సంపాదకీయం

నేపాల్‌పై చైనా ‘పంజా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైనా చొఱబాటును వ్యతిరేకిస్తూ నేపాల్‌లో నిరసన ప్రదర్శనలు తీవ్రతరం అవుతుండడం, హాంకాంగ్‌లో కొనసాగుతున్న ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమానికి సమాంతర పరిణామం. నియంతృత్వ ఏకపక్ష రాజ్యాంగ వ్యవస్థ నెలకొని ఉన్న చైనాలో ‘్భగమైన’ హాంగ్‌కాంగ్ నగర రాజ్యంలో మాత్రం ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడి ఉంది. ‘ఒక దేశం-రెండు వ్యవస్థలు’ అన్న ఒప్పందం హాంగ్‌కాంగ్‌కూ చైనాకూ మధ్య ఇరవై రెండేళ్ల క్రితం కుదిరింది. చైనా నియంతృత్వ కమ్యూనిస్టు పార్టీ ఏకపక్ష పాలనకు భిన్నంగా హాంగ్‌కాంగ్ ప్రాంతంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పరిఢవిల్లడానికి చైనా అంగీకరించింది. ఒకే దేశంలో రెండు రకాల రాజ్యాంగ వ్యవస్థలు ఉండవచ్చునన్నది ఆనాటి ఒప్పందానికి ప్రాతిపదిక. మొదటిది నియంతృత్వ వ్యవస్థ, రెండవది ప్రజాస్వామ్య వ్యవస్థ. హాంగ్‌కాంగ్‌లోని ప్రజాస్వామ్య వ్యవస్థను రద్దు చేయడానికి చైనా ప్రభుత్వం జరిపిన దుశ్చర్య బెడిసికొట్టడం ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం తీవ్రతరం కావడం! ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి చైనా ప్రభుత్వం పోలీసులను, సైనికులను ఉసిగొల్పింది. ఫలితంగా ఉద్యమం రక్తసిక్తం అయిపోయింది. ఇరవై రెండేళ్ల క్రితం చైనా, హాంగ్‌కాంగ్‌ల మధ్య ‘ఒక దేశం- రెండు రాజ్యాంగ వ్యవస్థలు’ అన్న ఈ ఒప్పందం కుదిరిన తరువాతనే చైనాలో విలీనం కావడానికి హాంగ్‌కాంగ్ ప్రజలు అంగీకరించారు. అంతవరకు హాంగ్‌కాంగ్ బ్రిటన్ అధీనంలో ఉండేది. ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని రద్దు చేయడానికి చైనా ప్రభుత్వం యత్నిస్తోంది. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థను రక్షించుకొనడంలో భాగంగా అనివార్యం అయితే చైనా నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడడానికి హాంగ్‌కాంగ్ ప్రజలు సిద్ధపడుతున్నారు. అందువల్లనే చైనా ప్రభుత్వం హాంగ్‌కాంగ్‌లో భయంకర దమనకాండను ప్రారంభించింది. ఈ దమనకాండ నుంచి ప్రపంచ దేశాల దృష్టిని మళ్లించడానికి చైనా ప్రభుత్వం వివిధ సమాంతర చర్యలకు ఒడిగట్టింది. తదుపరి ‘దలైలామా’ను ఎంపిక చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ విషయమై టిబెట్ ప్రజలు, మన దేశంలోను విదేశాలలోను ఉన్న బౌద్ధులు చైనా ప్రభుత్వం పట్ల నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. నేపాల్‌లోకి చొఱబడడం చైనా ప్రభుత్వం వారి మరో దుశ్చర్య...
‘దలైలామాలు’ టిబెట్ బౌద్ధుల ధర్మాచార్యులు. అందువల్ల తదుపరి దలైలామాను ఎంపిక చేసే అధికారం, బాధ్యత టిబెట్ ప్రజలది. ప్రస్తుత దలైలామా అరవై ఏళ్లుగా మన దేశంలో ప్రవాస జీవితం గడుపుతున్నాడు. అరవై ఏళ్ల క్రితం వరకు టిబెట్ ‘దలైలామాలు’ బౌద్ధమత ప్రధాన మతగురువులు మాత్రమే కాదు, టిబెట్ దేశ అధినేతలు కూడ. అరవై ఏళ్ల క్రితం చైనా స్వతంత్ర టిబెట్ దేశాన్ని దురాక్రమించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ దురాక్రమణ కొనసాగుతోంది. దలైలామా అరవై ఏళ్ల క్రితం చైనా సైనికుల బారి నుంచి తప్పించుకొని, దాదాపు తొంబయి వేల మంది అనుచరులతో కలసి మన దేశానికి వచ్చేశాడు. మన హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో టిబెట్ ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రస్తుత దలైలామా వారసుడిని ఎంపిక చేసే హక్కు దేశ విదేశాలలోని టిబెట్టీయ బౌద్ధులకు మాత్రమే ఉంది. కానీ చైనా ప్రభుత్వం వారు కొత్త దలైలామాను ఎంపిక చేయడానికి యత్నిస్తున్నారు. అమెరికా తదితర దేశాల ప్రభుత్వాల వారు చైనా ప్రభుత్వ అక్రమ ప్రమేయాన్ని తప్పుపడుతున్నారు. హాంగ్‌కాంగ్ ఉద్యమంపై నుంచి ప్రపంచ దేశాల దృష్టిని మళ్లించడానికే చైనా ఇప్పుడు దలైలామా వారసుడి ఎంపిక ప్రహసనాన్ని మొదలుపెట్టింది. నేపాల్‌లోకి చొఱబడడం చైనా వారి మరో సమాంతర దుశ్చర్య! టిబెట్‌ను దిగమింగిన తరువాతనే చైనా ప్రభుత్వం మన లడక్‌లోకి కాని, సిక్కింలోకి కాని, అరుణాచల్‌లోకి కాని చొఱబడగలుగుతోంది. నేపాల్, భూటాన్‌లను దురాక్రమించడానికి చైనా చేస్తున్న యత్నాలకు కూడ ప్రాతిపదిక టిబెట్‌ను అరవై ఏళ్ల క్రితం దురాక్రమించడమే!! టిబెట్ దురాక్రమణ అంతిమ లక్ష్యం కాదన్న చైనా నియంతలు దశాబ్దుల తరబడి ఆవిష్కరిస్తున్న వికృత వ్యూహం. ‘చైనా చేతికి టిబెట్ అరచేయి.. లడక్, నేపాల్, సిక్కిం, భూటాన్, అరుణాచల్ ఈ చేతికి వేళ్లు..’ అన్నది చైనా వారి విస్తరణ వ్యూహపు దురాక్రమణ స్వభావం!
ఈ స్వభావానికి అనుగుణంగానే ప్రస్తుతం చైనా ప్రభుత్వం నేపాల్‌లోకి చొఱబడింది. ఈ చొఱబాటును గురించి నేపాల్ ప్రభుత్వం ఎలాంటి నిరసనను తెలపడం లేదు. ఎందుకంటె ప్రస్తుతం నేపాల్ ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న రాజకీయ పక్షాల వారు చైనా కమ్యూనిస్టు పార్టీ చంకబిడ్డలు. మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ వారు, మార్క్సిస్టు లెనినిస్టు కమ్యూనిస్టు పార్టీ వారు కలసికట్టుగా ప్రస్తుతం నేపాల్ ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నారు. కానీ నేపాల్ ప్రజలు మాత్రం దేశమంతటా నిరసన ప్రదర్శనలు జరుపుతున్నారు. సోమవారం చైనా అధ్యక్షుడు జింగ్‌పింగ్ గడ్డిబొమ్మలను నేపాల్‌లోని అనేక జిల్లాల్లో నిరసనకారులు తగులబెట్టడం ఈ నిరసనలో భాగం. ‘సప్తాం’, ‘వర్థియా’, ‘కపిలవస్తు’, ‘కర్నాలీ’ తదితర జిల్లాల్లో ఉద్యమకారులు చైనా చొఱబాటును నిరసిస్తూ నినాదాలు చేశారట. ‘చైనా.. చొఱబడిన మా స్థలం నుంచి తొలగిపో! భూమిని తిరిగి నేపాల్‌కు అప్పగించు’.. అంటూ వ్రాసిన ‘వస్త్ర ఫలకాల’ను నిరసనకారులు ప్రదర్శించారు. నేపాల్‌కు చెందిన దాదాపు తొంబయి రెండు ఎకరాల- ముప్పయి ఆరు హెక్టార్ల- భూమిని ఇటీవల చైనా ఆక్రమించుకోవడం ఈ నిరసనలకు ప్రాతిపదిక. చైనా మరికొన్ని వందల హెక్టార్ల భూమిని కూడ దురాక్రమించుకొని ఉందని, నేపాల్ ప్రభుత్వం నోరు మెదపకపోయినట్టయితే ఈ వందల హెక్టార్ల భూమి చైనా అక్రమ అధీనంలోనే ఉండిపోయే ప్రమాదం ఉందని నేపాల్ నిరసనకారుల ప్రతినిధులు ప్రకటించారట. ఇరుగు పొరుగు దేశాలను మొత్తంగాను, కొన్ని భూభాగాలను కబళించడం శతాబ్దుల తరబడి కొనసాగిన చైనా అక్రమ విస్తరణలో భాగం.
చైనాలోని అతి పెద్ద ప్రాంతమైన ఝింజియాంగ్- సింకియాంగ్- ఒకప్పుడు ‘హూణ’ దేశం. దాదాపు పదహారున్నర లక్షల చదరపుకిలోమీటర్ల ఈ విశాల దేశంలో క్రీస్తుశకం ఎనిమిదవ శతాబ్ది వరకు వేద, బౌద్ధమతాలు విలసిల్లాయి. ‘హూణు’ల కంటె భిన్నులైన ‘హాణులు’ చైనావారు. ‘హూణుల’కూ ‘హాణుల’కూ మధ్య క్రీస్తునకు పూర్వం నుంచీ యుద్ధాలు కొనసాగాయి. క్రీస్తుశకం ఎనిమిదవ శతాబ్దిలో ఇస్లాం జిహాదీలు ఈ ‘హూణ’ దేశంలోకి చొఱబడినారు. ఫలితంగా ‘హూణ’ దేశం- సింకియాంగ్-లో ఇస్లాం మతస్థులు అధిక సంఖ్యాకులుగా మారారు. ప్రాబల్య సమరంలో క్రీస్తుశకం 1884లో చైనా, సింకియాంగ్‌ను ఆక్రమించింది. ఇంత పెద్ద భూభాగం చైనా వశం కావడంతో చైనా సరిహద్దు మన దేశపు జమ్మూ కశ్మీర్ ఉత్తర భాగం వరకు విస్తరించింది. ‘మంచూరియా’ ఒకప్పుడు స్వతంత్ర దేశం. శతాబ్దుల తరబడి రష్యా, చైనా, జపాన్ దేశాలు మంచూరియాను దురాక్రమించాయి. చివరికి రెండవ ప్రపంచ యుద్ధం తరువాత మంచూరియను చైనా దురాక్రమించుకొంది. 1959లో టిబెట్‌ను ఆక్రమించింది. రెండువేల ఐదు వందల ఏళ్లు చైనాను నిరోధించగలిగిన ‘త్రివిష్టపం’-టిబెట్- చివరికి స్వాతంత్రాన్ని కోల్పోవడం చారిత్రక వైపరీత్యం. మంగోలియాను కబళించడానికి సైతం చైనా శతాబ్దుల తరబడి యత్నించడం చరిత్ర. చివరికి మంగోలియా దక్షిణ ప్రాంతాన్ని- లోపలి మంగోలియాను- 1644లో చైనా దురాక్రమించింది. ఆ తరువాత మూడు వందల ఏళ్లు మంగోలియా చైనాతో పోరాడింది. 1924లో ఉత్తర మంగోలియా- వెలుపలి మంగోలియా- మాత్రమే స్వతంత్ర దేశంగా అవతరించింది. ‘లోపలి మంగోలియా’ ఇప్పటికీ చైనా దురాక్రమణలో కొనసాగుతూనే ఉంది. నేపాల్‌లోకి సైతం ఇప్పుడు చైనా చొఱబడడానికి ఈ దురాక్రమణ స్వభావం వికృత చారిత్రక నేపథ్యం..