సంపాదకీయం
ప్రయాణ సౌలభ్యం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తెలంగాణలో సగం రహదారి రవాణా సేవలను ప్రభుత్వేతర సంస్థలకు అప్పగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉన్నత న్యాయస్థానం వారు ఆమోదించడం ‘ప్రయాణ వ్యవస్థ’ ప్రస్థానక్రమంలో మరో ఆరంభం! ఈ ఆరంభం శుభారంభం కాగలదా? అన్నది సామాన్య జన హృదయాలలో ఉత్కంఠను రేపుతున్న ప్రశ్న! ఉన్నత న్యాయస్థానం ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మరో విధంగా చారిత్రక పునరావృత్తి! గతంలో ప్రభుత్వ బస్సులు ప్రభుత్వేతర సంస్థల బస్సులు నడచిన నాటి స్మృతులను సామాన్య జనాలు మరచిపోలేదు! ప్రభుత్వ బస్సులను ‘గోరుమెంటు’- గవర్నమెంట్- బస్సులని, ప్రభుత్వేతరులు నడిపే వాహనాలను ‘పరివేటు బస్సు’లని సామాన్య జనాలు పిలిచేవారట. ఇది దశాబ్దుల క్రితం నాటి కథ. బస్సులను ప్రభుత్వాలు పాక్షికంగా ప్రభుత్వీకరించిన నాటి మాట ఇది. క్రమంగా అన్ని రహదారులలోను ‘పరివేటు’ బస్సులు అంతర్ధానమయిపోయి ‘గోరుమెంటు బస్సు’లు సర్వసమగ్ర సాకారాన్ని పొందాయి! ఇటీవలి తరానికి ఈ తేడా ఉన్నట్టు కూడ తెలీదు. అందువల్ల ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో ‘బస్సు’ అంటే ‘బస్సే’.!! అది ‘గోరుమెంటు బస్సా’? ‘పరివేటు బస్సా’? అన్న తేడా తెలీదు. ఆ తేడా మళ్లీ తెలియడానికి కనీసం తెలంగాణలో మళ్లీ రంగం సిద్ధమైంది! ‘గవర్నమెంట్’ అన్న ఆంగ్ల పదం దాదాపు శతాబ్దిక్రితమే తెలుగు భాషా పదంగా రూఢి అయింది. ఈ ‘రూఢి’ గిడుగు రామమూర్తి పంతులు వంటివారు వ్యవహార భాషా ఉద్యమం నిర్వహించిన నాటిది! అప్పటి నుంచి ఇప్పటి వరకు మన భాషలు ఇతర భాషల పదాలతో పరిపుష్టం అవుతూనే ఉన్నాయి. అందువల్ల ‘గవర్నమెంట్’, ‘ప్రైవేట్’ అన్న పదాలు ప్రస్తుతం అచ్చతెనుగు పదాలు..!! ఈ పదాలు సామాన్య జనాల నాలుకలలో నలిగి, మెదగి, ‘గోరుమెంటు’ ‘పరివేటు’గా మారి ఉన్నాయి. అందువల్ల ఇకపై గ్రామీణ ప్రాంతాలలో ‘గోరుమెంటు బస్సు’, ‘పరివేటు బస్సు’ అన్న పదాలు విరివిగా వినిపించనున్నాయి! ప్రభుత్వ రంగ సంస్థల మధ్య ప్రభుత్వేతర సంస్థల క్రియాశీలకమైన ప్రగతికి దోహదకరమైన పోటీ జరగాలన్నది తెలంగాణ ప్రభుత్వం చెప్పిన మాట. ఉన్నత న్యాయస్థానం కూడ దీన్ని అంగీకరించింది. అందువల్ల ఈ పోటీ జనజీవన సౌలభ్యం పెంపొందడానికి తప్పక దోహదం చేయవచ్చు!
మన దేశం మన భావజాలంతో ప్రపంచ దేశాలను ప్రభావితం చేయాలా? లేక ఇతర దేశాల భావజాలంతో మన దేశం ప్రభావితం కావాలా? అన్న మీమాంస ఒకప్పుడు జరిగింది. ఇప్పుడు జరగడం లేదు. జరగాలన్న ధ్యాస కూడ లేదు. బ్రిటన్ దురాక్రమణ నుంచి విముక్తమైన నాటి నుంచి మన దేశంలో ఈ ధ్యాస అడుగంటిపోయింది. ఎందుకంటె డెబ్బయి ఏళ్లకు పైగా మన ప్రభుత్వాల విధానాలు ప్రభావితం అవుతున్నాయి. జవహర్‌లాల్ నెహ్రూ నుంచి రాజీవ్ గాంధీ వరకు గల ప్రధానుల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ‘ప్రభుత్వీకరణ’ వల్లనే ప్రగతి సాధ్యమని విశ్వసించాయి. అప్పట్లో కమ్యూనిస్టు దేశమైన సోవియట్ రష్యా సాధించిన ‘ప్రగతి’ మన ప్రధానమంత్రులను, ప్రభుత్వాలను ప్రభావితం చేసింది. అలా ప్రభావితమైన మన ప్రభుత్వాలు ‘ప్రభుత్వేతర రంగం’లోని బ్యాంకులను, పరిశ్రమలను, వ్యాపారసంస్థలను క్రమంగా ప్రభుత్వీకరించింది. ప్రభుత్వమే ఒక పెద్ద వాణిజ్య వ్యవస్థగా మారిన చరిత్ర దాదాపు ముప్పయి ఏళ్ల క్రితం వరకూ నడిచింది! ఈ ‘ప్రభుత్వీకరణ’ను చక్రవర్తి రాజగోపాలాచారి వంటివారు నిరసించారు. ‘‘ది ‘బిజినెస్’ ఆఫ్ ది గవర్నమెంట్ కెనాట్ బి బిజినెస్- ప్రభుత్వం వారి కర్తవ్యం వ్యాపారం చేయడం కాదు, కారాదు’’-అన్నది రాజగోపాలాచారి చేసిన చారిత్రక ప్రకటన. రాజగోపాలాచారి బ్రిటన్ విముక్త భారత్‌కు అధినేత- గవర్నర్ జనరల్-గా పనిచేశాడు! కానీ సోవియట్ రష్యా ప్రభావిత భారత ప్రభుత్వాలు ‘ప్రభుత్వీకరణ’ను ఆపలేదు. బ్యాంకుల ‘ప్రభుత్వీకరణ’పై పొడసూపిన వివాదం క్రీస్తుశకం 1969లో కాంగ్రెస్ చీలిపోవడానికి ఒక కారణం!!
ఇప్పుడు మన ప్రభుత్వాలు ‘ప్రపంచీకరణ’తో ప్రభావితం అవుతున్నాయి. ప్రభుత్వరంగం పూర్తిగా అంతరించిపోవాలన్నది ‘ప్రపంచీకరణ’ స్ఫూర్తి! అందువల్ల గత పాతికేళ్లుగా వందలాది ప్రభుత్వ సంస్థలు ‘ప్రభుత్వేతర రంగం’ పాలయ్యాయి! ఇలా 1947 నుంచి 1994 వరకు ‘ప్రభుత్వీకరణ’ ప్రభుత్వాల ‘విలాసం’- ఫాషన్- అయింది! గత పాతికేళ్లుగా ‘ప్రభుత్వేతర వ్యవస్థీకరణ’ ప్రభుత్వాల విలాసం అయిపోయింది. ఈ పరస్పర వ్యతిరేక విధానాల మధ్య సమానత్వ సూత్రం మాత్రం ఒకటి ఉంది. మన దేశం విదేశాల విధానాలతో ‘ప్రభావితం’ అవుతుండడం ఈ సమానత్వ సూత్రం! మొదట రష్యా వల్ల ప్రభావితం అయ్యాము, రష్యా ఆర్థికంగా దివాలా తీసిన తరువాత 1991 నుంచి అమెరికా ఐరోపా ఆర్థిక విధానాలతో ప్రభావితం అవుతున్నాము. అమెరికా ఐరోపాల వాణిజ్య దురాక్రమణకు మరో పేరు ప్రపంచీకరణ... ఈ దురాక్రమణకు ప్రస్తుతం చైనా ప్రధాన ప్రతినిధి కావడం వేఱుకథ..!! అందువల్ల సగం ‘బస్సు సేవల’ను ప్రభుత్వేతర సంస్థలకు అప్పగిస్తున్న తెలంగాణ ప్రభుత్వ విధానాన్ని మాత్రమే కాదు, దాదాపు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల విధానాలను, కేంద్ర ప్రభుత్వం వారి విధానాలను కూడ ఈ విస్తృత ‘ప్రపంచీకరణ’ప్రాతిపదికగా విశే్లషించుకోవలసి ఉంది! తెలంగాణ ప్రభుత్వం బస్సుల ప్రయాణ వ్యవస్థను ప్రభుత్వేతరులకు అప్పగిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వరంగ సేవాసంస్థ ‘రహదారి రవాణా సంస్థ’- ఆర్‌టిసి-ను ప్రభుత్వ విభాగంగా మార్చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇలా పరస్పరం వ్యతిరేక దిశలలో బస్సులను నడుపుతుండడం మాత్రం ‘విశే్లషణ’కు అందని వ్యవహారం...
ప్రభుత్వేతర సంస్థలు చిత్తశుద్ధితో జనహిత నిష్ఠతో బస్సులను నిర్వహించడం కూడ గత చరిత్ర.. ఆ చరిత్ర ఇప్పుడు మళ్లీ జరిగితే ప్రయాణీకులు సంతోషిస్తారు, జీవన సౌలభ్యం పెరుగుతుంది. బస్సులు సకాలంలో బయలుదేరడం, సకాలంలో గమ్యం చేరడం ప్రయాణ సౌలభ్యంలో మొదటి అంశం! ఎంతమంది కూర్చుండడానికి చట్టం ప్రకారం వీలుందో అంతమందిని మాత్రమే బస్సులో ఎక్కించుకోవడం సౌలభ్యసాధనలో రెండవ అంశం! ప్రయాణ శుల్కాలు న్యాయబద్ధంగా ఉండాలి, ఇష్టం వచ్చినట్టు పెంచరాదు. ఇది మూడవ అంశం! బస్సులు ప్రతి మార్గంలోను తగినన్ని నడిచే విధంగా ప్రభుత్వం నిర్దేశించాలి! ఇది నాలుగవ అంశం.. ఈ నాలుగు సూత్రాలను ప్రభుత్వేతర సంస్థల బస్సులలో అమలు జరిపితే ప్రయాణ సౌలభ్యం పెరుగుతుంది. 1970వ దశకం నడికొనే వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ‘‘పరివేటు బస్సులే’’ ప్రధానంగా ఉండేవి. ఆ తరువాత బస్సు సేవల ప్రభుత్వీకరణ జరిగింది. అలా ప్రభుత్వేతరులు బస్సులను నడిపిన కాలంలో రాయలసీమలోను కర్నాటకలోను ‘ఆర్.పి.జి.టి.’అనే ప్రభుత్వేతర సంస్థ బస్సులను నడిపిన తీరు సర్వజనుల మన్ననలను పొందడం చరిత్ర. ఆ సంస్థ బస్సులు దారిపొడవునా ప్రతి ‘గమ్యం’ వద్దకు సకాలంలో చేరేవి. అమిత వేగంగా ఆ బస్సులు ప్రయాణించలేదు, అందువల్ల ఆ బస్సులు ప్రమాదాలకు గురికాలేదు. యాబయి మందిని మాత్రమే బస్సులో ఎక్కించేవారు, నిలబడి ప్రయాణం చేయవలసిన ప్రమాదం ఏర్పడలేదు! ఇలాంటి నియమాలను ఇప్పుడు కూడ ప్రభుత్వాలు ప్రభుత్వేతర సంస్థల బస్సులలో అమలు చేయించాలి. నిలబడి ప్రయాణం చేయడం- ఓవర్ లోడింగ్- ప్రయాణీకుల పాలిట నరకం! మితిమీరిన వేగంతో ప్రయాణించకుండా ప్రభుత్వేతర బస్సులను ప్రభుత్వం అదుపు చేయగలగాలి. నిబంధనలను పాటించిన ‘ఆర్.పి.జి.టి’ లాభాల బాటలో పయనించడం చరిత్ర! డెబ్బయి ఏళ్ల రాజ్యాంగ ప్రస్థానంలో ఇలా ఉదాహరణలు అనేకం ఉన్నాయి..