సంపాదకీయం

‘ప్రగతి’ ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవుడు కల్పించుకున్న ‘ప్రగతి భ్రాంతి’- ఇల్యూషన్ ఆఫ్ డెవలప్‌మెంట్-కి పది లక్షల తరగతుల జీవరాసులు బలిఅయిపోతున్నాయన్నది పర్యావరణ శాస్తవ్రేత్తల అధ్యయన నివేదికలో జరిగిన నిర్ధారణ. ‘పారిస్’ పర్యావరణ పరిరక్షణ అంగీకారానికి అనుగుణంగా జరుగుతున్న వివిధ దేశాల సమన్వయ అధ్యయనంలో భాగంగా ఈ నివేదికను రూపొందించారు. సోమవారం ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఆవిష్కృతమైన ఈ ‘అంతర్ ప్రభుత్వ’ అధ్యయన సంఘం నివేదికను నూటముప్పయి దేశాలు ఆమోదించాయట. జీవ వైవిధ్య పరిరక్షణ గురించి, పర్యావరణ సమతుల్యం గురించి శాస్ర్తియ అధ్యయనం చేయడానికి ఈ ‘అంతర్ జాతీయ’ సంఘం ఏర్పడి ఉందట. ప్రగతి పేరుతో మానవులు ప్రకృతిని గాయపరుస్తుండడం గురించి, ఇతర జీవరాసులను తుదముట్టిస్తుండడం గురించి ఈ నివేదికలో ఆందోళనను వ్యక్తం చేశారట. మానవుల జీవన రీతి- లైఫ్ స్టయిల్- ప్రకృతికి పరిపోషకంగా ఉండాలన్నది అనాదిగా భారతీయ వికాసానికి ప్రాతిపదిక! మానవుడు ప్రకృతిలోని ఒక అంశం మాత్రమేనన్నది ఈ ప్రాతిపదిక. ధరాతలంలోని ఎనబయి నాలుగు లక్షల జీవరాసులలో ఒక్క ‘రాసి’ జీవన ప్రగతి కోసం మిగిలిన జీవరాసులను బలిచేయడం అన్యాయమన్నది భారతీయ జీవన నీతి. ‘నితాంత అపార భూతదయ..’ పర్యావరణంలోని సకల జీవరాసుల పట్ల మానవునికి గల మమకారానికి ప్రతీక! ఈ భారతీయతను పాశ్చాత్య భావజాలం దిగమింగిన ఫలితం ‘ప్రగతి’ పేరుతో జరిగిపోతున్న పర్యావరణ విధ్వంసం. మానవుడు తప్ప దాదాపు అన్ని జీవరాసులు ‘స్వభావం’- ఇన్‌స్టింక్ట్- ప్రాతిపదికగా మనుగడ సాగిస్తున్నాయి. ఈ స్వభావాత్మక ప్రవర్తన- ఇన్‌స్టింక్టివ్ బిహేవియర్- ప్రతి జీవరాసి మనుగడను సహజంగా పరిరక్షిస్తోంది- ఒక ‘జీవరాసి’ మనుగడకు మరో జీవరాసి మనుగడకు మధ్య వైరుధ్యం లేదు, సంఘర్షణ లేదు, సమన్వయం మాత్రమే ఉంది. మానవుడు మాత్రమే ‘ఇన్‌స్టింక్ట్’- స్వభావం-ను అతిగమించి ప్రవర్తిస్తున్నాడు. ఇందుకు కారణం మానవుని మేధ- ఇంటలెక్ట్-! మేధావంతమైన మానవుని ప్రవర్తన- ఇంటలెక్చువల్ బిహేవియర్- ఈ ప్రాకృతిక సమన్వయాన్ని మరింతగా పెంపొందించగలదు లేదా సంఘర్షణను, జీవరాసుల మధ్య వైరుధ్యాలను సైతం రెచ్చగొట్టగలదు. మానవుని మేధాసంపత్తి ప్రాకృతిక సమన్వయాన్ని పరిరక్షించి పెంపొందించడానికి వీలైన జీవనరీతి నైతిక ప్రవృత్తి మన దేశంలో అనాదిగా వికసించాయి. ఇది సుగతితో కూడిన ప్రగతి. అందువల్ల శతాబ్దులకు పూర్వం విదేశీయులు దాడిచేసే వరకు, మన దేశాన్ని దురాక్రమించే వరకు ఈ ప్రాకృతిక యోగం భారతీయ జీవనం. బ్రిటన్‌వారు, ఐరోపావారు, అంతకు పూర్వం అరబ్బులు తదితర విదేశీయ జాతులవారు ఈ ప్రాకృతిక యోగాన్ని ధ్వంసం చేశారు. అడవులను చెట్లను నరికారు, జంతువులను జల చరాలను పక్షులను ప్రకృతిని నిర్ధాక్షిణ్యంగా వేటాడారు. ప్రకృతి మానవుని భోగ వస్తువన్న ఈ విదేశీయ దురహంకారం మన దేశాన్ని జీవన విధానాన్ని ధ్వంసం చేసింది. ఈ ప్రాకృతిక భోగం ‘ప్రగతి’ పేరుతో ఇప్పుడు మన దేశాన్ని మాత్రమే కాదు ప్రపంచాన్ని నియంత్రిస్తోంది. మానవుని జీవన రీతి పది లక్షల జీవరాసుల మనుగడకు ప్రమాదకరంగా మారిందన్న ‘అంతర్ ప్రభుత్వ సంఘం’వారి నివేదికకు ఇదంతా చారిత్రక నేపథ్యం!
ఆధునిక నాగరికత పేరుతో, అభివృద్ధి పేరుతో జరుగుతున్న ప్రాకృతిక విధ్వంసం అంతా ఇంతా కాదు. ఈ సంగతి మనదేశంలోను ఇతర దేశాలలోను పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారులు, సామాన్య ప్రజలు దశాబ్దుల క్రితమే గుర్తించారు. గుర్తించనివారు లేదా గుర్తించినప్పటికీ గుర్తించనట్టు అభినయిస్తున్నవారు అక్రమ పారిశ్రామిక వర్గాలవారు, వారి కొమ్ముకాస్తున్న రాజకీయ వర్గాలవారు. అభివృద్ధి అంటే భూమిని సస్యశ్యామలం చేయడమన్నది భారతీయ దృక్పథం. భూమికి తగినంత ప్రాకృతికమైన ఎఱువులను సమకూర్చడం, నీటి సరఫరాను మెరుగుపరచడం, వ్యవసాయానికి సహజంగా ఉపకరిస్తున్న గోసంతతిని పెంపొందించడం, పశువులను వృద్ధిచేయడం.. ఇదీ నిజమైన ప్రగతి. పాడి పంటలు సహజమైన అభివృద్ధి! ఆధునిక నాగరికత ‘ఆవృతమైన’- అలముకొన్న- తరువాత ‘అభివృద్ధి’కి అర్థం మారిపోయింది. పాడి పంటలు, పచ్చికబయళ్లు, ఆకుపచ్చని అందాలు, పశువులు, గడ్డివాములు, అడవులు, చెఱువులు- వీటిని చూసినవారు- ఆధునిక నాగరికులు- ‘ఈ ప్రాంతం ఇంకా ‘డెవలప్’ కాలేదు..’అని ఆశ్చర్యపోతున్నారు. వీరి దృష్టిలో అభివృద్ధి- డెవలప్‌మెంట్- అని అంటే చెట్లు కొట్టే, పశువులను తోలేసి భూమిని చదునుచేయడం.. ఉడుతలు, ఊర పిచ్చుకలు లేకుండా చేయడం. చదును చేసిన భూమిపై అంతస్థుల భవనాలను ఆకాశ హర్మ్యాలను కట్టడం! ఇదట ‘అభివృద్ధి’.. ఈ ‘అభివృద్ధి’భ్రాంతి వల్లనే ఇప్పుడు ప్రపంచంలోని పది లక్షల జీవరాసులు అంతరించిపోయే విపత్తు దాపురించింది. ఐరోపీయ ప్రవృత్తి ఈ కృత్రిమ ‘అభివృద్ధి’ ఆవృత్తం కావడానికి శతాబ్దులకు పూర్వం ప్రాతిపదిక! దీనికి ‘పునరావృతం’- మళ్లీ అలముకొనడం- ప్రపంచీకరణ! చరిత్ర ఇలా పునరావృత్తం అవుతోంది...
జంతుజాలం వృక్షజాలం పరస్పర పరిపోషకాలు. అందువల్లనే ‘అభివృద్ధి’ పేరుతో ఆకుపచ్చదనాన్ని హననం చేయడం వల్ల ఇప్పుడిలా పది లక్షల జీవరాసులు అంతరించిపోతున్నాయి. మానవ జీవన విధానం మారాలన్నది ‘అంతర్ ప్రభుత్వ’ అంతర్జాతీయ అధ్యయన సంఘం వారి నిర్ధారణ. మారకపోయినట్టయితే ఈ పది లక్షల జీవరాసుల- స్పీసీస్-కు మనుగడ ఉండదట! ఐదు లక్షల వృక్ష, జంతురాసులు దీర్ఘకాలంపాటు మనుగడ సాగించడానికి తగిన నివాస స్థలం లేదట! ఈ జీవరాసుల నివేశన హరిత స్థలాలు సిమెంటు కట్టడాలుగా మారిపోయాయి మరి. తిండి సరేసరి, నీటి చుక్క కూడ దొరక్క పిచ్చుకలు, అనేక జాతుల పక్షులు అంతరించిపోయాయి. ఆధునిక నాగరిక పిచ్చుకల ‘కలకల’లను విని ఎన్ని ఏళ్లయింది?? తుమ్మెదల ఝంకారాలు ఏవీ?? భూమిని సహజంగా నిరంతరం పరిపుష్టం చేయగల జీవజాలం అంతరించిపోయిన తరువాత దశాబ్దులు గడిచాయి. సస్యపోషక, భూపరిపోషక జీవరాసులు- పాలినేటర్స్- నశించాయని ఇప్పటికైనా అధ్యయన సంఘం వారు ‘‘కనిపెట్టడం’’హర్షణీయం. ఈ ‘పరిపోషకాలు’ నశించడం వల్ల ప్రపంచంలో సాలీనా నలబయి లక్షల కోట్ల రూపాయల విలువైన పంట నష్టమయ్యే ప్రమాదం వాటిల్లనున్నదట. ‘పరిపోషకాలు’ నశించిపోయాయి, కాలుష్య కారకాలు- పొల్యూటర్స్- పెరిగాయి. ఏటా ప్రపంచ మానవులు నలబయి కోట్ల టన్నుల కాలుష్య పదార్థాలను నదులలోకి సముద్రాలలోకి కలుపుతున్నారట! ఫలితంగా నీటిలోను భూమి ఉపరితలం మీదను కూడ నివసించగల జీవరాసులు- యాంఫీబియన్ స్పీసిస్-లో కప్పల వంటి శీతల శరీర ప్రాణులలో నలబయి శాతం అంతరించిపోవడానికి ‘రంగం’ సిద్ధమైపోయిందట! ఇప్పటికే కోట్లకొలదీ చేపల మృత కళేబరాలు, లక్షల తాబేళ్ల శవాలు, వేల తిమింగలాల మృతదేహాలు సముద్రాల నుండి తీరాలకు కొట్టుకొని వచ్చేశాయి. ఏళ్లతరబడి కొనసాగిన వికృత విషాదం ఇది. ప్రకృతి రోదిస్తోంది, భూమి బాధతో ప్రకంపిస్తోంది. ‘ఆధునిక నాగరికత’ పేరుతో ఆవహించిన అమానవీయ ప్రవృత్తి దీనికి కారణం. ఇన్నాళ్లకు ‘అంతర్ ప్రభుత్వ అధ్యయన’ బృందం వారు ఈ తథాకథిత- సోకాల్డ్- ఆధునిక నాగరికత- మోడరన్ సివిలిజేషన్-ను నిరసించడం, పేరు పెట్టి నిందించడం చారిత్రక శుభపరిణామం..
చతుర్ముఖ సృష్టి ప్రకృతి! భూమిపై మనుగడ సాగిస్తున్న జీవజాలం నాలుగు ముఖాలతో నలు దేశాల సమాంతరంగా వికసించడం సృష్టిక్రమం. అనాదిగా భారతీయులు ఈ క్రమాన్ని గుర్తించారు. ఉద్భిద్యములు- భూమిని లోపలి నుంచి చీల్చుకొని పైకి అంకురించేవి- వృక్షజాలం- మొదటి ముఖం. స్వేదజములు- చెమట తదితరముల నుంచి పుట్టినవి- ఏకకణ జీవులు, ఇతర క్రిములు- రెండవ ముఖం! అండ జములు- గ్రుడ్ల నుంచి జన్మిస్తున్న ప్రాణులు- మూడవ ముఖం! జరాయుజములు- గర్భం నుంచి, తల్లి కడుపులోనుంచి బయటికి వస్తున్న ప్రాణులు- నాలుగుముఖాల- సృష్టి! ఇందులో ఏ ముఖాన్ని వికృతం చేసినప్పటికీ సృష్టి- ప్రకృతి- సమగ్రతకు వైకల్యం ఏర్పడుతుంది. ఇలా వైకల్యం సంభవించకుండా నిరోధించి సమగ్రతను కాపాడగలవాడు మానవుడు. ఇలా కాపాడగలిగే జీవన పద్ధతి అనాదిగా భారతీయత.. దీన్ని పునరుద్ధరించుకోవడం వల్ల మాత్రమే ‘చతుర్ముఖ’ ప్రకృతి మళ్లీ పరిపుష్టం కాగలదు, సర్వసమగ్రం కాగలదు.. ఆరంభం పునరారంభం ఎప్పుడు??