సంపాదకీయం
‘మందగమన’ కారణం..??
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అంతర్జాతీయ వాణిజ్య అనుసంధానం ముదురుతున్నకొద్దీ మన ఆర్థిక ప్రగతి మందగించిపోతోందన్నది ధ్రువపడిన వాస్తవం! ఆర్థిక ప్రగతిని, స్థూల జాతీయ ఉత్పత్తి పెరుగుదలను వేగవంతం చెయడానికి కేంద్ర ప్రభుత్వం వారు రిజర్వ్‌బ్యాంకువారు చేపట్టిన చర్యలు బూడిదలో పోసిన పన్నీరు వలె పరిణమించడానికి ప్రపంచీకరణ - గ్లోబలైజేషన్ - కారణం! ఈ వాస్తవాన్ని గుర్తించడానికి మాత్రం కేంద్ర ప్రభుత్వం కాని, అధికాధిక రాష్ట్ర ప్రభుత్వాలు కాని సిద్ధంగా లేవు. అందువల్లనే ప్రభుత్వం ఆర్థిక పరిపుష్టిని, వాణిజ్య సౌష్టవాన్ని పెంపొందించడానికి చేస్తున్న కృషి బూడిదలో పోసిన పన్నీరు!! అంతర్జాతీయ అనుసంధానం ఈ ‘బూడిద’! ప్రభుత్వం వారి ప్రగతి ప్రేరక చర్యలు ‘పన్నీరు’... రూపాయి విలువ నానాటికీ ఘోరంగా పతనం అయిపోతుండటం మన ఆర్థిక వ్యవస్థ అలజడికి గురి అయి వుందన్న వాస్తవానికి ఒక సంకేతం మాత్రమే! పదేళ్ల క్రితం అమెరికా డాలర్ విలువ నలుబయి ఐదు రూపాయలు. కానీ ఆ తరువాత నాలుగేళ్లలో ‘రూపాయి’ ఘోరంగా పతనమైంది. అమెరికా డాలర్ విలువ అరవై ఎనిమిది రూపాయలకు చేరింది. రూపాయి విలువను పెంచడానికి ఈ ఆరేళ్లలో జరగిన ఆర్థిక విప్లవ విన్యాసాలు ఫలించలేదు. రూపాయి మరింత పతనమైంది. డాలర్ విలువ డెబ్బయి మూడు రూపాయలకు చేరింది. విదేశాలతో జరుపుతున్న వాణిజ్యంలో మన దేశానికి ఏర్పడివున్న లోటు నానాటికీ పెరుగుతుండటం అంతర్జాతీయ అనుసంధానం వల్ల ఒనగూడిన మరో విపరిణామం! చైనాతో, మనకు అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించి ఉన్న చైనాతో - మనం జరుపుతున్న ద్వైపాక్షిక వాణిజ్యంలో ఈ లోటు మరింత భారీగా విస్తరించిపోతుండటం ప్రభుత్వానికి భయం కలుగవలసిన విపరిణామం! పారిశ్రామిక ఉత్పత్తులు తగ్గిపోతుండటం ‘ఆర్థిక మందగతి’కి మరో ప్రబలమైన సూచిక! పారిశ్రామిక ఉత్పత్తుల పెరుగుదల వేగం ఎనిమిదేళ్ల చరిత్రలో అతి తక్కువ స్థాయికి పడిపోతుండటం ఆందోళన కలిగించదగిన అంశం!! స్థూల జాతీయోత్పత్తి - గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ - జీడీపీ - పెరుగుదల వేగం ఐదు శాతానికి మించబోదన్నది వివిధ అధికారిక అధ్యయనాలు చేస్తున్న నిర్ధారణ! ద్రవ్యోల్బణం మళ్లీ పెరుగుతోంది. ఆహార ద్రవ్యోల్బణం దాదాపు పదకొండు శాతానికి చేరనున్నట్టు అంచనాలు వెలువడుతున్నాయి. ఫలితంగా ‘చిల్లర’ ద్రవ్యోల్బణం కూడ వేగవంతం అవుతోంది. పదహారు నెలల కాలవ్యవధిలో ఎన్నడూ లేనంతగా అక్టోబర్‌లో చిల్లర దవ్యోల్బణం పెరిగిందట! పెట్టుబడులను పెంచడానికి రిజర్వ్ బ్యాంక్‌వారు తీసుకుంటున్న చర్యలు ద్రవ్యోల్బణాన్ని పెంచాయన్నది స్పష్టంగా ధ్రువపడిన వాస్తవం! పెట్టుబడులను పెంచడానికి వీలుగా రిజర్వ్‌బ్యాంక్ పదేపదే ‘వడ్డీ’ల శాతాన్ని తగ్గిస్తోంది... పెట్టుబడులు పెరిగాయో లేదో తెలియదు కాని ధరలు, ప్రధానంగా ఆహార ధరలు మాత్రం పెరిగాయి! ద్రవ్యోల్బణం పెరగడానికి ఇదీ కారణం...
నిరుద్యోగుల శాతం కూడా నిరంతరం పెరుగుతోందన్న నిర్ధారణలు జరుగుతున్నాయి. అక్టోబర్‌లో - మూడేండ్లలో అత్యధికంగా - నిరుద్యోగుల సంఖ్య ఎనిమిదిన్నర శాతానికి చేరిందట. త్రిపురలో నిరుద్యోగుల శాతం కూడ పైకి చేరడం ఆర్థిక సమతుల్య రాహిత్యానికి చిహ్నం. ఇవన్నీ తప్పుడు ‘గణాంకాలన్న’ వాదాన్ని వినిపించే వీలు లేదు. ఈ ‘గణాంకాలు’ అధికారికంగానే వెలువడుతున్నాయి. ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల అధ్యయనాల్లో అవకతవకలు ఉన్నట్టయితే ప్రభుత్వం ఆ సంగతిని ప్రకటిస్తుంది. అందువల్ల ‘ఆర్థిక మందగమనం’ వ్యవస్థీకృతం అయిపోయిందన్నది వాస్తవం! వ్యవసాయ రంగం సర్వసమగ్ర ప్రగతికి నిజమైన గీటురాయి. కానీ ‘వ్యవసాయ నికషం’పై ఆధారపడి ప్రగతిని నిర్ధారించడం గతమైపోయింది. వ్యవసాయ వాణిజ్యం, వికేంద్రీకృత పారిశ్రామిక వ్యవస్థ పరిఢవిల్లిన సమయంలో మొత్తం ప్రపంచ దేశాల ఎగుమతులలో మన దేశం వాటా నలబయి శాతం! బ్రిటన్ దురాక్రమణ సమయంలో వ్యవసాయ వాణిజ్యం, వికేంద్రీకృత పారిశ్రామిక వ్యవస్థ నష్టభ్రష్టమైపోయాయి. ఫలితంగా ప్రస్తుతం ప్రపంచ దేశాల మొత్తం ఎగుమతులలో మన దేశం వాటా నాలుగు శాతం కంటే తక్కువకు పడిపోయింది. వ్యవసాయ వాణిజ్యం అంతరించింది, వాణిజ్య వ్యవసాయం మొదలైంది. బ్రిటన్, ఐరోపా దేశాల వాణిజ్య దురాక్రమణకు విస్తరణ ప్రపంచీకరణ... వ్యవసాయ వాణిజ్యం నడిచిన రోజులలో మన దేశం నుంచి ‘మిరియాల’ను నింపుకొని పాశ్చాత్య దేశాలకు వెళ్లిన ఓడ, బంగారం నింపుకొని తిరిగి వచ్చేది. అది గతం... వర్తమానంలో వేల టన్నుల విష రసాయనపు ఎరువులు దిగుతుమతి అవుతున్నాయి. సామాన్య జన శ్రమార్జిత ‘విదేశీయ వినిమయ ద్రవ్యం’ వేల కోట్లలో విదేశాలకు వెళ్లిపోతోంది. ఇదీ వాణిజ్య వ్యవసాయం! వాణిజ్య సంస్థలు ప్రధానంగా విదేశీయ వాణిజ్య సంస్థలు అంటగట్టిన ‘జన్యు పరివర్తక’ - జెనటికల్లీ మోడిఫైడ్ - జిఎమ్ - పత్తి విత్తనాల వల్ల దేశమంతటా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
వికేంద్రీకృత పరిశ్రమలు పరిఢవిల్లిన బ్రిటన్ దురాక్రమణ పూర్వ యుగంలో - వేల సంవత్సరాల పాటు - గ్రామాలలోని చిన్న పరిశ్రమలలో శ్రేష్టమైన ఉక్కు తయారయ్యేది. ‘డమాస్కస్’ ఉక్కుగా ప్రపంచ దేశాలకు వినిమయమైన ఈ శ్రేష్ఠమైన ఉక్కు భారతదేశంలో మాత్రమే ఉత్పత్తి కావడం చరిత్ర. మన దేశం నుంచి ఎగుమతి అయిన ఉక్కు - ప్రస్తుత సిరియా రాజధాని - డమాస్కస్ విపణి కేంద్రంగా వివిధ దేశాలకు వెళ్లింది. ఈ వికేంద్రీకృత పారిశ్రామిక వ్యవస్థను బ్రిటన్ వారు ధ్వంసం చేసిపోయారు. ‘ప్రపంచీకరణ’ బ్రిటన్ వారి వాణిజ్య దురాక్రమణకు కొనసాగింపు. ఉక్కు, బొగ్గు, సిమెంటు, ఎరువులు, ఇంధన తైల వాయువులు, విద్యుత్తు - ఈ ఆరు వౌలిక పారిశ్రామిక ఉత్పాదక రంగాలు. ఈ అన్ని రంగాలలోను పెరుగుదల వేగం తగ్గిపోతుండడానికి కారణం ‘ప్రపంచీకరణ’... విదేశాల నుంచి వస్తున్న పెట్టుబడులు ఈ రంగాలలోకి రావడం లేదు. ఈ రంగాల ఉత్పత్తులను పెంచడం లేదు. అప్పడాలు, ఆవకాయలు, శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్‌లు, చాక్లెట్లు, స్టార్ హోటళ్లు - ఇలా ‘అవసరం లేని’ అంటే విదేశీయుల సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడులు అవసరం లేని - రంగాలలోకి విదేశీయ సంస్థలు చొరబడిపోయాయి. ఇదీ ప్రపంచీకరణ మాయాజాలం! ఈ మాయాజాలం నుంచి బయటపడి స్వదేశీయ ఉత్పాదక, వినిమయ, విక్రయ వ్యవస్థలను పునరుద్ధరించుకున్నప్పుడు మాత్రమే ప్రభుత్వం కొనసాగిస్తున్న ప్రేరక చర్యలు ఫలితాలనిస్తాయి. అంతవరకు వాణిజ్య శుల్కాలు - కార్పొరేట్ టాక్సెస్ - తగ్గించడం, బ్యాంకులలో కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు కుమ్మరించడం, వడ్డీలు తగ్గించడం వంటి చర్యలు ‘బూడిద’లో పోసిన పన్నీరుకు ప్రతీకలు...
భౌతిక బీభత్సకాండ ఫలితంగా పదేళ్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్తకు దాదాపు డెబ్బయి లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిన సంగతిని ‘బ్రిక్స్’ దేశాల ప్రభుత్వ అధినేతల సమావేశంలో గురువారం మన ప్రధాని నరేంద్రమోదీ ప్రస్తావించాడు. ‘బ్రఝిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణ ఆఫ్రికా’ దేశాల కూటమి ‘బ్రిక్స్’! బ్రఝిల్ రాజధాని బ్రసలియాలో జరిగిన ఈ సమావేశంలో మన ప్రధాని చెప్పిన మాట అక్షర సత్యం. ఈ నష్టం మిగిలిన బ్రిక్స్ దేశాలలో కంటే మన దేశంలో ఎక్కువగా వాటిల్లింది. కానీ ‘ప్రపంచీకరణ’లో భాగంగా విదేశీయ వాణిజ్య పారిశ్రామిక సంస్థలు మన దేశంలో చొరబడిపోయి సాగిస్తున్న ఆర్థిక బీభత్సం వల్ల మన ఆర్థిక వ్యవస్థకు మరింత నష్టం కలుగుతోంది. విదేశాల పెట్టుబడులపై ఆధారపడకుండా స్వదేశీయ నిధులతో మాత్రమే సర్వ సమగ్ర ప్రగతిని సాధించగలమన్నది భారతీయ జనతాపార్టీవారు 2014లో చేసిన ప్రతిజ్ఞ...