సంపాదకీయం

పెట్టుబడుల రహస్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లడబ్బును నిరోధించడానికి వీలుగా మారిషస్ ప్రభుత్వంతో మన ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం పన్ను ఎగవేతదారుల పాలిట మరో అంకుశం. మనదేశంలో ఈ ఒప్పందం కుదుర్చుకొనడానికి అనేక ఏళ్లపాటు తటపటాయించిన మారిషస్ చివరికి అంగీకరించడం మన ప్రభుత్వం సాధించిన దౌత్యవిజయం. రెండుసార్లు పన్ను చెల్లించడాన్ని నిరోధించడానికి వీలైన ఒప్పందాలను మన ప్రభుత్వం అనేక దేశాలతో కుదుర్చుకొని ఉంది. అయితే ఈ ఒప్పందాలను దుర్వినియోగం చేసుకోగలిగిన ఘరానా వ్యక్తులు, సంస్థలు ఉభయదేశాలలోను పన్నులు ఎగవేయడం నల్లడబ్బు ఉత్పత్తికి ప్రధాన కారణం. ముప్పయి రెండేళ్లుగా మనకూ మారిషస్‌కూ మధ్య అమలులో ఉన్న ఒప్పందం వల్ల మనదేశంనుండి భారీగా నల్లడబ్బు మారిషస్‌కు తరలిపోయిందట. స్విట్జర్లాండ్, పనామా, జర్మనీ వంటి దేశాలలోవలె మారిషస్‌లో కూడ మన నల్లడబ్బు భారీగా నక్కి ఉండడానికి ఈ ఒప్పందంలోని లొసుగులు కారణం. ఇలా మనదేశంలో పన్ను ఎగవేసి మారిషస్‌కు డబ్బును తరలిస్తున్నవారు అక్కడ నల్లడబ్బును తెల్లగా మార్చి మళ్లీ మన దేశానికి తరలించుకొని వస్తున్నారట. అందువల్ల మనదేశానికి నిధులను సమకూర్చుతున్న దేశాలలో మారిషస్ అగ్రస్థానంలో ఉండడానికి వెనుకగల నల్లని రహస్యం ఇదీ. ఇప్పుడు పాత ఒప్పందంలోని లొసుగులను తొలగించడానికి వీలుగా కొత్త ఒప్పందం కుదిరింది...మారిషస్‌తో కుదిరిన కొత్త ఒప్పందం వల్ల సింగపూర్ నుంచి మారిషస్ గుండా మనదేశానికి తిరిగి వస్తున్న నల్లడబ్బును కూడ నిరోధించవచ్చు. రెండుసార్లు పన్ను విధించడం అన్యాయం, ఏదో ఒక దేశంలో తమ ఆదాయంపై పన్ను చెల్లించేవారిపై మరోదేశం పన్ను విధించరాదు! తెల్లడబ్బు పెట్టుబడుల రూపంలో మరోదేశానికి తరలినప్పుడు ఆ మరోదేశం వారు దానిపై మళ్లీ పన్ను విధించరాదు. రెండుసార్లు పన్ను విధించడాన్ని నిషేధించే ఒప్పందం-డిటిఏఏ- స్ఫూర్తి ఇదీ. కానీ మనదేశంలోని ఘరానాలు తమ నల్లడబ్బును సింగపూర్, మారిషస్ బ్యాంకులలో జమచేస్తుంటారు. ఈ ఖాతాల వివరాలు వెల్లడికావు. ఈ ఖాతాలనుంచి ఆ తరువాత ఈ మొత్తాలను ఉపసంహరించి ఆ దేశాలలోని వాణిజ్య పారిశ్రామిక సంస్థలలో పెట్టుబడులుగా పెడుతున్నారు. ఫలితంగా పన్నులు చెల్లించకుండానే నల్లడబ్బును తెల్లగా మార్చేస్తున్నారు. ఇలాంటి తెల్ల డబ్బును మళ్లీ మనదేశానికి ‘విదేశీయ ప్రత్యక్షపు పెట్టుబడుల’-ఎఫ్‌డిఐ- రూపంలో తరలించుకొని వస్తున్నారట.
మనదేశానికి తరలిస్తున్న మొత్తం ఎఫ్‌డిఐలో సగం ఈ రెండు చిన్న దేశాలనుండి దిగుమతి కావడంలోని కిటుకు ఇదే. ఇప్పుడు కుదిరిన ఒప్పందంవల్ల ఈ దిగుమతి అవుతున్న నిధులపై మన ప్రభుత్వానికి నియంత్రణ ఏర్పడుతుందట. ఎలా నియంత్రిస్తారు? పన్ను విధించడానికి ప్రాతిపదిక ఏమిటి? అన్న వివరాలు వెల్లడి కాలేదు. కానీ మనదేశం నుండి మొదట తరలిపోయి మారిషస్‌లో జమ అవుతున్న నిధులపై పెట్టుబడుల వృద్ధి పన్ను విధించడానికి కొత్త ఒప్పందం వల్ల వీలు కలుగుతుందట. ఈ ఒప్పందం ఇప్పుడు కుదరడం వల్ల ముప్పయి రెండేళ్లుగా మన ప్రభుత్వానికి వేలకోట్ల రూపాయల పన్నులు నష్టమయ్యాయని స్పష్టమైంది. ఇది మొదటి వైపరీత్యం. రెండవ వైపరీత్యం ఎఫ్‌డిఐ స్వరూపంలోని డొల్లతనం. మన ప్రభుత్వం రెండున్నర దశాబ్దులుగా ఎఫ్‌డిఐని తరలించుకొని రావడంకోసం మన్నునూ మిన్నునూ ఏకం చేస్తోంది. ఆడంబరమైన ఒప్పందాలను కుదుర్చుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం మాత్రమే కాదు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడ వేల, లక్షల కోట్ల రూపాయల ఎఫ్‌డిఐ తరలిరావడానికి వీలైన ఒప్పందాలను విదేశాలతో కుదుర్చుకుంటున్నాయి. ముఖ్యమంత్రులు విదేశాలలో పదేపదే విహరించి బహుళ జాతీయ సంస్థల యాజమాన్యాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. అవి దేశీయ యజమానులను మన రాష్ట్రాల రాజధానులకు ఇతర ప్రధాన నగరాలకు పిలిపించి విందు భోజనాలు పెడుతున్నారు. చైనా, జపాన్, అమెరికా, ఐరోపా దక్షిణ కొరియా దేశాల వాణిజ్య ప్రతినిధులు తండోపతండాలుగా వచ్చిపోతున్న ఆర్భాటం కొనసాగుతూనే ఉంది.
కానీ జరుగుతన్నదేంటి? చైనా, అమెరికా, జపాన్, ఐరోపా, కొరియా వంటి చోట్ల నుండి లభిస్తున్న ఎఫ్‌డిఐకంటె మారిషస్-సింగపూర్ మాధ్యమాల ద్వారా లభిస్తున్న ఎఫ్‌డిఐ పరిమాణం అధికంగా ఉంది. కానీ ఈ సంగతి పెద్దగా ప్రచారం కావడంలేదు. పాశ్చాత్య, పూర్వ ఆసియా దేశాల బహుళ జాతీయ సంస్థలు, నిధుల ‘మూటలను’ మోసుకొని వచ్చి మనదేశాన్ని ఉద్ధరిస్తున్నాయన్న ‘మారీచ’ బ్రాంతికి మనం ఏళ్ల తరబడి గురి అయి ఉన్నాము. ప్రపంచీకరణ సృష్టించిన విచిత్రాలలో ఇది ప్రధానమైంది. మారిషస్ నుండి సింగపూర్ నుండి మాత్రమే నిధులు భారీగా వస్తున్నాయన్న వాస్తవ వివేకం ఇప్పుడు కొత్త ఒప్పందం వల్ల ఉదయించింది. అలా వస్తున్న నిధులు మారిషస్, సింగపూర్‌లోను ఉత్పత్తి అయినవి కావు. దొంగచాటుగా మనదేశం నుండి తరలిపోతున్న నిధులు మళ్లీ మనదేశానికే ఎఫ్‌డిఐ రూపంలో వేంచేస్తున్నాయి. ‘సింగపూర్ మోడల్’ అని అంటే బహు శా ఇదేనేమో? అమరావతిని సింగపూర్ మోడల్‌ను అనుసరించి తీర్చిదిద్దాలని ఆర్భాటం చేస్తున్న వారు గుర్తించవలసిన కఠోర వాస్తవమిది. మనదేశంలోని నల్లధనమే, మారిషస్, సింగపూర్‌లనుండి వస్తున్న ఎఫ్‌డిఐ. అంతర్జాతీయ సమాజంలో ఇంతకంటె గొప్ప హాస్య ప్రహసనం బహుశా మరోటి లేదు. దీనికి తెరదించడానికి సింగపూర్‌లోనో మారిషస్‌తోనో ఒప్పందాలను కుదుర్చుకోవచ్చు. ఈ నల్లడబ్బు ప్రాతిపదికగా దళారీ భూమికను పోషిస్తున్న ఇలాంటి దేశాల ప్రభుత్వాలు నిజంగా సహకరిస్తాయా అన్నది వేచి చూడదగిన ముచ్చట. కానీ నల్లడబ్బు మనదేశం నుండి తరిపోకుండా నిఘా వ్యవస్థీకృతం అయినట్టయితే ఒప్పందాలు అవసరమే లేదు. మన డబ్బు మనదేశంలోనే పెట్టుబడిగా మారుతుంది..అలా జరిగితే విదేశీ పెట్టుబడులతో పనే లేదు. విదేశాలు పెట్టుబడుల సహాయంతో కాక స్వదేశంలోని పెట్టుబడులతో ప్రగతిని సమృద్ధిని సాధిస్తామని భారతీయ జనతాపార్టీ వారు 2014 నాటి లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రకటించి ఉన్నారు కూడ...
గత రెండేళ్లలో నల్లడబ్బు ఉత్పత్తి దారులు యాబయివేల కోట్ల రూపాయల పరోక్షపు పన్నులను ఎగకొట్టారట! ఇరవై ఒక్క వేలకోట్ల రూపాయల ఆదాయాన్ని లెక్కలలో చూపలేదట. ఈ రహస్యాన్ని ప్రభుత్వం పసికట్టి బయటపెట్టడం మారిషస్‌తో కుదిరిన ఒప్పందానికి సమాంతర పరిణామం..దొంగ రవాణా జరుగుతున్న నాలుగు కోట్ల రూపాయల విలువైన వస్తువులను కూడ అధికారులు పట్టుకున్నారట...అంతా బాగుంది కానీ పట్టుబడని, ప్రభుత్వం పసికట్టని దొంగడబ్బు విలువ ఎంత?