సంపాదకీయం

తీరు మారని ‘తోడేలు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తదుపరి ‘దలైలామా’ను తాము నియమిస్తామని చైనా ప్రభుత్వ నిర్వాహకులు ప్రకటించడం దురహంకార ప్రవృత్తికి, దురాక్రమణ చిత్తవృత్తికి మరో నిదర్శనం. తమ నిర్ణయాన్ని వ్యతిరేకించరాదని, దాన్ని అమలు జరుపడంలో జోక్యం చేసుకోరాదని మన ప్రభుత్వాన్ని చైనా నియంతలు హెచ్చరించడం అక్రమ ఆధిపత్య వైఖరికి, దౌత్య దౌర్జన్యానికి మరో నిదర్శనం. రెండువేల ఐదువందల ఏళ్లపాటు స్వతంత్ర దేశంగా మనుగడ సాగించిన టిబెట్- త్రివిష్టప- దేశాన్ని క్రీస్తుశకం 1949-1959 సంవత్సరాల మధ్య చైనా దురాక్రమించడం చరిత్ర. టిబెట్ అధినేత దలైలామా చైనా సైనికుల హత్యాకాండకు బలికాకుండా తప్పించుకొని మన దేశానికి వచ్చాడు. దలైలామా టిబెట్ ప్రజల అత్యున్నత ధర్మాచార్యుడు. 1959లో దలైలామా మన దేశానికి వచ్చి, హిమాచల్‌ప్రదేశ్‌లోని ‘్ధర్మశాల’లో టిబెట్ ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. 1959లో యువకుడైన దలైలామా ప్రస్తుతం ఎనబయి నాలుగేళ్ల వృద్ధుడు. టిబెట్‌ను చైనా దురాక్రమణ నుంచి విముక్తం చేసి, మళ్లీ స్వతంత్ర దేశంగా రూపొందించడం ‘టిబెట్ ప్రవాస ప్రభుత్వ’ లక్ష్యం. దాదాపు నలబయి ఐదేళ్లు ‘మాతృభూమి’ని చైనా కబంధ బంధం నుంచి విముక్తి చేయడం లక్ష్యంగా ప్రవాస ప్రభుత్వాన్ని నడిపిన దలైలామా 2005లో మాట మార్చాడు, ‘స్వతంత్ర టిబెట్’లక్ష్యాన్ని వదలుకున్నాడు. 2006 నుంచి ఆయన రాజకీయ సంన్యాసం స్వీకరించాడు. చైనాలో ‘‘అంతర్భాగంగానే టిబెట్ కొనసాగాలని’’, అయితే తమ ప్రాంత ప్రజల రాజకీయ సాంస్కృతిక అధికార పరిరక్షణకు వీలుగా స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించాలని దశాబ్దికి పైగా దలైలామా కోరుతున్నాడు. అందువల్ల ప్రవాస టిబెట్ ప్రజల స్వాతంత్ర ఉద్యమం బలహీనపడింది. అయినప్పటికీ ప్రవాస టిబెట్ ప్రజలలో అత్యధికులు టిబెట్ స్వాతంత్య్రాన్ని కోరుతున్నారు. 2016లో ప్రవాస టిబెట్ పార్లమెంటుకు జరిగిన ఎన్నికలలో ఈ విభేదాలు ప్రస్ఫుటమయ్యాయి. దాదాపు నాలుగు లక్షల డెబ్బయి తొమ్మిది వేల చదరపుకిలోమీటర్లను విశాల టిబెట్‌లోని ప్రాకృతిక భూగర్భ సహజ సంపదను కొల్లగొడుతున్న చైనా టిబెట్ పర్యావరణకు మాత్రమేకాక మన దేశపు పరిసరాలకు సైతం తీరని హాని కలిగిస్తోంది. ‘అపురూప భూగర్భ ధాతువుల’- రేర్ అర్త్ ఎలిమెంట్స్- నిక్షిప్తమై ఉన్న టిబెట్ ‘‘బంగారపు గని’’. కానీ టిబెట్ ప్రజల సంపదను వారికి దక్కనివ్వకుండా చైనా తన్నుకొని పోతోంది, తరలించుకొని పోతోంది. అందువల్ల టిబెట్‌లో స్వాతంత్య్ర విప్లవ జ్వాలలు చల్లారలేదు. ఉండి ఉండి భగ్గుమంటున్నాయి. దలైలామా తమకు అనుకూలంగా మారి ఉన్నప్పటికీ చైనా నియంతలు సంతృప్తిచెందడం లేదు. ప్రవాసీ టిబెట్ ప్రజలలోను, టిబెట్‌లోను నిహితమైన మాతృదేశ స్వాతంత్య్ర కాంక్ష ఎప్పుడైనా విప్లవాగ్నిగా మారి విరుచుకొనే ప్రమాదం ఉందన్నది చైనా నియంతల భయం. అందువల్లనే స్వాతంత్య్ర లక్ష్యాన్ని దలైలామా వదలుకొన్నప్పటికీ దలైలామాను మాత్రం చైనా ‘కమ్యూనిస్టులు’ ఇప్పటికీ నీచమైన పదజాలంతో నిందిస్తున్నారు.
ప్రస్తుత ‘దలైలామా’ తరువాత టిబెట్ ప్రజల అత్యున్నత ధర్మాచార్య పదవిని అధిష్ఠించే వ్యక్తిని తాము ఎంపిక చేస్తామని చైనా ప్రకటించడానికి ఇదీ నేపథ్యం. కానీ భారతదేశంలో ఉన్న తన అనుయాయులలోనే తన వారసుడి కోసం అనే్వషణ జరగాలని ఎనబయి నాలుగేళ్ల దలైలామా ఇదివరకే ప్రకటించి ఉన్నాడు. ఈ ధర్మాచార్య పరంపరలో ప్రస్తుత దలైలామా పదునాలుగవ వాడు. దలైలామా పార్థివ శరీరం పరిత్యజించిన తరువాత ఆయన మళ్లీ అవతరిస్తాడన్నది టిబెట్ ప్రజల సంప్రదాయం. ఈ సంప్రదాయానికి అనుగుణంగానే ప్రతి దలైలామా దేహపరిత్యాగం తరువాత తదుపరి దలైలామా కోసం అనే్వషణ జరుగుతుంది. అందువల్ల ఈ ‘అనే్వషణ’లో తదుపరి దలైలామాను గుర్తించడం సంప్రదాయం. కానీ చైనా ప్రభుత్వం ఈ ధర్మ సంప్రదాయాన్ని నియంత్రించడానికి నిరోధించడానికి యత్నిస్తోంది. చైనా ప్రభుత్వం ఎవరినో ఒకరిని తదుపరి దలైలామాగా ఎంపిక చేసినట్టయితే, టిబెట్‌లో ఉన్న ప్రజలుకాని, వెలుపల ఉన్న ప్రవాస టిబెట్టీయ ప్రజలు కాని ఆయనను దలైలామాగా అంగీకరించరు, తమ ధార్మిక అధిపతిగా భావించరు. చైనా దురాక్రమణను వ్యతిరేకిస్తున్న టిబెట్ ప్రజలు తమ ‘కొత్త’ దలైలామాను తామే ఎంపిక చేసుకుంటారు. అందువల్ల సమాంతరంగా ఇద్దరు దలైలామాలు ఏర్పడే వైపరీత్యం సంభవిస్తుంది. ప్రస్తుత దలైలామా అభిమతం ప్రకారం అనే్వషణ జరగడం న్యాయం.
ఈ న్యాయాన్ని అంగీకరించని చైనా ప్రభుత్వం సాంస్కృతిక దురాక్రమణకు పూనుకుంది. తమ నిర్ణయాన్ని మన ప్రభుత్వం ఆమోదించాలట. చైనా ప్రభుత్వానికి నిర్ణయించే అధికారం లేదు. అందువల్ల ఆ ‘నిర్ణయాన్ని’ మన ప్రభుత్వం ఆమోదించవలసిన అవసరం లేదు. టిబెట్ ప్రజలు నిజానికి కొత్త ‘దలైలామా’ను నిర్ధారించవలసి ఉంది. కొత్త దలైలామా మన దేశంలో నివసించినట్టయితే ప్రస్తుత దలైలామా పట్ల వ్యవహరిస్తున్న రీతిలోనే మన ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అందువల్ల 1959నుంచి కొనసాగుతున్న పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండదు. టిబెట్ దలైలామా కాని టిబెట్ ప్రజలుకాని చైనా వ్యతిరేక రాజకీయ కలాపాలను నిర్వహించడాన్ని మన ప్రభుత్వం అనుమతించడం లేదు, 1959 నుంచి అనుమతించడం లేదు. అయినప్పటికీ చైనా దలైలామా విషయంలోను ప్రవాసీ టిబెట్ ప్రజల విషయంలోను మన దేశాన్ని దుయ్యబట్టే వైఖరిని అనుసరిస్తూనే ఉంది. ఈ నడుస్తున్న చైనా కుట్రలో ఇప్పుడిలా మన ప్రభుత్వాన్ని హెచ్చరించడం ఒక అంశం మాత్రమే! 1950- 1959 సంవత్సరాల మధ్య మన ప్రభుత్వం చైనాకు అక్రమంగా సహకరించింది. మన ‘‘సహకారం’’ లేకపోయి ఉండినట్టయితే చైనా టిబెట్‌ను దురాక్రమించి ఉండేది కాదు. చైనా దురాక్రమణ నుంచి ‘స్వతంత్ర టిబెట్’ను రక్షించవలసిన బాధ్యత మన ప్రభుత్వానిది. 1914లో టిబెట్‌తో మన దేశానికి- బ్రిటన్ దురాక్రమణ సమయంలో- సిమ్లాతో కుదిరిన ఒప్పందంలో ప్రధాన అంశం ఇది. 1947 వరకు మన దేశంలోని బ్రిటన్ ప్రభుత్వం అలా చైనా దురాక్రమణ నుంచి టిబెట్‌ను రక్షించింది. కానీ 1949 తరువాత కమ్యూనిస్టు చైనా నియంతల పట్ల స్నేహ వ్యామోహానికి గురి అయిన అప్పటి మన ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ మన దేశాన్ని నమ్ముకొని ఉండిన టిబెట్ పట్ల విశ్వాస ఘాతుకానికి ఒడిగట్టాడు. ‘‘టిబెట్ మనలను నమ్ముకొని ఉంది. ఆ దేశ స్వాతంత్య్ర పరిరక్షణ మన బాధ్యత..’’ అని అప్పటి ఉప ప్రధాని సర్దార్ వల్లభభాయి పటేల్ జవహర్‌లాల్ నెహ్రూకు గుర్తుచేశాడు. ‘టిబెట్ స్వాతంత్య్రం చచ్చిపోయింది..’’ అన్నది జవహర్‌లాల్ నెహ్రూ వ్రాసిన జవాబు. 1950వ సంవత్సరం తరువాత పటేల్ జీవించకపోవడం టిబెట్‌ను చైనా దురాక్రమించడానికి దోహదం చేసిన ‘‘విధి విలాసం’’. టిబెట్ స్వాతంత్య్రాన్ని హరించిన చైనా 1962లో మన దేశంపై దొంగ దెబ్బ తీసింది. అప్పటి నుంచి మన దేశానికి వ్యతిరేకంగా చైనా దురాక్రమణ వివిధ పద్ధతులలో సాగుతూనే ఉంది. మనకూ దురాక్రమణ ప్రవృత్తికల చైనాకు మధ్య రెండువేల ఐదువందల ఏళ్లు స్వతంత్ర టిబెట్ నెలకొని ఉండడం చరిత్ర. ‘‘టిబెట్ దాటి వచ్చి’’ చైనా మన దేశంపై దురాక్రమణ చేయలేదు.. టిబెట్ చైనాలో కలసిపోవడంతో చైనా మన సరిహద్దుల వరకు విస్తరించగలిగింది.
1962 నాటి చైనా దురాక్రమణ నిజానికి మన ప్రభుత్వ కృత చారిత్రక మహాపరాధం! ఇప్పుడైనా మన ప్రభుత్వం టిబెట్ ప్రవాస ప్రభుత్వాన్ని స్వతంత్ర దేశ ప్రభుత్వంగా పరిగణించాలి. టిబెట్ స్వాతంత్య్ర ఉద్యమానికి సహకరించాలి. మన పట్ల నిరంతరం విషం కక్కుతున్న చైనాతో కాక టిబెట్‌తో మనం మైత్రిని వహించాలి. స్వతంత్ర టిబెట్ అవతరణ భారత్‌ను చైనా దురాక్రమణ నుంచి రక్షించగల వజ్ర కవచం..