సంపాదకీయం

‘దప్పి’కొన్న ధరణి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్లుకు చెందిన లక్ష్మణ్ సుధాకర్ అనే ఉపాధ్యాయుడు సామాజిక మాధ్యమాల ద్వారా ఓ సందేశాన్ని ప్రసారం చేశాడు. ‘వేసవిలో నీటిచుక్క దొరకక పిచ్చుకలు, పావురాలు తదితర పక్షులు, ప్రాణులు దప్పికతో అల్లాడిపోతుంటాయి. ఒక మట్టి పిడతలో కాని ఇతర పాత్రలలో కాని నీరు నింపి మన ఇంటి ప్రహరీగోడల మీద, ఇంటి కప్పుమీద ఉంచుదాము. ఆ ప్రాణులు దప్పిక తీర్చుకుంటాయి..’ అన్నది ఆ సందేశం! ‘నితాంత అపార భూతదయ’ భారత జాతీయ అనాది జీవన ప్రవృత్తి! మండుతున్న ఎండలకు తాళలేక పిట్టలు రాలిపోతాయట! ఇలాంటి వైపరీత్యం అకస్మాత్తుగా జరుగుతుందా? లేక దప్పికతో గొంతులెండిపోయిన పిట్టలు నీరు దొరకక క్రమంగా అంతరించిపోతాయా? అన్న మీమాంస ఎప్పటి నుంచో కొనసాగుతోంది. ఇది ప్రధాన విషయం కాదు. నీటిచుక్క దొరకకపోవడం ప్రధాన వైపరీత్యం. నగరాలలో పట్టణాలలో సిమెంటు అరణ్యాల మధ్య వెలసిన అంతస్థుల భవనాలలో ఇళ్ల ముందుకాని, ఇంటి పైన కాని నీరు కన్పించదు. ‘నాగరిక ప్రగతి విస్తరణ’ వైపరీత్యాన్ని అతిక్రమించి ఇంకా మిగిలి ఉన్న మానవేతర ప్రాణులకు ఈ సిమెంటు అరణ్యాలలో నీటిచుక్కలు దొరకక పోవడం అందువల్ల అత్యంత సహజం. ఉన్న నీరంతా ‘ప్లాస్టిక్ జలాశయం’లో భద్రంగా ఉంటోంది. ఇళ్లపై ఉన్న ఈ ‘ప్లాస్టిక్’ ‘సిమెంట్’ ట్యాంకులకు భద్రంగా తాళాలు వేసి ఉంటున్నాయి. స్నానాల గదులు, శౌచాలయాలు, భూగర్భంలోని ‘హవుస్’లు ఇళ్లలోపలే ఉంటున్నాయి. అందువల్ల వీధికుక్కలకు నీటి చుక్క దొరకకపోవడం, దప్పికతో అవి నాలుకలను బయటపెట్టి అంగలార్చడం నగర వీధులలో సర్వసాధారణ దృశ్యాలు. ‘మనుషులకే లేవు.. కుక్కలకు నీళ్లుపెట్టాలా?’ అని నిలదీయడం కూడ ‘నాగరికం’లో భాగమైపోయింది. ఈ నాగరిక సామ్రాజ్యంలో మానవేతర ప్రాణులకు జీవించే హక్కు లేదన్నది ‘ధ్వని’... అందువల్ల మానవేతర ప్రాణుల ధ్వనులు సైతం అంతస్థుల భవన సముదాయాల మధ్యలో వినబడడం లేదు. వసంత ఋతువులో పట్టపగలు మిట్టమధ్యాహ్నం ఊరంతా నిశ్శబ్దంగా ఉన్నవేళ.. ఎక్కడో అక్కడ ఒక తుమ్మెద ఝంకారం వినబడడం ప్రకృతి.. దూరం నుంచి ఓ తేనెటీగ పరిమళాల పూలతోటలో పరిభ్రమిస్తున్న ధ్వని వినబడడం వసంత కాలపు ప్రకృతి.. కొత్త చిగురుల కొమ్మలలో చల్లని నీడలో సేద తీరుతుండిన కోకిలలు పలకడం ఆమని మధ్యాహ్నపు ప్రకృతి.. చిగురాకుల చిత్రగృహాలలోని ‘శుకశారికల’- చిలుకాగోరింకల- జంటలు వెలయించిన ‘గుసగుసలు’ మగత నిద్రలోని గుండెలకు హత్తుకొనడం వసంతపు మిట్టమధ్యాహ్నపు ప్రకృతి.. ఇప్పుడు వసంత ఋతువు నడుస్తోంది. వైశాఖ పూర్ణిమ వచ్చేసింది! కానీ ఈ ‘ధ్వనులేవీ’ నగరాలలో పట్టణాలలో ప్రకృతి నుంచి ‘ప్రసారం’ కావడం లేదు. ఈ ‘ధ్వనులు’ చేయగల ప్రాణుల గొంతులెండిపోయాయి! ఇళ్లముందు, ఇళ్లమీద నీటి చుక్కలు కనిపించడం లేదు. ఎండిపోయిన గొంతుతో ఏ కోకిల మాత్రం పాడగలదు? జీవ హితం కోరుతున్న లక్ష్మణ్ సుధాకర్ వంటి ఉపాధ్యాయులు, ఇతరులు ఇలా ‘పిడతల’లో నీరు నింపి ఇళ్లబయట ఇళ్లమీద ఉంచాలన్న మానవీయ ఆకాంక్షను వ్యక్తం చేయడానికి ఇదంతా నేపథ్యం...
అమలిన గంగ అవిరళ గంగ కూడ కావాలన్నది ప్రకృతిలోని జీవ వైవిధ్య సమతుల్యతను పరిరక్షించడానికి ప్రాతిపదిక. గంగానదిలో నీరు స్వచ్ఛంగా ఉండాలి. గంగానదిలో నిరంతరం నీరు ప్రవహిస్తూ ఉండాలి. నిరంతర ప్రవాహం- అవిరళ ప్రవాహం- గంగలో ఉండాలన్నది ప్రతీక మాత్రమే! ధరాతలంలోని ప్రతి ప్రవాహం ‘అవిరళం’-అవిచ్ఛిన్నం-కావాలన్నది అనాదిగా భారతీయుల ఆకాంక్ష. కొండవాగు, సెలఏఱు, ఊటబుగ్గ, నది, ఉపనది నిరంతరం ప్రవహించడం ప్రకృతి సహజత్వం! ‘ఎప్పుడు ఎడతెగక పారు ఏఱు’ ఉన్న ఊరిలోనే జీవించాలన్నది భారతీయ జీవన స్వచ్ఛత. ‘నీరు భూమిని పరిశుద్ధం చేయడం’- ఆపఃపునన్తు పృథివీం- అన్నది అనాదిగా ఋషుల ఆకాంక్ష, భారతీయుల ఆకాంక్ష! దేశమంతటా పదుల సంఖ్యలోని మహానదులు, వేల సంఖ్యలోని ఉపనదులు, లక్షలాది సహజ స్రవంతులు- ఏఱులు, వంకలు, వాగులు- నిరంతరం- అవిరళం- ప్రవహించిన చరిత్ర మనకుంది. ప్రతి పల్లె సమీపంలో ఒకటి, రెండు చిట్టి నదులు - వాగులు- ప్రవహించేవి. ప్రతి వాగు ఒక చెఱువును నింపేది. నిండిన చెఱువులు ‘మరవలు’ ఎత్తి నీరు మళ్లీ ముందుకు దూకేది! ఇదీ ‘అవిరళ గంగ’ దేశమంతటా ఆవిష్కృతమైన తీరు. జనవికేంద్రీకరణకు పల్లెలు ప్రాతిపదికలు! జల వికేంద్రీకరణకు ఎడతెగకుండా- అవిరళంగా- ప్రవహించిన అసంఖ్యాక నీటిధారలు ప్రాతిపదికలు! ఏఱులు, చెఱువులు ఉన్నచోట తవ్విన బావులలో నిరంతరం నీరు నిండి ఉండేది. ఒక గ్రామ పంచాయతీ పరిధిలో వందలాది బావులు, చెఱువులు, కుంటలు, గడుగులు, మడుగులు, చెలమలు, పడియలు, దొనలు వేసవిలో సైతం నీరు నిండి ఉండేవి! ఆవులు గేదెలు గొర్రెలు మేకలు అడవులలో మేసి చెలమలలో పడియలలో నీరు త్రాగేవి. వన్యప్రాణులకు అడవి అంతటా సెలఏళ్లలోను, గడుగులలోను మడుగులలోను కుంటలలోను నీరు పుష్కలంగా లభించేది!
ఇప్పుడివన్నీ ఎండిపోయాయి. వీటి ‘పేరులు’ కూడ మనం మరచిపోతున్నాము. నదులకు ఆనకట్టలు, గొట్టపుబావులు, నల్లా- కొళాయి-లు, రిజర్వాయర్‌లు మాత్రమే మనకు తెలిసిన జల వనరులు. వీటిలో నీరు సహజం కాదు. మానవ ప్రయత్నంలో నింపుతున్నాము! ఈ నీరు మానవుల దప్పి తీర్చడానికి సైతం చాలడం లేదు. ప్రకృతి దప్పి ఎలా తీరుతుంది? జంతుజాలం వృక్షజాలం కలసిన జీవజాలం ప్రకృతి! మానవుడు మిగిలిన జంతుజాలాన్ని, వృక్షజాలాన్ని హత్యలు చేశాడు. దశాబ్దుల ఈ హత్యాకాండ వల్ల నీరు అంతరించింది. దప్పి తీరని ప్రకృతి దహించుకొనిపోతోంది. ఈ దగ్ధజ్వాలల పొగలు సెగల వల్ల వేడిమి పెరిగింది. వసంత ఋతువుగ్రీష్మఋతువు కంటె ఎక్కువగా మండిపోతోంది, మంటలు రేపుతోంది! వన్య జంతువులు నీటిని వెతుక్కుంటూ జనావాసాలలోకి చొరబడిపోతున్నాయి. ఇలా చొరబడుతున్న దృశ్యాలు దేశమంతటా ఆవిష్కృతవౌతున్నాయి. నదులపై ఆనకట్టలు కట్టి జలాశయాలను నిర్మిస్తున్నారు. కానీ పుట్టినచోట నుంచి సముద్ర సంగమం వరకు నదులు ‘అవిరళం’గా -ఎడతెగకుండా ప్రవహించాలన్న పర్యావరణ పరిరక్షక సూత్రం గురించి ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. గంగానదిలో గంగోత్రి నుంచి సముద్రం వరకు వివిధ ఋతువులలో ఇరవై నుంచి ముప్పయి శాతం నీటిని దిగువకు వదులుతూనే ఉండాలన్నది కేంద్ర ప్రభుత్వం గత అక్టోబర్‌లో నిర్దేశించిన విధానం. ఈ సూత్రం దేశంలోని అన్ని ప్రధాన నదులకూ వర్తించాలి. అవిరళ-ఎడతెగని- ప్రవాహం వల్లనే అమలిన- స్వచ్ఛ-జలాలు లభ్యవౌతాయి. లేదంటే నీటి నదులు ఇసుక పర్రలుగా మిగిలిపోతాయి. ప్రస్తుతం గోదావరి నది భద్రాచలం వద్ద దాదాపు ఎండిపోయిందట. ఎండిపోయిన నదులలో ఉప నదులలో ఇసుకను తవ్వి నీటి పడియలను ఏర్పాటు చేసుకోవడం అనేక గ్రామాల వద్ద కనిపిస్తున్న దృశ్యం!
కాకతీయ, విజయనగర సామ్రాజ్యాలు పరిఢవిల్లిన కాలంలో క్రీస్తుశకం పదమూడవ శతాబ్ది, పదిహేడవ శతాబ్దుల మధ్యకాలంలో తెలుగు నేలపై జలకళ నాట్యం చేసింది. నదులు నీటితోనిండి పరుగులు తీశాయి. చెఱువులు నీటితో తొణికిసలాడి సతత హరిత వ్యవసాయ క్షేత్రాలను విస్తరింపచేశాయి. ఆ కాలంలో నదుల ప్రవాహాన్ని అడ్డగించి కట్టలు కట్టలేదు. నదుల నీటిని ఎగువన మళ్లించారు, ఆ నీరు చెఱువులను నింపి మళ్లీ దిగువన యధా పూర్వమార్గంలో పయనించింది. ఇదీ ‘అవిరళ ప్రవాహం’, అవిరళ గంగ. హంపీ విజయనగర క్షేత్రంలో ఇలా తుంగభద్ర నుంచి బయలుదేరిన కాలువలు పొలాలను పండించి దేవాలయంలో ప్రవహించి మళ్లీ తుంగభద్రలో కలుస్తున్నాయి. ఇదీ అవిరళత్వం! మూసీ నదిని అవిరళ ప్రవాహంగా మార్చినట్టయితే మళ్లీ స్వచ్ఛజలాల ముచికుంద అవతరిస్తుంది. ఈ అవిరళ జల వాహినుల పునరుద్ధరణ ఎప్పుడు జరుగుతుంది? కేరళలో ఆనవాలు సైతం లేని ఒక ఉపనదిని ఇటీవల పునరుద్ధరించారు. ఆ నది యథాపూర్వంగా పరుగుతీస్తోందట! ప్రజల దప్పి తీరాలి. ప్రకృతి దప్పి తీరడం ఇందుకు ప్రాతిపదిక.. మేథామథనం జరగాలి.