సంపాదకీయం

ప్రగతి ప్రహేళిక..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిపుణులు నిగ్గుతేల్చిన ఆర్థిక వాస్తవాల గురించి కూడ భిన్నస్వరాలు వినబడుతుండడం ‘ప్రపంచీకరణ’ కల్పించిన మాయాజాలం. రాజకీయ వాస్తవాల గురించి పరస్పర వైరుధ్య భావాలను వేత్తలు వెళ్లగక్కుతుండడం సహజం. కానీ ప్రామాణిక వాస్తవాలు, గణాంకాలు, అధ్యయనాలు, విశే్లషణల ప్రాతిపదికగా నిర్ధారణకు గురి అవుతున్న ఆర్థికప్రగతి గురించి కూడ విభిన్న అభిప్రాయాలు వెలువడుతుండడం విచిత్రమైన వ్యవహారం. మన ‘స్థూల జాతీయ ఉత్పత్తి’-గ్రాస్ డొమస్టిక్ ప్రాడక్ట్-జిడిపి- వేగవంతంగా పెరుగుతోందని దేశ ప్రజలు మురిసిపోతున్న సమయంలో అరవింద సుబ్రహ్మణ్యం అనే ప్రముఖ ఆర్థికవేత్త ఈ ‘అధికార ఆర్థిక ఉత్సాహాన్ని’ నీరుకార్చే విధంగా పరిశోధనలను ఆవిష్కరించాడు. 2011- 2017 సంవత్సరాల మధ్య సగటున ‘జిడిపి’ ప్రతి సంవత్సరం ఏడు శాతం పెరిగిందన్నది ఇంతవరకు ప్రభుత్వ అధ్యయనాల వల్ల జరిగిన ఆధికారిక నిర్ధారణ. ఈ అధికార నిర్ధారణ వల్ల ‘ప్రగతి గౌరవం’ ప్రస్తుత ప్రభుత్వ నిర్వాహకులకు, 2011- 2014 సంవత్సరాల మధ్య ప్రభుత్వాన్ని నిర్వహించిన వారికి సమానంగా దక్కింది. 2011 నుంచి 2014 మే ఇరవై ఐదవ తేదీ వరకు ప్రభుత్వాన్ని నిర్వహించిన కాంగ్రెస్ కూటమికి, 2014 మే 26న ప్రభుత్వ నిర్వహణ బాధ్యతను స్వీకరించిన ‘్భరతీయ జనతా పార్టీ’కి కూడ అందువల్ల అరవింద సుబ్రహ్మణ్యం చేసిన ఆవిష్కరణ అంతగా రుచించదు. ఈ ఆరేళ్ల వ్యవధిలో ‘జిడిపి’ సగటున ఏటా నాలుగున్నర శాతం మాత్రమే పెరిగిందన్నది అరవింద సుబ్రహ్మణ్యం చేసిన నిర్ధారణ. అరవింద సుబ్రహ్మణ్యం రూపొందించిన పరిశోధన పత్రాన్ని హార్వర్డ్ విశ్వవిద్యాలయం వారు ప్రచురించారట! మన దేశానికి చెందిన ఏ విశ్వవిద్యాలయమైనా ఈ ‘ఆరేళ్ల స్థూల జాతీయ ఉత్పత్తి’కి సంబంధించిన ఇలాంటి పరిశోధన పత్రాన్ని ప్రచురించి ఉండవచ్చు.. ప్రచురించలేదు. ‘‘మనకు ఆకలి అవుతోందని’’ మనం చెప్పడం కంటె ఒక విదేశీయ విశ్వవిద్యాలయం చెప్పడం ‘‘ప్రాధాన్యాన్ని ప్రామాణికతను పెంచగల’’ పరిణామం. అందువల్ల సుబ్రహ్మణ్యం శోధించిన వాస్తవాలను హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఆవిష్కరించడం వల్ల ప్రచార ప్రాధాన్యం పెరిగింది. అరవింద సుబ్రహ్మణ్యం వెల్లడించిన సంగతులు వాస్తవాలు కావని మన ప్రభుత్వ గణాంక, కార్యక్రమ సమాచరణ మంత్రిత్వ విభాగం వారు స్పష్టీకరించడం ‘మీమాంస’కు మరో ఆరంభం. ఈ స్పష్టీకరణను ప్రభుత్వం ఆవిష్కరించక పోయినట్టయితే సుబ్రహ్మణ్యం వ్యాసానికి పెద్ద ప్రచారం లభించి ఉండేది కాదు. ప్రభుత్వం వారి స్పష్టీకరణ వల్ల ‘జిడిపి’ ఈ ఆరేళ్లలో సగటున ఏడు శాతం పెరిగిందా? లేక నాలుగున్నర శాతం మాత్రమే పెరిగిందా? ఏది వాస్తవం?? అన్న విషయమై చర్చ మొదలైంది. నిజాన్ని నిగ్గుతేల్చవలసిన బాధ్యత ఏర్పడింది. ఈ బాధ్యత ప్రభుత్వానిది...
అరవింద సుబ్రహ్మణ్యం 2014 అక్టోబర్ నుంచి 2018 జూన్ వరకు కేంద్ర ప్రభుత్వం వారికి ప్రధాన ఆర్థిక వ్యవహారాల సలహాదారు. అందువల్ల 2014- 2017 సంవత్సరాల మధ్య ‘జిడిపి’ పెరుగుదలను నిర్ధారించిన ప్రక్రియలో ఆయన భాగస్వామ్యం ఉండి ఉంటుంది. అలాంటప్పుడు ‘జిడిపి’ ఏడు శాతం పెరగలేదు, కేవలం నాలుగున్నర శాతం పెరిగింది- అన్న మహా విషయం అప్పుడు ఆయన దృష్టికి వచ్చిందా? లేదా? ‘‘వచ్చినప్పటికీ’’ ఆయన అప్పుడు ఈ సంగతిని ఎందుకని వెల్లడించలేదు? ప్రధాన ఆర్థిక వ్యవహారాల సలహాదారు బాధ్యతల నుంచి విముక్తమైన తరువాత ఏడాదికే ఆయన ఈ సంగతిని- జిడిపి పెరుగుదల నాలుగున్నర శాతం మాత్రమేనన్న సంగతిని- ఆయన ఎలా కనిపెట్టగలిగాడు? ‘‘ఇలా కనిపెట్టడంవల్ల కొత్త గందరగోళం ఏర్పడడం లేదా?? ఆరేళ్లపాటు రెండేళ్ల క్రితం వరకు జరిగిన ప్రగతి ఎంత? అన్నది చరిత్ర! ఎంతమేరకు ‘జిడిపి’ పెరిగి ఉండినప్పటికీ ఇప్పుడు చేయగలిగింది లేదు. ప్రస్తుత ఆర్థికస్థితి ఏమిటి? వర్తమాన ఆర్థిక సంవత్సరంలో ‘జిడిపి’ పెరుగుదల మందగించిందా? గతం కంటె వేగవంతం అయిందా?? మందగించి ఉండినట్టయితే వేగవంతం చేయడానికి ప్రభుత్వం చేపట్టతగిన చర్యలు ఏమిటి? అన్న అంశాల గురించి సుబ్రహ్మణ్యం అధ్యయనం చేసి ‘హార్వర్డ్’వ్యాసాన్ని వెల్లడి చేసి ఉండినట్టయితే అది ‘జిడిపి’ పెరుగుదల వేగాన్ని పెంచడానికి దోహదం చేసి ఉండేది. కానీ అరవింద సుబ్రహ్మణ్యం అలాంటి మార్గదర్శనానికి పూనుకోలేదు, ఆయన చేసిన ఆర్థిక శోధన ‘‘గత జల సేతుబంధనం..’’ - నీళ్లు మొత్తం ఉరికిన తరువాత ఎండిన చెఱువునకు తూములను మూయడం!
భారతీయ రిజర్వ్ బ్యాంక్ వారు ‘జిడిపి’ ఏడు శాతం వృద్ధిని సాధించగలదని 2016 డిసెంబర్‌లో ప్రకటించారు. అంతకు పూర్వం దాదాపు ఆరు నెలలపాటు 2016-2017వ సంవత్సరంలో ‘ఏడుమ్ముప్పావు’ శాతం మేర ‘జిడిపి’ ప్రగతిని సాధించగలదని ‘రిజర్వ్ బ్యాంక్’ వారు నిర్ధారించారు, ప్రభుత్వం కూడ తల ఊపింది. ఈ ప్రక్రియ జరిగిన సమయంలో అరవింద సుబ్రహ్మణ్యం కూడ ఈ పెరుగుదలను ఆమోదించాడు. 2015వ సంవత్సరం నాటి ‘రూపాయి వినిమయం విలువ’ ప్రాతిపదికగా 2008- 2015 సంవత్సరాల మధ్య మన ‘జిడిపి’ రెట్టింపు అయింది. 2008 మన ‘స్థూల జాతీయ ఉత్పత్తి’ విలువ అరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు. ‘బ్రిటన్ విముక్త భారత్’ ఈ స్థాయి ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి ఆరు దశాబ్దులు పట్టింది. కానీ ఏడేళ్లలోనే ‘జిడిపి’ విలువ రెట్టింపు అయింది. కోటీ ముప్పయి ఒక్క లక్షల కోట్ల రూపాయల స్థాయికి చేరడం గొప్పగా ప్రచారమైన సంగతి. ఈ సంగతి అప్పుడు అరవింద్‌కు తెలుసు. 2017 నాటికి మన ‘జిడిపి’ విలువ కోటీ నలబయి ఏడు లక్షల పదహారు వేల కోట్ల రూపాయలు. ఈ అంకెల వివరాల ప్రాతిపదికగా 2011- 2017 సంవత్సరాల మధ్య ‘జిడిపి’ సాలుసరి వృద్ధి ఏడు శాతమని తేలింది. అరవింద సుబ్రహ్మణ్యం ఈ ‘పరిమాణం విలువ’ తప్పు అని చెప్పలేదు. నాలుగున్నర శాతం మాత్రమే పెరిగి ఉంటే 2017 నాటికి మన ‘జిడిపి’ కోటీ నలబయి ఏడు లక్షల కోట్ల కంటె తక్కువ కావాలి! వృద్ధి శాతాన్ని తగ్గించిన సుబ్రహ్మణ్యం మొత్తం ‘పరిమాణం విలువ’ను ఎందుకు తగ్గించలేదో? ఏడు శాతం సగటు వార్షిక వృద్ధి ప్రాతిపదికగా 2017 నాటి ‘జిడిపి’ పరిమాణం విలువ ఇది. నాలుగున్నర శాతం మాత్రమే ‘జిడిపి’ పెరిగి ఉన్నట్టయితే ‘పరిమాణం’ విలువ బాగా తగ్గి ఉండాలి...
‘‘అంతర్జాతీయ ప్రమాణాలు, ప్రాతిపదికలు’’- అన్న మాయాజాలం మన ఆర్థిక వ్యవస్థను మాత్రమే కాదు. మనలోని అత్యధికుల బుద్ధిని సైతం ఆవహించి ఉండడం ‘ప్రపంచీకరణ’! కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం నడచిన చివరి సంవత్సరంలో ‘జిడిపి’ వృద్ధి శాతం దాదాపు ఐదు శాతం అని ఆధికారికంగా నిర్ధారణ జరిగింది. కానీ ఆ తరువాత ‘రూపాయి విలువ’కు ప్రాతిపదిక అయిన సంవత్సరం మారింది. 2001వ సంవత్సరం నుంచి 2011వ సంవత్సరానికి ఈ ప్రాతిపదిక మారింది. అందువల్ల 2013-2014వ ఆర్థిక సంవత్సరం ‘జిడిపి’ ప్రగతి వృద్ధి ఏడు శాతమని నిర్ధారించారు. విలువ మారితే ‘పరిమాణం’ మారాలి. కాని వృద్ధి శాతం ఎలా మారుతుంది?? అన్న ప్రశ్నకు సమాధానం లేదు. ప్రస్తుతం మన ‘జిడిపి’ విలువ దాదాపు రెండు కోట్ల లక్షల కోట్ల రూపాయలట! కానీ ఈ పెరుగుదలలో అధిక శాతం రూపాయి విలువ- అమెరికా డాలర్ ప్రాతిపదికగా - తగ్గిపోవడం వల్ల ఏర్పడింది. భారత జాతీయ స్థూల ఉత్పత్తిని విదేశీయ వినిమయ ద్రవ్యం -డాలర్- ప్రాతిపదికగా నిర్ధారించడం ‘ప్రపంచీకరణ’.. ‘డాలర్’కు అరవై రూపాయలు ఉన్నప్పటి కంటె ‘డాలర్’ విలువ డెబ్బయి రూపాయలు కావడం వల్ల మన ‘జిడిపి’ విలువ పెరిగింది. ఇదీ ఆర్థిక భ్రాంతి!!