సంపాదకీయం

ప్రగతి కోరల్లో పచ్చదనం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూమాతను ఆకుపచ్చని హారంతో అలంకరించాలన్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పం హర్షణీయం. గత ఏడాది వర్షఋతువులో కోట్ల మొక్కలు నాటిన ప్రభుత్వం ఈ ఏడాది కూడ హరిత హారాన్ని మరిం త విస్తరించడానికి పూనుకుంటోంది. కాని రాష్ట్ర రాజధాని నగరంలో ఆకుపచ్చదనం నానాటికీ తగ్గిపోతుండడం దశాబ్దుల వైపరీత్యం. ఈ హరిత హననం తెలంగాణ ప్రభుత్వానికి సంక్రమించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి వారసత్వం కావచ్చు. కానీ ఈ రెండేళ్లలో కూడ రాష్ట్ర రాజధానిలో చెట్లు నరికే కార్యక్రమం యథావిధిగా జరిగిపోతోంది. కెబిఆర్ జాతీయ హరిత ప్రాంగణం-నేషనల్ పార్క్-లోని కొన్ని వేల చెట్లను నరికివేయడానికి విస్తృత హైదరాబాద్ మహానగర పాలకమండలి-జిహెచ్‌ఎంసి-చేసిన విఫలయత్నం సరికొత్త సాక్ష్యం. ‘విస్తృత పథ ప్రగతిపథకం-ఎస్‌ఆర్‌డిపి-పేరుతో రహదారులను వెడల్పు చేసి ఆధునీకరిస్తున్న జిహెచ్‌ఎంసి వారు జంటనగరాలలోని అడ్డువస్తున్న వేల చెట్లను హతమార్చడానికి పూనుకున్నారు. చెట్లను నిర్మూలించకపోతే రహదారులను వెడల్పు చేయడం సాధ్యంకాదు మరి. కూల్చివేస్తున్న చెట్లకు సమాన సంఖ్యలో కొత్త మొక్కలు నాటి హరితశోభలను యథాతధంగా ఉంచడానికి మాత్రం జిహెచ్‌ఎంసి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. భాగ్యనగరంలో మాత్రమే కాదు భారతదేశమంతటా నెలకొనివున్న ప్రధాన సమస్య ఇదే. హరితశోభకు అభివృద్ధికీ మధ్య జరిగిపోతున్న సంఘర్షణలో హరితశోభ నిరంతరం ఓడిపోతుండడం వాణిజ్య ప్రపంచీకరణ ఫలితం. జాతీయ వేగపథాలు-ఎక్స్‌ప్రెస్ హైవేస్- నిర్మాణం పేరుతో లక్షల కొలదీ ఎదిగిన చెట్లను నిర్మూలించారు. మళ్లీ బాటల పక్కన చెట్లను పెంచే కార్యక్రమం మొదలు కాలేదు. హరిత పథాలు-గ్రీన్‌హైవేస్-ను అభివృద్ధి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్త ప్రణాళికను రూపొందించింది. కానీ ఎక్స్‌ప్రెస్ హైవేల నిర్మాణం ఆరంభమైనప్పటినుండి, కొత్త మొక్కలు నాటే కార్యక్రమం సమాంతరంగా జరిగివుండినట్లయితే పదిహేను ఏళ్లలో లక్షల చెట్లు వేగ పథాలకు ఇరువైపులా పెరిగి ఉండేవి. రహదారి సుంకాల-టోల్‌గేట్-ను వందల వేల కోట్లుగా దండుకున్న ప్రభుత్వేతర సంస్థలు చెట్లను పెంచలేదు. పెంచమని ప్రభుత్వాలు కోరలేదు. ఇదంతా ప్రపంచీకరణ మనకు ప్రసాదించిన కృత్రిమ ప్రగతి...ప్రగతి భ్రాంతి ఆకుపచ్చదనాన్ని హత్య చేస్తుండడమే వాణిజ్య ప్రపంచీకరణ. రహదారుల మధ్యలో ఉన్న నడవలలో పిచ్చి మొక్కలను మాత్రమే పెంచుతున్న నిర్వాహక సంస్థలు రహదారులను ఆకుపచ్చదనం అలముకోకుండా నిరోధిస్తున్నారు. ఈ మొక్కలు ‘పిల్లి మోకాలు’ ఎత్తు వరకు పెరిగి వాడిపోతున్నాయి. అందువల్ల ప్రతిఏటా ఇటువంటి పొట్టి మొక్కలను నాటుతున్న నిర్వాహక సంస్థలు ఆచంద్ర తారార్కం తాము సుంకాలను దండుకోవడానికి మార్గాన్ని సుకరం చేసుకున్నాయి. కెబిఆర్ నేషనల్ పార్కును జిహెచ్‌ఎంసి వారు పాక్షికంగా ధ్వంసం చేసిన విఫలయత్నానికి ఇదంతా జాతీయ నేపథ్యం...
హైదరాబాద్‌లోని కెబిఆర్ పార్క్‌ను పాక్షికంగా ధ్వంసం చేయడానికి జిహెచ్‌ఎంసి చేసిన ప్రయత్నం తాత్కాలికంగా విఫలం కావడానికి ప్రధాన కారణం జాతీయ హరిత న్యాయమండలి-నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్-ఎన్‌జిటి- నెలరోజులలో రెండుసార్లు నిరోధక ఆదేశాలను జారీ చేయడం. చెట్లను నరికివేసే కార్యక్రమానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున జంటనగరవాసులు ఉద్యమించడం హరిత రక్షణ చైతన్యం విస్తరిస్తున్నదనడానికి నిదర్శనం. ఈ ఉద్యమం కారణంగానే హరితన్యాయమండలి దక్షిణ విభాగం మదరాసు పీఠంవారు మేనెల రెండవ తేదీని ఆ మూడువేల చెట్లను నరకరాదని ఆదేశించింది. అంతకుపూర్వం చెట్లను నరికివేయడం కొన్ని నెలలపాటు ఆపాలని హరిత పరిరక్షకులు చేసిన విజ్ఞప్తిని అధికారులు పాటించలేదు. వర్షాకాలంలో ఈ మూడువేల ఎదిగిన చెట్లను వేళ్లతో సహా పెళ్లగించి వేరేచోట నాటగలమని ఉద్యమకారులు ప్రకటించారు. ఇలా ఈ వృక్షాలను రక్షించడానికి వలసిన భూమిని నిధులను సమకూర్చడానికి హరిత పోషకులు స్వచ్ఛందంగా సిద్ధం కావడం అపూర్వ పరిణామం.
కొన్ని నెలల పాటు ఈ వృక్ష నిర్మూలన కార్యక్రమాన్ని నిలిపివేయడానికి సైతం జిహెచ్‌ఎంసి అంగీకరించకపోవడం ఘోరమైన అన్యాయం. న్యాయమండలి మధ్యంతర ఆదేశం జారీ చేసిన తరువాత చెట్ల జోలికి వెళ్లలేకపోయిన జిహెచ్‌ఎంసి రహదారి వెడల్పు చేయడానకి వీలుగా కెబిఆర్ పార్కు గోడలను కూల్చడానికి పూనుకుంది. మే 24న ఒక గోడను కొంతమేర కూల్చివేశారు కూడ. అయితే కెబిఆర్ పార్క్‌లోపలగాని,పరిసరాలలోగాని ఎలాంటి నిర్మాణ, విధ్వంస కలాపాలు చేపట్టవద్దని 27వ తేదీన గ్రీన్ ట్రిబ్యునల్ మరోసారి మధ్యంతర ఆదేశాలను జారీ చేసింది. ఉద్యమకారుల వినతిని పాటించి కొన్ని నెలలపాటు ఈ హరిత హనన కార్యక్రమాన్ని జిహెచ్‌ఎంసి నిలిపివేసి ఉండినట్టయితే న్యాయమండలి ప్రమే యం అవసరం ఉండేది. కెబిఆర్ పార్కుకు ఊపిరి నిలిచినప్పటికీ ఈ విస్తృత పథ ప్రగతి పథకం జంటనగరాలలోని వేలాది చెట్ల ఉసురులను తీయడం ఖాయం. చెట్లు కొట్టివేయడం జిహెచ్‌ఎంసి వారికి గొప్ప సరదా. గాలి వానలకు కొన్ని చెట్లు కూలిపోయాయి. ఈ కారణంగా అనేక ప్రాంతాలలోని ఎదిగిన మహా వృక్షాలను నగరపాలకులు రెండు మూడు రోజులపాటు నరికి వేయించారు. గాలివాన బీభత్సాన్ని నిరోధించడానికి చికిత్స ఇదేనా?
పారిశ్రామిక ప్రగతి పచ్చదనం పాలిట శాపం కావడం వాణిజ్య ప్రపంచీకరణలో భాగం. హరిత పరిరక్షణ నియమాలను అతిగా పాటించడం వల్ల ప్రగతి కుంటుపడిపోతుందని 2011వ సంవత్సరం ఫిబ్రవరి మూడవ తేదీన అప్పటి ప్రధాని మన్‌మోహన్ సింగ్ న్యూఢిల్లీలో ప్రకటించారు. ఆయన దృష్టిలో ప్రగతి అంటే పరిశ్రమలు ఏర్పడడం. అప్పటినుంచి దాదాపు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటి కేంద్ర ప్రభుత్వం కూడ పచ్చని సీమలను పాడుపెట్టి పరిశ్రమలను పెట్టే విధానాన్ని అనుసరిస్తున్నాయి. ప్రకృతిని వ్యవసాయాన్ని పరిమార్చకుండా పారిశ్రామిక ప్రగతి సాధించే మార్గాలు లేవా? తెలంగాణ ప్రభుత్వం కూడ చెట్లను కొట్టివేసే కార్యక్రమాలను మరింత సులభతరం చేస్తూ మే నెలలో ఉత్తర్వులు జారీ చేసిందట. ఈ ప్రభుత్వపుటుత్తర్వుల ప్రకారం చెట్లు నరకదలచినవారు దరఖాస్తులుపెట్టుకున్న ఏడు రోజులలోగా సంబంధిత అధికారులు అనుమతి ఇచ్చేస్తారట. పరిశ్రమల స్థాపనకు విఘాతం కలుగరాదన్నది ప్రభుత్వ విధానం..విలంబనం వల్ల ప్రగతి ఆగిపోతుంది. వృక్షానికి రక్షణ ఎవరు?