సంపాదకీయం

మతోన్మాద శుల్కం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిక్కు మత సంస్థాపకుడు నానక్ గురుదేవుని ధర్మప్రచార క్షేత్రమైన ‘కర్తార్‌పూర్’ను సందర్శించనున్న ‘తీర్థయాత్రికుల’ నుండి పదునాలుగు వందల రూపాయల చొప్పున ‘పన్ను’ వసూలు చేయాలని పాకిస్తాన్ నిర్ణయించడం ఆ ప్రభుత్వ బీభత్సకాండకు మరో ఉదాహరణ, మతపరమైన అసహిష్ణుతకు మరో నిరూపణ! కలియుగం నాలుగువేల ఐదువందల డెబ్బయి ఒకటవ- క్రీస్తుశకం పదునాలుగు వందల అరవై తొమ్మిదవ- సంవత్సరంలో లాహోర్‌కు సమీపంలోని ‘రాయ్‌భాయ్‌దీ తల్వండీ’ గ్రామంలో జన్మించిన నానక్ గురుదేవుడు తన డెబ్బయ్యవ ఏట కర్తార్‌పూర్‌లో పార్ధివ శరీర పరిత్యాగం చేశాడు. ‘దర్బార్ సాహిబ్ గురుద్వారం’గా ప్రసిద్ధికెక్కిన కర్తార్‌పూర్ ప్రాంగణంలో నానక్ గురుదేవుడు తన జీవితంలో ఎక్కువ భాగం గడిపాడు. అందువల్ల నానక్ దేవుని సార్థపంచ శతతమ- ఐదువందల యాబయ్యవ జయంతి వత్సర ఉత్సవాల సందర్భంగా మన దేశం నుంచి అధిక సంఖ్యలో యాత్రికులు కర్తార్‌పూర్‌ను సందర్శించనున్నారు. ఈ సందర్శన యాత్ర సులభతరం కావడానికి వీలుగా మన ప్రభుత్వం మన పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా ‘డేరాబాబా నానక్’ తీర్థస్థలం నుంచి పాకిస్తాన్ పంజాబ్‌లోని దర్బార్ సాహిబ్ గురుద్వార- కర్తార్‌పూర్-వరకు ‘మహాపథాన్ని’- ట్రావెల్ కారిడార్-ను నిర్మించ తలపెట్టింది. గత ఏడాది కుదిరిన ఒప్పందం మేరకు పాకిస్తాన్ సరిహద్దు వరకు మన ప్రభుత్వం ఈ ‘కారిడార్’ను నిర్మించింది. ఉభయ దేశాల సరిహద్దు రేఖ నుంచి ‘దర్బార్ సాహిబ్ గురుద్వార’వరకు పాకిస్తాన్ ప్రభుత్వం మహాపథాన్ని నిర్మించింది. ఉభయ దేశాల సరిహద్దు రేఖ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో మన వైపున డేరాబాబా నానక్ నెలకొని ఉంది. సరిహద్దు రేఖనుంచి దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్ వైపున ‘దర్బార్‌సాహిబ్ గురుద్వార’ నెలకొని ఉంది. ఇలా ఆరు కిలోమీటర్ల మహాపథం ఏర్పడడంతో యాత్రికులు చుట్టుతిరిగి ‘దర్బార్ సాహిబ్ గురుద్వార’కు వెళ్లే శ్రమ తప్పిపోవడం గత ఏడాది కుదిరిన ఒప్పందం ఫలితం. ఈ ‘రహదారి’ నిర్మాణం పూర్తయింది. ఉభయ దేశాల అధికారులు గురువారం సరిహద్దురేఖ వద్ద సమావేశమై యాత్రకు సంబంధించిన ‘అవగాహన పత్రం’- మెమొరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్- ఎమ్‌ఓయు- పై సంతకాలు చేస్తారట. అయితే సంవత్సర కాలంపాటు మిన్నకుండిన పాకిస్తాన్ ప్రభుత్వం యాత్ర మొదలుకానున్న సమయంలో ఈ ‘తీర్థయాత్ర సేవా శుల్కాన్ని’వసూలు చేయాలని నిర్ణయించడం విస్మయకరం. ప్రతి యాత్రికుడు ప్రయాణపు ఖర్చులు వసతి ఖర్చులు భోజనం ఖర్చులు ఇతర సాధారణమైన ఖర్చులను భరించడం పరిపాటి. కానీ అదనంగా ‘సేవాశుల్కం’ పేరుతో ప్రతి భారతీయ యాత్రికుడు పదునాలుగువందల రూపాయలను తమకు చెల్లించాలని పాకిస్తాన్ ప్రభుత్వం వారు నిర్దేశించడం ‘జిహాదీ బీభత్స రాజ్యాంగ వ్యవస్థ’ స్వభావానికి అనుగుణమైన విపరిణామం. ఈ ‘తీర్థయాత్ర శుల్కాన్ని’ రద్దుచేయాలని మన ప్రభుత్వం పదే పదే కోరినప్పటికీ పాకిస్తాన్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకొనకపోవడం ఇస్లామేతర మతాల పట్ల పాకిస్తాన్ సమాజంలో నిహితమై ఉన్న సమష్టి విద్వేషానికి నిదర్శనం...
ఈ విచిత్రమైన ‘యాత్రా శుల్కం’ గతంలో ‘జిహాదీ బీభత్సకారులు’ మన దేశంలో ‘‘పాలకులు’’గా చెలామణి అయిననాటి ఘటనలను స్ఫురింప చేస్తోంది. అఖండ భారత్‌లోకి కలియుగం మూడువేల ఎనిమిది వందల పదునాలుగవ- క్రీస్తుశకం ఏడువందల పనె్నండవ- సంవత్సరంలో అరబ్బీ ‘జిహాదీ’లు చొఱబడడం చరిత్ర. అన్ని ఇతర మతాలను ధ్వంసం చేసి ఇస్లాంను మాత్రమే ఏకైక మతంగా ప్రతిష్ఠించాలన్నది ‘జిహాదీ’ల లక్ష్యం. ఈ లక్ష్యసాధన కోసం ‘‘పాలకులు’’గా చెలామణి అయిన ‘జిహాదీ’లు బీభత్సకృత్యాలను భయంకర రీతిలో కొనసాగించారు. ఇస్లామేతరులపై పన్ను విధించడం ఈ బీభత్సకృత్యాలలో ఒకటి. ‘జుట్టుపన్ను’గాను ‘జిజియా’ పన్నుగాను పేరుమోసిన ఈ దుర్మార్గపు పన్నును ‘స్వజాతీయులు’ శతాబ్దులపాటు ‘జిహాదీ’పాలకులకు చెల్లించవలసి వచ్చింది. ఈ భయంకర ‘జిహాదీ’ దమనకాండను నానక్ గురుదేవుడు నిరసించాడు. హైందవ జాతీయ సమాజాన్ని ఈ మతోన్మాద దమనకాండ నుంచి రక్షించడం కోసం నానక్ కొత్త ధార్మిక సంప్రదాయాన్ని ఆరంభించాడు. ఆ ధార్మిక సంప్రదాయం సిక్కుమతం! విదేశీయ దురాక్రమణకారులు వ్యాపించిన ‘చీకటి’లో సత్యమనే వెలుగురేఖ వలె నానక్ దేవుడు ప్రస్ఫుటించాడు.
‘నీచమైన కాళరాత్రి
నృత్యం చేస్తూ ఉన్నది,
సత్యమనే చంద్రరేఖ
కనబడకుండా ఉన్నది,
ఈ చీకటి రాజ్యంలో
దారి తెలియడం లేదు,
మరో కొత్తబాట వైపు
మనసును మళ్లిస్తాను..’
-అని నానక్ దేవుడు ప్రకటించాడు. ఆ తరువాత శతాబ్దులపాటు పంజాబ్‌లోను, ఉత్తర భారతంలోను సిక్కు గురువుల మార్గదర్శనం హిందూ జాతీయ సమాజం ‘జిహాదీ’బీభత్సకాండను ప్రతిఘటించడం చరిత్ర. సిక్కు సంప్రదాయం ఆరంభం కావడానికి ముందు తుగ్లక్‌లు, ఖిల్జీలు వంటి ‘’జిహాదీ’పాలకులు హిందువులపై జుట్టుపన్ను విధించారు. సిక్కు ధర్మాచార్యులు ‘మొఘలాయి’ జిహాదీల బీభత్సకాండను ప్రతిఘటించారు. జహంగీర్, షాజహాన్, ఔరంగజేబు వంటివారు సిక్కు మత గురువులను హింసించారు, హత్య చేయించారు. కోట్ల మంది హిందువులు జుట్టు పన్ను చెల్లించవలసి వచ్చింది. ఈ చరిత్ర ఇప్పుడు పాకిస్తాన్‌లో కొనసాగుతోంది. ‘తాలిబన్లు’ ‘లష్కర్లు’వంటి జిహాదీలు దశాబ్దుల తరబడి ‘సిక్కుల’నుంచి జుట్టుపన్ను వసూలుచేశారు. పెషావర్ ప్రాంతంలో మిగిలి ఉన్న రెండువందల సిక్కు-కుటుంబాలవారు ఐదు కోట్ల రూపాయల ‘జిజియా’పన్ను చెల్లించాలని పదేళ్లక్రితం ‘తాలిబన్లు’ ఆదేశించడం అప్పుడు ప్రకంపనాలను సృష్టించింది. పది కుటుంబాల ఇళ్లలో చొఱబడి తిష్ఠవేసిన పాకిస్తానీ తాలిబన్లు వారిని అనేక రోజులపాటు నిర్బంధించారు. చివరికి ఈ సిక్కు కుటుంబాలవారు రెండు కోట్లు రూపాయల ‘జిజియా’ పన్నును చెల్లించారు. ఆ తరువాత ఈ రెండువందల కుటుంబాలవారు ‘పెషావర్’ ప్రాంతం నుంచి పాకిస్తాన్‌లోని ఇతర ప్రాంతాలకు వలసపోవలసి వచ్చింది!! కొన్ని కుటుంబాలు మన దేశానికి తరలివచ్చినట్టు కూడ ప్రచారమైంది...
పాకిస్తాన్ ప్రభుత్వం ఈ దుష్టచరిత్రను కొనసాగిస్తోంది. కర్తార్‌పూర్‌కు మన దేశం నుంచి యాత్రికులను అనుమతించడం గొప్ప స్నేహచర్యగా ప్రచారం చేసుకొంటోంది. కానీ ప్రతి యాత్రికుని మీద పదునాలుగువందల రూపాయల ‘అక్రమ శుల్కం’ విధించడం ద్వారా పాకిస్తాన్ ప్రభుత్వం తన జిహాదీ స్వభావాన్ని వికృతంగా ఆవిష్కరించుకొంది. ఇదంతా కలియుగం ఐదువేల నలబయి తొమ్మిదవ- క్రీస్తుశకం పంతొమ్మిది వందల నలబయి ఏడవ- సంవత్సరంలో జరిగిన ‘అఖండ భారత విభజన’తో ముడివడి ఉన్న వైపరీత్యం. శతాబ్దులుగా ‘జిహాదీ’- స్వజాతీయులైన హిందువులను ఇస్లాంలోకి మతం మార్చడం వల్లనే అఖండ భారత విభజన జరిగింది. ఇస్లాం మతస్థులు ఎక్కువగాఉన్న అఖండ భారత ప్రాంతాలు పాకిస్తాన్‌గా ఏర్పడినాయి. ‘అవశేష భారత్’లో ‘అఖండ భారత్’లోవలె ‘సర్వమత సమభావ రాజ్యాంగ’వ్యవస్థ పరిఢవిల్లుతోంది. అందువల్ల ‘ఇస్లాం’ సహా అన్ని మతాలవారు ఇక్కడ సమానత్వం పొందారు, సమానంగా ప్రగతి సాధిస్తున్నారు. కానీ పాకిస్తాన్‌లో ఇందుకు విరుద్ధంగా ‘ఏకమత ఇస్లాం రాజ్యాంగ వ్యవస్థ’ ఏర్పడింది. ఫలితంగా అఖండ భారత విభజన నాటికి, పాకిస్తాన్‌లో మిగిలి ఉండిన వందలాది గురుద్వారాలు, దేవాలయాలు దశాబ్దుల తరబడి ధ్వంసమైపోయాయి. పదుల సంఖ్యలో మిగిలి ఉన్న ’గురుద్వారాలు’ ‘దేవాలయాలు’కూడ నిరంతరం ‘జిహాదీ’ల దాడులకు గురిఅవుతున్నాయి. కర్తార్‌పూర్ కథకు ఇదంతా నేపథ్యం...
ఐదువేల సంవత్సరాలకు పైగా భారతీయుల ధార్మిక సాంస్కృతిక స్ఫూర్తి కేంద్రాలు భారతదేశపు సరిహద్దుల లోపలనే ఉన్నాయి- అందువల్ల భారత దేశపు వెలుపలికి తీర్థయాత్రికులు వెళ్లవలసిన అవసరమే ఉండేదికాదు. కానీ విదేశీయుల దురాక్రమణ సమయంలో భారతదేశం ముక్కలు చెక్కలైంది. అందువల్ల ఒకప్పటి భారత ప్రాంతాలు ఇప్పుడు ‘‘విదేశాలు’’గా మారి ఉన్నాయి. శ్రీలంకలోని శక్తిపీఠాన్ని, పాకిస్తాన్‌లోని ఆలయాలను, బంగ్లాదేశ్‌లోని ఆలయాలను, నేపాల్‌లోని ఆలయాలను, టిబెట్‌లోని కైలాస, మానస సరోవర క్షేత్రాలను సందర్శించడం కోసం భారతీయులు ‘‘విదేశాల’’కు వెళ్లవలసి రావడం అఖండ భారత విభజన వ్యవస్థీకరించిన విషాదం..