సంపాదకీయం

‘అమిత’ ప్రాధాన్యం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమిత్ షా ప్రాధాన్యం ఇంత గొప్పది. కేంద్రమంత్రి పదవి ప్రాధాన్యం ఇంత గొప్పది. దేశ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రాధాన్యం మరింత విస్తృతమైనది. బ్రిటన్ విముక్త భారతదేశపు తొలి ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభభాయి పటేల్ సమకాల జాతీయ మహాపురుషుల- స్టేట్స్‌మెన్-లో అగ్రగణ్యుడు. ఆయన స్వయంగా నిర్వహించినందువల్ల దేశ వ్యవహారాల మంత్రిత్వశాఖ గరిమ, ఘనత, ప్రాధాన్యం, ఔన్నత్యం మరింత పెరిగాయి. అందువల్లనే దేశ వ్యవహారాల మంత్రిత్వశాఖను నిర్వహిస్తున్నవారు మంత్రివర్గంలో ప్రధాని తరువాత ద్వితీయస్థానంలో ఉన్నారన్నది ధ్రువపడిన భావం. రాజ్యాంగ నిబంధనల ప్రకారం మంత్రులందరూ సమానులే, అయినప్పటికీ ప్రధాని తరువాతి స్థానం దేశ వ్యవహారాల మంత్రిదేనన్నది పాలనా సంప్రదాయమైంది. అలాంటి అత్యంత ప్రధానమైన పదవి అమిత్ షాను వరించడం భారతీయ జనతాపార్టీ చరిత్రలో మరో మహత్తర ఘట్టం. పార్టీ అధ్యక్ష పదవి కంటె దేశ వ్యవహారాల మంత్రి- హోమ్ మినిస్టర్- పదవి గొప్పదా? అన్న మీమాంస జరగడం సహజం.. ఎందుకంటె పార్టీ నియమావళి ప్రకారం అమిత్ షాను మరోసారి ‘మూడేళ్ల కాలవ్యవధి కల’ అధ్యక్ష పదవికి ఎన్నుకోవడానికి వీలుందట. గత ఏడాది ఈ ‘ఎన్నికలు’ జరుగవలసి ఉండింది. కానీ లోక్‌సభ ఎన్నికల సమయంలో అధ్యక్షుడుగా ఉండి అమిత్ షా పార్టీకి నాయకత్వం వహించి గెలిపించడానికి వీలుగా ఆ ‘సంస్థాగత’ ప్రక్రియను వాయిదావేశారు. అందువల్ల పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ ఇప్పుడు మొదలుకావచ్చు, అమిత్ మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నిక కావచ్చు. కానీ అమిత్‌కు మళ్లీ అధ్యక్ష పదవి కాక ఈ పదవి లభించడం దేశ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రాధాన్యాన్ని మరోసారి ధ్రువపరచిన పరిణామం. బ్రిటన్ విముక్త భారత్‌కు- లార్డ్‌వౌంట్ బాటన్ పీడ విరగడ అయిన తరువాత- మొదటి అధిపతి- గవర్నర్ జనరల్- చక్రవర్తుల రాజగోపాలాచారి. సర్దార్ పటేల్ భౌతికయాత్రను చాలించిన తరువాత రాజగోపాలాచారి కూడా కొన్నాళ్లు దేశ వ్యవహారాలను పర్యవేక్షించాడట. పండిత గోవిందవల్లభ పంత్, గుల్జారీలాల్ నందా వంటి కాంగ్రెస్ మహా నేతలు కూడ ‘హోమ్’శాఖను నిర్వహించడం ద్వారా మాత్రమే మంత్రివర్గంలో ద్వితీయ స్థానంలో ఉన్న పేరు గడించారు. 1975లో దేశంలో ‘అంతర్గత అత్యవసర స్థితి’- ఇంటర్నల్ ఎమర్జెన్సీ-ని విధించి ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థను ‘నియంతృత్వ రాజకీయ గ్రహణగ్రస్తం చేసిన’ అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ 1977 నాటి లోక్‌సభ ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయింది. ఆ ఎన్నికలలో గెలిచిన ‘జనతాపార్టీ’ప్రధానమంత్రి పదవికి మురార్జీ దేశాయ్‌ని ఎంపిక చేసింది. మంత్రివర్గంలో ప్రధాని తరువాతి స్థానం తనకే దక్కాలని చౌదురీ చరణ్‌సింగ్, బాబూ జగ్‌జీవన్‌రామ్ పరస్పరం స్పర్థ వహించినట్టు చరిత్ర చెబుతోంది. ఈ పోటీలో చరణ్‌సింగ్ నెగ్గి దేశ వ్యవహారాల మంత్రిత్వశాఖను ‘గెలుచుకున్నాడు’. జగ్‌జీవన్‌రామ్ రక్షణమంత్రిగా మంత్రివర్గంలో మూడవ స్థానాన్ని అలంకరించడం ఈ చరిత్ర. ఇప్పుడు నరేంద్ర మోదీ మంత్రివర్గంలో ‘హోమ్’శాఖ అమిత్‌ను వరించింది. మంత్రివర్గంలో అత్యంత ‘వరిష్ఠుడు’-సీనియర్- అయిన, సంస్థ అంతర్గతంగా అమిత్ షా కంటె వరిష్ఠుడైన రాజ్‌నాథ్ సింగ్‌కు రక్షణ మంత్రిత్వశాఖను నిర్వహించే అవకాశం లభించింది. ఇదీ ‘అమిత్’ ప్రాధాన్యం..
అభినవ సర్దార్ పటేల్‌గా ప్రసిద్ధుడైన లాల్‌కృష్ణ అద్వానీ దేశ వ్యవహారాల మంత్రిత్వశాఖను నిర్వహించడం ఆ మంత్రిత్వశాఖకు మరింత ప్రతిష్టను సంతరించి పెట్టిన పరిణామం. 1998లో జరిగిన ఎన్నికల తరువాత ‘భాజపా’ లోక్‌సభలో అతిపెద్ద పార్టీగా అవతరించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అటల్‌బిహారీ వాజపేయి ప్రధానమంత్రి అయ్యాడు. ఈ విజయానికి ప్రధాన కారకుడైన లాల్‌కృష్ణ అద్వానీ అప్పుడు పార్టీ అధ్యక్షుడు. అద్వానీ పార్టీ పదవిని పరిత్యజించి ‘హోమ్’మంత్రి పదవిని స్వీకరించాడు. ‘పార్టీ’ అభినవ కృష్ణార్జునులుగా ప్రసిద్ధికెక్కిన అద్వానీ, వాజపేయి 1998 నాటి విజయ కారకులు. ఇప్పటి విజయకారకులు నరేంద్ర మోదీ, అమిత్ షాలు. అందువల్ల అమిత్ షాకు హోమ్‌మంత్రి పదవి దక్కి తీరాలన్నది సంప్రదాయం కావచ్చు! కానీ అప్పుడు అద్వానీ అధ్యక్ష పదవీకాలం పూర్తయిపోయింది. ఇప్పుడు అమిత్‌కు మరోసారి అధ్యక్ష పదవిని చేపట్టగల అవకాశం ఉంది. అప్పుడు అద్వానీ రెండేళ్ల అధ్యక్ష పదవిని రెండుసార్లు నిర్వహించి ఉన్నాడు, వరుసగా మూడవసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి వీలులేదు. కానీ ఆ తరువాత ఈ అధ్యక్ష పదవీ నిర్వహణ నియమాలను ‘భాజపా’వారు అనేకసార్లు మార్చుకొనడం చరిత్ర. ‘నియమాలు మనకోసం ఉన్నాయి కాని మనం నియమాల కోసం లేము..’ అన్నది నియమ పరివర్తనకు తర్కం! అందువల్ల 1998 తరువాత ధారాళంగా నియమ పరివర్తన జరిగిపోయింది. ఇప్పుడు మరో మూడేళ్లపాటు అధ్యక్షుడుగా ఉండడానికి అమిత్‌కు అవకాశం లభించడానికి ఇదీ నేపథ్యం. అయినప్పటికీ అమిత్ షా పార్టీ అధ్యక్ష పదవి పరిత్యజించి మంత్రి పదవిని ఎంచుకొనడం ద్వారా ‘హోమ్’మంత్రి పదవి అధ్యక్ష పదవితో సమానమన్న అభిప్రాయాన్ని కలిగించాడు. లేదా ‘అధ్యక్ష’ పదవి కంటె ఈ మంత్రి పదవి స్థాయి ఎక్కువ అన్న భావాన్ని కలిగించాడు. 2014 నాటి లోక్‌సభ ఎన్నికల సమయంలో రాజ్‌నాథ్ సింగ్ పార్టీ అధ్యక్షుడు. అప్పటికి ఆయన ‘మొదటిసారి’ అధ్యక్ష కాలవ్యవధి పూర్తికాలేదు. పూర్తయిన తరువాత మరోసారి ఎన్నిక కావడానికి సైతం ఆయన అవకాశం ఉండింది. అయినప్పటికీ రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్ష పదవిని అర్ధాంతరంగా వదలిపెట్టి హోమ్‌మంత్రి పదవిని అలంకరించాడు. బహుశా అమిత్‌షా ఇదే సంప్రదాయాన్ని ఇప్పుడు పాటిస్తున్నాడు. ఈ పరివర్తనలో ప్రస్ఫుటిస్తున్న ‘్ధ్వని’ స్పష్టం..
పార్టీ అధికారంలో లేనప్పుడు అధ్యక్ష పదవికున్న ప్రాధాన్యం, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లేదన్నది ఈ ‘్ధ్వని’. ఎందుకీ తేడా? అన్నది ‘భాజపా’వారు మాత్రమేకాదు సంస్థాగత ప్రజాస్వామ్యం సజీవంగా ఉన్న ప్రతి రాజకీయ పక్షం వారు సమాధానం చెప్పదగిన ప్రశ్న. పార్టీ పదవులకు, ప్రభుత్వ అధికార పదవులకు మధ్య పోలిక ఉండరాదు. ‘పోలిక’ప్రస్ఫుటించే విధంగా రాజకీయ పరిణామక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో జనం ఈ ‘పోలిక’ను గుర్తించకుండా ఉండలేరు. వాజపేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ‘్భజపా’ జాతీయ అధ్యక్షులుగా ఉండినవారు ఆ సమయంలో ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు కారు. అప్పుడు ప్రథమశ్రేణికి చెందిన నాయకులందరూ మంత్రులుగా చేరిపోయారు. ప్రధానమంత్రికి, దేశవ్యవహారాల మంత్రికి పరమ విధేయులైన ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులకు అధ్యక్ష పదవి దక్కింది. పార్టీ అధ్యక్షుని స్థాయి కంటె పార్లమెంటరీ పార్టీ నాయకుని స్థాయి చాలా గొప్పదన్నది గ్రహించవలసి ఉండిన పాఠం. అధికారం ఉన్నప్పుడు పార్లమెంటరీ పార్టీ నాయకుడు ప్రధానమంత్రి. కానీ అధికారం లేనప్పుడు కూడ పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఉన్నాడు. కానీ ఆ సమయంలో పార్లమెంటరీ పార్టీ నాయకుని కంటె అధ్యక్షుని స్థాయి పెద్దది. ఇలా సంస్థాగత ప్రాధాన్యాలను ‘అధికారం’ నిర్ణయిస్తూ ఉండడం ప్రజాస్వామ్య వైపరీత్యం! వాజపేయి ప్రధానిగా ఉండినప్పుడు జనా కృష్ణమూర్తి పార్టీ అధ్యక్షుడుగా ఉన్నాడు. ప్రధానమంత్రి -పార్లమెంటరీ నాయకుడు-, అధ్యక్షుడు- పార్టీ అధినేత- సమాన స్థాయి కలవారన్న సిద్ధాంతాన్ని అమలు జరుపడానికి జనా కృష్ణమూర్తి యత్నించాడు. అందువల్లనే పదవీ పరిత్యాగం చేయవలసి వచ్చిన జనా కృష్ణమూర్తి కేంద్రమంత్రివర్గంలో మంత్రిగా చేరలేదు. కేంద్ర మంత్రి పదవిని పార్టీ అధ్యక్షుడుగా పనిచేసినవారు నిర్వహించరాదన్నది బహుశా జనా కృష్ణమూర్తి అభిప్రాయం కాబోలు! ‘జనా కృష్ణమూర్తి పార్టీ అధ్యక్షుడు, ఆయన నన్ను సైతం తొలగించగలడు..’ అని వాజపేయి చమత్కరించిన సంగతి ఇప్పుడు చాలామందికి గుర్తు ఉండకపోవచ్చు! అయినప్పటికీ పార్టీ అధ్యక్ష పదవిని నిర్వహించినవారు దేశ వ్యవహారాలు, రక్షణ, ఆర్థిక, విదేశ వ్యవహారాలు వంటి మొదటి నాలుగు ఉన్నత మంత్రి పదవులను స్వీకరించవచ్చునన్నది అమిత్ షా నిరూపించిన నీతి!
కుక్క ‘తోక’ను ఆడించాలని.. కాని ‘తోక’ కుక్కను ఆడించరాదు- అన్నది 1998లో ప్రధాని పదవిని స్వీకరించిన తరువాత వాజపేయి చెప్పిన మాట! పార్టీ విధానాలను ప్రభుత్వం అమలు జరపాలన్నది ఆయన చెప్పిన మాటలలోని ధ్వని. అంతేకానీ ప్రభుత్వాన్ని పార్టీ అనుకరించరాదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోని ఈ సూత్రం నిజంగా అమలు జరగాలంటే పార్లమెంటరీ నాయకునితో అన్నివిధాలుగా సమఉజ్జీ కాదగిన నాయకుడు, కనీసం సరిపోల్చదగిన నాయకుడు పార్టీ అధ్యక్షుడుగా ఉండాలి. లేనట్టయితే ‘తోక’ కుక్కను ఆడించే స్థితి క్రమానుగతంగా నడిచి తీరుతుంది. ఎంత ప్రజాదరణ కలిగిన రాజకీయ పక్షానికైనా ‘ప్రభుత్వ అధికారం’ శాశ్వతం కావచ్చు, కాకపోవచ్చు.. కానీ సిద్ధాంత నిబద్ధత, కార్యకర్తల సౌష్టవం, ప్రజాదరణ కలిగిన రాజకీయ పక్షం అస్థిత్వం మాత్రం శాశ్వతం..