సంపాదకీయం

మన ‘మెతకతనం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన రక్షణ పటిమ క్రమంగా ‘చేవ’తేలుతోందన్నది నిరాకరింపజాలని నిజం. కానీ ఈ కరకుతనంలో కొంత మెతకతనం కూడ నిహితమై ఉండడం కూడ నిరాకరింపజాలని నిజం! ఈ మెతకతనం మన విదేశాంగ విధానం! ‘ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి’ వారు మన జమ్మూ కశ్మీర్ గురించి ‘జనాంతిక’- క్లోజ్‌డ్ డోర్- మంతనాలను సాగించాలని గురువారం నిర్ణయించడానికి ఈ మన విదేశాంగ విధానపు మెతకతనం కూడ కొంత కారణం. ఇలాంటి విచిత్ర నిర్ణయానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పాలుపడడం మన ప్రభుత్వంపై చైనా ప్రభుత్వం సాధించగలిగిన విజయం. ఈ విజయం వంచన.. ఈ విజయం దౌత్య బీభత్సం.. ఈ విజయం చైనా కుట్ర! ఈ విజయం చైనా నియంతల వెన్నుపోటు. చైనాలో హాంగ్‌కాంగ్ 1997లో విలీనమైంది. అంతవరకు బ్రిటన్‌వారి ‘వలస స్థావరం’గా ఉండిన ‘హాంగ్‌కాంగ్’ నగర దేశం బ్రిటన్‌కూ చైనాకూ మధ్య కుదిరిన ‘ఒప్పందం’ కారణంగా చైనాలో కలసింది. చైనాలో కలవడం ‘హాంగ్‌కాంగ్’ ప్రజలకు ఇష్టం లేదు. ఎందుకంటె చైనా ఏకపక్ష కమ్యూనిస్టు నియంతృత్వ రాజ్యాంగ వ్యవస్థ. ‘హాంగ్‌కాంగ్’ ప్రజలు బహుళ పక్ష ప్రజాస్వామ్య వ్యవస్థను కోరుకున్నారు. కానీ చైనా నియంతలు హామీ ఇచ్చారు. ‘ఒక దేశం- రెండు విధానాలు’అన్న పద్ధతిని పాటించడానికి అంగీకరించారు. ఫలితంగా హాంగ్‌కాంగ్‌లో మాత్రం బహుళపక్ష ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడింది. ఈ వ్యవస్థను నీరుకార్చడానికి చైనా ప్రభుత్వం ఇప్పుడు యత్నిస్తోంది. చైనాలో అమలుజరుగుతున్న భయంకరమైన శిక్షలను, నేర విచారణ పద్ధతులను ‘హాంగ్‌కాంగ్’లో కూడ అమలుజరపడానికి వీలుగా చట్టాలను సవరించే యత్నం చేస్తోంది. ఇందుకు నిరసనగా హాంగ్‌కాంగ్ ప్రజలు రెండున్నర నెలలుగా ఉద్యమం చేస్తున్నారు. ఈ ఉద్యమాన్ని క్రూరంగా అణచివేయడానికి చైనా చేస్తున్న ప్రయత్నం ప్రభుత్వ ప్రేరిత బీభత్సకాండ. ఉద్యమకారులు హాంగ్‌కాంగ్ విమానాశ్రయాన్ని ముట్టడించి దిగ్బంధించడంతో దాదాపు వెయ్యి విమాన సేవలు రద్దయ్యాయి. ఇది చైనా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమ తీవ్రతకు నిదర్శనం. హాంగ్‌కాంగ్‌లోని పోలీసులు, చైనా అనుబంధ సైనికులు ఉద్యమకారులను చితకబాదుతున్న దృశ్యాలు మాధ్యమాలలో ఆవిష్కృతం అయ్యాయి. సైనిక దళాలను కూడ చైనా సమాయత్తం చేస్తోంది. కానీ ఈ దమనకాండ గురించి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చర్చించడం లేదు. చర్చించాలని మన ప్రభుత్వం కోరలేదు. ‘‘ఇదంతా చైనా అంతర్గత వ్యవహారం’’అన్న మెతక విధానాన్ని మన ప్రభుత్వం అనుసరిస్తోంది. ఐరోపా, అమెరికా ప్రభుత్వాలు సైతం బయట చైనాను విమర్శిస్తున్నాయి కాని చైనాను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అభిశంసించడానికి యత్నించడం లేదు. నిజానికి ఇదంతా ‘‘పలుకుబడి’’.. ఆధిపత్యం!! మన ప్రభుత్వం రాజ్యాంగంలోని మూడువందల డెబ్బయ్యవ అధికరణాన్ని రద్దుచేయడం, జమ్మూ కశ్మీర్‌కు దేశంలోని ఇతర అన్ని ప్రాంతాలతోను సమానత్వం కల్పించడం మన అంతర్గత వ్యవహారం. కానీ ఈ మన అంతర్గత వ్యవహారాన్ని పాకిస్తాన్‌తో కుమ్మక్కయిన చైనా అంతర్జాతీయం చేయడానికి యత్నిస్తోంది. ఈ వ్యవహారాన్ని ‘జనాంతికం’గా చర్చించాలని ఐక్యరాజ్యసమితి భద్రతామండలి నిర్ధారించడం ఈ ప్రయత్నంలో భాగం. ‘మండలి’ చర్య మన అంతర్గత వ్యవహారాలలో అక్రమ ప్రమేయం.. మన జాతీయ సార్వభౌమ అధికార గరిమకు అవమానకరం.
మూడువందల డెబ్బయ్యవ రాజ్యాంగపు అధికరణం రద్దుకావడం పట్ల జమ్మూ కశ్మీర్, లడక్ కేంద్ర పాలిత ప్రాంతాలలో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కశ్మీర్ లోయలో జన జీవనం మళ్లీ ప్రశాంతంగా కొనసాగుతోంది. పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత, మతోన్మాద ప్రేరిత బీభత్సకారులు బిక్కుబిక్కుమంటూ ఎక్కడో నక్కి ఉన్నారు లేదా తోకలు ముడుచుకున్న తోడేళ్లవలె పాకిస్తాన్‌లోకి జారుకుని ఉన్నారు. ఇలా కల్లోలగ్రస్తమై ఉండిన జమ్మూ కశ్మీర్‌లో మళ్లీ ప్రశాంత స్థితి నెలకొని ఉండడం పాకిస్తాన్ జిహాదీ బీభత్స రాజ్యాంగ వ్యవస్థ నిర్వాహకులకు నచ్చని వ్యవహారం, చైనాకు ‘గొంతులో పచ్చివెలక్కాయ’ వంటి పరిణామం. అందువల్లనే చైనా నియంతలు పాకిస్తానీ బీభత్స ప్రభుత్వాన్ని ఉసిగొలిపారు. ఈ పాకిస్తానీ బీభత్స మృగం మరోసారి అంతర్జాతీయ వేదికలనెక్కి వికృతంగా విలపిస్తోంది. ఈనెల పనె్నండవ తేదీన చైనా రాజధానిలో మన విదేశ వ్యవహారాలమంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ చైనా విదేశాంగ మంత్రి ఈవాంగ్ ఛీతోను ఇతర చైనా ప్రభుత్వ ప్రతినిధులతోను చర్చలు జరిపి వచ్చాడు. ఈ చర్చలు జరుగుతుండిన సమయంలోనే ‘జమ్మూ కశ్మీర్’ను మరోసారి ఐక్యరాజ్యసమితికి ఎక్కించాలన్న కుట్రకు చైనా నియంతలు రూపకల్పన చేశారు. ఫలితంగా జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దుకావడం గురించి, కశ్మీర్ పరిస్థితి గురించి భద్రతా మండలిలో చర్చించాలని పాకిస్తాన్ ప్రభుత్వం ‘సమితి’కి దరఖాస్తు పెట్టింది. జమ్మూ కశ్మీర్ మన దేశపు అంతర్భాగమన్న అనాది వాస్తవం అంతర్జాతీయ సమాజానికి తెలుసు. అందువల్ల ఈ పాకిస్తానీ అభ్యర్థనను బహిరంగంగా ఆధికారికంగా చర్చించడానికి ‘మండలి’లోని పదిహేను సభ్య దేశాల ప్రతినిధులలో చైనావాడు తప్ప మరెవరూ సుముఖంగా లేరు. అందువల్లనే పాకిస్తాన్ అభ్యర్థనను ‘మండలి’ అధ్యక్షుడు తోసిపుచ్చాడు. ఇది పాకిస్తాన్‌కు శృంగభంగం, చైనా దౌత్యరంగ భంగం..
ఈ పరాజయాన్ని వ్యూహాత్మక విజయంగా మార్చుకొనడం చైనా ప్రభుత్వపు ‘శకుని’తనం.. ‘మండలి’లోని పదహైదు సభ్యదేశాలలో కనీసం తొమ్మిది దేశాల ప్రతినిధులు అంగీకరించాలి. అప్పుడు మాత్రమే ఏ తీర్మానాన్ని అయినా మండలిలో ఆధికారికంగా చర్చించడానికి వీలుంది. అలా చర్చించి ఆమోదించిన తీర్మానాలను ఆధికారికంగా ప్రకటించగలరు. ఈ అధికార తీర్మానాలను అమలు జరిపించడానికి సైతం వీలుంది. అలాంటి ‘అధికార పరిధి’లో మన దేశపు అంతర్గత వ్యవహారాన్ని, మూడువందల డెబ్బయ్యవ అధికరణం రద్దయిన తరువాత ఏర్పడిన స్థితిని, ఇరికించడానికి పాకిస్తాన్, చైనాలు ఉమ్మడిగాచేసిన కుట్ర ఇలా భగ్నమైంది.. కనీసం జనాంతికంగానైనా అనధికారికంగానైనా ‘జమ్మూ కశ్మీర్’ను చర్చించాలని చైనా చేసిన విజ్ఞప్తిని, పాకిస్తాన్‌తో చేయించిన విజ్ఞప్తిని ‘మండలి’ అధ్యక్షుడు ఆమోదించాడట. ఇలాంటి అనధికార చర్చ 1971లో ఒకసారి - జమ్మూ కశ్మీర్ గురించి- జరిగిందట! మళ్లీ ఇప్పుడు జరుగుతోంది. ఈ ‘రహస్య’ సంభాషణల ప్రక్రియలో ఎవరు ఏమి మాట్లాడుతారన్నది వెల్లడి చేయడానికి వీలులేదు, అంతే కాదు ఈ చర్చల తరువాత ఎలాంటి తీర్మానాన్ని కూడ ఆమోదించడానికి వీలులేదు. మరి ‘ఈ చర్చలు ఎందుకు?’ అన్న ప్రశ్నకు సమాధానం ఐరోపా దేశాల వారు, అమెరికా వారు చైనాను మచ్చిక చేసుకొనడానికి యత్నిస్తూ ఉండడం. అంతర్జాతీయ వాణిజ్య ఆధిపత్య సమరంలో ఒకవైపున అమెరికా ‘కూటమి’ మరోవైపున చైనా ‘కూటమి’నిలబడి ఉన్నాయి, తలపడుతున్నాయి. ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’ నియమాల వల్ల తమ దేశానికి అన్యాయం జరిగిపోతోందని, ఈ ప్రపంచీకరణ వ్యవస్థ నుండి నిష్క్రమించడానికి సైతం వెనుదీయబోమని అమెరికా అధ్యక్షుడు దాదాపు ప్రతిరోజూ హెచ్చరిస్తున్నాడు. కానీ మరోవైపు చైనాతో సఖ్యతను పునరుద్ధరించుకోవాలని కూడ డొనాల్డ్ ట్రంప్ యత్నిస్తున్నాడు. ఈ ప్రయత్నంలో భాగమే ‘జమ్మూ కశ్మీర్’పై మండలిలో ఈ అనధికార జనాంతిక చర్చ! ‘అధికార చర్చ’ను నిరోధించడం ద్వారా మన దేశానికి అనుకూలమన్న అభిప్రాయం ఏర్పరచవచ్చు. జనాంతిక మంతనాలకు అభ్యంతరం చెప్పకపోవడం ద్వారా చైనాకు అనుకూలమన్న భ్రాంతిని పెంపొందించవచ్చు....
ఏమయినప్పటికీ ఇది చైనా ఆధిపత్య విస్తృతికి, చైనా పట్ల పాశ్చాత్య దేశాల భయానికీ నిదర్శనం. ఈ జనాంతిక మంతనాల వల్ల మన దేశానికి కలిగే ప్రత్యక్ష నష్టం లేదు. ఈ ‘చర్చల’లో పాకిస్తాన్ ప్రతినిధి పాల్గొనరాదన్నది మండలి విధించిన నిబంధన. అందువల్ల పాకిస్తాన్ ప్రతినిధి నోరుపారేసుకోవడానికి కూడ అవకాశం లభించలేదు. చర్చల ఆరంభానికీ ముందూ, ముగిసిన తరువాత కూడ ‘పరిస్థితి’లో మార్పులేదు. మరి ఎందుకని చైనా ఈ చర్చల కోసం పట్టుపట్టింది? ‘జమ్మూ కశ్మీర్’ను సమస్యగా చిత్రీకరించడం కోసం మాత్రమే చైనా ఈ దుశ్చర్యను సాగించింది. ఆమేరకు చైనా వ్యూహాత్మక విజయం సాధించింది. ‘హాంగ్‌కాంగ్’ కల్లోలాలను ద్వైపాక్షిక చర్చలలోను, అంతర్జాతీయ వేదికల మీద ప్రస్తావించకపోవడం మన విదేశాంగ నీతిలోని ‘మెతక తనం’!