సంపాదకీయం

‘ప్రదాత’ల ప్రవర్తన..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బడి ఎగ్గొట్టి ‘బలుసకాయల’ కోసం పుట్టల వెంట గుట్టల వెంట తిరిగిన ఆకతాయి పిల్లల మూకవలె.. కర్నాటకలోని లక్షలాది మత ప్రదాతలు- వోటర్స్- విహారయాత్రలకు వెళ్లిపోయారట. అందువల్లనే పదునాలుగు కర్నాటక లోక్‌సభ నియోజకవర్గాలలో గురువారం నాడు కేవలం అరవై ఎనిమిది శాతం ‘మత ప్రదానం’- పోలింగ్- జరిగిందట! పక్క రాష్టమ్రైన తమిళనాడులో డెబ్బయి ఒక్క శాతం ‘పోలింగ్’ జరిగినప్పటికీ గత ఎన్నికల స్థాయి కంటె ‘పోలింగ్’శాతం తగ్గిపోయిందట! దేశం మొత్తం మీద ముగిసిన రెండు దశల ‘మత ప్రదానం’లోను గత ఎన్నికలలో కంటె ‘శాతం’ సన్నబడడం ప్రజాస్వామ్య ఉత్సాహానికి సూచిక. ఉత్సాహం ఉన్మాదంగా మారినచోట్ల మానవీయ మత ప్రదాతలు పరస్పరం కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, చింపుకున్నారు. తాడిపత్రి వంటిచోట్ల చంపుకున్నారు కూడ! ఈ ఉన్మాదం వందల మందిని మాత్రమే ఆవహించింది. కానీ లక్షల మంది ‘తెలిసిన’, ‘తెలివైన’ మత ప్రదాతలు వ్యూహాత్మకంగా వ్యవహరించారట. ఈ ‘తెలిసిన’, ‘తెలివైన’ మత ప్రదాతలు ప్రధానంగా నాగరికులు, ఉన్నతోన్నత విద్యావంతులు, విజ్ఞులు, నానావిధ కోవిదులు, ఉద్యోగస్థులు, అధికారులు, నగరాలలో ఉంటున్నవారు. అందువల్లనే బెంగళూరు మహానగరంలోని లోక్‌సభ నియోజకవర్గాలలో యాబయి శాతం కంటె తక్కువమంది మత ప్రదాతలు తమ ప్రజాస్వామ్య అధికారాన్ని వినియోగించుకున్నారట, రాజ్యాంగ విధిని నిర్వహించారట. మిగిలిన అధిక సంఖ్యలోని మత ప్రదాతలకు- ఏళ్లతరబడి జరుగుతున్న రీతిలోనే- ప్రజాస్వామ్య అధికారం, రాజ్యాంగ విధి పట్టలేదు. అందువల్ల ఈ ‘బెంగళూరులోని విజ్ఞతకల వోటరులలో అధికులు విహార యాత్రలకు- పిక్నిక్‌లకు, ఎక్స్‌కర్షన్‌లకు, సైట్ సీయింగ్‌లకు, తీర్థయాత్రలకు, ప్రేమయాత్రలకు- వెళ్లిపోయారని పరిశీలించి కనిపెట్టిన విశే్లషకులు ఆవిష్కరించారు. మత ప్రదాన దినోత్సవం- పోలింగ్ డే- నాడు ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల ఉద్యోగులకు సెలవు. శుక్రవారం కూడ సెలవు. శని, ఆదివారాలు సరేసరి. అందువల్ల ‘ఏమీ వోట్ల రామాయణమని..’ బుధవారం రాత్రి నుంచే బెంగళూరు నుంచి లక్షల నాగరికులు వివిధ వాహనాలనెక్కి బయటికి వెళ్లిపోయారట. అందువల్లనే గురువారం బెంగళూరులో ప్రశాంతంగా ‘నత్తల నడక’తో పోటీపడి, హడావుడి లేకుండా, మందకొడిగా మత ప్రదానం జరిగిందట. ఆర్భాటం, హడావుడి, రద్దీ, రభస వంటివి బుధవారం రాత్రి నుంచి బెంగళూరు నుంచి మైసూరుకు వెళ్లే రహదారిలోని వాహనాలలో కొలువుతీరిందట. బెంగళూరు నుంచి ఇతర చోట్లకు వెళ్లే దారులు కూడ వాహనాలతో కిక్కిరిసిపోయాయట! నాలుగు రోజులు సెలవులు దొరికిన ఉద్యోగులు బయటికి వెళ్లిపోయారు. పట్టణాలలోను నగరాల బస్తీలలోను సంతబజారులలో సాయంత్రం పూట ‘దుకాణాల’ ముందు నిలబడిన వర్తకులు, ప్రతినిధులు ‘రండి రండి ఏ వస్తువులు కావాలన్నా ఉన్నాయి..’ అని పాదచారులను ఆహ్వానిస్తున్న దృశ్యాలు ఆవిష్కృతం కావడం సహజం! బెంగళూరులో కొన్ని ‘మత ప్రదాన కేంద్రాల’- పోలింగ్ బూత్‌లు- ముందు నిలబడిన ఎన్నికల ఉద్యోగులు, రాజకీయ పక్షాల ప్రతినిధులు, ‘‘రండి, వోటేసి వెడుదురు కానీ...’’అని దారిన ‘వెడుతుండిన ‘దానయ్య’- మత ప్రదాత-లను పిలిచిన ‘చిత్రాలు’ ఆవిష్కృతమయ్యాయట..
బెంగళూరు ప్రతీక మాత్రమే. దేశం మొత్తం మీద మహానగరాలలో ఇదే తీరు! నిజానికి ఈ మందకొడి ‘మత ప్రదానం’ పోటీలో బెంగళూరు ఓడిపోయింది, హైదరాబాద్ గెలిచింది, సికిందరాబాద్ నియోజకవర్గం గెలిచింది. బెంగళూరులో నలబయి తొమ్మిది మంది- నూటికి- ఓట్లు వేశారు. మన జంటనగరాలలో అంతకంటె తక్కువ మంది వోట్లువేశారు. ‘క్రీస్తుశకం 2050వ సంవత్సరం నాటికి భారత ప్రజాస్వామ్య వ్యవస్థను కూల్చివేస్తాము..’ అని మావోయిస్టు బీభత్సకారులు పదే పదే ఘోషిస్తున్నారు. కానీ వారిది కేవలం మాటల ఆర్భాటమే. వారి కోరిక ఎప్పటికీ తీరదు. ‘కల్పాంతం’వరకు ప్రయత్నించినప్పటికీ భారత ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థను మావోయిస్టులు కూల్చలేరు. వారి పగటి కల. కానీ నిజంగా ప్రజాస్వామ్య వ్యవస్థపై విరోధం సాధిస్తున్నవారు వోటువేయని విద్యావంతులు. మావోయిస్టులది ఆచరణకు సాధ్యం కాని కృత్రిమ సిద్ధాంతం, వోటువేయని విద్యావంతులది ‘క్రియ’, ఆచరణ! వోట్లు వేయని వారిలో అత్యధికులు దాదాపు ఎనబయి శాతం విద్యావంతులు, ఆర్థికపరమైన ఇబ్బందులు లేనివారు, ‘మత ప్రదాన కేంద్రానికి’ వెళ్లడానికి వీలుగా సొంత వాహనాలు ఉన్నవారు, ‘ప్రజల కొరకు ప్రజల చేత ఏర్పడే ప్రజల ప్రభుత్వం ప్రజాస్వామ్యం..’ అని పాఠశాలల్లో వల్లెవేసిన వారు, పాఠశాలల్లో చదివిన బాల్యం నాటి ఈ ‘సూత్రం’ మరచిపోయినవారు, గుర్తుఉన్నప్పటికీ ప్రజాస్వామ్యంపై గురి లేనివారు, విబుధ దైత్యులు అంటే చదువుకున్న రాక్షసులు. వోటువేయని విద్యావంతులు తాము ‘‘ప్రజలము కాము’’ అని భావిస్తున్నారా? లేక వంచించాలని భావిస్తున్నారా?? ఈ ‘చదువు’ తెలియనివారు సామాన్యులు, గ్రామీణులు, కర్షకులు, గోపాలకులు, నిరుపేదలు మాత్రమే గంటల తరబడి ‘వరుస’- క్యూలైన్-లో నిలబడి వోటు వేస్తున్నారు. చదివిన వారికి విజ్ఞులకు- అంటే వీరిలో అత్యధికులకు- వరసలో నిలబడే ఓపిక లేదు.. మోకాళ్ల నొప్పులు... అంటే తల నొప్పులు! ఎందుకంటే ఈ ‘కుహనా’ మేధావుల ‘తల’మోకాళ్లలో ఉంది..
తమిళనాడులోని కొన్ని ‘మత ప్రదాన కేంద్రాల’కు వెళ్లడానికి ‘దారి’ లేదన్నది గురువారం నాటి ‘పోలింగ్’ సందర్భంగా బయటపడిన మహా విషయం. అన్ని రాజకీయ పార్టీలవారు ఆర్భాటించి చాటిస్తున్న ప్రధాన అంశం ‘సర్వతోముఖ ప్రగతి’ విద్యుత్ సరఫరా లేని జనావాసం ఇప్పుడు దేశంలో లేదు. లేదన్నది కేంద్ర ప్రభుత్వం నిర్ధారించిన ‘ప్రగతి’.. అన్ని గ్రామాలకు, జనావాసాలకు, వనవాసీ ప్రాంగణాలకు సైతం ప్రస్తుతం విద్యుత్ సరఫరా అవుతోంది. కానీ ‘బాట’లు లేని పల్లెటూళ్లు, వాహనాల ద్వారా చేరుకోలేని జనావాసాలు మాత్రం ఇంకా పరిఢవిల్లుతూనే ఉన్నాయి. కనీసం తమిళనాడులో ఉన్నాయన్నది ఈ ఎన్నికల ద్వారా నిగ్గుతేలిన నిజం. తమిళనాడులో అలా ‘వాహనాలు’ చేరని గ్రామాలకు సైతం ‘ప్రజాస్వామ్య ప్రక్రియ’ విస్తరించగలిగింది. ఎన్నికల సిబ్బంది గాడిదల మీద ‘ఇవిఎమ్’లను ఎక్కించి ఆయా గ్రామాలకు తరలించాలట. ‘ఇవిఎమ్’లను ఇతర ‘పోలింగ్’ సామగ్రిని ఆ గ్రామాలకు మోసుకెళ్లిన గాడిదలు, ఆ ప్రాణుల వెంట నడచిన ఎన్నికల సిబ్బంది దృశ్యమాధ్యమాలలో దర్శనమివ్వడం ‘ప్రజాస్వామ్య నిష్ఠ’కు నిదర్శనం. ఈ చిన్నచిన్న జనావాసాలలోని ‘వోటరు’లు ఎక్కువమంది చదువుకున్నవారు కాదు, అందరూ అక్షరాస్యులు కూడ కాదు. కానీ సంతకం పెట్టలేని ఈ సామాన్య గ్రామీణులు వేలిముద్రల ద్వారా తమ ఉపస్థితిని నమోదుచేసి ‘మత ప్రదానం’ చేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియ విజయంలో భాగస్వాములు అవుతున్నారు. గ్రామీణులకు, కర్షకులకు, వ్యవసాయ శ్రామికులకు ‘పోలింగ్’ రోజున సెలవు ఎవ్వరూ ఇవ్వడం లేదు. పని మానుకొని, పని మానుకున్నందువల్ల కూలి డబ్బులను పోగొట్టుకొని వీరందరూ వచ్చి ‘వోట్లు’వేశారు, వేయనున్నారు. కానీ వేతనంతో కూడిన సెలవును పొందిన విద్యావంతులు మాత్రం నిర్లజ్జగా నిర్భయంగా ప్రజాస్వామ్య ప్రక్రియకు గండ్లు పొడుస్తున్నారు.. వోట్లువేయకుండా విహారయాత్రలకు వెడుతున్నారు. మత ప్రదానం కోసం సెలవును పొంది, వేతనం పొంది ‘వోటు’వేయకపోవడం ప్రజాస్వామ్యానికి ద్రోహం.. దేశద్రోహం!
మన దేశం అనాదిగా ప్రజాస్వామ్య దేశం. ‘పేర్లు’ ‘ప్రక్రియ’లు వేఱు కావచ్చు. కానీ ‘జన వాక్యన్తు కర్తవ్యం’- ప్రజలు చెప్పినట్టు చేయడం పాలకుని విధి- అన్న ప్రజాస్వామ్య స్ఫూర్తి మాత్రం అనాదిగా పరిఢవిల్లుతోంది. ప్రజల కోరిక ప్రకారమే తొలి పాలకుడైన ‘మనువు’ పరిపాలన బాధ్యత స్వీకరించాడని మహాభారత ఇతిహాస కావ్యంలో వివరించారు. అందుకే
‘రాజునకు ప్రజ శరీరము
రాజు ప్రజకు రక్ష, కాన రాజున్ ప్రజయున్
రాజోత్తమ! అన్యోన్య వి
రాజితులై మెలగవలయు రక్షార్చలనలన్!’’
అన్నది సనాతన జాతీయ స్వభావం. ‘‘రాజు’’ అని అంటే ‘వ్యక్తి’ కాలేదు, రాజ్యాంగ వ్యవస్థ అయింది! రాజ్యాంగ వ్యవస్థకు ప్రజలు రూపం, ప్రాణం! వంద శాతం భాగస్వామ్యం ఉన్నప్పుడే ‘రూపం’ సమగ్రం. భాగస్వామ్యం తగ్గినమేర రాజ్యాంగ స్వరూపం పక్షవాతానికి గురి అవుతోంది. ‘అందరికీ ఇళ్లు, అందరికీ ఉద్యోగాలు, అందరికీ సమాన అధికారాలు, అందరికీ అన్నీ ఇస్తాము..’అన్న ఎన్నికల వాగ్దానాలు హోరెత్తుతున్నాయి. కానీ అందరూ- వందశాతం- మత ప్రదానం చేసేదెప్పుడు? ‘వైకల్యగ్రస్త’అయి ఉన్న రాజ్యాంగ వ్యవస్థ సమగ్ర స్వరూపాన్ని సాధించుకునేదెప్పుడు??