సంపాదకీయం

నిర్బంధ నిష్క్రమణ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూడేళ్లలో బ్రిటన్ ప్రధానమంత్రులు ఇద్దరు రాజీనామా చేశారు.. కానీ ఐరోపా సమాఖ్య- యూరోపియన్ యూనియన్- ఈయూ-నుంచి బ్రిటన్ వైదొలగే-బ్రెగ్జిట్-ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగుతూనే ఉంది. ఈ ప్రక్రియను వ్యతిరేకించిన డేవిడ్ కామెరన్ రాజీనామా చేయవలసిన అవసరం లేకపోయినా హుందాగా ప్రధాని పదవి నుంచి తప్పుకున్నాడు. దీనికి విపరీతంగా ఎప్పుడో రాజీనామా చేయవలసి ఉండిన థెరీసా మేయ్ అనేక నెలలపాటు పదవిని పట్టుకొని వేలాడింది. పదవీ పరిత్యాగం చేసినట్టు ప్రధానమంత్రి మేయ్ శుక్రవారం ప్రకటించడం అందువల్ల ఆశ్చర్యం కాదు. ఇన్ని రోజులు ఆమె పదవిని వదలకపోవడమే ప్రజాస్వామ్యవాదులకు విస్మయం కలిగించిన విచిత్ర వ్యవహారం. ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ వైదొలగిపోవాలని నిర్ణయించడం ఐరోపాలోని దేశాల మధ్య నిహితమై ఉన్న ఆధిపత్య స్పర్థకు, అంతర్గత వైరుధ్యాలకు చారిత్రక పునరావృత్తి! మొదటి ఐరోపా యుద్ధానికి, రెండవ ఐరోపా యుద్ధానికి దారితీసిన ఈ అంతర్గత వైరుధ్యాలు మళ్లీ నిక్కి చూస్తుండడం ‘బ్రెగ్జిట్’-బ్రిటన్ ఎగ్జిట్- ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ నిష్క్రమణ-కు నేపథ్యం. ఐరోపా దేశాల మధ్య అంకురించిన ‘అంతర్ జాతీయత’కు ప్రతీక ఐరోపా సమాఖ్య. ఈ సమాఖ్య ఏర్పడినప్పటి నుంచి కూడ ‘సమాఖ్య సభ్య దేశాల’లో జాతీయ ఉన్మాదం విస్తరిస్తూ ఉండడం సమాంతర చరిత్ర. ఇలాంటి ‘జాతీయ ఉన్మాదులు’ లేక ‘జాతీయతత్త్వ నిష్ఠులు’-నేషనలిస్ట్‌లు-ఐరోపాలోని అన్ని దేశాలలోను ఉన్నారు. ప్రత్యేక ప్రతి దేశంలోను ఈ ‘జాతీయ’ రాజకీయ పక్షాలు ఏర్పడి ఉన్నాయి. అంతేకాదు ప్రతి ప్రధాన పక్షంలోను ‘ఐరోపా సమాఖ్య నిబద్ధలు’- యూరోపియన్ యూనియనిస్టులు- ‘జాతీయ ప్రత్యేకతావాదులు’ ఉన్నారు. బ్రిటన్‌లోని ప్రధాన పక్షాలు ‘కన్సర్వేటివ్ పార్టీ’లోను ‘లేబర్ పార్టీ’లోను కూడ ఇలా ‘జాతీయవాదులూ’ ఉన్నారు. ‘సమాఖ్యవాదులూ’ ఉన్నారు. బ్రిటన్ ప్రధాని థెరిసా మేయ్ ‘‘ఐరోపా సమాఖ్యనుంచి తమ దేశం వైదొలగాలని’’ కోరుతున్న ‘‘జాతీయ’’వాది. కానీ ఆమె నాయకత్వం వహిస్తున్న కన్సర్వేటివ్ పార్టీలోని పార్లమెంటు సభ్యులలో అధికులు ‘‘సమాఖ్య’’వాదులు ప్రధాన ప్రతిపక్షమైన ‘లేబర్ పార్టీ’కూడ ఇలా ‘సమాఖ్య’వాదులకూ ‘‘జాతీయ’’ సంకుచిత ప్రయోజన సిద్ధాంతవేత్తలకు మధ్య చీలిపోయి ఉంది. ఫలితంగా ‘బ్రెగ్జిట్’కు సంబంధించిన ‘బిల్లు’లకు పార్టీలకు అతీతంగా సమర్థన, వ్యితిరేకత ఏర్పడి ఉంది. ‘బ్రెగ్జిట్’ సమర్థకుల సంఖ్య కంటె వ్యతిరేకుల సంఖ్య ఎక్కువ ఉన్నందువల్లనే థెరిసా మేయ్ ప్రతిపాదించిన ‘నిష్క్రమణ ప్రక్రియ’కు బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం లభించలేదు. 2016 జూన్ 23వ తేదీన బ్రిటన్‌లో జరిగిన ‘ప్రజాభిప్రాయ సేకరణ’- రెఫరెండమ్-లో యాబయి రెండు శాతం ‘మత ప్రదాతలు’- వోటర్లు ఐరోపా సమాఖ్య నుంచి తమ దేశం వైదొలగాలని కోరారు. నలబయి ఎనిమిది శాతం తమ దేశం ‘సమాఖ్య’లో కొనసాగాలని కోరారు! ఇలా కేవలం ‘నాలుగు శాతం’ సంఖ్యాధిక్యంతో ‘బ్రెగ్జిట్’ నెగ్గినందున మరోసారి ‘రెఫరండమ్’జరగాలని పార్లమెంటు సభ్యులలో ఎక్కువమంది కోరుతున్నారు. ఈ ప్రతిపాదనకు థెరీసా మేయ్ వ్యతిరేకి. అందువల్లనే అనేక నెలలుగా బ్రిటన్ పార్లమెంటులో ‘బ్రెగ్జిట్’ వివాదగ్రస్తమైంది. ‘బ్రెగ్జిట్’పై సయోధ్య సాధించలేని థెరిసా మేయ్ ప్రధానమంత్రి పదవికి శుక్రవారం రాజీనామా చేయవలసి వచ్చింది.
ఐరోపా సమాఖ్య నుంచి విడిపోవాలన్న బ్రిటన్ నిర్ణయానికి సమాంతర విపరిణామం బ్రిటన్ నుండి విడిపోయి కొత్త స్వతంత్ర దేశంగా ఏర్పడాలని ‘స్కాట్‌లాండ్’లో ఉద్యమం సాగుతుండడం. ఇంగ్లాండు, వేల్స్, స్కాట్‌లాండ్, ఉత్తర ఐర్లాండ్ ప్రాంతాలు కలిసి ప్రస్తుతం ఒకే దేశంగా ఏర్పడి ఉన్నాయి. కానీ ఇవన్నీ ఒకప్పుడు స్వతంత్ర దేశాలు. బ్రిటన్ దీవులలో అతి పెద్ద దేశమైన ‘ఇంగ్లాండ్’ప్రపంచ దేశాలను శతాబ్దులపాటు దురాక్రమించడం, మిగిలిన మూడు దేశాలతో కలసి ‘సమాఖ్య’ను ఏర్పాటుచేసుకొనడం సమాంతర పరిణామాలు. ఇంగ్లాండ్, వేల్స్ కలసి బ్రిటన్‌గా ఏర్పడినాయి. బ్రిటన్‌తో ‘స్కాట్‌లాండ్’ చేరడంవల్ల ‘మహా బ్రిటన్’-గ్రేట్ బ్రిటన్- ఏర్పడింది. గ్రేట్ బ్రిటన్‌లో ఉత్తర ఐర్లాండ్ కలవడంవల్ల ‘యునైటెడ్ కింగ్డమ్’- యుకె- ఐక్యరాజ్యం- ఏర్పడింది. ఈ ‘ఇంగ్లండ్’నుంచి ‘యుకె’వరకూ జరిగిన రాజకీయ పరిణామక్రమంలో ‘ఐచ్ఛికం’కంటె బలవంతం ఎక్కువ. ఈ ‘సమాఖ్య’ ఏర్పడడంలో భాగంగా బ్రిటన్‌వారు ఐర్లాండ్‌ను చీల్చారు. దక్షిణ ఐర్లాండ్ ఇప్పటికీ స్వతంత్ర దేశం. బ్రిటన్‌లో భాగమైన ‘ఉత్తర ఐర్లాండ్’లో బ్రిటన్ నుంచి విడిపోవాలన్న ఉద్యమం ఏళ్లతరబడి నడుస్తోంది. ఈ ఉద్యమకారులు సాయుధ సమరం ఆరంభించడం కూడ చరిత్ర.
స్కాట్‌లాండ్‌లో కూడ ఏళ్లతరబడి విభజన ఉద్యమం జరుగుతోంది. బ్రిటన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా ‘స్కాట్ లాండ్’ ఏర్పడాలన్నది ఈ ఉద్యమ లక్ష్యం. 2014 సెప్టెంబర్‌లో జరిగిన ‘రెఫరెండం’లో యాబయి ఐదు శాతం ‘వోటర్లు’ తమ ప్రాంతం బ్రిటన్‌లో ఉండాలని తీర్పుచెప్పడంతో బ్రిటన్ ప్రభుత్వం ఊపిరి పీల్చుకోగలిగంది. ‘స్కాట్‌లాండ్’ ఒకవేళ బ్రిటన్ నుంచి విడిపోవాలని ‘ఆ జనాభిప్రాయసేకరణ’లో నిర్ణయించి ఉంచినట్టయితే ‘యునైటెడ్ కింగ్‌డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ నార్తన్ ఐర్‌లాండ్’- యు.కె. మళ్లీ నాలుగు దేశాలుగా మారడానికి రంగం సిద్ధం అయి ఉండేది. ఆ ప్రమాదం తృటిలో తప్పింది. కానీ స్పెయిన్‌లోను ఇతర ఐరోపా దేశాలలోను అనేక ప్రాంతాలు మాతృదేశాల నుంచి విడిపోయి కొత్త స్వతంత్ర దేశాలుగా ఏర్పడడానికి వీలుగా జరుగుతున్న ఉద్యమాలు మాత్రం ‘స్కాట్‌లాండ్’ ఘటనలతో ఊపందుకున్నాయి. తమ ‘జాతుల కుటుంబాన్ని’ విచ్ఛిన్నం చేయవద్దని స్కాట్ ప్రజలకు అప్పటి బ్రిటన్ ప్రధాని, కన్సర్వేటివ్ పార్టీ నాయకుడు డేవిడ్ కామెరాన్ విజ్ఞప్తి చేశాడు. స్కాట్‌లాండ్ ప్రజలు ఆయన మాటను మన్నించారు. ‘ఐరోపా సమాఖ్య’నుంచి తమ మాతృదేశాన్ని విడగొట్టవద్దని కామెరాన్ 2016 జూన్‌లో బ్రిటన్ ప్రజలకు విజ్ఞప్తిచేశాడు. కానీ బ్రిటన్ ప్రజలు ఆయన మాటను మన్నించలేదు, ఐరోపా సమాఖ్య నుంచి విడిపోవడానికే వారు నిర్ణయించారు. డేవిడ్ కామెరాన్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశాడు. నిజానికి ఆయన రాజీనామా చేయవలసిన పనిలేదు. కానీ ‘సమాఖ్య’నుంచి బ్రిటన్ విడిపోయే కార్యక్రమానికి అధ్యక్షత వహించడం ఇష్టం లేని కామెరన్ ప్రధానమంత్రి పదవిని, పార్లమెంటు సభ్యత్వాన్ని పరిత్యజించాడు. చిన్న వయసులోనే రాజకీయాల నుంచి నిష్క్రమించాడు. పదవికంటె సిద్ధాంత నిబద్ధత ప్రధానమన్నది కామెరన్ చెప్పిన పాఠం. ఇందుకు పూర్తి విరుద్ధంగా థెరీసా మేయమ్మ నిర్బంధ నిష్క్రమణ చరిత్ర ముగిసింది.
ఐరోపా సమాఖ్య ఇరవై ఎనిమిది ఐరోపా దేశాల సమీకృత ‘ఆర్థిక రాజకీయ భౌగోళిక స్వరూపం’! కానీ ఈ ఆర్థిక రాజకీయ భౌగోళిక సమైక్యం కృత్రిమమైనది, కృతకమైనది. ప్రజల మధ్య నిజమైన సమైక్య భూమిక సంస్కృతి! అది భారత్‌లో ఉంది. అనేక భాషల భారత్ ఒకే దేశం, ఒకే జాతి! ఇందుకు కారణం సాంస్కృతిక సమానత్వం. ఐరోపా వారు ఆర్థిక ప్రయోజనాల కోసం, రాజకీయ వ్యూహాత్మక ప్రయోజనాల కోసం రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఏకమవ్వాలని భావించారు. జాతీయ సంకుచిత ప్రయోజనాలు తాత్కాలికంగా శమించినప్పటికీ ఇప్పుడు మళ్లీ అవి తలెత్తాయి. ‘బ్రెగ్జిట్’కు ఇదీ కారణం...