సంపాదకీయం

విశుద్ధ ప్రసిద్ధుడు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత రాజ్యాంగ ప్రక్రియ క్రమానుగత వికాస చరిత్రలో టీఎన్ శేషన్ ఒక ప్రజాస్వామ్య అద్భుతం.. భారత ప్రజాస్వామ్య ప్రాంగణానికి ఆయన ఒక నైతిక ప్రాకారం! ‘్భరతీయ పాలనా సేవ’- ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్-ఐఏఎస్- అధికారి ఒకరు భారత ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి జరిపిన కృషికి శేషన్ పరాకాష్ఠ. భారత ఎన్నికల సంఘం- ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా-ఈసీ- ప్రధాన అధికారి- చీఫ్ ఎలక్షన్ కమిషనర్- పదవిని ఆయన నిర్వహించిన తీరు ఎన్నికల నిర్వహణ ప్రక్రియను సర్వ సమగ్రంగా ప్రజాస్వామ్యబద్ధం చేయగలిగింది. ఆయన ఎన్నికల సంఘం ప్రధాన అధికారి కావడం గొప్ప పరిణామం కాలేదు. ఎన్నికల సంఘానికి ఆయన తెచ్చిపెట్టగలిగిన గుర్తింపు అద్వితీయ రాజ్యాంగ అద్భుతం. 1990వ దశకం ఆరంభమయ్యే వరకు ఎన్నికల కమిషన్ కేవలం కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఒక విభాగమన్నది జనానికి కలిగి ఉండిన అనుభూతి. 1951 నుంచి 1991 వరకూ కొనసాగిన ఈ అనుభూతి ‘రాజకీయ భ్రమ’ మాత్రమే అని నిరూపించగలిగిన రాజ్యాంగ నిపుణుడు టీఎన్ శేషన్. ఎన్నికల కమిషన్ స్వతంత్ర రాజ్యాంగ సంస్థ అన్న వాస్తవాన్ని వెలిగించిన వాడు శేషన్. శేషన్ ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారి అయ్యేవరకు రాజ్యాంగంలోని మూడు వందల ఇరవై నాలుగవ అధికరణం ధ్యాస పెద్దగా ఉండేది. ఈ అధికరణం ప్రకారం పార్లమెంటు ఎన్నికలను-లోక్‌సభ, రాజ్యసభ ఎన్నికలను- రాష్టప్రతి, ఉప రాష్టప్రతి పదవులకు జరిగే ఎన్నికలను, రాష్ట్రాల విధానమండలుల ఎన్నికలను నిర్వహించే అధికారం కేంద్ర ఎన్నికల కమిషన్‌కు మాత్రమే ఉంది. ఈ ఎన్నికలను పర్యవేక్షించడం, నిర్దేశించడం, నియంత్రించడం కేంద్ర ఎన్నికల సంఘం అధికార పరిధిలోని వ్యవహారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయ నిర్వాహకులు కాని, అధికారులు కాని ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈసీ సూచనల ప్రకారం, నిర్దేశాల ప్రకారం నడుచుకోవలసిందే. ఈసీ ఆదేశాలను శిరసావహించవలసిందే. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఎలాంటి కొత్త నిర్ణయాలను కాని, పథకాలను కాని, కార్యక్రమాలను కాని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించరాదన్నది కూడ మూడు వందల ఇరవై నాలుగవ అధికరణం స్ఫూర్తి. అత్యవసరంగా ఇలాంటివి జరుపవలసినప్పుడు కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు ఈసీ నుంచి అనుమతులను తీసుకోవాలన్నది ఈ స్ఫూర్తి. ఈ అధికరణానికి అనుగుణంగా రూపొందిన ప్రజాప్రాతినిధ్యపు చట్టాన్ని అమలు జరిపే బాధ్యత, అధికారం కూడ ఈసీకే చెంది ఉన్నాయి. కానీ శేషన్ ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవిని చేపట్టక ముందు ఈ అధికారాలను సర్వ సమగ్రంగా ఉపయోగించుకున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ లేడు. కేంద్ర ప్రభుత్వమే ఎన్నికల ప్రక్రియను నిర్దేశిస్తోందన్న అభిప్రాయం ఎన్నికల ప్రక్రియతో సంబంధం ఉన్న అందరికీ ఏర్పడి ఉండడం చరిత్ర. ఈ చరిత్ర గతిని మార్చగలిగిన వాడు శేషన్.. ఆదివారం సంభవించిన ఆయన సహజ మరణం రాజ్యాంగ వ్యవస్థ చరిత్రలో ఒక గణనీయ ఘట్టం! రాజ్యాంగ వ్యవస్థను మరింత ప్రజాస్వామ్యవంతం, పారదర్శకం చేయగలిగిన శేషన్ శాశ్వత సంస్మరణీయుడు.
‘నేను దృఢంగా ప్రక్రియను అమలు జరుపనున్నాను. దృఢమైన విధానాన్ని అమలు జరుపుతున్నందుకు నేను సిగ్గు పడడం లేదు..’అని 1991 నాటి లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా బాధ్యతలను స్వీకరించిన ఈ ‘తిరువియెక్కడవు నారాయణ అయ్యర్’- టీఎన్- శేషన్ చెప్పినమాట. ‘నేను ఎన్నికల అక్రమాలను నిరోధిస్తాను’ అని ప్రతిజ్ఞ చేసిన విశ్వాసశీలుడు శేషన్. ‘ఒకవేళ నేను అక్రమాలను సర్వ సమగ్రంగా అరికట్టలేక పోయినప్పటికీ, ఎన్నికల ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్న, అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తులు పార్లమెంటుకు కాని, మండలికి కాని ఎన్నిక కాకుండా మాత్రం నిరోధించగలను’ అని విశ్వాసం వ్యక్తం చేయగలిగిన ఉన్నతోన్నత అధికారి శేషన్. కేరళలోని పాలక్కాడ్‌లో 1932 డిసెంబర్ పదహైదవ తేదీన జన్మించిన శేషన్ 1955లో ఐఏఎస్ అధికారిగా నియుక్తుడయ్యాడు. ఐఏఎస్ అధికారిగా నియుక్తుడైన తర్వాత కూడ ఆయన విద్యాభ్యాసం కొనసాగించడం ఆజీవన అధ్యయన నిష్ఠకు నిదర్శనం. ఈ అధ్యయన శీలం కారణంగానే 1990 డిసెంబర్ 12న ఎన్నికల కమిషన్ అధిపతిగా నియుక్తుడైన తర్వాత ‘కమిషన్’ అధికారాలను శోధించి ఆవిష్కరించగలిగాడు. 1960 దశకంలో ఆయన హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఏడాది పాటు యాజమాన్య వ్యవహారాల- మేనేజ్‌మెంట్ కోర్స్-ను అధ్యయనం చేశాడట. ‘కమిషన్’ అధికారాలను రాజ్యాంగబద్ధంగా చెలాయించగలిగిన శేషన్ 1996 డిసెంబర్ 11వ తేదీ వరకు అవినీతిపరులైన ఎన్నికల అభ్యర్థుల పాలిట అంకుశమయ్యాడు. అశనిపాతమయ్యాడు!
ఇలా శేషన్ పాలనాపటిమను ప్రదర్శించడం 1965లోనే ఆరంభమైన చరిత్ర. 1965-1967 సంవత్సరాల మధ్య తమిళనాడులోని మధుర జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన శేషన్ ప్రజల అభిమానం చూరగొన్నాడు. అందువల్ల సహజంగానే రాజకీయ వేత్తలకు నిందనీయుడయ్యాడు. రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులకు సైతం ఆయన పట్ల వ్యతిరేకత అంకురించడం చరిత్ర. తమిళనాడు ప్రభుత్వ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా, వ్యవసాయ శాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆయన రాజకీయవాదుల ఒత్తిడులను తిప్పికొట్టడం ద్వారా నిజాయితీపరులకు వందనీయుడయ్యాడు. విశుద్ధ చరితులు ప్రసిద్ధికెక్కడం అరుదైన పరిణామం. ఎందుకంటె విశుద్ధ చరితులు ఎదగకుండా, ప్రసిద్ధికెక్కకుండా వారిపై అధికారులు, రాజకీయ వేత్తలు, ఇతర దుర్మార్గవర్తనులు అడ్డుకోవడం మన వ్యవస్థలో పరిపాటి అయింది. ‘సత్యవంతుల మాట జన విరోధంబయ్యె.. వదరపోతుల మాట వాసికెక్కె..’ అని ‘నరసింహశతక కర్త’ శేషప్పకవి చెప్పినట్టు విశుద్ధ జీవనులకు ప్రసిద్ధి లభించడం అపురూపం.. అలాంటి అపురూప పరిణామాలలో ఒకటి శేషన్ జీవన ప్రస్థానం! రాజకీయపు ఒత్తిడుల పర్యవసానం శేషన్ రాష్ట్ర ప్రభుత్వ ‘సేవ’నుంచి వైదొలగడం, కేంద్ర ప్రభుత్వ ‘సేవ’లో చేరడం. రక్షణమంత్రిత్వ శాఖ కార్యదర్శిగా, అటవీ పర్యావరణ కార్యదర్శిగా, మంత్రివర్గ- క్యాబినెట్- కార్యదర్శిగా ఆయన పనిచేయగలగడం ‘విశుద్ధత’కు లభించిన ‘ప్రసిద్ధి’కి అరుదైన నిదర్శనం. ‘్భరతీయ అంతరిక్ష పరిశోధన మండలి’- ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్- ఇస్రో- పాలనావిభాగం అధిపతిగాను, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడిగాను బాధ్యతలు నిర్వహించినప్పటికీ ఎన్నికల ప్రధాన అధికారిగానే ఆయన దేశ ప్రజలకు అత్యంత ప్రియతముడయ్యాడు. ఇటీవలి కాలంలో అబ్దుల్ కలాం, శేషన్ వంటి ఉన్నత అధికారుల వలె, శాస్తవ్రేత్తల వలె ప్రజలకు పరిచయమైన అధికారులు, శాస్తవ్రేత్తలు చాలా తక్కువమందిలో అబ్దుల్ కలాం రాష్టప్రతి అయ్యాడు, శేషన్ రాష్టప్రతి పదవికి పోటీ చేశాడు. కానీ రాష్టప్రతి కాలేదు. 1996లో ‘రామన్ మెగసెసే’ పురస్కారం శేషన్‌కు లభించడం ఆయన ప్రజాస్వామ్య రాజ్యాంగ నిష్ఠకు లభించిన అంతర్జాతీయ పరిగణన..
శేషన్ ఎన్నికల నిర్వహణ బాధ్యతలను స్వీకరించే వరకు ‘ఎన్నికల ప్రవర్తన నియమావళి’ కేవలం నామకార్థంగా ఉండేది. ఈ నియమావళిని ఆయన పటిష్టంగా అమలు జరిపించాడు. ‘ఒక్క మతదాన కేంద్రాన్ని కూడ ఎవ్వరూ అక్రమంగా స్వాధీనం చేసుకోలేరు’ అని ప్రకటించి సాధించిన ‘గరిమ’ శేషన్‌కు సొంతం. మతదాన కేంద్రాలను స్వాధీనం చేసుకొనడం- బూత్ కాప్చరింగ్-, దొంగవోట్లు వేయించడం-రిగ్గింగ్- వంటి అక్రమాలను అంతం చేయడం ఆయన లక్ష్యమైంది. మతప్రదాత- వోటర్-లకు గుర్తింపు పత్రాల- ఐడెంటిటీ కార్డ్-లను ఇవ్వడం వల్ల ఒకరి వోటు మరొకరు వేసే - ఇంపర్సనేషన్- అక్రమాలకు అడ్డుకట్ట పడింది. శేషన్ పదవీ అనంతర కాలంలో ఈ ప్రజాస్వామ్య పరిణతి మరింతగా ప్రస్ఫుటించింది, ప్రస్ఫుటిస్తోంది. ఆద్యుడు శేషన్.. ‘నందామ శరదశ్శతమ్’- వంద ఏళ్లు ఆనందంగా జీవించాలి- అన్న భారతీయ సనాతన ఆకాంక్షకు సమకాలీన నిదర్శనం శేషన్ జీవన ప్రస్థానం..!!