మెయన్ ఫీచర్

పోటీ అనే చదరంగంలో యువత మెడకు ఉరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంతో కాలంగా ఎదురుచూసిన ఉపాధ్యాయ ఉద్యోగ అర్హత పరీక్ష రాసి మృత్యువును ఆహ్వానించిన ఇద్ద రు అభ్యర్థులు. కారణం-సరిగా రాయలేదనే భావన, ఉద్యోగం దొరకదనే వేదన! పిల్లల్ని 3పోటీ2అనే క్రీడ పేరున కోచింగ్ అనే కానె్సంట్రేటెడ్ క్యాంపులో బంధించడానికై తీసుకెళ్ళుతున్న ముగ్గురు పిల్లలతో సహా తల్లిదండ్రులు కామారెడ్డిలో ఘోర ప్రమాదానికి గురి! దేశంలోనే పెద్ద, కోచింగ్ కేంద్రంగా విరాజిల్లుతున్న రాజస్థాన్‌లోని కోటలో మే ఒకటిన నీట్2పరీక్ష రాసిన కేశవ మీనా వారం రోజులకే ఉరితాడుకు బలి. ఇదే కోటలో బిటెక్ చివరి సంవత్సరం విద్యార్థి అవినాష్ మీనా విషాన్ని మింగి ప్రాణాలు వదిలిన వైనం! గత ఏప్రిల్ 20న బిటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న ఆదిలాబాద్‌కు చెందిన దినేష్‌రెడ్డి హైదరాబాద్ దగ్గరలోని కీసర హాస్టల్ గదిలో, ఇంజనీరింగ్ చివరి సంవత్సరపు విద్యార్థిని జనగామకు చెందిన బాలనందిని స్వంత ఇంట్లో ఫ్యానులకు వేళ్ళాడారు! ఇదే రోజున సరూర్‌నగర్‌లో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని కె.శ్రీజ స్వంత అపార్ట్‌మెంటు 5వ అంతస్థు పైనుంచి దూకి ఆత్మహత్య!
ఓ నెల రోజుల్లో గాలిలో కలుస్తున్న విద్యార్థుల ప్రాణాలకు సంబంధించిన చిరు ఉదాహరణలే ఇవి. పరీక్షల ఫలితాలు, ప్రవేశపరీక్షల సీజన్ కాబట్టి, దేశవ్యాపితంగా ఇలా తనువుల్ని చాలిస్తున్న రేపటి దేశ సంపద ఎన్ని వందల సంఖ్యలో వుంటుందో మొద్దుబారిన వ్యవస్థకు పట్టదు. 3ప్రధానమంత్రిగారు, కోటలోని కోచింగ్ సెంటర్లను వెంటనే మూసివేయించండి...అమ్మా, నాన్నా క్షమించండి...2అంటూ పక్షం రోజుల క్రితం ఓ సూసైడ్ నోటు రాసి ఈ లోకాన్ని విడిచిన ఐఐటి కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థిని ఆత్మఘోష మోదీకి, స్మృతి ఇరానికి కాదు, అసలు తల్లిదండులకు అర్థవౌతున్నదా అనేది పెద్ద ప్రశ్న? మనమందరం వేసుకోవాల్సిన మరో ప్రశ్న!
ఇలా కోటలో... కోచింగ్ (పోకింగ్) తీసుకునే విద్యార్థుల్లో గత సంవత్సరం 19 మంది, ఈ సంవత్సరం 8 మంది బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కోట జిల్లా కలెక్టర్ రవికుమార్ సుర్పుర్ లక్షా ఏభై వేల మంది విద్యార్థుల తల్లిదండ్రులకు కోచింగ్ పేరుతో పిల్లల్ని ఒత్తిడికి గురిచేయవద్దని లేఖలు రాయడం గమనార్హం! ఈ లేఖలకు ఎంతమంది తల్లిదండ్రులు స్పందించారో తెలియదుగాని, వీరికి అసలు స్పందించే హృదయం వుందా అనేది పెద్ద అనుమానం! ఈ లెక్కన కోట కేంద్రంగా ఎన్ని లక్షల మంది ఈ నిర్బంధ క్షోభను అనుభవిస్తున్నారో తెలియదు. ఒక్క హైదరాబాద్‌లోనే ఇలాం టి నిర్బంధ కోచింగ్‌కు గురి అవుతున్న వారి సంఖ్య 5 లక్షల దాకా వుంటుందని అంచనా! దేశవ్యాపితంగా ఈ సంఖ్య కోట్లల్లోనే వుంటుందనేది కాదనలేని సత్యం!
రేపటి బంగారు భవిష్యత్తు అనే ఓ ఊహాజనిత ఆలోచన తల్లిదండ్రుల్లో ఆత్మీయతనే పణంగా పెడుతున్నది. సుదూర ప్రాంతాల్లోని ఇలాంటి కానె్సంట్రేటెడ్ క్యాంపుల్లో వేయడం తల్లిదండ్రులకు దురలవాటుగా మారింది. అమాయక తల్లిదండ్రులకే కాదు- చదువుకోని, చదువుకున్న తల్లిదండ్రులకు ఈ దురద ఎక్కువగా వుండడం గమనార్హం! ఆర్థికంగా వున్నా, లేకున్నా ఇల్లుగుల్లచేసి, అనైతికంగానన్నా ఆర్జించి ఈ క్యాంపుల్లో పిల్లల్ని వేసి మురిసిపోవడం తల్లిదండ్రుల తంతుగా మారింది. పిల్లలతో మాట్లాడే అవకాశం వుండే ఆదివారాల్లో ఉదయానే్న హైదరాబాదుకు చేరుకునే ప్యాసింజర్ రైళ్ళలో గుంపులు గుంపులుగా, చేతి సంచుల్లో తినుబండారాలతో సబర్బన్ స్టేషన్లలో దిగి, ఆటోలను ఎక్కి ఆయా కోచింగ్ కేంద్రాలకు వెళ్ళడం మామూలే! ఇలా వచ్చిన తల్లిదండ్రులతో పిల్లలు బెంగతో చూడ డం, బిక్కమొఖం పెట్టడం, ఏడ్వడం ఓ సాధారణ దృశ్యం కాగా, బుజ్జగించి, లాలించి, బాగా చదువుకోవాలని మాత్రం గట్టిగా చెప్పడం తల్లిదండ్రుల చివరి ఘట్టం. కొంతమంది పిల్లలు అక్కడ వుండలేమని చెప్పినా, కొందరి ఉదాహరణల్ని చెప్పి వదిలిరావడం ఓ బాధాకర దృశ్యం!
ఇలాంటివారే, పై సంఘటనలు జరగ్గానే యాజమాన్యంపై విరుచుకుపడడం, కట్టిన ఫీజులకై వెంపర్లాడడం, కేసు కాకుండా వుంటుందని భావించే యాజమాన్యాలు కొంత మినహాయించుకొని ఫీజుల్ని వాప సు ఇవ్వడం చర్విత చరణమే! పోయిన పిల్లల ప్రాణాలకన్నా, తిరిగి రాబట్టిన ఫీజునే భాగ్యంగా భావించే తల్లిదండ్రులు మరికొందరు. వీరికి అప్పుడప్పుడు ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు దోహదపడుతూనే వుంటాయి. ఈ కోచింగ్ వ్యధాశిలలకు బలౌతున్న వారు అత్యధికులు మధ్యతరగతి వారే! రైతుల తర్వాత అత్యధికంగా ప్రాణాలు తీసుకుంటున్న ఈ యువత పట్ల ఏ స్థాయిలో చర్చ లేదు. మాట లేదు. ప్రభుత్వాలకు పట్టింపు లేదు. అత్యధిక కేంద్రాలకు రాజకీయ అండ వుండడంతో ఈ సంఘటనలపై పార్లమెంటులో, అసెంబ్లీల్లో అసలు ప్రస్తావనే వుండదు.
కొత్తకొత్త పేర్లతో, పాత బ్రాండు వాళ్ళే ఇతర ప్రాంతాలకు కోచింగుల పేరున దోపిడి సంస్థల్ని విస్తరిస్తూపోతుంటే, కుటుంబాలకు కూడా సరిగా వసతి వుండని కొంపల్లో వీటిని ఏర్పాటుచేస్తుంటే, వీటినో స్వర్గ్ధామాల్లా తల్లిదండ్రులు భావించడం వీరి పిల్లలు చేసుకున్న పాపమే! పెంపుడు కుక్కనో, పిల్లో చనిపోతే కన్నీరు పెట్టే కుటుంబాలు, ప్రాణాల్ని హరించే చదువుల బందిలిదొడ్డిలో పిల్లల్ని వేసి నిస్సహాయులుగా, నిర్లక్షంగా వ్యవహరించడం శోచనీయం. చదువు కేవలం కోచింగ్ ద్వారానే సాధ్యమనే రోగం సమాజంలో బాగా ముదిరిపోయింది. ఈ కేంద్రాల ప్రచారాలు, ప్రింటు, ఎలక్ట్రాన్ మీడియా కథనాలు వీటికి మరింత ఉత్ప్రేరకాలుగా పనిచేస్తున్నాయి.
గతంలో పదో తరగతి ఫలితాల తర్వాత జరిగేవేట, ఇప్పుడు ఆరు, ఏడు తరగతుల్లోనే మొదలైంది. పిల్లల్ని ఇంద్రులని, చంద్రులని, వారి చదువుకువారే సాటని ముఖస్థుతితో తల్లిదండ్రుల్ని బురిడీకొట్టించి, ఫీజుల్లో రాయితీలని, పిల్లల్ని ఎరవేసి పట్టుకుపోవడం సర్వసాధారణం. వీటికి ఆయా ప్రాంతాల్లో బ్రోకర్లు, కన్సల్టెంట్లు సహాయపడి కమీషన్లు కొట్టగా, నేరుగా ఉపాధ్యాయులే ఈ అవతారం ఎత్తడం గమనార్హం!
మేధావుల ముసుగుల్లో చలామణి అవుతున్న మిథ్యా విద్యావేత్తలు కూడా 5 శాతం విద్యార్థుల అవసరాల్ని కూడా తీర్చలేని ఐఐటిల పట్ల, ఎన్‌ఐటిల పట్ల భ్రమల్ని పెంచి, తల్లిదండ్రులకు కలల్ని రేకెత్తించి, కోచింగుల పేరున సొమ్ముచేసుకోవడం అధునాతన విద్యావిధానంగా మారిపోయింది. విశ్వవిద్యాలయాలు తప్ప (ఇవికూడా కొన్ని ప్రాంతాలవారికి అందుబాటులో వుంటాయి) మిగతా విద్యాలయాలు స్థానిక, మండల, జిల్లాస్థాయిల్లో అందుబాటులో వుండాల్సినవి ఏక మొత్తం గా హైదరాబాద్ లాంటి పట్టణాలకే పరిమితం కావడం, సుదూర ప్రాంతాల విద్యార్థులు వ్యయప్రయాసలకు ఓర్చి, ఇరుకు గదుల్లో కుక్కబడి 3చదువు2అనే ఓ అశాస్ర్తియ ప్రక్రియకు గురై తట్టుకోలేకపోతున్నారు. వీరి ఇబ్బందులు, బాధలు ఎవరికీ పట్టవు. పైగా వచ్చింది చదువుకోవడానికే గాని, తిండి, నిద్ర, విరామంకోసం కాదని యాజమాన్యాలు పదే పదే హెచ్చరించడం కోచింగ్‌లో ఓ భాగం. ఒకే యాజమాన్యానికి పదుల సంఖ్యలో వుండే కోచింగ్ కేంద్రాల్లో ఓ ఫ్యాకల్టి గ్రూప్ (వీరి కో లేబుల్ వుంటుంది) వంతుల వారిగా వచ్చి బోధన అనే ప్రక్రియతో పిల్లల్ని బాధించి వెళ్ళితే, గ్రూపులవారిగా సూపర్‌వైజర్లు స్టడీ అవర్సు పేరున రుద్దడం జరుగుతుంది. ఇక సెక్షన్లు ఆయా విద్యార్థుల తెలివితేటల్నిబట్టి ఏర్పాటుచేయడం ఇక్కడ రివాజు.
పశువుల్ని తోలుకొని వచ్చినట్లు పిల్లల్ని తీసుకొచ్చి వీరికి అప్పజెప్పే ఈ కేంద్రాల్లో, ఫలానా తరగతిలో వున్నప్పుడు చేర్పిస్తే ఇంత డిస్కౌంటు అని, ఫలానా మార్కుల వారికి ఇంత రాయితీ అని, కోచింగ్ కేంద్రాలు నిర్వహించిన పరీక్షల్లో నెగ్గిన కొందరు విద్యార్థులకు తమ సంస్థ కొంత మొత్తాన్ని అందిస్తుందనే ప్రకటనలు తల్లిదండ్రుల్ని ఆకర్షించడంతో, పసి ప్రాయంలోనే పిల్లల్నివేయడం జరుగుతున్నది. ఇలా మంచి విద్య అనే పేరు కింద తల్లిదండ్రులు పిల్లల్ని వదిలించుకోవడం ఓ ఫ్యాషన్‌గా మారింది.
కామన్ స్కూలు విధానం, నైబర్‌హుడ్ విధానం రాజకీయ నాయకులకు, విద్యాశాఖకు పట్టకపోగా, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు అసలు పట్టడం లేదు. ఈ విధానాలే వారికి అర్ధంకావు. ఎవరి చెవికీ ఎక్కవు. కాని, వీరంతా ఆయా ప్రభుత్వ పాఠశాలల్లోనే ప్రజల పిల్లల్ని చేర్పించాలని ప్రచారం చేస్తూ వుంటారు. ఇలాంటి ఉపాధ్యాయులే, అంతంత మాత్రంగా నడుస్తున్న ప్రభుత్వ పాఠశాలల పట్ల, విద్యార్థుల పట్ల ఉదాసీనంగా వుంటారు. అక్కడక్కడా ఆత్మప్రబోధంతో పనిచేసేవారున్నా వీరి ఆవేదన ఎవరికీ పట్టదు. సదరు ఉపాధ్యాయులకే ఆంగ్ల పరిజ్ఞానం లేకున్నా, ఆంగ్ల మాధ్యమమే రేపటి అమెరికా పౌరులుగా తయారుచేస్తుందని సెలవిస్తూ వుంటారు. దీనికి రాజకీయ అండ కొండంతగా వుండడంతో అమాయకపు సమాజపు ఆమోదముద్ర అంతే మోతాదులో వుంటున్నది.
ఇది మారుతుందా, మాసిపోతుందా అంటే, ఈ దిశగా ఆలోచించని వ్యవస్థలో, పట్టింపే లేని సమాజంలో పిల్లలు సమిధలు కావడం తప్ప మరో దారిలేదు. యథా తల్లిదండ్రులు- తథా పిల్లల ప్రాణాలు. దీన్ని మూర్ఖత్వమని, ఈ రచయితతో సహా ఎవరైనా అంటే వారినే పరమ మూర్ఖులుగా పరిగణించే దుస్థితి. అందుకే తల్లిదండ్రుల మూర్ఖత్వానికి జిందాబాద్ అనాలా? మూర్ఖత్వపు విద్యావిధానానికి జిందాబాద్ అనాలా? ఈ స్థితిలో చదువు పిల్లలకు కాదు- వీరి తల్లిదండ్రులకు కావాలి. వీరికి బోధించడానికై ఓ పరమానందయ్య చాల అవసరం!

- డా. జి.లచ్చయ్య సెల్: 9440116162