను మాత్రం ముందుగా చెల్లించి సరకును తరలించి కొనిపోయిన ఆ ఘరానా వ్యాపార సంస్థవారు మూడు నెలలవరకు మిగిలిన సొమ్ము చెల్లించకుండా ఠలాయించడంతో వ్యవసాయదారులు ఆర్మూరులో నిరసన ప్రదర్శనలు చేశారు. కడుపు మండిన రైతులు కదం తొక్కారు. 2008 జూన్ నాటి ఘటన ఇది. పోలీసుల కాల్పులతో ఆర్మూరు రక్తసిక్తం కావడం చరిత్ర. పదకొండు ఏళ్లు గడిచినప్పటికీ ఎఱ్ఱజొన్నల రైతుల కడగండ్లు కొనసాగుతూనే ఉండడానికి కారణం ‘ప్రపంచీకరణ’ మారీచ మృగ మాయాజాలం... ఈ మాయాజాలం పరిధి నుంచి ప్రభుత్వాలు బయటపడడం లేదు....
రైతుబంధు పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఎకరానికి సాలీనా ఎనిమిది వేల రూపాయలను పెట్టుబడిగా ఇవ్వడం దేశంలోకెల్లా అత్యంత ఆదర్శవంతమైన సంక్షేమ పథకమన్న ప్రచారం జరుగుతోంది. ఈ పెట్టుబడి మొత్తాన్ని పదివేల రూపాయలకు పెంచనున్నారట. ఈ పథకం అమలు జరగడం ఆరంభమైన తరువాత వివిధ రాష్ట్రాల ప్రభుత్వాల వారు దీన్ని అనుసరిస్తున్నారట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడ ఆర్థికస్థితి ప్రాతిపదికగా రైతులకు సాలీనా పదివేల నుంచి పదిహేనువేల రూపాయల వరకూ ఆర్థిక సహాయం అందించడానికి నిర్ణయించింది. ‘కిసాన్ సమ్మాన్’ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఐదు ఎకరాల కంటె తక్కువ భూమి ఉన్న రైతులకు సాలీనా ఆరువేల రూపాయలను ప్రదానం చేస్తోంది. ఈ పథకాలన్నీ కూడ రెండేళ్ల కాలవ్యవధికి ఈవల మాత్రమే అమలు జరుగుతున్నాయి. అందువల్ల దీర్ఘకాల ‘ప్రపంచీకరణ’ప్రభావం కారణంగా ఉత్పన్నమైన సమస్యలకు ఈ సంక్షేమ పథకాలు విరుగుడు కావడం లేదు, తెలంగాణలో తొమ్మిది లక్షల మంది రైతులకు రైతుబంధు పథకం ప్రయోజనం సిద్ధించడం లేదన్నది మరోవైపు జరుగుతున్న ప్రచారం. మహారాష్టల్రోను, మధ్యప్రదేశ్‌లోను రైతుల ఉద్యమాలు హింసాత్మకం కావడం కూడ చరిత్ర. 2017 జూన్‌లో మధ్యప్రదేశ్‌లో రైతులు ‘‘విధ్వంసకాండకు పూనుకొనడం’’ పోలీసులు జరిపిన కాల్పులలో అనేకమంది ప్రాణాలు కోల్పోవడం 2018నాటి శాసనసభ ఎన్నికలలో ‘్భజపా’ అధికార చ్యుతికి ఒక ప్రధాన కారణం. భారతీయ జనతాపార్టీ పాలనలో ఉన్న అతిపెద్ద రాష్టమ్రైన ఉత్తరప్రదేశ్‌లో సైతం రైతులు గత రెండేళ్లుగా ఉద్యమిస్తూనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ రెండేళ్లలో చెరకు, వరి, గోధుమ, పప్పు్ధన్యాల కనీసపు మద్దతు ధరలను సైతం గణనీయంగా పెంచింది. కానీ ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలితాలు ‘ప్రపంచీకరణ’ ఊబిలో కూరుకొనిపోయి ఉన్నాయి! ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’ నడిపిస్తున్న ‘స్వేచ్ఛా ఆర్థిక వ్యవస్థ’- మార్కెట్ ఎకానమీ ‘మారీచుని’ వలె భారతీయ వ్యవసాయాన్ని అపహరించింది! అనాదిగా మన దేశంలో చిన్న వ్యాపారులు గ్రామాలలో పర్యటించి వ్యవసాయ ఉత్పత్తులను ఎప్పటికప్పుడు కొనుగోలు చేసి దేశమంతటా పంపిణీ చేసేవారు! ‘‘మార్కెట్ ఎకానమీ’’ ఈ చిన్న వ్యాపారులను నిర్మూలించింది. ఇప్పుడు రైతుల వద్దకువెళ్లి వ్యాపారులు కొనే వ్యవస్థ లేదు. రైతులు తమ ఉత్పత్తులను పట్టణాలలోని పెద్దపెద్ద ‘వాణిజ్య ప్రాంగణాల’- మార్కెట్ యార్డుల-కు తరలించుకొనిపోవలసి వస్తోంది. ఈ ప్రాంగణాలలోని పెద్ద వ్యాపారులు ధరలను తగ్గించడం, కొనుగోళ్ళను నిలిపివేయడం వంటి ఆర్థిక బీభత్స కలాపాలను కొనసాగిస్తున్నారు. రైతుల వద్దకు వ్యాపారులు వెళ్లి కొనుగోలు చేసే పద్ధతిని పునరుద్ధరిస్తామన్న ప్రభుత్వాల ప్రచారం ఆచరణకు రావడం లేదు. మరిన్ని ‘‘మార్కెట్ యార్డుల’’ను నిర్మించడం వ్యాపారుల ‘గుత్త’పెత్తనం ప్రబలడానికి దోహదం చేస్తోంది. పరిశ్రమల వారు చెఱకు కొనుగోళ్లను తగ్గించి వేయడం వల్ల ఉత్తరప్రదేశ్‌లో చెఱకు పంట పొలాలలోనే ఎండిపోతోందట!
ఉత్తరప్రదేశ్‌లోని డెహ్రాడూన్‌లో 1949 మే 23వ తేదీన అప్పటి ఉప ప్రధానమంత్రి వల్లభభాయి పటేల్ ప్రసంగించాడు! ‘‘సామాన్య ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి ఆహార ఉత్పత్తులను పెంచడం వౌలిక మాథ్యమం’’ అన్నది సర్దార్ పటేల్ చెప్పిన మాట! వ్యవసాయ భూమి విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతుండడం నేటి మాట! ఎఱువులు, విత్తనాలు, క్రిమి నాశక రసాయనాలు రైతులను పీల్చి పిప్పిచేస్తుండడం ప్రపంచీకరణ.. ప్రపంచీకరణ నుంచి విముక్తికి ఏకైకమార్గం సేంద్రియ వ్యవసాయం..