సంపాదకీయం

‘మత ప్రదాన’ వేళ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మత ప్రదాతల హృదయ సీమలలో ప్రజాస్వామ్య భావతరంగాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయన్నది జరిగిన ప్రచారం. ప్రచారం మంగళవారం ముగిసింది. నగరాల నుండి పట్టణాలకు, పల్లెలకు వెళ్లి ‘మత ప్రదానం’ చేయడానికి- వోటు వేయడానికి- మత ప్రదాతలు- వోటరులు- ఉత్సాహం చూపిన దృశ్యాలు మంగళవారం, బుధవారం మాధ్యమాలలో విస్తృతంగా ఆవిష్కృతమయ్యాయి. గురువారం తెలంగాణలో పదిహేడు లోక్‌సభ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్‌లో ఇరవై ఐదు లోక్‌సభ స్థానాలకు ప్రతినిధులను ఎన్నుకొనడానికి ‘వోటరు’లు చూపుతున్న కుతూహలం అపూర్వమన్నది జరుగుతున్న ప్రచారం. ఆంధ్రప్రదేశ్‌లో నూట డెబ్బయి ఐదు స్థానాలున్న శాసనసభలో ఏ రాజకీయ పక్షానికి ‘సంఖ్యాధిక్యం’- మెజారిటీ- లభింపచేయాలన్న మత ప్రదాతల అభిమతం కూడ గురువారం యంత్రాలకెక్కనుంది.. ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్- ఇవిఎమ్-లకు ఎక్కనుంది. మత ప్రదాన ఘట్టం గురువారం పరిసమాప్తం కానున్నప్పటికీ ఉత్కంఠ మాత్రం శమించడం లేదు. మే ఇరవై మూడవ తేదీన లోక్‌సభ ఎన్నికల, నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడే వరకూ ఉత్కంఠ కొనసాగనుంది. తెలుగు రాష్ట్రాలలో ఒకే దశలో, తొలి దశలోనే, లోక్‌సభ ఎన్నికల, శాసనసభ ఎన్నికల ‘పోలింగ్’ జరిగిపోతుండడంతో ఈ రాష్ట్రాల వారు మిగిలిన రాష్ట్రాల వారి కంటె ఎక్కువకాలం ఫలితాల కోసం వేచి ఉండవలసి వస్తోంది. అరుణాచల్, మేఘాలయ రాష్ట్రాలలో రెండేసి లోక్‌సభ స్థానాలున్నాయి. మిజోరం, నాగాలాండ్, సిక్కిం రాష్ట్రాలలోను, లక్షద్వీపాలు, అండమాన్ నికోబార్ ద్వీపాలు- కేంద్ర పాలిత ప్రాంతాలలోను ఒక్కొక్క లోక్‌సభ స్థానం ఉంది. ఉత్తరఖండ్‌లో ఐదు స్థానాలున్నాయి. వీటన్నింటిలోను గురువారం ఒకే దశలో ‘పోలింగ్’ను నిర్వహిస్తున్న ఎన్నికల సంఘం వారు అనేక చిన్న రాష్టల్రలో సైతం దశలవారీగా ‘పోలింగ్’ను నిర్వహిస్తుండడం విచిత్రం. ఆయా రాష్ట్రాలలో శాంతి భద్రతలు క్షీణించి ఉండడం ఇందుకు కారణమన్నది బహిరంగ రహస్యం. మణిపూర్, త్రిపుర రాష్ట్రాలలో రెండేసి లోక్‌సభ స్థానాలుండగా గురువారం ఒక్కొక్క స్థానంలో మాత్రమే మత ప్రదానం జరుగుతోంది. పద్దెనిమిదవ తేదీన ఈ రెండు రాష్ట్రాలలోను రెండవ స్థానానికి ‘పోలింగ్’ జరుగుతుందట! జమ్మూ కశ్మీర్‌లో ఆరు లోక్‌సభ స్థానాలుండగా ఐదు దశలలో ‘పోలింగ్’ జరిపించడం శాంతిభద్రతల దుస్థితికి అద్దం. పదకొండు స్థానాల ఛత్తీస్‌గఢ్‌లో మూడుదశల ‘పోలింగ్’ అందువల్ల ఆశ్చర్యం కాదు. మావోయిస్టు బీభత్సపు పుట్టల నుంచి విష కీటకాలు నిరంతరం వెలువడుతుండడం ఛత్తీస్‌గఢ్‌లో నడుస్తున్న చరిత్ర. ఈ చరిత్ర మంగళవారం మరింత రక్తసిక్తమైంది! భీమ మండవి అనే ‘్భరతీయ జనతాపార్టీ’ శాసనసభ్యుడిని, నలుగురు భద్రతా సిబ్బందిని దంతేవాడ ప్రాంతంలో మావోయిస్టులు హత్యచేయడం గురువారం బస్తర్ లోక్‌సభ నియోజకవర్గంలో జరుగనున్న ‘పోలింగ్’నకు బీభత్స నేపథ్యం!
జమ్మూ కశ్మీర్‌లోని కిస్తివార్ జిల్లాలోని ఒక వైద్యశాల ప్రాంగణంలో చంద్రకాంత శర్మ అనే ‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం’ కార్యకర్తను, ఆయన అంగరక్షకుడిని జిహాదీ బీభత్సకారులు కాల్చిచంపడం ‘మత ప్రదాతల’ను భయపెట్టడానికి, ఎన్నికల ప్రక్రియను నిరోధించడానికి జరుగుతున్న కుట్రలో భాగం. భారత ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థను 2050వ సంవత్సరం నాటికి కూల్చివేసి ఏకపక్ష నియంతృత్వ వ్యవస్థను ఏర్పాటు చేయడం మావోయిస్టుల లక్ష్యమట! ఈ సంగతిని మావోయిస్టు మహానేతలు పదే పదే పునరుద్ఘాటించి ఉన్నారు. ఈ లక్ష్యం 2050వ సంవత్సరం నాటికి కాని 20,500వ సంవత్సరం నాటికి కాని నెరవేరడం కల్ల. దేశంలో బహుళపక్ష ప్రజాస్వామ్య వ్యవస్థ నానాటికీ బలపడుతుండడం ఇందుకు నిదర్శనం. 2050వ సంవత్సరం నాటికి మావోయిస్టులు ఉండకపోవచ్చు.! 20,500వ సంవత్సరం నాటికి మావోయిస్టుల భయంకర స్మృతులు కూడ మిగలవు. 2050వ సంవత్సరం నాటికి, 20,500వ సంవత్సరం నాటికి ఆ తరువాత కూడ అనంతంగా ఈ దేశం ఉంటుంది, ఈ జాతి ఉంటుంది. కానీ చైనా మద్దతుతో మనుగడ సాగించినన్నాళ్లు మావోయిస్టులు తోడేళ్ల వలె దూకడం మానరు. అందువల్ల ఈ బీభత్సకారులను ఎప్పటికప్పుడు ప్రతిఘటించి శిక్షించడం భద్రతాదళాలకూ తప్పదు. ఈ సంఘర్షణ కారణంగానే దేశంలో ‘పోలింగ్’ప్రక్రియ సుదీర్ఘంగా సాగుతోంది. 1980 జనవరిలో కేవలం రెండు దశలలో నాలుగు రోజుల వ్యవధిలో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పరిసమాప్తం కావడం చరిత్ర. కానీ ఆ తరువాత జిహాదీ బీభత్సకారులు, మావోయిస్టు బీభత్సకారులు చెలరేగడం ఎన్నికల ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగుతుండడానికి కారణం! జమ్మూ కశ్మీర్, మణిపూర్ వంటి చోట్ల ఈ బీభత్సం నిరంతరం పొంచి ఉంది.
ఏమయినప్పటికీ అంతరిక్షంలోకి ఉపగ్రహ విధ్వంసక క్షిపణులను సైతం విజయవంతంగా ప్రయోగించగల మన దేశంలో ఒకే రోజున ఒకే విడతలో ‘పోలింగ్’ పరిసమాప్తం కాకపోవడం విచిత్రమైన వ్యవహారం! ఐదువందల నలబయి మూడు లోక్‌సభ స్థానాలకు ఒకేరోజున మతదాన ప్రక్రియను నిర్వహించగల రీతిలో భద్రతను సమకూర్చగల బలగాలు మనకు లేవా? పదకొండవ తేదీన మత ప్రదానం జరిగిన తరువాత వచ్చేనెల ఇరవై మూడవ తేదీవరకు ‘ఇవిఎమ్’లను నిక్షిప్తం చేసే ప్రదేశాల భద్రత కోసం బలగాలను మోహరించడం తప్పనిసరి. ఒకటి రెండు విడతలలో ‘పోలింగ్’ ప్రక్రియ పూర్తయినట్టయితే ఇంత దీర్ఘకాలంపాటు సాయుధ బలగాలను ‘ఇవిఎమ్’లను భద్రపరచిన కేంద్రాల వద్ద నెలకొల్పవలసిన అవసరం లేదు! ఇదంతా ఎన్నికల సంఘం వారికి, ప్రభుత్వ నిర్వాహకులకు, న్యాయస్థానాలకు తెలియని విషయం కాదు. అయినప్పటికీ ‘విడతల’ మత ప్రదాన ప్రక్రియ నుంచి మన ప్రజాస్వామ్యానికి విముక్తి లభించడం లేదు. అమెరికా, రష్యా, బ్రిటన్ తదితర ఐరోపా దేశాలలో ఒకే రోజున ‘పోలింగ్’ను ఎలా పరిసమాప్తి చేయగలుగుతున్నారు? ‘కాగితం’ బ్యాలెట్ ప్రక్రియ నుంచి ‘యాంత్రిక మతప్రదాన ప్రక్రియ’కు చేరుకున్న తరువాత మన ఎన్నికల వ్యవస్థలో ప్రస్ఫుటిస్తున్న ప్రధాన పరిణామం జాప్యం.. విలంబనం! ఈ ‘విలంబనం’ కూడ మద్యం, నల్లధనం తదితర అక్రమాలు విస్తరించడానికి ఒక ప్రధాన కారణం. ‘వోటర్ వెరిఫికేషన్ పేపర్ ఆడిట్ ట్రయిల్’- వీవీపాట్- పద్ధతిని ప్రవేశపెట్టడం వల్ల ‘పోలింగ్’ప్రక్రియ మరింత పారదర్శకమైంది. మరింత ప్రామాణికత సిద్ధించింది. కానీ ‘యాంత్రిక ఫలితాల’ను వెల్లడించిన తరువాత ‘వీవీపాట్’ కాగితం ముక్కలను - పేపర్ స్లిప్‌లను- లెక్కపెట్టడానికి ఎన్నికల సంఘం వారు సుముఖతను వ్యక్తం చేయకపోవడం విచిత్రమైన వ్యవహారం. ప్రతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గంలో ఐదు కేంద్రాల ‘వీవీపాట్’ పత్రాలను లెక్కపెట్టి, యాంత్రిక మత ప్రదానంతో సరిచూడాలన్నది సర్వోన్నత న్యాయస్థానం చేసిన నిర్ధారణ...
గతంలో ‘బ్యాలెట్ పేపర్స్’- మత ప్రదాన పత్రాల-ను ఒక్క రోజులో లెక్కపెట్టడానికి సాధ్యమయ్యేది. ఉదయం ఎనిమిది గంటలకు మొదలైన ‘వోట్ల లెక్కింపు’ రాత్రికి పూర్తయ్యేది, మరుసటిరోజు ఉదయానికైనా పూర్తయ్యేది. అలాంటిది ప్రతి నియోజకవర్గంలోను కనీసం సగం ‘వీవీపాట్’ పత్రాలను ‘యాంత్రిక ఫలితాల’తో సరిచూడడానికి ఇప్పుడు ఐదున్నర రోజులు పడుతుందట! మొత్తం వోట్లను సరిపోల్చడానికి పదకొండు రోజులు పడుతుంది. ఇంతటి విచిత్ర జాప్యానికి కారణం ఏమిటన్నది సామాన్యులకు బోధపడని విషయం! అందువల్ల ‘ఇవిఎమ్’ల వ్యవస్థలో ఎలాంటి అవకతవకలు జరగడం లేదన్న విశ్వాసం ధ్రువపడుతోందా? ధ్రువపడడం లేదా?? అన్న మీమాంస మరి కొంతకాలం ‘సాగ’నున్నది! ఈ మీమాంసతో నిమిత్తం లేకుండా మత ప్రదానం చేయడం మన విధి, మన అందరి సమష్టి అధికారం..