సంపాదకీయం

‘పెప్సీ’ బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ విద్రోహపు చరిత్ర పునరావృత్తం అవుతుండడం ప్రచారం కాని మహా విషయం. క్రీస్తుశకం 1498లో మొదలై 1947 వరకు నడచిన చరిత్రకు ఇది పునరావృత్తి. వాస్కోడిగామా అనే పోర్చుగీసు బీభత్సకారుడు మన దేశంలో అడుగుపెట్టడం 1498 నాటి కథ. 1947లో బ్రిటన్ ముష్కరులు దేశం నుండి నిష్క్రమించేవరకు విదేశీయులు మన దేశాన్ని కుళ్లగించి వేయడం అప్పుడు నడచిన చరిత్ర. 1993లో ప్రపంచీకరణ వ్యవస్థలో మన దేశం చేరడంతో 1498-1947 సంవత్సరాల మధ్య నడచిన చరిత్ర మళ్లీ మొదలైంది. ఇదీ పునరావృత్తి! అప్పుడు కూడ మన ప్రభుత్వాలు విదేశీయులను పోటీపడి ఆహ్వానించాయి. ఇప్పుడు కూడ మన ప్రభుత్వాలు విదేశీయులను పోటీపడి ఆహ్వానిస్తున్నాయి. ఈ విదేశీయులు, అప్పటి విదేశీయుల వలెనే వాణిజ్యవేత్తల ముసుగులను ధరించిన దురాక్రమణదారులు.. తస్కర ముష్కర మూకలు! గుజరాత్‌లో బంగాళా దుంపల- ఉర్లగడ్డల- ఆలుగడ్డల-ను పండిస్తున్న రైతులపై విదేశీయ, బహుళ జాతీయ వాణిజ్య సంస్థ ‘పెప్సీ’ ఆంక్షలు విధించడానికి యత్నిస్తుండడం కొనసాగుతున్న ఈ దురాక్రమణలో ఒక అంశం మాత్రమే! ‘ఉర్లగడ్డ ఉప్పేరి’-పొటాటో చిప్స్-ని తయారుచేయడానికి మన దేశానికి అమెరికా నుంచి ఐరోపా నుంచి వాణిజ్య సంస్థలు రానక్కరలేదు. వంద రూపాయల లోపు పెట్టుబడితో వీధి అరుగుమీద దుకాణం పెట్టుకున్న చిట్టివ్యాపారి ఈ ‘చిప్స్’ను తయారుచేయగలడు. తరతరాలుగా లక్షల వ్యాపారులు ఇలాంటి ‘బంగాళా దుంపల వేపుడు’ బట్టీలను దేశంలో నిర్వహించారు. ‘పేప్సీ’వంటి విదేశీయ సంస్థలు కాని వందల కోట్ల రూపాయల పెట్టుబడులు కాని, అర్థం కాని- అర్థం లేని పాశ్చాత్య ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కాని ఈ ‘ఉప్పేరి’- ఆలుగడ్డ ముక్కల-ని తయారుచేయడానికి అవసరం లేదు. మనకు అవసరం లేని విదేశీయ సంస్థలు మన దేశంలోకి చొరబడిపోవడం ‘ప్రపంచీకరణ’ ఫలితం. పెప్సీ సంస్థ వారి రకరకాల ‘బంగాళా దుంపల’ వేపుళ్ల రుచి మరగిన మనవారు ఒకటికి పది రెట్లు ధరలనుపెట్టి వాటిని కొని పరాపరా నమిలేస్తున్నారు. ‘వేఫర్స్’- పలుచని పొరల-, లేస్- పలుచని తొనలు- వంటి పేర్లతో విదేశీయ సంస్థలు మన దేశంలో తయారుచేస్తున్న బంగాళా దుంపల వేపుడు ముక్కలను ముక్కులెగరేసుకుంటూ ముసలమ్మలు, ముసలప్పలు సైతం మెక్కుతుండడం దేశహితం పట్టని మానసిక ప్రవృత్తికి నిదర్శనం. ఇంట్లో బంగాళాదుంపలు వేయించి ఇవ్వగలిగిన అమ్మలు, నాయనమ్మలు ఆ పని చేయడం లేదు. ‘మా మనుమరాలు ‘లేస్’ తప్ప మరేమీ తినదండీ..’ అని ఓ అమ్మమ్మగారు పక్కింటి స్నేహితురాలికి చెప్పడం నడుస్తున్న వైచిత్రి. ‘ఉప్పేరి’ లేదా ‘ఉప్పుచెక్కలు’అన్నవి వేయించిన ‘బంగాళా దుంపల’ పేర్లు!! ఈ పేర్లు మాయమయ్యాయి. వాటి స్థానంలో ‘లేస్’ ‘వేఫర్స్’ చెలామణి అవుతున్నాయి. ‘ప్రపంచీకరణ’ యుగంలో స్థానికమైన ‘పదజాలం’ వాడడం ‘నామోషీ’ అన్నది మనలోని అత్యధికుల భావం. ‘ప్రపంచీకరణ’ మన ఆర్థిక వ్యవస్థను మాత్రమేకాదు, సాంస్కృతిక స్వభావాన్ని చెఱచివేసింది! ‘వేపుడు కూర’ అని చెప్పడం ‘ప్రపంచీకరణ’ స్థాయికి అవమానకరం.. ‘ఫ్రై’అన్నది ఆంగ్ల పదం. ‘తిరగమోత అన్నం’ ‘పోపు అన్నం’ అని అనరాదట. ‘ఫ్రయిడ్ రైస్’అని ఉటంకించాలి! ఉర్లగడ్డ ముక్కలను వేయించి అమ్మే వ్యాపారంలోకి ‘పెప్సీ’ ‘నెజల్’- నెస్లే- వంటి సంస్థలు చొఱబడిన ఫలితం ఇది....
ఇలా అనుత్పాదక, పంపిణీ, సేవల రంగాలలో విదేశీయ సంస్థలు చొఱబడడం వల్ల చిన్న వ్యాపారులు, గ్రామీణ, కుటీర ఉత్పత్తిదారులు అడుగంటిపోయారు, స్వదేశీయ బృహత్ పారిశ్రామిక సంస్థలను సైతం విదేశీయ సంస్థలు దిగమింగుతున్నాయి. మన వ్యవసాయ రంగాన్ని సైతం విదేశీయ సంస్థలు దురాక్రమిస్తుండడం గుజరాత్ ఆలుగడ్డల ఉత్పాదకుల కడగండ్లకు కృత్రిమ నేపథ్యం. ఈ నేపథ్యాన్ని మన ప్రభుత్వాలు పనికట్టుకొని కల్పించాయి. పెద్ద పెద్ద వాణిజ్య వ్యవసాయ క్షేత్రాల- కార్పొరేట్ ఫార్మ్స్-ను ఏర్పాటుచేసుకొనడానికి బహుళ జాతీయ వాణిజ్య సంస్థలకు అనుమతినిచ్చేందుకు వీలైన చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా రూపొందించాయి. అందువల్ల ‘పెప్సీ’ సంస్థ పెద్ద పెద్ద వాణిజ్య వ్యవసాయ క్షేత్రాలలో బంగాళా దుంపలను పండిస్తోంది. పండించడమంటే- ‘పెప్సీ’ పెత్తనానికి లోబడి ‘పెప్సీ’ సూచించిన రకాల ‘ఉర్లగడ్డల’ను భారతీయ రైతులు ఉత్పత్తిచేయడం కూడ!! ‘పెప్సీ’కి సొంత వ్యవసాయ క్షేత్రాలున్నాయి, ‘పెప్సీ’కి కట్టుబానిసలైన రైతులు పండిస్తున్న పొలాలలోని ‘గడ్డల’ను కూడ ఈ సంస్థ కొంటున్నదట! తాము ఉపయోగిస్తున్న రకాల బంగాళా దుంపలను తమతో ఒప్పందం కుదుర్చుకోని రైతులు పండించరాదన్నది ‘పెప్సీ’సంస్థ వారి ‘ఆదేశం’. మన దేశానికి- వ్యాపారం చేసి లాభాలు దండుకొని పోవడానికై వచ్చిన విదేశీయ ‘ముఠా’లు ఇలా మన రైతులపై ఆంక్షలు విధించడం ప్రపంచీకరణ. మన రైతులపై ఇలాంటి విదేశీయ దళారీ ముఠాలు ‘పన్నులు’- యాజమాన్య శుల్కం- రాయల్టీ- విధిస్తుండడం ‘ప్రపంచీకరణ’. పత్తి విత్తనాలను పండించే రైతుల నుంచి ‘మెన్‌సాంటో’ అన్న విదేశీయ సంస్థవారు అక్రమంగా ‘రాయల్టీ’ని వసూలుచేశారు. ఆ కథ వేఱు!
మన ప్రభుత్వాలు అనేక సందర్భాలలో బహుళ జాతీయ వాణిజ్య సంస్థల- మల్టీ నేషనల్ కంపెనీస్-కు అనుకూలంగా వ్యవహరిస్తుండడం, రైతుల ప్రయోజనాలను పట్టించుకొనకపోవడం నడుస్తున్న విషాదం. 2001లో రూపొందిన ‘మొక్కల విత్తనాల సంరక్షణ, వ్యవసాయదారుల హక్కుల పరిరక్షణ’ చట్టం ప్రకారం భారతీయ రైతులకు తమ ఇష్టం వచ్చిన పంటలను పండించుకొనే అధికారం ఉంది. గింజలను మాత్రమేకాక తదుపరి పంటకోసం అవసరమైన ‘విత్తనాల’ను, ‘అంకురాల’ను పండించుకునే హక్కు ఉంది. కొనుగోలు చేయడానికి పరిరక్షించడానికి పెంపొందించడానికి విస్తరింపచేయడానికి అమ్మడానికి హక్కు ఉంది. నిజానికి వ్యవసాయదారుల అధికారం సహజమైనది, అనాదిగా రైతులకు సంక్రమించిన ప్రాకృతికమైనది. ఈ ప్రాకృతిక న్యాయ సూత్రాన్ని వేల ఏళ్ల రైతుల అధికారాన్ని మళ్లీ ధ్రువీకరించడానికి మాత్రమే చట్టం. కానీ ఇలాంటి చట్టాలను ప్రభుత్వాలు చేయవలసి రావడం ‘ప్రపంచీకరణలో భాగం... ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’ నిర్దేశానుసారం ఇలాంటి చట్టాన్ని రూపొందించవలసి రావడం మన దేశపు సార్వభౌమ అధికారం కుంచించుకొనిపోతోందన్న వాస్తవానికి నిదర్శనం. విచక్షణ లేని, వివేకం లేని మన ప్రభుత్వం 1993లో ఈ ‘ప్రపంచీకరణ’ను అంగీకరించింది. అప్పుడు ‘గ్యాట్’-వాణిజ్య సుంకాల సాధారణ అంగీకారం-ను, ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’ను వ్యతిరేకించిన భారతీయ జనతాపార్టీ 1998లో అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ కంటె మరింత ఉత్సాహంగా ఈ ‘ప్రపంచీకరణ’ను వ్యవస్థీకరించింది. ఇదీ జాతీయ దౌర్భాగ్యం.... అయినప్పటికీ అనవసరమైన ‘చట్టాల’ ప్రకారం కూడా మన రైతులకు ఆలుగడ్డలను మాత్రమే కాదు ఏ పంటనైనా పండించుకునే అధికారం ఉంది. కానీ గుజరాత్‌లోని రైతులకు ఈ హక్కులేదని ‘పెప్సీ’ పేచీ పెట్టింది. తమ సంస్థ ఉపయోగిస్తున్న రకం ఆలుగడ్డలను పండిస్తున్న రైతులు తమకు నాలుగు కోట్ల ఇరవై లక్షల పరిహారం చెల్లించాలని కోరుతూ ‘పెప్సీ’ యాజమాన్యం వారు గుజరాత్‌లోని న్యాయస్థానంలో దావా వేశారట! ఈ నలుగురూ పెద్ద రైతులు కాబట్టి ధైర్యంగా ‘పెప్సీ’ని లెక్కచేయకుండా ‘ఉర్లగడ్డల’ను సాగు చేస్తున్నారు. కానీ వందలాది రైతులు ఇప్పటికే ‘పెప్సీ’వారి ‘నియంత్రిత వ్యవసాయ కార్యక్రమం’లో చేరిపోయారట. కట్టుబానిసలయ్యారు. ఈ నలుగురు రైతులు కూడ తమ ‘నియంత్రణ’కు లోబడి పండించాలని, ఈ రకం ఆలుగడ్డలను తమకే అమ్మాలని ‘పెప్సీ’ కోరుతోంది. ‘దావా’వేయడం పట్ల భారతీయ కిసాన్ సంఘం తదితర సంస్థలు నిరసన ప్రకటించాయి. ‘పెప్సీ’ ఉత్పత్తులను బహిష్కరించాలన్న ఉద్యమం ఊపందుకోవడంతో ‘దావా’ను ఉపసంహరించుకొంటున్నట్టు ప్రకటించిందట! కానీ కేంద్ర ప్రభుత్వం ఇంతకాలం ‘నిద్ర’ను అభినయించడమే విచిత్రం..
తిండి పెట్టండని యాచిస్తూ ఇంటిలోకి ప్రవేశించిన ‘యాచకులు’ ముష్కరులుగా మారి ‘తస్కర క్రీడ’ను నడపడం 1498- 1947 సంవత్సరాల మధ్య నడిచిన కథ. ఐరోపా వారు ఆ ‘యాచకులు’, దోపిడీ దొంగలు. ‘ప్రపంచీకరణ’ ఫలితంగా వందలాది విదేశీయ సంస్థలు మన దేశంలోకి చొఱపడ్డాయి. పాతికేళ్లలో ఈ ‘తొండలు’ ముదిరి ఊసరవెల్లులయ్యాయి. విదేశీయ సంస్థలు ప్రస్తుతం ‘సమాంతర పాలన’సాగిస్తున్నాయి. ‘పరిపాలన’ కేవలం రాజకీయానికి, సరిహద్దుల భౌతిక రక్షణకు పరిమితం కాదు. ఆర్థిక, సాంస్కృతిక బీభత్సం కూడ దేశాన్ని బద్దలుకొట్టాలన్న విదేశీయుల విద్రోహంలో భాగం. ‘గతం’ ఇందుకు సాక్ష్యం. అందువల్ల విదేశీయ సంస్థల వస్తువులను కొంటున్నవారు, ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాలు దేశ వ్యతిరేకులే! గతంలో ‘ఈస్టిండియా కంపెనీ’ ఒక్కటి.. ఇప్పుడు ‘పెప్సీ’వంటివి వందలు, వేలు! భౌతిక బీభత్సం, ఆర్థిక బీభత్సం, సాంస్కృతిక బీభత్సం, రాజకీయ బీభత్సం- దురాక్రమణ వ్యూహంలోని ‘దుష్టచతుష్టయం...’