సంపాదకీయం

మౌలికం.. ప్రత్యామ్నాయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థ గురించి అనే్వషణ జరగాలన్నది జాతీయభావ నిష్ఠులు చెబుతున్న మాట! నిజానికి ఈ ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థ ‘ప్రత్యామ్నాయం’- ఆల్టర్‌నేటివ్- కాదు, ఇది మౌలికమైన- ఒరిజినల్- ఆర్థిక వ్యవస్థ. అనాదిగా ఈ వ్యవస్థ మన దేశంలో అలరారింది. ఈ వ్యవస్థ స్వభావం ఉత్పత్తిదారుల సమాజం అవసరాలను తీర్చడం. ఈ వ్యవస్థ స్వరూపం వికేంద్రీకరణ! మట్టిపాత్రలను ఉత్పత్తి చేసిన కుంభకారుడు సమాజంలోని అన్ని కుటుంబాలకు వౌలిక ఉపకరణాలను అందించాడు. అతడు అధిక లాభాలను ఆర్జించాలని కాని, సమాజాన్ని దోపిడీ చేయాలని కాని భావించలేదు. తన అవసరాల కోసం మాత్రమే ధనం సంపాదించిన దోపిడీ చేయని యజమాని ఆ కుంభకారుడు- కుమ్మరి-! అతడు ‘కూలి’వాడు కాదు, శ్రమ జీవనుడైన యజమాని! ఇలాంటి ‘కుంభకార’ కర్మాగారాలు ప్రతి గ్రామంలో ఉండేవి. ఇది స్వరూపానికి సంబంధించిన వికేంద్రీకరణ! యజమానుల ‘స్వభావం’ దోపిడీ చేయనితనం, సమాజ అవసరాలను తీర్చడం.. యాజమాన్యం ‘స్వరూపం’ వికేంద్రీకరణ. గ్రామస్థాయి వరకు ఇంటి స్థాయి వరకు ఈ వికేంద్రీకృత ఆర్థిక వ్యవస్థ నిలువున విస్తరించడం భారతీయం, ‘మానవీయం’.. వికేంద్రీకృతి కారణంగా ప్రతి పరిశ్రమ ‘పరిధి’ ఒక గ్రామానికి లేదా కొన్ని గ్రామాల ‘విపణి వీధి’ అయిన ‘సంత’కు పరిమితమై ఉండేది. అందువల్ల ఉత్పత్తిదారుడు కానీ పంపిణీదారుడు కాని అవసరానికి మించిన రీతిలో కలుపుమొక్కల వలె విస్తరించడానికి వీలుండేది కాదు. ఉత్పత్తిదారుడు శ్రమజీవి, యజమాని. పంపిణీదారుడు శ్రమజీవి, యజమాని. ఇలా దోపిడీ చేయడానికి వీలులేని, దోపిడీ చేయాలన్న తలంపు అంకురించని మానవీయ ఆర్థికవ్యవస్థ ఈ దేశంలో సహస్రాబ్దుల తరబడి వికసించింది. ఆధునిక జాతీయ తత్త్వజ్ఞులైన దత్తోపంత్ ఠేంగ్డీ, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ వంటివారు ఈ వౌలిక, సమాజ సమన్వయ మానవీయ ఆర్థిక సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం సర్ సంఘ చాలక్- అధ్యక్షుడు- మోహన్ భాగవత్ ఇటీవల ఈ ‘వౌలిక’ ఆర్థిక వ్యవస్థ గురించి ప్రస్తావించడానికి ‘విజయ దశమి’ నేపథ్యం...
శతాబ్దుల తరబడి విదేశీయ దురాక్రమణకారులు ప్రధానంగా బ్రిటన్ ఆర్థిక రాజకీయ బీభత్సకారులు మన దేశంలోని ఈ అనాది ‘వికేంద్రీకృత ఆర్థిక వ్యవస్థ’ను ధ్వంసం చేశారు. కేంద్రీకృత పారిశ్రామిక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఉత్పాదక కేంద్రాలయిన లక్షల, కోట్ల కుటీర పరిశ్రమలు మూతపడి వందల సంఖ్యలో అతిపెద్ద పరిశ్రమలు నగరాలలోను పెద్ద పట్టణాలలోను కేంద్రీకృతమయ్యాయి. ఫలితంగా ఒక ‘యజమాని’ వందల వేల మంది ‘కూలీ’లుగా శ్రమజీవన సమాజం ద్విధావిభక్తం కావడానికి మార్గం ఏర్పడిపోయింది. ఉత్పాదకులు, పంపిణీదారులు సమాజాన్ని దోపిడీ చేయడానికి ప్రాతిపదిక ఏర్పడింది. ఇదంతా పెట్టుబడిదారీ- కాపిటలిస్ట్- వ్యవస్థ. ఐరోపాలో పుట్టపగిలిన ఈ ‘పెట్టుబడిదారీ’ కీటక సమూహం ప్రపంచమంతటా ‘మిడతల’దండు వలె విస్తరించి సమాజాన్ని ముంచెత్తడం క్రీస్తుశకం పదిహేడవ శతాబ్ది నుంచి మొదలైన చరిత్ర... 1990వ దశకంలో ‘మారీచ మృగం’వలె వివిధ దేశాలలో విశృంఖల విహారాన్ని మొదలుపెట్టిన ‘వాణిజ్య’ ప్రపంచీకరణ- గ్లోబలైజేషన్- పెట్టుబడిదారీ వ్యవస్థకు మరో వికృతరూపం... ‘వన వరాహం’ ముదిరి ‘తోడేలు’గా మారింది! ఒక దేశం కొన్ని దేశాలను, కొన్ని దేశాలు అనేక దేశాలను దోపిడీ చేయడం ప్రపంచపు పెట్టుబడిదారీ వ్యవస్థ. ‘ప్రపంచీకరణ’ దీనికి పరాకాష్ఠ. సమాజంలో సహజంగా సమన్వయం నిహితమై ఉంది. ఇది సృష్టిస్థిత సమన్వయ వ్యవస్థకు సమాజీకరణ, ఇది భారతీయ లేదా హైందవ ఆర్థిక వ్యవస్థకు ప్రాతిపదిక! దీన్ని ధ్వంసం చేసిన ఐరోపావారి అత్యాశ, అహంకారం సమన్వయాన్ని భంగపరిచింది, వైరుధ్యాలను సృష్టించింది. పెట్టుబడిదారీ పద్ధతికి కొనసాగింపు ‘సామ్యవాదం’ పేరుతో చెలామణి అయిన ‘కమ్యూనిజమ్’. ‘కమ్యూనిస్టు’ సిద్ధాంతకర్తలు ‘వైరుధ్యాలు’ సమాజంలో సహజంగా నిహితమై ఉన్నాయని ప్రచారం చేశారు. ఇలా ‘కాపిటలిజమ్’, ‘కమ్యూనిజమ్’ రెండూ సమాజంలో నిహితమై ఉన్న సహజ సమన్వయాన్ని - హార్మొనీ-ని భగ్నం చేశాయి. సమాజం వైరుధ్య-కాన్‌ఫ్లిక్టింగ్- శక్తుల సమాహారమని ప్రచారం చేశారు...
పరిణామక్రమంలో ఈ రెండు ఆర్థిక వ్యవస్థలూ దమనకాండకు ప్రతిరూపాలుగా మారాయి. అందువల్లనే వివిధ దేశాలలో ‘‘శ్రమజీవన స్వేదజలం సమరార్ణవమై లేచెను, దమననీతి దనుజ శిఖల దావాగ్నుల ముంచెత్తెను..’. వివిధ దేశాల ప్రజలు మొదట ‘కాపిటలిస్టు’ ఆర్థిక నీతిని తిరస్కరించారు. ‘కమ్యూనిజమ్’ మేలని భావించారు. కానీ ‘కమ్యూనిజమ్’ ‘కాపిటలిజమ్’కంటె మరింత భయంకర దమనకాండను వ్యవస్థీకరించడం తూర్పు ఐరోపా చరిత్ర, రష్యా చరిత్ర. అందువల్ల ఐరోపా దేశాలు, రష్యా ప్రజలు ‘కమ్యూనిస్టు’వ్యవస్థను నిర్మూలించారు. ‘కాపిటలిస్ట్’ వ్యవస్థలో వందల ‘పెట్టుబడి’ సంస్థలు లక్షల కోట్ల ప్రజలను దోపిడీ చేశాయి, ‘కమ్యూనిస్టు’ వ్యవస్థలో ఒకే ఒక ‘పెట్టుబడి సంస్థ’- ప్రభుత్వం- లక్షల కోట్ల ప్రజలను దోపిడీ చేయడం, దమనకాండకు గురిచేయడం తూర్పు ఐరోపా చరిత్ర. ‘పెట్టుబడిదారీ’ పద్ధతిని మొదట నిరాకరించిన ఐరోపా, రష్యా ప్రజలు ‘కమ్యూనిజాన్ని’ అంగీకరించారు. కానీ 1989వ సంవత్సరంలో ‘కమ్యూనిజాన్ని’కూడ నిరాకరించిన ప్రజలు మళ్లీ పెట్టుబడిదారీ పద్ధతిని నెత్తికెత్తుకున్నారు. ఇదే ‘ప్రపంచీకరణ’ స్వేచ్ఛావిపణి వ్యవస్థ! ఎందుకంటె ఇప్పటికీ ఐరోపా, అమెరికాలలోని ‘మేధావుల’కు మూడో ప్రత్యామ్నాయం కావాలన్న ధ్యాస కలగడం లేదు. ‘‘వేసుకుని ఉన్న చొక్కా మాసిపోయింది, కంపు కొట్టింది, అందువల్ల ‘అతగాడు’ ఆ చొక్కాను తీసి గూటానికి తగిలించాడు. గూటానికి వేలాడిన చొక్కాను తీసుకొని తొడుక్కున్నాడు. కొన్ని రోజులకు రెండవ చొక్కా కూడ కంపుకొట్టింది. దాన్ని విప్పేసి గూటానికి వేలాడుతుండిన ‘‘మాసిపోయిన కంపుకొట్టిన’’ మొదటి చొక్కాను అతగాడు మళ్లీ తొడుక్కున్నాడు.. ‘కాపిటలిజమ్’ తరువాత ‘కమ్యూనిజమ్’, ‘కమ్యూనిజమ్’ తరువాత మళ్లీ ‘కాపిటలిజమ్’!’’- దత్తోపంత్ ఠేంగ్డీ వంటివారు చెప్పిన ఉదాహరణ ఇది. అందువల్ల ‘చొక్కాల’ను ‘అతగాడు’ ఉతుక్కోవాలి. ఇలాంటి ప్రక్షాళన జరగడానికి సైతం ఆ ‘చొక్కాలు’ పనికిరావు. అందువల్ల మూడవ ‘చొక్కా’-అంగీ- షర్ట్-కోసం, తృతీయ ఆర్థిక ప్రత్యామ్నాయం కోసం ప్రపంచవ్యాప్తంగా అనే్వషణ జరగడం అనివార్యం! ఈ తృతీయ ప్రత్యామ్నాయం నిజానికి ‘‘మొదటిది’’, భారతదేశంలో అనాదిగా వికసించినది, విదేశీయులు ధ్వంసం చేసినది!! వౌలికమైన వ్యవస్థను ‘ప్రత్యామ్నాయం’గా భావించడం చారిత్రక పరిజ్ఞాన రాహిత్యానికి నిదర్శనం...
బ్రిటన్ వారి బీభత్సపాలన సమయంలో ‘లాల్ బాల్ పాల్’- లాలా లజపతి రాయ్, బాలగంగాధర తిలక్, విపిన్‌చంద్ర పాల్- త్రయం, గాంధీ మహాత్ముని వంటివారు ఈ ‘స్వదేశీయ’-మానవీయ- హైందవీయ- వికేంద్రీకృత- ఆర్థిక వ్యవస్థను పునర్ధురించాలని తపించారు. బ్రిటన్ దొంగల నిష్క్రమణ తరువాత స్వదేశీయ ఆర్థిక సిద్ధాంతవేత్తలు, ఉద్యమకారులు ఈ ‘మౌలిక’ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాలని కోరుతున్నారు. ఈ పునరుద్ధరణ చేయడం ‘‘సమాజాన్ని వెనక్కి నడిపించడమని’’ ప్రచారం చేస్తున్నవారు దేశ వ్యతిరేకులు! రాట్నం, మగ్గం, నాగలి, కుమ్మరిబట్టీ, కమ్మరి కొలిమి ఒకరోజులో ధ్వంసం కాలేదు, పథకం ప్రకారం వందల ఏళ్లలో విదేశీయులు ధ్వంసం చేశారు. అందువల్ల వికేంద్రీకృత భారతీయ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు కూడ- అంకురార్పణ జరిగిన నాటి నుంచి-అనేక దశాబ్దులు పట్టవచ్చు. అత్యాధికశాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అట్టడుగు స్థాయి వరకు వికేంద్రీకృతం కావాలి. స్వరూపం మారవచ్చు. స్వభావం మారదు. ఈ వౌలిక ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ జరిగితే నగరాల నుంచి, పట్టణాల నుంచి పల్లెలకు ప్రజలు తరలిపోతారు..!