సంపాదకీయం

నిషేధం.. నిరోధం??

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎలక్ట్రానిక్ సిగరెట్లుగా పేరుమోసిన ‘ఆవిరి’ సిగరెట్లను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం ఆరోగ్య పరిరక్షణకు దోహదకరం. ‘కల్తీ’ని నిర్మూలించనున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు బుధవారం శాసనసభలో ప్రతిజ్ఞచేయడం ఆరోగ్య పరిరక్షణకు దోహదం చేయగల సమాంతర పరిణామం. కొంటున్న తింటున్న ప్రతి పదార్థం విష రసాయనాలతోను, నాసిరకం పదార్థాలతోను సంకరం అయిపోతుండడం జనం అనుభవిస్తున్న నిరంతర వైపరీత్యం. ఈ వాస్తవాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి శాసనసభలో పునరుద్ఘాటించడం జన హృదయ ఆందోళన ధ్వనులకు ప్రతిధ్వని.. సిగరెట్లు, బీడీల వంటి ధూమపానం, మద్యపానం మరిగి ఉన్నవారు ప్రజలలో దాదాపు మూడవ వంతు! ఈ ‘వంతు’ ప్రజలు భయంకరమైన చిత్ర విచిత్ర వ్యాధులకు గురై అకాల మృత్యుకోరలకు ఆహారం అవుతున్నారన్నది బహిరంగ రహస్యం. కానీ ‘కల్తీ’ తిండి విష ప్రభావానికి దాదాపు వంద శాతం ప్రజలు గురవుతున్నారన్నది ఇంత ప్రసిద్ధం కాదు. ధూమపానం వల్ల మద్యపానం వల్ల సంభవిస్తున్న స్థాయిలోనే, రీతిలోనే ‘కల్తీ’ తిండివల్ల కూడ జనానికి ‘వ్యాధి ప్రమాదాలు’ సంభవిస్తున్నాయన్నది జనానికి పెద్దగా ధ్యాసలేని విషయం! పొలం నుంచి అప్పుడే తెంపుకొని వచ్చిన కూరగాయలు, ఆకుకూరలు ‘కల్తీ’అయి ఉన్నాయి, పండ్లు ‘కల్తీ’అయి ఉన్నాయి! ‘ఆకర్షణ’ను పెంచుతున్న రసాయన విషాలతో ఇవి ‘కల్తీ’కావడం పరాకాష్ఠ. కానీ విత్తనం దశనుంచి, మొక్క దశనుంచి, గింజ దశనుంచి, పంట దశనుంచి ఈ ‘్భజన పదార్థాలు’ ఎఱువులతోను, శుద్ధి రసాయనాలతోను, క్రిమిసంహారాలతోను ‘కల్తీ’అవుతున్నాయి. చివరి దశలో ‘పండ్ల’ను కూరగాయలను కూరలను ‘‘నవ నవలాడించడానికి’’ రసాయనపు ద్రావకాలను, పొడులను వాటిపై చల్లుతున్నారు. ఈ తుది దశ విష రసాయనాలలో అత్యధిక శాతం చైనాలో తయారై దిగుమతవుతున్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిషేధించిన ‘ఆవిరి’- వేపర్- ఎలక్ట్రానిక్- సిగరెట్లను కూడ కనిపెట్టింది చైనా వారేనన్నది ‘కల్తీ’ కథలోని ‘విషరస’ ఘట్టం...
మన జాతీయ జీవన రీతి ‘కల్తీ’కావడం వౌలికమైన సాంకర్యం. ఐరోపా వారు పొగాకుతోను పొగాకు పదార్థాలతోను మన ‘రీతి’ని కల్తీచేయడం విస్తృత సాంకర్యంలో ఒక అంశం మాత్రమే! ‘సిగరెట్లు’ తాగడం, ‘ముక్కులు’ ‘నోళ్లు’ పొగలు సెగలు కక్కడం జీవన ‘విలాసం’- ఫ్యాషన్- కావడం ఐరోపా వారి విధానం. శతాబ్దుల తరబడి మన దేశంలో విస్తరించిన ఐరోపా వాణిజ్య దురాక్రమణకు చెఱగని ప్రతీకలు ‘సిగరెట్ల’ పొగలు.. ‘పొగల’ సిగరెట్లవల్ల ప్రమాదం ఏర్పడుతోందని ‘‘కనిపెట్టడం’’ తరువాత జరిగిన దోపిడీ ప్రక్రియ.. ఈ ప్రక్రియలో భాగంగానే ‘ఆవిరి’ సిగరెట్లవల్ల ప్రమాదం లేదని చైనావారు కనిపెట్టడం! అందువల్ల ‘ఆవిరి’-వేపర్- సిగరెట్లను చైనావారు ప్రపంచం నెత్తికెత్తారు. ఐరోపా సామ్రాజ్య దురాక్రమణకు విస్తరణ ‘ప్రపంచీకరణ’. ‘ప్రపంచీకరణ’ వాణిజ్య ఆధిపత్యం అమెరికా నుంచి ఐరోపా నుంచి చైనాకు సంక్రమించింది. 2000వ సంవత్సరంలో ‘పొగల’ సిగరెట్లకు బదులు ‘ఆవిరి’సిగరెట్లను తాగడం మొదలైంది! ‘‘ఎలక్ట్రానిక్’’ ప్రక్రియ ద్వారా పొగలకు బదులు ‘ఆవిరులు’ వెలువడడం ఈ కొత్త సిగరెట్లను కాల్చడంలో జరిగిపోతున్న ‘‘అద్భుతం’’. పద్దెనిమిది ఏళ్లుగా ప్రపంచంలోని వివిధ దేశాలలో ఈ ‘ఆవిరి’ సిగరెట్లు పీల్చుతున్నారట. మన దేశంలోకి మాత్రం ఇవి రెండేళ్ల క్రితమే చొఱబడినాయట. మన ప్రభుత్వం తొందరగానే మేల్కొన్నట్టు ధ్రువపడింది. ఈ ‘ఆవిరి’ సిగరెట్లను ఆఘ్రాణిస్తున్న ‘విలాస జీవుల’లో అరవై శాతం గుండె జబ్బులకు, ఇతర రోగాలకు గురికానున్నట్టు పరిశోధనలలో నిగ్గుతేలడం మన ప్రభుత్వం మేలుకొనడానికి నేపథ్యం. ఈ ‘ఆవిరి’ సిగరెట్ల కారణంగా ‘పొగల’ సిగరెట్ల అమ్మకాలు తగ్గిపోయాయని ప్రచారం జరిగింది. తగ్గలేదని మరోవైపున ప్రచారం.. ‘పొగల’ సిగరెట్లను ఉత్పత్తిచేస్తున్న సంస్థలవారే మరో పేరుతో సంస్థలను వెలయించి ఈ ‘ఆవిరి’ సిగరెట్లను తయారుచేశాయన్నది అసలు వాస్తవం. ‘ఆవిరి’ సిగరెట్లను మాత్రమే తయారుచేస్తున్న సంస్థలలో ‘పొగలు’ సిగరెట్ల సంస్థలవారికి భాగస్వామ్యం ఉందట...
ఇదంతా వాణిజ్య మాయ! ‘ప్రపంచీకరణ’ మారీచ స్వర్ణ మృగం కల్పిస్తున్న మాయ! ధూమపానానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారం కారణంగా బుద్ధివచ్చిన ఎందరో సిగరెట్లను పీల్చడం మానివేయడం ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’ అక్రమ లాభాలకు గండికొడుతున్న పరిణామం. అంతర్జాతీయ జనంలోని యువకులు, ప్రౌఢ వయస్కులలో 2009లో ఇరవై రెండు శాతం సిగరెట్లను కాల్చేవారట, ఈ ‘శాతం’ 2018నాటికి ‘ఇరవై’కి తగ్గిందట. ధూమపానం చేసేవారి సంఖ్య రెండు శాతం తగ్గడంవల్ల ‘వాణిజ్య’పు దళారీలకు బోలెడన్ని ‘లాభాలు’ తగ్గిపోయాయి. అందువల్ల ‘‘హానికరం కాని’’ సిగరెట్లను ఉత్పత్తిచేస్తున్నామన్న ‘వంచన క్రీడ’ను బహుళ జాతీయ ఉత్పాదక సంస్థలు మొదలుపెట్టాయి. జనం నమ్మారు, పొగ త్రాగడం మాని ‘‘పొగాకు ఆవిరి’’ని తాగడం మొదలుపెట్టారు. ‘పొగల సిగరెట్ల’కంటె ఈ కొత్త ‘ఆవిరి సిగరెట్లు’ మరింత రుచికరమైనవి, మరింత విష పూరితమైనవి, మరింత ప్రమాదకరమైనవి. ఈ నిజం బయటపడింది. ముప్పయి మూడు దేశాలలో ఈ ‘ఆవిరి’సిగరెట్లను ఇదివరకే నిషేధించారట! రోగాలను నయం చేయడానికి మందులను కనిపెట్టడం, ఆ మందులవల్ల కొత్త వ్యాధులు వ్యాపించడం, ఆ మందులను నిషేధించడం- ఇదంతా దశాబ్దుల తరబడి జరుగుతున్న అంతర్జాతీయ వాణిజ్య వంచన క్రీడ. కానీ కనిపెట్టడానికి, నిషేధించడానికి మధ్య జరిగిన కాలంలో వేల మంది లక్షల మంది మోసపోవడం డబ్బును పోగొట్టుకొనడం ఆరోగ్యాన్ని చెడగొట్టుకొనడం, ఉత్పాదక సంస్థలు ‘దళారీ’లు అక్రమ లాభాలను దండుకోవడం... ఇదీ కుట్ర జరుగుతున్న తీరు! ‘ఆవిరి’సిగరెట్లను నిషేధించిన ప్రభుత్వం ‘పొగల’ సిగరెట్లను మాత్రం ఎందుకని నిషేధించరాదు?! వేల సంవత్సరాలుగా పత్తి పండించిన భూములలో బ్రిటన్ బీభత్స ‘పాలన’సమయంలో పొగాకును ఉత్పత్తిచేయడం ఆరంభమైంది. అందువల్లనే బ్రిటన్ వ్యతిరేక స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో గాంధీ మహాత్ముడు ‘రాట్నం’- చరఖా- మన జీవన విధానంలో మళ్లీ భాగం కావాలని బోధించాడు. పత్తి, ‘రాట్నం’, నూలు వడకడం, మగ్గం, వస్త్ర పరిశ్రమ... ఇవన్నీ కల్తీలేని స్వచ్ఛమైన స్వరాజ్య వ్యవస్థకు సోపానాలు. సురాజ్య వ్యవస్థకు ప్రతీకలు! ధూమపానం, మద్యపానం సమూలంగా నిర్మూలన జరగనిదే మన జీవన విధానం కాలుష్య సాంకర్యం నుంచి విముక్తం కాజాలదు! 1958 ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి దేశమంతటా మద్యపానాన్ని సర్వసమగ్రంగా నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం నియమించిన అధ్యయన సంఘం వారు క్రీస్తుశకం 1955 అక్టోబర్‌లో ప్రతిపాదించడం చరిత్ర. ఎనే్నళ్లు గడచిపోయాయి?
దేశ ప్రజల సమష్టి నైతిక నిష్ఠ ‘కల్తీ’అయి ఉండడం ఆహారం కల్తీఅయి ఉండడానికి కారణం! ఆహారం శుద్ధిచేసి నిలువ ఉంచే ప్రక్రియ అనాదిగా మన దేశంలో ఉంది. ప్రతి ఇల్లూ ఒక ‘ఆహారశుద్ధి’ కర్మాగారం. అప్పడాలు, ఆవకాయలు, ఒరుగులు- చిప్స్-, బొరుగులు- మరమరాలు-, పేలాలు, అటుకులు, పుట్నాలు, పూతరేకులు, తేనెలు, తాండ్రలు- ఇవన్నీ దేశమంతటా గ్రామగ్రామాన వికేంద్రీకృతమైన గృహ పరిశ్రమలలో తయారయ్యాయి. ఈ ‘శుద్ధీకృత’ ఆహారం- ప్రాసెస్డ్ ఫుడ్- విష రసాయనాలతో ‘కల్తీ’ కాలేదు! బ్రిటన్ బీభత్స పాలకులు ఈ వికేంద్రీకృత ‘ఆహార శుద్ధి’- ఫుడ్ ప్రాసెసింగ్- వ్యవస్థను ధ్వంసం చేశారు. మన ప్రభుత్వాలు సైతం ‘మెగా’ ఆహారశుద్ధి కేంద్రాలను కేంద్రీకృతం చేసి ‘శుద్ధి’పేరుతో ఆహారాన్ని విష రసాయనాలతో కల్తీ చేయిస్తున్నారు! నిజానికి ‘ఆహారశుద్ధి’ పేరుతో భారీ పరిశ్రమలవారు ‘ప్రిజర్వెంట్స్’- నిలువకు దోహదం చేసే రసాయన విషాలు-తో ఆహారాన్ని కలుషితం చేస్తున్నారు. ‘‘యాడెడ్ ఫ్లేవర్స్’’- కృత్రిమ పరిమళాల-తో ‘డబ్బాల తిండి’ని సంకరం చేస్తున్నారు. ఇలా ‘విష రసాయనాల’ను ఆహారంలో తగుపాళ్లలో కలపడానికి అనుమతించిన ప్రభుత్వాలు ‘కల్తీ’ని చట్టబద్ధం చేశారు. అనుమతించిన ‘‘తగిన మోతాదు’’ కంటె రెండుమూడు రెట్లు, పది రెట్లు ‘రసాయన విషాల’ను ఆహారంలో కలిపేస్తున్న ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’వారు కృత్రిమ రుచులతో జనం నోళ్లు ఊరిస్తున్నారు! ఇదీ ‘ఆహారశుద్ధి’పేరుతో జరుగుతున్న సాంకర్యం... కల్తీ! ఎవరు నిరోధిస్తారు? ఎవరు నిర్మూలిస్తారు??