సంపాదకీయం

వైద్య బీభత్సం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వేతర రంగంలోని వైద్యశాలలు, విద్యాలయాలు ‘దోపిడీ కేంద్రా లు’గా, నిర్లక్ష్యపు నిలయాలుగా, అమానవీయతకు ఆటపట్టులుగా, పైశాచిక దురహంకార ప్రవృత్తికి పట్టుకొమ్మలుగా మారి ఉండడం ‘వాణిజ్య ప్రపంచీకరణ’ మన నెత్తికెత్తిన వైపరీత్యం. దశాబ్దుల తరబడి మన నెత్తికెక్కిన ఈ వాణిజ్య-కార్పొరేట్- వైద్యశాలలలో, వాణిజ్య విద్యాశాలలలో క్రూరత్వం కొలువుతీరి ఉండడం బహిరంగ రహస్యం. ఈ క్రూరత్వం ఐరోపా వారి స్వభావం. అమెరికాలోను, ఆస్ట్రేలియాలోను శతాబ్దుల తరబడి హత్యలు చేసి ఆయా ఖండాలలోని అనాది జాతులను నిర్మూలించిన వారి స్వభావం! పాశ్చాత్యుల దురాక్రమణ సమయంలో భారతీయ విద్యావంతులలో అనేకులకు ఈ క్రూరత్వం, ఈ పైశాచికత్వం వంటబట్టింది. అందువల్ల మన దేశంలో చదువుకున్న సంస్కారవంతుల కంటె చదువుకున్న అవినీతి పరులు, అత్యాచార పరాయణులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేవారు- విబుధదైత్యులు- ఎక్కువ మంది ప్రబలి ఉన్నారు. ఇలాంటి విబుధదైత్యులు నిర్వహిస్తున్న విద్యాలయాలు, వైద్యశాలలు ఘోర భయంకర ‘తమాల వాటికలు’ కావడంలో ఆశ్చర్యం ఏముంది? పాశ్చాత్యుల వాణిజ్య దురాక్రమణకు సరికొత్త కొనసాగింపు వాణిజ్య ప్రపంచీకరణ-గ్లోబలైజేషన్-! ‘అంతర్జాతీయ స్థాయి’ అన్న ముసుగులో ‘కార్పొరేట్’ విద్యాలయాలు, ‘కార్పొరేట్’ వైద్యశాలలు దేశమంతటా విష కీటకాల పుట్టలా పెరిగిపోతున్నాయి. ప్రజల డబ్బును, శ్రమార్జిత సంపదను కొల్లగొట్టి తమ పొట్టలను పెంచుకొనడం మాత్రమే ఈ ‘కార్పొరేట్ సంస్థల’ కామందుల ఏకైక లక్ష్యం. భారతీయ సంస్థలను కూడ ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’ వికృత స్వభావం ఆవహించి ఉండడం ‘ప్రపంచీకరణ’ ఫలితం, ‘స్వేచ్ఛా వాణిజ్య వ్యవస్థ’ ప్రభావం. ప్రాణం పోయవలసిన వైద్యశాలలు ప్రాణం తీసే కసాయి వాటికలుగా మారి ఉండడం నడుస్తున్న చరిత్ర. చికిత్సార్థుల ప్రాణభద్రతతో నిమిత్తం లేని కార్పొరేట్ వైద్యశాలలలో నిర్లక్ష్యం బలికొంటోంది. నియమాలు పాటించకుండా నిర్మించిన, నిర్వహిస్తున్న వైద్యశాలలలో అగ్నిప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. దేశమంతటా వైద్యశాలలలో భయంకర అగ్నిప్రమాదాలు జరగడం చరిత్ర.. హైదరాబాద్ లాల్‌బహదూర్ నగర్‌లోని ఒక వాణిజ్య వైద్యశాలలో ఆదివారం రాత్రి రెండున్నర గంటల ప్రాంతంలో జరిగిన భయంకర అగ్నిప్రమాదానికి ఇదీ నేపథ్యం. వైద్యశాల నిర్వాహకుల క్రూరమైన నిర్లక్ష్యం ఈ నేపథ్యం. ‘షైన్ చిల్డ్రన్ హాస్పిటల్’ అన్న ఈ ప్రభుత్వేతర వైద్యశాలలో చెలరేగిన అగ్నిజ్వాలలకు నాలుగు నెలల వయస్సుకల పసిబాలుడు ఆహుతైపోయాడట...
నిర్లక్ష్యం వహించిన అభియోగంపై వైద్యశాల యజమానిని పోలీసులు నిర్బంధించారట. కానీ దీని నిర్లక్ష్యానికి బలైపోయిన శిశువు తిరిగి బతకబోడు, తల్లిదండ్రుల హృదయాగ్ని వ్యథాజ్వాలలు చల్లారబోవు. ఈ నిర్లక్ష్యం ‘పొరపాటు’కాదన్నది జరుగుతున్న ప్రచారం. ఎందుకంటె రెండురోజుల క్రితం కూడ ఇదే వైద్యశాలలో అగ్నిప్రమాదం జరిగిందట. అప్పుడు ‘వైద్య సహాయక’-నర్సు-లు చిన్ని పాపలను, బాబులను ఎత్తుకొని పరుగులు తీశారట. అయితే ఆ ప్రమాదంలో జ్వాలలు పెద్ద ఎత్తున చెలరేగలేదు. కానీ ఆ ఘటన జరిగిన తరువాతనైనా ‘యాజమాన్యం’వారు జాగ్రత్తలు తీసుకొనక పోవడం, అగ్నిప్రమాద నిరోధక చర్యలకు పూనుకోకపోవడం దుర్బుద్ధి, పైశాచిక నిర్లక్ష్యం...!! ‘పొరపాటు’మాత్రం కాజాలదు. ఇలాంటి ఘోరమైన నిర్లక్ష్యాలను ‘్భరతీయ శిక్షాస్మృతి’లోని మూడువందల నాలుగవ నిబంధన ప్రకారం శిక్షించడం వల్ల దోషులు స్వల్ప శిక్షలతో తప్పించుకోగలుగుతున్నారు. బుద్ధిపూర్వకంగా భద్రతను నిర్లక్ష్యం చేసే వైద్యశాలల యజమానులకు ‘యావజ్జీవ కారాగృహ శిక్ష’ను విధించే విధంగా ప్రత్యేక శాసన నిబంధనను రూపొందించినప్పుడు మాత్రమే ఈ దుర్బుద్ధి జీవుల రోగం కుదురుతుంది. ఆదివారం రాత్రి ప్రమాదం జరిగిన సమయంలో వైద్యశాలలోని ‘అతి జాగరూక చికిత్స’- ఇంటెన్సివ్ కేర్- విభాగంలో నుండి పిల్లలను బయటికి తీసుకొని రావడానికి ‘నర్సు’లెవరూ ప్రయత్నించలేదట. ‘నర్సు’లు విధులలో లేకపోవడం ‘్భయంకర యాజమాన్య నిర్లక్ష్యం.. శిశువుల తల్లిదండ్రులు, బంధువులు వెంటనే అప్రమత్తులైపోయి తమ శిశువులను ఆ విభాగం నుంచి బయటికి తీసుకొని రావడంతో, నలబయి ఎనిమిది మంది ఇతర శిశువులు సురక్షితంగా బతికి బయటపడినారు. ఒక ‘రిఫ్రిజరేటర్’లో విద్యుత్ ప్రసారంలో ఏర్పడిన వైపరీత్యం ఈ ప్రమాదానికి కారణమట! దట్టమైన పొగలు కమ్మిన చిమ్మచీకటిలో తమ ‘సంచార వాణి’- సెల్‌ఫోన్-లోని వెలుగు సహాయంతో తమ శిశువులను గుర్తించి, రక్షించగలిగిన తల్లిదండ్రులు అభినందనీయులు. యాజమాన్యం వారి ‘రాక్షసత్వం’నుంచి భగవంతుడు ఆ పసికందులను రక్షించాడు...
దేశవ్యాప్తంగా నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించిన వైద్యశాలలలో ‘ఇది’కూడ ఒకటి. ఈ ‘షైన్ చిల్డ్రన్ హాస్పిటల్’ను కేవలం నూట యాబయి చదరపు గజాల స్థలంలో నిర్మించారట. భూగర్భ ప్రాంగణం -సెల్లార్- కాక నాలుగు అంతస్థులను నిర్మించారట. నూట యాబయి చదరపు గజాల ఇరుకైన స్థలంలో నాలుగు అంతస్థుల భవనం! ఇది ఎలా సాధ్యమని వైద్యశాల యాజమాన్యాన్ని ఇన్ని రోజులుగా ‘మహానగర పాలిక’- జిహెచ్‌ఎంసి- అధికారులు కాని, ప్రభుత్వం కాని ఎందుకు ప్రశ్నించలేదన్న ప్రశ్నకు సమాధానం స్పష్టం. రెండు అంతస్థులను నిర్మించడానికి మాత్రమే అనుమతి తీసుకున్న యాజమాన్యం నాలుగు అంతస్థులను నిర్మించినట్టు ఇప్పుడు వెల్లడైంది. అగ్నిప్రమాదం జరిగేవరకూ ఈ ‘అక్రమం’ గురించి అధికారులకు ధ్యాస కలుగలేదు. ఇలాంటి అక్రమ కట్టడాలు దేశవ్యాప్తంగా అన్ని నగరాలలోను పట్టణాలలోను దశాబ్దుల తరబడి నిర్మిస్తూనే ఉన్నారు. రాజకీయవేత్తలు, అధికారులు, అక్రమ స్థిరాస్థి వ్యాపారులు, భవన నిర్మాతలు కలసికట్టుగా నిర్వహిస్తున్న దేశవ్యాప్త అవినీతి కార్యక్రమం ఇది. అనుమతి లేకుండా కట్టిన కట్టడాలను, అంతస్థులను నగర, పట్టణ ‘పాలికలు’కాని రాష్ట్ర ప్రభుత్వాలు కాని కూల్చివేయడం లేదు. అక్రమ నిర్మాణకర్తల వద్ద ‘క్రమబద్ధీకరణ’ రుసుమును రాబట్టుకుని అక్రమాన్ని ‘సక్రమం’గా మార్చి చట్టబద్ధం చేస్తున్నారు. అందువల్ల ‘ఎల్‌బి నగరం’ప్రాంతంలోని ఈ ‘వైద్యశాల’ అక్రమ నిర్మాణమని వెల్లడి కావడం ఆశ్చర్యకరం కాదు. ప్రభుత్వాలు వ్యవస్థీకరిస్తున్న చట్టబద్ధమైన అవినీతికి ‘క్రమబద్ధీకరణ’ అని నామకరణం చేశారు! ప్రతి ప్రాంతంలో ఇలాంటి అక్రమ అంతస్థుల భవనాలు నిర్మాణమవుతూనే ఉన్నాయి. ‘కూల్చివేయాలని’ న్యాయస్థానాలు అప్పుడప్పుడు తీర్పులిస్తున్నాయి కూడ. కేరళలో ఇలా అక్రమంగా నిర్మించిన భవన సముదాయాన్ని కూల్చివేయాలని ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించం ఒక ఉదాహరణ మాత్రమే! విస్తృత అక్రమ నిర్మాణ వైపరీత్యంలో ఈ వైద్య పైశాచికత్వం ఒక అంశం మాత్రమే!! నవజాత శిశు- నియోనాటల్- చికిత్సా కేంద్రంగా చెలామణి అయిన ఈ ‘ప్రమాద వైద్యశాల’కు ఇలాంటి చికిత్స చేయడానికి ఆధికారిక అనుమతి లేదట.. ఇది మరింత ప్రమాదకరమైన వాస్తవం! ప్రమాదం నుంచి తప్పించుకోవడం నలబయి ఎనిమిది మంది శిశువుల సుకృతం...
‘ఆయుష్మాన్ భారత్’ పథకం కింద లబ్దిపొందుతున్న వారిలో అరవై శాతం మంది ప్రభుత్వేతర వైద్యశాలలలో చికిత్సపొందుతున్నారు. ఈ వాణిజ్య వైద్యశాలల వారు ప్రభుత్వ వైద్యశాలలలో కంటె రెండు రెట్లు అధికంగా చికిత్సా శుల్కాలను వసూలుచేస్తున్నట్టు ప్రచారవౌతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయమై దర్యాప్తు చేస్తోందట.. ప్రజాధనం ఇలా అక్రమ వాణిజ్యవేత్తల పాలవుతోంది! ‘‘వైద్యుడు నారాయణుడు.. హరి!’’ అన్నది తరతరాల జాతీయ సంప్రదాయం. కానీ వైద్యులు హరిస్తున్నారు, దొంగిలిస్తున్నారు.. ఇది ప్రస్తుత వ్యవహారం! సక్రమంగా వైద్యం చేస్తున్న మానవీయ వైద్యులు, సమాజ ఆరోగ్య పరిరక్షకులు ఇప్పటికీ ఉన్నారు, వారు మహనీయులు. కాని వారి సంఖ్య చాలా తక్కువ..