సంపాదకీయం

నేరస్థులకు ‘నీడ’..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లోబరీనా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వారి ‘వాణిజ్య అనుమతి’ రద్దుకాకపోవడం ఆర్థిక బీభత్సకాండను అరికట్టే నాథుడు దేశంలో లేడన్న వాస్తవానికి మరో ధ్రువీకరణ. ‘ఇంటర్ మీడియట్’ పరీక్షను తప్పినట్టు భ్రాంతి చెందిన అనేకమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం తెలంగాణ అంతటా ఆవిష్కృతమైన విషాద దృశ్యం. జనగామ జిల్లా తరిగొప్పుల మండలం నర్సాపూర్‌లో గురువారం మరో విద్యార్థి ఈ ‘భ్రాంతి’కి బలైపోయాడు. నీల అరవింద్ అన్న పదిహేడేళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్ మీడియట్ పరీక్షా పత్రాల మూల్యాంకనంలో ఈ ‘గ్లోబరీనా’ సంస్థ చేయించిన ఘోరమైన నేరం విద్యార్థులు ఇలా పరీక్ష తప్పిన భ్రాంతికి గురికావడానికి ఏకైక కారణం. ఈ వాణిజ్య సంస్థ యజమానులు నర రూప పిశాచాలు, మానవ రూపంలోని మృగాలు, అక్రమ లాభాలను ఆర్జించడం లక్ష్యమైన దోపిడీదారులు. పని సక్రమంగా చేయకుండానే ప్రజల సొమ్మును- ప్రభుత్వాన్ని మంచి చేసుకొని- కొల్లగొట్టిన దొంగలు. ఈ సంస్థ నిర్లక్ష్యం నిజానికి ప్రాణాలను తీసిన పైశాచికత్వం! ఈ దుర్మార్గపు సంస్థకు నాలుగు కోట్ల ముప్పయి లక్షల రూపాయల విలువైన పనులను అప్పగించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఘోరమైన తప్పిదం చేసిందన్నది ధ్రువపడిన వాస్తవం! ఇంటర్ మీడియట్ పరీక్షా ఫలితాలు తప్పుల కుప్పలుగా మారడం ఈ ధ్రువీకరణ! ఉత్తీర్ణులైన విద్యార్థులు తాము పరీక్ష తప్పినామన్న భ్రాంతిని కలిగించిన భయంకర భూతం ఈ ‘గ్లోబరీనా’ వాణిజ్యపు ముఠా. ఈ భ్రాంతివల్లనే అనేక మంది విద్యార్థుల నిండు ప్రాణాలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. వారి బతుకులు వికసించకుండానే మొగ్గలుగా రాలిపోయాయి. ‘గ్లోబరీనా’ ఆర్థిక బీభత్సపు ముఠాను మూసివేయించినప్పటికీ, ఈ ముఠా నిర్వాహకులను జైళ్లపాలు చేసినప్పటికీ ప్రాణాలను తీసుకున్న విద్యార్థులు తిరిగి బతికిరారు. వారి కుటుంబాలను ఆవహించిన విషాదపు చీకటులు తొలగవు. కానీ ఇలా అనేక కుటుంబాలకు శాశ్వత నష్టం కలిగించిన ఈ దుర్మార్గపు సంస్థను మూసివేయించడం వల్ల భవిష్యత్తులో ఇలాంటి బౌద్ధిక, వాణిజ్య బీభత్స సంస్థలు పుట్టుకొని రాకుండా కొంతవరకూ నిరోధించవచ్చు! ఆ పనికి తెలంగాణ ప్రభుత్వం కాని, కేంద్ర ప్రభుత్వం కాని పూనుకొనకపోవడమే ఈ ‘మూల్యాంకన ముష్కరకాండ’లోని అతి హేయమైన వైపరీత్యం. ‘గ్లోబరీనా టెక్నాలజీస్’ ముఠావారి పాపం బద్దలయి రెండువారాలు గడిచినప్పటికీ ఈ ‘సంస్థ’మూతపడలేదు! మన దేశపు ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థను ‘ప్రపంచీకరణ’ వాణిజ్య బీభత్సకారులు నడిపిస్తున్నారన్న ఆరోపణ అందువల్ల అతార్కికం కాజాలదు... స్వదేశంలో పుట్టపగిలిన వాణిజ్య సంస్థలను సైతం ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థ’ల- మల్టీ నేషనల్ కంపెనీస్- వికృత ప్రవృత్తి ఆవహించి ఉండడం ‘ప్రపంచీకరణ’- గ్లోబలైజేషన్- విష ప్రభావం!
ఇంతటి విపత్తునకు కారణమైన ‘గ్లోబరీనా’ సంస్థను శిక్షించడానికి ఎలాంటి చర్యలను తెలంగాణ ప్రభుత్వం చేపట్టలేదు. ఆ ‘సంస్థ’ సేవలకు సంబంధించిన ఒప్పందాన్ని రద్దుచేయలేదు. ఒప్పందానికి సంబంధించిన సొమ్మును తిరిగి రాబట్టడానికి ప్రభుత్వం ప్రయత్నించడం లేదు. ఆ సంస్థకు ఇంటర్ పరీక్షల ‘పునర్ మూల్యాంకనం’- రివాల్యుయేషన్- పనిని ఒప్పచెప్పాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ధారించడం విద్యార్థులకు ‘పుండుమీద కారం చల్లడం!’ ఈ తప్పుడు నిర్ణయం ఫలితాలు ఎవరు అనుభవించవలసి వస్తుంది? ప్రజాభిప్రాయాన్ని, జనాదేశాన్ని ప్రభుత్వాలు ఇలా లెక్కచేయక పోవడం ‘ప్రపంచీకరణ’లో భాగం! దేశమంతటా ఇదే తీరు. ఒకటి కాదు, రెండు కాదు.. వాణిజ్య సంస్థలు ఆర్థిక అవినీతికి, చట్టవ్యతిరేక కలాపాలకు పాలుపడుతుండడం దేశమంతటా దశాబ్దులుగా కొనసాగుతున్న వైపరీత్యం! ఈ సంస్థలు కొన్ని మన దేశానికి చెందినవి, మరెన్నో విదేశాలకు చెందినవి. పెప్సీ, కోకో, ‘పోస్కో’, లావాసా, నెజల్,- నెస్లే-, వేదాంత, మొన్‌సాంటో, వాల్‌మార్ట్- వంటి సంస్థల అక్రమాలు బయటపడినప్పటికీ ఈ సంస్థలకు వ్యతిరేకంగా ఎలాంటి ‘శిక్షలు’ నిర్ధారణ కాలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాహక రాజకీయ పక్షాలు, ప్రతిపక్షాలు పరస్పరం నిందించుకొంటున్నాయి. కానీ ఈ రాజకీయ పక్షాలు దాదాపు అన్నీ బహుళ జాతీయ వాణిజ్య సంస్థల పట్ల అనుకూలతను మాత్రమే ప్రదర్శిస్తున్నాయి. దాదాపు అన్ని రాజకీయ పక్షాల మధ్య కొనసాగుతున్న ‘‘సమానత్వం’’ ఆయా పక్షాలు బహుళ జాతీయ వాణిజ్య సంస్థలతో నెరపుతున్న ‘మైత్రి’.. రాష్టస్థ్రాయిలో ఉన్నత విద్యకు సంబంధించిన పరీక్షలను సజావుగా నిర్వహించడానికి తెలంగాణ ఉన్నత విద్యామండలి వారు వివిధ చర్యలను చేపట్టారట. సంస్కరణలు చేయడానికి వీలుగా లోతైన అధ్యయనం చేయడానికై ఐదుగురు సభ్యుల సంఘాన్ని నియమించడం ఈ చర్యలలో ఒకటి. భవిష్యత్తులో పరీక్షల మూల్యాంకనంలో ఎలాంటి చిన్న పొరపాటు కూడ జరగరాదన్నది ఈ సంస్కరణలలో ప్రధానమైనది. ‘మూల్యాంకనం’లో తప్పులు చేసే దోషులను కఠినంగా దండిస్తారట కూడ! కానీ ఇప్పుడు ‘ఇంటర్’ పరీక్షల ‘మూల్యాంకనం’లో ఘోరమైన తప్పిదాలను చేయించి, విద్యార్థుల ప్రాణాలను బలికొన్న ‘గ్లోబరీనా టెక్నాలజీస్’ ముఠాలోని ముష్కరులను తెలంగాణ ప్రభుత్వం ఎందుకు దండించడం లేదు? మళ్లీ అదే ‘క్రూర నిర్లక్ష్య సంస్థ’కు పునర్ మూల్యాంకనం బాధ్యతలను ఎందుకని అప్పగించినట్టు??
ఈ ప్రశ్నలకు సమాధానం- మన ఆర్థిక వాణిజ్య రాజకీయ సామాజిక సాంస్కృతిక రంగాలలో తిష్ఠవేసి ఉన్న ‘బహుళ జాతీయ వాణిజ్య భూతం’. ‘పెప్సీకోలా’వంటి సంస్థల శీతల పానీయాలలో హానికరమైన విష రసాయనాలు కలిసి ఉన్నాయన్న ప్రచారం ఏళ్లతరబడి జరుగుతోంది. కానీ ఈ నేరాలకు పాల్పడిన సంస్థలు ఘన గౌరవంతో దేశమంతటా ఊరేగుతున్నాయి. ఇలాంటి సంస్థలు నిర్వహించే శంకుస్థాపనలకు, ప్రారంభోత్సవాలకు ముఖ్యమంత్రులు హాజరుకావడం వల్ల, అక్రమ వాణిజ్యవేత్తలకు గౌరవం, ఘనత పెరుగుతున్నాయి. పెట్టుబడుల సదస్సుల పేరుతో జరుగుతున్న స్వేచ్ఛా వాణిజ్య- మార్కెట్ ఎకానమీ- ఉత్సవాలకు ముఖ్యమంత్రులే కాదు,ప్రధానమంత్రులు సైతం హాజరై ‘అనుగ్రహ భాషణల’ను ఆవిష్కరిస్తుండడం ఇరవై ఆరేళ్ల ప్రపంచీకరణ ప్రహసనం.. ‘మొన్‌సాంటో’ అన్న అమెరికా సంస్థవారు విత్తనాలను అమ్మి అంతర్జాతీయ సమాజాన్ని ఏళ్లతరబడి దోచుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం అమ్మరాదని నిషేధించిన ‘బీటీ’ పత్తి విత్తనాలను సైతం ‘మొన్‌సాంటో’వారు అమ్మించగలిగినట్టు ప్రచారమైంది. ‘మొన్‌సాంటో’కు వ్యతిరేకంగా అనేక దేశాలలో రైతులు ప్రదర్శనలు చేశారు. కొన్ని దేశాల నుంచి ఈ సంస్థను వెళ్లగొట్టారట! మన దేశంలో మాత్రం ‘మొన్‌సాంటో’ తిష్ఠవేసి ఉంది. ‘నెజల్’-నెస్లే-సంస్థవారు ‘మ్యాగీ’ సేమ్యా-నూడుల్-ల పేరుతో అనేక ఏళ్లుగా భారతీయుల నోళ్లకు కడుపులకు విష రసాయనాలను పట్టించారు. ‘విషాల’ రుచి మరిగిన జనం కూడ లొట్టలు వేసుకుంటూ ఈ ‘కల్తీ’ సేమ్యాలను ఆరగించారు. కానీ ఈ ‘సంస్థ’వారి ‘కల్తీ’ బయటపడింది. ‘మ్యాగీ’ నిషేధానికి గురి అయింది. కానీ వారాల వ్యవధిలో ఈ వ్యవహారం విచిత్రమైన మలుపులు తిరిగింది. మ్యాగీ సేమ్యాలను ‘నెజల్’ సంస్థవారు యథావిధిగా అమ్మేస్తున్నారు, మన జనం కొనేస్తున్నారు. ‘వాల్‌మార్ట్’ అన్నది అవినీతికి మారుపేరు, అక్రమాలకు వాణిజ్య విగ్రహం! అమెరికాలో ఈ సంగతి ధ్రువపడింది. కానీ తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్‌లోను, దేశంలోను ‘వాల్‌మార్ట్’ చిల్లర దుకాణాలు విస్తరిస్తూనే ఉన్నాయి.
భారతీయుల జీవన విధానాన్ని ‘ప్రపంచీకరణ’ నియంత్రిస్తున్న తీరు ఇది. ‘బహుళ జాతీయత’- మల్టీ నేషనలిజమ్-అన్న పేరులోనే ‘కల్తీ’ ఉంది... జాతీయత భారతీయత సంకరమైపోతున్నాయి. ఈ స్వభావ సాంకర్యం అవినీతి రాజకీయాలను అక్రమ వాణిజ్యంలో సంకరం చేసింది. వాణిజ్యానికి రాజకీయం నీడ.. రాజకీయానికి వాణిజ్యం నీడ....!!