సంపాదకీయం

ఊపిరాడని ఊరు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ రాజధాని ‘ప్రపంచ కాలుష్య రాజధాని’గా పేరు మోసిందని జరిగిన నిర్ధారణ ‘జీవన సౌలభ్య’- ఈజ్ ఆఫ్ లివింగ్- సూత్రాన్ని వెక్కిరిస్తోంది. దేశ ప్రజల జీవన సౌలభ్యం మెరుగుపడకుండా నిరోధిస్తున్న వైపరీత్యాలలో అతి ప్రధానమైనది పర్యావరణ కాలుష్యం. ఆర్థిక అసమానతలు, పేదరికం జీవన సౌలభ్యానికి విఘాతకరం. అంతకంటే ప్రమాదకరమైనది కాలుష్య బీభత్సం. ఢిల్లీలో జనం ఇళ్ల నుంచి బయటికి రాలేని దుస్థితి దాపురించి ఉండడం గత నాలుగైదు రోజులుగా కొనసాగుతున్న వైపరీత్యం. ఢిల్లీ ప్రభుత్వ నిర్వాహక పక్షానికి, కేంద్ర ప్రభుత్వ నిర్వాహక పక్షానికి మధ్య కాలుష్యం విషయమై కొనసాగుతున్న మాటల తూటాల యుద్ధం రాజకీయ కాలుష్యాన్ని కూడా వ్యాపింప చేస్తోంది. కాలుష్య నిరోధక చర్యలను అమలు జరపడంలో ఢిల్లీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నది నిరాకరింపజాలని నిజం. కానీ ఈ ఘోర వైఫల్యానికి కారణం ‘ప్రపంచీకరణ’ ఢిల్లీలో మాత్రమే కాక దేశమంతటా వ్యవస్థీకరించిన దీర్ఘకాల వాణిజ్య కాలుష్యం! ఈ వాణిజ్య కాలుష్యం విస్తరించడానికి కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ‘ప్రపంచీకరణ’ మారీచ మృగం సృష్టించిన బంగారపు మాయా విన్యాసాల ‘జాలం’లో చిక్కుకొని ఉండడం. ఇది వౌలికమైన కాలుష్య కారణం. ఈ సంగతిని వదలిపెట్టి ఢిల్లీ ప్రజలకు ఊపిరి ఆడకపోవడానికి వేఱు వేఱు కారణాలను ప్రచారం చేస్తున్నారు. ఈ వేఱు వేఱు కారణాలకు మూల కారణం ప్రపంచీకరణ పంచుతున్న వాణిజ్య పారిశ్రామిక కాలుష్యం. ఢిల్లీ ప్రభుత్వం వైఫల్యం చెందింది. కానీ ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం, జాతీయ రాజధాని ప్రాంతం! అందువల్ల కేంద్ర ప్రభుత్వానికి సైతం ఢిల్లీలో కాలుష్యాన్ని నిర్మూలించాల్సిన బాధ్యత ఉంది. కానీ ఐదేళ్ల వైఫల్యం తర్వాత కేంద్ర అధికార పక్షం, ఢిల్లీ ప్రాంత అధికార పక్షం పరస్పరం విమర్శించుకుంటున్నాయి. కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం ప్రభుత్వేతర వాహనాల రాకపోకలను నియంత్రించడానికి మళ్లీ పూనుకొంది. ఒక రోజు ‘సరి’ సంఖ్య వాహనాలు, మరోరోజు ‘బేసి’ సంఖ్య వాహనాలు మాత్రమే రహదారులపై పయనించాలన్నది ఢిల్లీ ప్రభుత్వం విధించిన నిబంధన. ఈ ఏర్పాటు గతంలో విఫలమైందని భాజపా నాయకుడు విజయ్ గోయల్ చెప్పిన మాట. అందువల్ల ఈ ‘సరి-బేసి’ నిబంధనను సోమవారం ఆయన స్వయంగా ఉల్లంఘించాడట! ఢిల్లీ ప్రభుత్వం విధించిన నాలుగు వేల రూపాయల జరిమానాను కోర్టులో చెల్లించినట్టు ఆయన ప్రకటించడం భాజపాకి, ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య కొనసాగుతున్న రాజకీయ సమరానికి పరాకాష్ఠ!
ఈ ‘యుద్ధాల’ వల్ల కాలుష్యంపై జరగాల్సిన యుద్ధం గురించి ధ్యాస తగ్గడం మినహా జరిగేది ఏమీ లేదు. దీపావళి పండుగ సందర్భంగా టపాకాయలు పేల్చడం వల్ల, చిచ్చుబుడ్లు కాల్చడం వల్ల ఢిల్లీలో కాలుష్యం పెరిగి, గాలి పీల్చడానికి పనికిరాకుండా పోతోందట! ఈ ‘వాయు ప్రదూషణ’కు అసలు కారణం ఢిల్లీ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని వ్యవసాయ క్షేత్రాల్లో పంటల అవశేషాలను తగులబెట్టడం అన్నది మరో నిర్ధారణ. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు గత ఏడు, ఈ ఏడాది కూడ ఢిల్లీలో మాత్రమే కాక దేశమంతటా కూడ ‘హరిత బాణసంచా’- గ్రీన్ క్రేకర్స్-ను దీపావళి సందర్భంగా జనం చిటపటలాడించినట్టు ప్రచారమైంది. విష రసాయనాలు నిండిన కృత్రిమ బాణసంచా- విస్ఫోటనాలు- పేల్చడం వల్ల, కాల్చడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతోంది. పెద్దగా కాలుష్యం పెంచని, పైపెచ్చు ప్రకృతిని శుభ్రం చేయగల ‘హరిత’ విస్ఫోటన సామగ్రిని దీపావళికి పేల్చాలన్నది నిబంధన. అయినప్పటికీ ఈ ఏడాది దీపావళి తర్వాత ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగందట! గత ఏడాది కంటె ఈ ఏడాది ‘దీపావళి అనంతర’ కాలుష్యం స్థాయి తగ్గినప్పటికీ ఈ కాలుష్యం కూడ భయంకరంగానే ఉండడం ఢిల్లీవాసులకు ఎదురవుతున్న వాయు కాలుష్య బీభత్సం. ఆదివారం ఉదయం ఇళ్లలో నుంచి బయటికి రాగానే ఢిల్లీవాసుల ముక్కుకు కాలుష్యపు వాయువుల వేడి సెగలు తగిలి ఇబ్బంది పెట్టాయట. ఇళ్లలో ఉండిపోయినవారికి సైతం కాలుష్య వాయువులు కళ్లను మండించాయట. ఢిల్లీ ప్రపంచ కాలుష్యగ్రస్త నగరాలలో మొదటి స్థానంలో ఉందన్న నిర్ధారణకు ఇదంతా విచిత్ర నేపథ్యం. కాలుష్యం కొలువు తీరడానికి వౌలిక ప్రాతిపదికలు అయిన బహుళ అంతస్థుల భవన నిర్మాణం గురించి కాని, ఢిల్లీ చుట్టూ విస్తరించిన పారిశ్రామిక వాటికల గురించి కానీ, ఆర్థిక మండలాల గురించి కానీ, ఈ పరిశ్రమలు వెళ్లగక్కుతున్న విష కాలుష్య ద్రవాల గురించి కానీ పెద్దగా చర్చ జరగడం లేదు. పంటల అవశేషాల- ప్రధానంగా గోధుమ మొక్కల మొదళ్లు- కాల్చడం గురించి, దీపావళి పటాకాయల గురించి మాత్రమే చర్చ జరుగుతోంది. ప్రపంచీకరణ మాయాజాలం ఇదే మరి! వాస్తవాలను భ్రాంతిగాను, భ్రాంతిని వాస్తవాలు గాను చిత్రీకరిస్తున్నారు..
గోధుమ గడ్డిని కాని వరిగడ్డిని కాని వ్యవసాయ వ్యర్థాలను కాని ఏడాదికి ఒకటి రెండుసార్లు కాల్చుతున్నారు. ఇలా కాల్చిన సమయంలో ఢిల్లీలో ‘వాయు ప్రదూషణ’ తీవ్రతరం అవుతోందట. కానీ ఏడాది పొడవునా పారిశ్రామిక కాలుష్యాలు, అంతస్థుల భవనాల వల్ల ఏర్పడుతున్న ‘కాలుష్య కేంద్రీకరణలు’ కొనసాగుతూనే ఉన్నాయి. వీటిని నియంత్రిస్తే గడ్డి కాలిన సమయంలో ఏర్పడే గాలి కాలుష్యం జనాన్ని పెద్దగా బాధించబోదు. పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో వ్యవసాయ వ్యర్థాలు కాలినందున ఆ ప్రాంతాల్లో ఢిల్లీలో కంటె ఎక్కువ ‘వాయు వైపరీత్యం’ ఏర్పడాలి. అలా ఏర్పడడం లేదు. గడ్డికాలిన ప్రభావం కంటె మిన్నగా పారిశ్రామిక కాలుష్యం ఢిల్లీని ఆవహిస్తోందన్నమాట! అందువల్ల ఢిల్లీ చుట్టూ ఉన్న పరిశ్రమలను, కాలుష్య కేంద్రాలను గురుగావ్, నోయిడా వంటి చోట్ల నుంచి తరలించి వివిధ ప్రాంతాల్లో వికేంద్రీకరించాలి. ఆ పనికి ప్రభుత్వాలు పూనుకోవడం లేదు. ఇదీ ప్రపంచీకరణ మాయాజాలం. పట్టణ, నగర నిర్మాణ పద్ధతుల్లో విప్లవాత్మక పరివర్తన రాకుంటే ఢిల్లీలో వలె హైదరాబాద్, బెంగళూరు, నాగపూర్, భువనేశ్వర్ వంటి చోట్ల కూడ జనానికి ఊపిరాడని భయానక స్థితి ఏర్పడుతుంది. నగరాలు, పట్టణాలు నిలువున పెరగకుండా అడ్డంగా మాత్రమే విస్తరించాలి. ఇదీ నిర్మాణ రీతిలో రావల్సిన విప్లవాత్మక పరివర్తన. మనుషులు నిలువన పెరగాలి. పట్టణాల, నగరాల నిర్మాణాలు అడ్డంగా పెరగాలి. కానీ ప్రపంచీకరణ నెత్తికెక్కిన తర్వాత గత పాతికేళ్లుగా ‘పెరుగుదల’ తారుమారైంది. ఒక ఇంటి మీద మరొక ఇల్లు.. ఇలా అంతస్థులు ఆకాశం అంటుతున్నాయి. ముప్పయి ఏళ్ల క్రితం నాలుగిళ్లు ఉండిన స్థలంలో ఇపుడు ఇరవై నాలుగిళ్ల భవన సముదాయం ఏర్పడి ఉంది. దేశమంతటా ఇదే తీరు. ఒకరు గాలిపీల్చిన స్థలంలో ఆరుగురు గాలిపీల్చి వదులుతున్నారు. ‘బొగ్గు పులుసు వాయువు’తో ప్రకృతి పరిసరాలు వేడెక్కిపోతున్నాయి. జనావాసాల్లో అంతస్థుల భవనాల నిర్మాణాన్ని నిషేధించాలన్న ‘బుద్ధి’ ప్రభుత్వ నిర్వాహకులకు ఎందుకు ఉండడం లేదు? డబ్బాల తిండి- జంక్‌ఫుడ్- సీసాల పానీయాలు సేవిస్తున్న మనుషులు ప్రధానంగా యువజనులు ‘అడ్డంగా’ పెరుగుతున్నారు. పాతికేళ్ల వారికి, ఇరవై ఏళ్ల వారికి నడుములు బలిసి, బొజ్జలు పెరిగిపోతున్నాయి. వారు వంగలేరు.. ఇదీ ప్రపంచీకరణ..!
గడ్డి వంటి ప్రాకృతిక పదార్థాలను కాల్చడం వల్ల పర్యావరణంలో కాలుష్యం ఏర్పడరాదు. వ్యవసాయ క్షేత్రాలు విష రసాయనాల ఎరువులతో క్రిమి నాశనాలతో భయంకరంగా కలుషితమైపోయాయి. వ్యవసాయ ఉత్పత్తుల అవశేషాలలో సైతం భయంకర విషాలు పేరుకొనిపోతున్నాయి. గడ్డిని కాల్చడం వల్ల కాలుష్యం పెరగడానికి ఇలా అసలు కారకాలు రసాయన విషాలు! సేంద్రియ వ్యవసాయ పునరుద్ధరణ మాత్రమే ఈ వైపరీత్యానికి విరుగుడు..!