సంపాదకీయం

నిర్మాణ మీమాంస..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలకు నూతన సచివాలయ నిర్మాణ పథకం కేంద్ర బిందువుగా మారి ఉండడం నడుస్తున్న చరిత్ర. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యక్రమాలకు నూతన రాజధాని నిర్మాణ పథకం కేంద్ర బిందువు కావడం నడచిన చరిత్ర. ఆంధ్రప్రదేశ్‌లో ఈ చరిత్రగతి ‘మందకొడి’ కావడం, తెలంగాణలో ఈ చరిత్ర వేగవంతం కావడం సమాంతర పరిణామాలు! అంతర్జాతీయ మహానగరం నిర్మించి తీరుతామని ఐదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు భూన భోంతరాళాలు మారుమోగించడం ఈ చరిత్ర. ఈ అంతర్జాతీయ వ్యామోహభ్రాంతి జాతీయతను, దేశ స్వాభిమాన స్వయం సమృద్ధిని కించపరచడం కూడ చరిత్ర. ‘మహానగర నిర్మాణం భారతీయ శిల్పుల వల్ల, స్థపతుల-ఇంజినీర్‌లు- వల్ల, సంస్థల వల్ల, నిర్మాణ కళాశ్రామికుల వల్ల సాధ్యం కాదన్నది చంద్రబాబు ప్రసంగాలలో, ప్రగతి పథకాలలో ధ్వనించిన భ్రాంతి! అందువల్లనే ‘సింగపూర్’, ‘మలేసియా’, ’చైనా’ నమూనాలు కావలసి వచ్చాయి. ‘బుర్కినోపాసో’ నమూనాలను కూడ తెప్పించారేమో తెలీదు. విదేశీయ సంస్థలు, విదేశీయ నిపుణులు, విదేశీయ పరిజ్ఞానం, విదేశీయ ఆర్భాటం ఐదేళ్లు తాండవించిన ‘అమరావతి’ ప్రాంగణంలో భారతీయత ఆనవాళ్లు అంతరించిపోతాయన్న భయాందోళనలను పట్టించుకున్న దాఖలా లేదు. దిక్కుతోచక బిక్కుబిక్కుమంటూ ఎక్కడో నక్కి ఉండిన ‘భారతీయత’ ఇప్పుడైనా అమరావతి ప్రాంగణానికి తిరిగి వస్తుందా? అన్నది వేచి చూడదగిన అంశం. తెలుగుదేశం పార్టీ- తెదెపా- అధికారచ్యుతికి గురి అయిన తరువాత ఈ ‘అంతర్జాతీయ ఆర్భాటం’ కొంత తగ్గడం మాత్రం వాస్తవం. ఇదీ ‘రాజధాని’ నిర్మాణంలో ఏర్పడిన మందకొడి తనానికి నేపథ్యం. విదేశీయ సంస్థలను వెళ్లగొట్టి, స్వదేశీయ పరిజ్ఞాన, పద్ధతులకు ప్రస్తుత ప్రభుత్వ నిర్వాహకులు అమరావతి ప్రాంగణంలో ప్రవేశం కల్పిస్తారా? అన్నది వేచి చూడదగిన వ్యవహారం.
ఆంధ్రప్రదేశ్‌లో అంతర్జాతీయ మహానగర నిర్మాణ ఆర్భాటానికి తాత్కాలికంగా ‘విశ్రాంతి’ లభించిన తరుణంలో, తెలంగాణ ‘సచివాలయ పునర్ నిర్మాణ’ కార్యక్రమం ఒక వైపున ఊపందుకొనడం, మరోవైపు వివాదగ్రస్తం కావడం ‘కాకతాళీయ’ సంగవ ఘట్టం కావచ్చు కాకపోవచ్చు. కానీ ఆకుపచ్చని అందాలతో భూమాతను అలరింపచేయడానికి ఐదు ఏళ్లుగా కృషిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఈ స్ఫూర్తికి విరుద్ధంగా సచివాలయ పునర్ నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టడమే విచిత్రం. ఇప్పుడు ‘సచివాలయం’ ఉన్నచోట దశాబ్దుల తరబడి జన సమ్మర్దం కేంద్రీకృతమై ఉంది. రహదారులు భరించలేక పగిలిపోతున్న రీతిలో వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. రాకపోకలు స్తంభించడం, ప్రకృతికి ఊపిరి ఆడకపోవడం సచివాలయ పరిసరాలలో నెలకొని ఉన్న వైపరీత్యాలు. వివిధ రకాల కాలుష్యాలు కొలువుతీరి ఉండడం ఈ ‘ఊపిరి ఆడని ప్రాకృతిక దుస్థితి’కి కారణం. ‘హరిత హారం’ పథకం ద్వారా చెట్లను పెంచి ప్రకృతిని స్వచ్ఛంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఇందుకు- ఈ లక్ష్యసాధనకు- విరుద్ధంగా ఉన్నచోటనే- ఉన్న భవనాలను కూల్చి- సచివాలయాన్ని మళ్లీ నిర్మించాలని యత్నిస్తుండడం విచిత్రం. సచివాలయాన్ని మళ్లీ అక్కడే నిర్మించడం వల్ల రాకపోకల రద్దీ, వాతావరణ కాలుష్యం పెరుగుతాయి. అలాగే ‘ఎఱ్ఱమంజిల్’ అన్న మరో జన కేంద్రీకృత, కాలుష్య కేంద్రీకృత ప్రాంతంలో శాసనసభ భవనాన్ని నిర్మించడం కూడ ‘హరితహారం’ స్ఫూర్తికి విరుద్ధం కాగలదు. ఈ మొత్తం ‘కూల్చివేత- పునర్ నిర్మాణం’ వ్యవహారం ప్రస్తుతం ఉన్నత న్యాయస్థానం పరిశీలనలో ఉంది. అందువల్ల హైకోర్టు నిర్ణయం వెలువడేవరకు వేచి ఉండక తప్పదు.
కానీ జంట నగరాలకు వెలుపల సచివాలయ భవన సముదాయాన్ని, విధాన మండలి- శాసనసభ, శాసన మండలి- భవనాలను, ఉన్నత న్యాయస్థానం భవనాలను నిర్మించడం వల్ల మహానగర మధ్యంలో జనసమ్మర్దం, రాకపోకల రద్దీ, కాలుష్య కేంద్రీకరణ తగ్గిపోతాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయమై ఎందుకు ఆలోచించడం లేదు. ప్రస్తుతం సచివాలయం నెలకొనిన ప్రాంతం నుంచి కనీసం యాబయి కిలోమీటర్ల పరిధికి ఆవల ఈ నూతన భవన వాటికను నిర్మించవచ్చు. కనీసం ‘బాహ్య వలయ పథం’- ఔటర్ రింగ్ రోడ్- దాటిన తరువాత ఏ దిక్కునైనా నూతన సచివాలయాన్ని నిర్మించవచ్చు. ఇలా నిర్మించడం వల్ల ‘మహానగరం’ నిలువున కాక అడ్డంగా పెరిగే అవకాశం ఉంది. అంతస్థుల భవనాలను ఆకాశహర్మ్యాలను నిర్మించడం వల్ల నగరం నిలువున పెరిగింది, పెరుగుతోంది. ఇలా నగరాలు నిలువున పెరగడం వల్ల ఒక ‘కుటుంబం’ నెత్తిపై మరో కుటుంబం, ఆ ‘కుటుంబం’ తలపై వేరొక కుటుంబం... ఇలా వందలాది కుటుంబాలు నివసిస్తున్నాయి. గతంలో పది మంది నివసించినచోట ప్రస్తుతం నలబయి, యాబయి మంది కేంద్రీకృతం అయ్యారు. హైదరాబాదులోనే కాదు ప్రతి నగరంలోను కాలుష్యం పెరగడానికి, వాహనాల తాకిడిని తట్టుకోలేక, బరువును భరించలేక రహదారులు కుంగిపోవడానికి పగిలిపోవడానికి, భూగర్భ జలాలు ఇంకిపోవడానికి ఇదీ కారణం. అందువల్ల నగరాలను నిలువున కాక అడ్డంగా పెంచడం మాత్రమే ఈ వైపరీత్యాల నిరోధానికి నివారణకు ప్రత్యామ్నాయం. పరిజ్ఞాన పాటవ ప్రకటన కోసం, ‘గరిమ’ను ధ్రువీకరించుకోవడం కోసం అరుదుగా ఒకటి రెండుచోట్ల అనేక అంతస్థుల భవనాలను నిర్మించవచ్చు. కానీ జనావాసాలను కార్యాలయాలను సచివాలయాలను వాణిజ్య కేంద్రాలను విద్యాలయాలను అనేకానేక కార్యక్రమ కేంద్రాలను ఒకటి రెండు అంతస్థులతో మాత్రమే నిర్మించడం వల్ల నగరాలలో కాలుష్యం కేంద్రీకృతం కాకుండా నిరోధించవచ్చు. తంజావూరులో బృహదీశ్వరాలయం, ఇంద్రప్రస్థం- ఢిల్లీ-లో ‘కీర్తిస్తంభం’ వంటి ఉన్నతోన్నత కట్టడాలను, ఎత్తయిన కోటలను బురుజులను నిర్మించిన ప్రాచీన భారతీయులు తమ వాస్తు కళానైపుణ్యాన్ని ధ్రువపరిచారు. కానీ అంతస్థుల భవనాలను నిర్మించలేదు.. చేతకాక కాదు, కాలుష్యాన్ని కేంద్రీకరించడం ఇష్టం లేక!!
అందువల్ల ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు- ‘అడ్డంగా నగరాలను విస్తరింపచేసే’ కాలుష్య నియంత్రణ నిర్మాణ పద్ధతులను చేపట్టడం, పర్యావరణ పరిరక్షణకు దోహదకరం. ‘పరిపాలన కేంద్రం’- అడ్మినిస్ట్రేటివ్ సెంటర్- కానక్కరలేదు, వాణిజ్య కేంద్రం కారాదు, తీర్థస్థలాలు పారిశ్రామిక వాటికలు కారాదు. నలంద తక్షశిల వంటి ప్రాచీన భారత విద్యాకేంద్రాలు రాజధానులు కాలేదు. రాజధాని నగరాలు వాణిజ్య వాటికలుగా మారలేదు. భారతీయ నగర నిర్మాణ పద్ధతిని ప్రస్తుతం ఇతర దేశాలవారు పాటిస్తున్నారు. క్రీస్తుశకం పదునాలుగవ శతాబ్దినాటి హంపీ విజయనగరం ఏడు ప్రాకారాలుగా నిర్మితమైందన్నది చారిత్రక వాస్తవం. పొలాల మధ్య ఇళ్ల సముదాయాలు, ఇళ్ల సముదాయాల మధ్య తోటలు.. ఇదీ నగరాలు అడ్డంగా విస్తరించిన తీరు. అందువల్ల ‘అమరావతి’ని పాలన నగరంగా మాత్రమే రూపొందించడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కర్తవ్యం. వాణిజ్య నగరాన్ని, చిత్ర నగరాన్ని, క్రీడా నగరాన్ని, విద్యా నగరాన్ని వేఱువేఱు జిల్లాలలో నిర్మించండి! తెలంగాణ ప్రభుత్వం కూడ ‘కొత్త పాలన నగరాన్ని’ లేదా పట్టణ వాటికను హైదరాబాద్‌కు దూరంగా నిర్మించడం వల్ల కాలుష్యం తగ్గుతుంది. ప్రస్తుతం సచివాలయం ఉన్నచోట పండ్ల తోటలను పెంచడంవల్ల నగర హరితశోభ పెంపొందుతుంది. కోతుల బెడదను నివారించాలంటే వాటికి ఆహారాన్ని సమకూర్చగల ‘పండ్ల చెట్ల’ను నగరాలలో పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా చెప్పి ఉన్నారు...