సంపాదకీయం

‘వారసత్వ’ విముక్తి?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరాజయానికి బాధ్యత వహించి పదవి నుంచి తప్పుకునే సంప్రదాయం జవహర్‌లాల్ నెహ్రూ కాలం నుంచీ ఆ ‘కుటుంబ’ వారసత్వం కాదు. అందువల్ల ‘ భారత జాతీయ కాంగ్రెస్’ అధ్యక్ష పదవి నుంచి వైదొలగి తీరాలని రాహుల్ గాంధీ నిర్ణయించడం ఆశ్చర్యకరం. కానీ, ఇన్నాళ్లపాటు ఆయన అధ్యక్షుడుగా కొనసాగడం మరింత ఆశ్చర్యకరం. లోక్‌సభ ఎన్నికలలో తమ పార్టీ ఘోర పరాజయం పాలుకావడానికి బాధ్యత వహించి రాహుల్ గాంధీ పదవి నుంచి తప్పుకుంటున్నాడు. ఈ తప్పుకుంటున్న ‘ప్రహసనం’ మే ఇరవై మూడవ తేదీన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది. ఫలితాలు వెలువడిన తరువాత కాంగ్రెస్ జాతీయ కార్యవర్గం జరిపిన తొలి సమీక్షా సమావేశంలోనే అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేసినట్టు ప్రచారమైంది. తాను తప్పుకున్న తరువాత తమ కుటుంబం వారిని ఎవ్వరినీ అధ్యక్ష పదవికి ఎన్నుకోరాదని కూడ రాహుల్ గాంధీ కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులకు సూచించినట్టు- లేదా ఆదేశం జారీచేసినట్టు- కూడ ప్రచారమైంది. తన సోదరి ప్రియాంకమ్మను కొత్త అధ్యక్ష వరణ ప్రక్రియలోకి ‘‘లాగవద్దని’’కూడ ఆయన మే ఇరవై ఐదవ తేదీనాటి సమావేశంలో కార్యవర్గ సభ్యులను కోరినట్టు కూడ వదంతులు, వార్తలు ప్రచారమయ్యాయి. కానీ రాహుల్ పదవీ పరిత్యాగ నిర్ణయాన్ని కాంగ్రెస్ కార్యవర్గం ముక్తకంఠంతో నిరాకరించినట్టు, అధ్యక్ష పదవిలో కొనసాగ వలసిందిగా రాహుల్ గాంధీని ప్రాధేయపడినట్టు కూడ ‘‘బయటకు వినిపించింది..’’. అందువల్ల గతంలో వలెనే ఇది ‘గాంధీ కుటుంబం’వారి మరో అభినయ విన్యాసమన్న భావం కలిగింది. ఆ తరువాత నెలరోజులకు పైగా రాహుల్ గాంధీ అధ్యక్ష విధులకు దూరంగా ఉన్నట్టు అధికార, అనధికార ప్రకటనలు వెలువడ్డాయి. అధ్యక్ష పదవిలో కొనసాగి తీరవలసిందేనని రాహుల్ గాంధీకి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అభ్యర్థనలు కూడ చేశారు. రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నట్టయితే తాము కూడ తమ సంస్థాగత పదవుల నుంచి తప్పుకుంటామని వివిధ స్థాయిల నాయకులు కూడ స్పష్టం చేశారట. కొందరు రాజీనామా లేఖలను కూడ సమర్పించి రాహుల్ గాంధీ పట్ల తమ విధేయతను, విశ్వాసాన్ని ధ్రువపరిచారట. ఆయన తప్ప పార్టీని నడిపించడానికి అంతటివాడు మరొకరు లేరని అందువల్ల ఆయన అధ్యక్ష పదవిలో కొనసాగ వలసిందేనని జూన్ ఒకటవ తేదీన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాహుల్ గాంధీకి విజ్ఞప్తిచేశారట. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నాయకత్వంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు రాహుల్ గాంధీని కలసి ఈ నివేదికను సమర్పించారట. అందువల్ల నాయకుల, కార్యకర్తల విజ్ఞప్తిని మన్నించి రాహుల్‌గాంధీ తన ‘పదవీ పరిత్యాగ’ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటాడన్నది దాదాపు ఒకటిన్నర నెలలుగా ఏర్పడిన భావం. కానీ ఈ భావం కేవలం ‘భ్రాంతి’ అన్నది బుధవారం నాడు రాజీనామా లేఖను బయటపెట్టిన రాహుల్ గాంధీ ‘‘సృష్టించిన’’ఆశ్చర్యం. ఇది హర్షణీయమా? విస్మయకరమా? అన్న విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు...
మరోసారి కార్యవర్గం సమావేశమై రాహుల్ గాంధీ రాజీనామాను తిరస్కరించే అవకాశం లేకపోలేదు. మాజీ కేంద్ర మంత్రి, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వయోవృద్ధ కాంగ్రెస్ ప్రముఖుడు మోతీలాల్ వోరా బుధవారం ‘రాహుల్ గాంధీ రాజీనామా’ గురించి చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనం. వోరాను తాత్కాలిక అధ్యక్షునిగా కాంగ్రెస్ ‘అధిష్ఠానం’వారు నిర్ణయించినట్టు ప్రచారం జరిగిన సమయంలోనే ‘ఈ సంగతి నాకు తెలియదు.. ఇప్పటికీ రాహుల్ గాంధీనే అధ్యక్షుడు.. రాజీనామాను ఉపసంహరించుకోవలసిందిగా కాంగ్రెస్ కార్యవర్గం సమావేశమై ఆయనను కోరుతుంది...’అని వోరా దృశ్యమాధ్యమాలలో ఆవిష్కరించారు. అందువల్ల గురువారం నాటికి రాహుల్ నిష్క్రమణ గురించి స్పష్టత ఏర్పడవచ్చు. చివరికి రాహుల్‌గాంధీ అధ్యక్ష పదవీ పరిత్యాగం చేసినట్టయితే ‘నెహ్రూ గాంధీ కుటుంబ’ వారసత్వ చరిత్రలో అది ఆశ్చర్యకర ఘట్టం, అభూత పూర్వ పరిణామం.. 1977 మార్చిలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత పరాజయం పాలయిన కాంగ్రెస్ అధినాయకురాలు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసింది. కానీ అప్పుడు ఆమె పార్టీ అధ్యక్షురాలు కాదు. అందువల్ల పార్టీ అధ్యక్ష పదవికి ఆమె రాజీనామా చేయవలసిన అవసరం రాలేదు. రాయబరేలి లోక్‌సభ స్థానం నుంచి ఆమె పోటీచేసి పరాజయం పాలైంది. అందువల్ల లోక్‌సభలో ‘ప్రతిపక్ష నాయక’ పదవి కానీ, కాంగ్రెస్ లోక్‌సభా నాయకత్వం కానీ ఆమెకు లభించలేదు. 1989 నవంబర్ నాటి లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ ఓడింది. అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు, ఇందిరా గాంధీ తనయుడు రాజీవ్ గాంధీ అధ్యక్ష పదవిని వదలిపెట్టలేదు. ప్రధానమంత్రి పదవి పోయినప్పటికీ రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకత్వాన్ని మాత్రం వదలిపెట్టలేదు. ఇదే సంప్రదాయాన్ని సోనియా గాంధీ కూడ కొనసాగించింది. 2014 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పరాజయం పాలయినప్పటికీ సోనియాగాంధీ మాత్రం పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగలేదు.
సోనియా గాంధీ 1998 నుంచి 2017 వరకూ దాదాపు ఇరవై ఏళ్లపాటు కాంగ్రెస్ అధ్యక్ష పీఠాన్ని ఏకబిగిన అలంకరించడం కాంగ్రెస్ చరిత్రలోనే కాదు, ప్రపంచ ప్రజాస్వామ్య రాజకీయ చరిత్రలోనే అపూర్వమైన వ్యవహారం. కాంగ్రెస్ పార్టీకి పట్టిన కుటుంబ రాజకీయ గ్రహణానికి ఇది అతి ప్రధానమైన నిదర్శనం. 1950లో అప్పటి ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభభాయి పటేల్ మరణించినప్పటి నుంచి జవహర్‌లాల్ నెహ్రూ, ఆయన వారసులు మాత్రమే కాంగ్రెస్‌ను నడిపిస్తున్నారు. 1964-1969 సంవత్సరాల మధ్య ఇందిరా గాంధీ కుటుంబ ఆధిపత్యానికి కొంత విఘాతం కలిగింది. కాంగ్రెస్‌లో సమష్టి నాయకత్వం అంకురించింది. కానీ 1969లో పార్టీని చీల్చడం ద్వారా ఈ సమష్టి నాయకత్వ సంప్రదాయాన్ని ఇందిరమ్మ మొగ్గ దశలోనే తుంచివేసింది, 1977లో మరోసారి కాంగ్రెస్‌ను చీల్చింది. అప్పటినుంచి ఇప్పటివరకు నలబయి రెండేళ్లుగా ఇందిరాగాంధీ, ఆమె తనయుడు రాజీవ్ గాంధీ, ఆయన భార్య సోనియా గాంధీ, సోనియా కుమారుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్‌కు అధ్యక్షులు, అధినేతలు. 1991-1998 సంవత్సరాల మధ్య పి.వి.నరసింహారావు, సీతారాం కేసరి అధ్యక్షులు కావడం చారిత్రక వారసత్వ రాజకీయానికి తాత్కాలిక అపవాదం మాత్రమే. కుమారుడికి పట్టం కట్టడానికి మాత్రమే సోనియాగాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి వైదొలగింది. అంతేకాని పార్టీ పరాజయానికి ఆమె నైతిక బాధ్యతను మాత్రం స్వీకరించలేదు. ఇలా పరాజయ బాధ్యతను పరిగ్రహించకపోవడం జవహర్‌లాల్ నెహ్రూ నాటి కుటుంబ స్వభావం. 1962లో చైనా మన దేశాన్ని దురాక్రమించడానికి, అప్పటి మన పరాజయానికి 1949 నుంచి ప్రధానమంత్రిగా నెహ్రూ అనుసరించిన ‘జాతీయ ఆత్మహత్యా’సదృశమైన విదేశాంగ, రక్షణ విధానాలు కారణం. కానీ 1962 నాటి ఘోర పరాజయ బాధ్యతను జవహర్‌లాల్ నెహ్రూ స్వీకరించలేదు. అప్పటి రక్షణమంత్రి వి.కె.కృష్ణమీనన్‌ను పదవి నుంచి తప్పించాడు కానీ తానుమాత్రం ప్రధాని పదవి నుంచి తప్పుకోలేదు. అందువల్ల ఇప్పుడిలా రాహుల్ గాంధీ పదవి నుంచి వైదొలగి తీరుతానని పట్టుపట్టడం ‘నెహ్రూ-గాంధీ’ కుటుంబ స్వభావ వారసత్వ సంప్రదాయానికి విరుద్ధమైన ఆశ్చర్యం....
ప్రధానమంత్రి కుమారుడు ప్రధానమంత్రి కారాదనడం ఉచితం కాదు. కాంగ్రెస్ అధ్యక్షురాలి కుమారుడు కాంగ్రెస్ అధ్యక్షుడు కాకూడదనడం కూడ అన్యాయం. కానీ ఈ పదవులను పొందడానికి ప్రతిఒక్కరూ పార్టీలో క్రమంగా ఎదగాలి. వారసత్వ ప్రాబల్యం ప్రాతిపదికగాకాక స్వీయ ప్రతిభతో స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదగాలి. రాహుల్ గాంధీ కాని అతని తల్లిదండ్రులు కాని కాంగ్రెస్‌లో అలా సంస్థాగత ప్రక్రియ ద్వారా ‘ఎదగ’లేదు. వారసత్వ‘బలం’తో ‘ఎగిరి’ అధ్యక్షపీఠంపై ఆసీనులైపోయారు. అందువల్లనే రాహుల్ గాంధీ వంటి ‘‘రాజకీయ విదూషకుడు’’ ఒకప్పుడు మహాత్మా గాంధీ నాయకత్వం వహించిన మహా సంస్థకు అధ్యక్షుడయ్యాడు. ఆయన వైదొలగడం వల్ల కలిగిన ఆశ్చర్యం కంటె ఆయన అధ్యక్షుడు కావడం వల్ల కలిగిన ఆశ్చర్యం అందువల్లనే మరింత విస్తృతమైనది. ‘‘కాంగ్రెస్ విముక్త భారత్’’ను కోరడం ప్రజాస్వామ్య వ్యతిరేక దుష్టవాంఛ. వారసత్వ రాజకీయ విముక్త కాంగ్రెస్ అవతరించడం ప్రజాస్వామ్య ఆకాంక్ష! ఆకాంక్ష సాకారం అయ్యేనా..?