సంపాదకీయం

నిగ్గుదేలిన ప్రజాస్వామ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్ని మలుపులు..ఇంకెన్ని మెరుపులో..!దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఉత్తరాఖండ్ వ్యవహారం సృష్టించినంత రాజకీయ, రాజ్యాంగ ఉత్కంఠను ఏ రాష్ట్రం సృష్టించలేదనడం అతిశయోక్తి కాదు. హరీశ్ రావత్ ప్రభుత్వం బలపరీక్షను ఎదుర్కొనే అవకాశం ఇవ్వకుండా కేంద్రం రాష్టప్రతి పాలన విధించడం మొదలుకుని తాజాగా ఆయన ప్రభుత్వమే అసెంబ్లీ విశ్వాసాన్ని నిరూపించుకునే వరకూ చోటుచేసుకున్న పరిణామాలు దేశంలో ప్రజాస్వామ్య తీరుకు అద్దం పట్టేవే..కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు రాష్ట్రాల్లోని ప్రజాప్రభుత్వాల విషయంలో అనుసరిస్తున్న ధోరణిని ఎండగట్టేవే..ప్రజాస్వామ్యమంటే ప్రజాభిమతానికి పెద్దపీట. రాష్ట్రం ఏదైనా, పార్టీ ఏదైనా దేనికి ప్రజలు పట్టం కడితే ఆ సర్కార్‌ను నిర్ణీత కాల వ్యవధిపాటు అధికారంలో కొనసాగనివ్వాల్సిందే..కేంద్రంలో ఉన్నది తమ ప్రభుత్వం కాబట్టి అన్ని రాష్ట్రాల్లోనూ తమ పార్టీనే అధికారంలో ఉండాలనుకోవడమంత అవివేకం మరొకటి ఉండదు. గతంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరునే ఇప్పటి ఎన్డీయే సర్కార్ కూడా అనుసరించడం ఎంత మాత్రం సమంజసం కాదన్న వాస్తవాన్ని ఉత్తరాఖండ్ నిగ్గుదేల్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా సర్వోన్నత న్యాయస్థానమే జోక్యం చేసుకుని స్వీయ పర్యవేక్షణలోనే రావత్ బలపరీక్షను నిర్వహించడం అన్నది అత్యంత కీలక పరిణామం. అంటే తాను స్వయంగా జోక్యం చేసుకుంటే తప్ప పరిస్థితులు అదుపులో ఉండే అవకాశం ఉండదన్న సంకేతాల్ని ఈ చర్య ద్వారా సుప్రీం అందించింది. పైగా, ఉత్తరాఖండ్ ప్రస్తుతం రాష్టప్రతి పాలన కింద ఉండటం కూడా ఇందుకు కారణమై ఉండవచ్చు. భారత దేశ రాజ్యాంగ చరిత్రలో ఎన్నడూ కూడా శాసన వ్యవహారాల్లో కోర్టులు ఈ విధంగా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడలేదు.రావత్ బలపరీక్ష అం తిమ ఫలితం బుధవారం సుప్రీం కోర్టే అధికారికంగా వెల్లడించే అవకాశం ఉన్నా..దాని పర్యవేక్షణలోనే ఈ తతంగమంతా జరగడం అన్నది ఓ బలమైన సంకేతానే్న చాలా స్పష్టంగా కేంద్రానికి అందించింది. అంటే రాజ్యాంగంలోని అత్యంత కీలకమైన 356 అధికరణ విషయంలో ఆచితూచి అడుగేయాల్సిందేనన్న వాస్తవాన్ని ఈ పరిణామం నిగ్గుదేల్చింది. అధికారం ఉంది కదాని..ఈ రాజ్యాంగ వజ్రాయుధాన్ని ఉచితానుచితాలతో నిమిత్తం లేకుండా ప్రయోగిస్తే దాని పర్యవసానాలు చాలా తీవ్రంగానే ఉంటాయన్న నిజాన్నీ ఉత్తరాఖండ్ ఉదంతం తేటతెల్లం చేసింది. చాలా సున్నితంగా, రాజ్యాంగ నియమ నిబంధనలకు, ప్రజాస్వామ్య విలువలకు ఎలాంటి లోటు, చేటు లేకుండా తేలిపోవాల్సిన వ్యవహారాన్ని అనూహ్యమైన రాజ్యాంగ సంక్షోభ స్థాయికి తీసుకొచ్చిన పాపం కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానిదేననడంలో ఎలాంటి సందేహం లేదు. గవర్నర్ ఆదేశానుసారం రావత్ సర్కారు బలపరీక్షను ఎదుర్కోనిచ్చి ఉంటే..వ్యవహారం అక్కడికక్కడే అటోఇటోగా తేలిపోయి ఉండేది. అలా జరగనీయకుండా..తన వద్ద ఉన్న వీడియో సాక్ష్యాల సాకుతో రాజ్యాంగంలోని 356 అధికరణ ప్రయోగానికే కేంద్రం మొగ్గు చూపడం వల్లే ఈ చిక్కంతా వచ్చింది. కేంద్ర నిర్ణయాన్ని సుప్రీం కోర్టే ప్రశ్నించాల్సిన పరిస్థితికి..తానే దగ్గరుండి మరీ రావత్ బలపరీక్షను నిర్వహించాల్సిన స్థితికి దారితీసింది. ఈ మొత్తం వ్యవహారంలో లోపం ఎక్కడుంది..తన తొందరపాటుకు కారణమేమిటన్న అంశాన్ని లోతుగా విశే్లషించుకోవాల్సిన.. ఆ విధంగా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అగత్యం బిజెపికి ఎంతైనా ఉంది. శాసన వ్యవహారాల్లో కోర్టు జోక్యం చేసుకోవడమే కాకుండా..ఏకంగా తానే ‘స్పీకర్’పాత్ర వహించి మరీ బలపరీక్ష తతంగాన్ని సవ్యంగా జరిగేందుకు సుప్రీం కోర్టు ఉద్యుక్తం కావడం..ఎన్నడూ జరగనిదే..ఎమర్జెన్సీ కాలంలో కూడా కోర్టులు శాసన వ్యవహారాల్లో ఇంతగా జోక్యం చేసుకున్న దాఖలాలు లేనేలేవు. కేంద్రంలో ఎంతటి తిరుగులేని అధికారం ఉన్నా..అన్ని రాష్ట్రాల్లోనూ వీలును, అవకాశాన్ని బట్టి అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న ఆశ ఉన్నా..అందుకు ప్రజాకోర్టులే శరణ్యం అన్న వాస్తవాన్ని రాజకీయ పార్టీలు గుర్తుంచుకోవాలి. తమ చేతిలో ఉన్న రాజ్యాంగ అధికరణ ఆయుధాన్ని ఇష్టారాజ్యంగా ప్రయోగించడం కుదరదన్న విషయాన్ని ఎస్‌ఆర్ బొమ్మయ్ కేసులో సుప్రీం నిర్ద్వంద్వంగా తేల్చేసింది. అంతే కాదు ప్రత్యర్థి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను దారికి తెచ్చుకోవడానికి రాజ్యాంగ విరుద్ధమైన మార్గాల్లో వెళ్లడానికి ఎంత మాత్రం వీల్లేదన్న స్వరాన్ని ఆ కేసుపై ఇచ్చిన తీర్పులో తేటతెల్లం చేసింది. కేంద్రం దూకుడు అన్ని వేళలా సాగదన్న విషయం తేలిపోయినా..అంది వచ్చిన అవకాశాన్ని రాజకీయంగా వినియోగించుకోవాలన్న కేంద్రం ధోరణే ఉత్తరాఖండ్ వ్యవహారం చినికిచినికి గాలివానగా..రాజ్యాంగ పెను సంక్షోభంగా మారడానికి కారణమైంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన కాంగ్రెస్ పార్టీ అనంతరం జరిగిన పలు అసెంబ్లీ ఎన్నికల్లో కీలక రాష్ట్రాల్ని కోల్పోయింది. ఇటీవలే అరుణాచల్ ప్రదేశ్‌లో కూడా ఇలాంటి పరిణామాల నేపథ్యంలోనే బిజెపికి అధికారాన్ని అప్పగించాల్సి వచ్చింది. అరుణాచల్‌లో సునాయాసంగానే కాంగ్రెస్‌ను రెబెల్స్ అండతో కుప్పకూల్చి అందలమెక్కిన బిజెపికి ఉత్తరాఖండ్‌లోనూ అదే రకమైన పరిస్థితులు అందివచ్చాయి. అయితే అన్ని వేళలా ఫలితాలు ఒకేలా ఉండవు. రాజకీయంగా సవాళ్లమీద సవాళ్లను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీకి బిజెపి దూకుడును నిరోధించేందుకు అన్ని విధాలుగా అనువైన అవకాశాలే అంది వచ్చాయి. తదుపరి పర్యవసానాలతో నిమిత్తం లేకుండా..అసలు వాటిపై ఎలాంటి దృష్టీ పెట్టకుండా బిజెపి కూడా ముందుకు దూసుకుపోవడం వల్ల వ్యవహారం బెడిసి కొట్టింది. కేంద్ర నిర్ణయంలోని లోపాలు కొట్టొచ్చినట్టు కనిపించడం వల్ల మొదట రాష్ట్ర హైకోర్టు చెక్ పెట్టింది. బలపరీక్ష జరగానికి ఒక్క రోజు ముందే కేంద్ర పాలన ఎందుకు విధించారని నిలదీయడమే కాదు...దాన్ని రద్దు చేస్తూ అసాధారణ నిర్ణయమే తీసుకుంది. ఒక ప్రభుత్వానికి అసెంబ్లీలో మెజార్టీ ఉందా లేదా అన్న విషయం తేలాల్సింది అసెంబ్లీలోనేనన్న సుప్రీం గత ఆదేశాన్ని పట్టకుండా బిజెపి వ్యవహరించడం వల్ల పరిస్థితి జటిలంగా మారింది. మొదట హైకోర్టు..అనంతరం సుప్రీం కోర్టు ఈ అంశంపై తలమునకలయ్యాయి. అంతిమంగా దేశంలో ప్రజాస్వామ్యం నెగ్గింది. ఇందుకు ఎలాంటి విఘాతం ఎదురైనా వాటిని కట్టడి చేసేందుకు, పరిస్థితిని చక్కదిద్దేందుకూ తామున్నామంటూ కోర్టులు మరింతగా భరోసా ఇచ్చాయి. తాము ఏమి చేసినా చెల్లుతుందన్న ఆలోచనకు ఎంతటి మెజార్టీ ఉన్న ప్రభుత్వాలైనా స్వస్తి పలకాల్సిందే. ఆయారాం గయారాం అన్న గత రాజకీయ సంస్కృతి. అప్పట్లో ప్రభుత్వాల ఏర్పాటు ఎంత సునాయాసమో..వాటిని కూల్చేయడమూ అంతే తేలిగ్గా సాగేది! కాని ఇప్పుడా పరిస్థితి లేదు. కోర్టులతోనూ, రాజ్యాగం 356 అధికరణతోనూ అన్నింటికీ మించి ప్రజలు ఐదేళ్లూ పాలించేందుకు ఎన్నుకున్న ప్రభుత్వాలతో చెలగాటమాడితే ‘దండన’ తప్పదన్న సందేశాన్ని ఉత్తరాఖండ్ అందించింది!